చర్చల్లో అవినీతి కనుమరుగు
అవలోకనం
భారతీయ జనతా పార్టీకి, కాం గ్రెస్ పార్టీకి మధ్య ఒక ముఖ్యమైన వ్యత్యాసం ఉంది. బీజేపీ ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ వంటిది. దీంట్లో షేర్లు అధిక సంఖ్యాక ప్రజల చేతుల్లో ఉంటాయి. కాంగ్రెస్ ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వంటిది. దీంట్లో షేర్లన్నీ ఒకే కుటుంబం చేతిలో ఉంటాయి.
బీజేపీ కూడా పూర్తిస్థాయిలో నియంత్రణ కలిగిన కంపెనీయే అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది రాష్ట్రీయ స్వయంసేవక్తో ముడిపడి ఉంటుంది. ఆర్.ఎస్.ఎస్. కూడా కుటుంబ వ్యవహారాలనే పోలి ఉంటుంది. కానీ ఇక్కడ వంశపారంపర్యంపై పట్టు పట్టరు. మన ప్రధాని నరేంద్రమోదీ నిరూపించినట్లుగా, సంస్థ వెలుపల ఉన్న చురుకైన వ్యక్తి కూడా తన ప్రతిభపై ఆధారపడి కంపెనీనే మొత్తంగా చేతపట్టుకోవచ్చు. అదే కాంగ్రెస్లో అయితే, వ్యక్తి ఎంత ప్రతిభావంతుడైనా సరే.. అతడు లేదా ఆమె తప్పనిసరిగా ఒక వాస్తవం పట్ల ఓర్పుతో ఉండాలి. అదేమిటంటే, కంపెనీలో తొలి రెండు స్థానాలు కుటుంబ సభ్యులకే తప్ప మరెవ్వరికీ అందుబాటులో ఉండవు. రెండో విషయం.. షేర్లన్నీ వారివే కనుక ఆ కుటుంబ సభ్యులు ఎంత ప్రతిభా రహితులైనా, అసమర్థులైనా సరే, ఆ కుటుంబం పనితీరు, చర్యలను ఉద్యోగులు ఎన్నటికీ ప్రశ్నించలేరు.
ఈ విశిష్టత కారణంగా, పార్టీ సభ్యులు ఒక విచిత్రమైన తీరులోనే ప్రవర్తిస్తుంటారు. ఒక ఆస్తికి సంబంధించిన వ్యవహారంలో గాంధీలు విచారణను ఎదుర్కొనవలసిన సందర్భంగా గత కొన్నిరోజులుగా జరుగుతున్న పరిణామాలు దీనికి సాక్షీభూతంగా ఉంటున్నాయి.
మొదట్లో దీన్ని కోర్టులోనే తేల్చుకుంటామని వారు చెప్పినట్లు వార్తలొచ్చాయి. తర్వాత ఈ సమస్య రాజ కీయపరమైనదని (స్పష్టంగానే అలాంటిదేమీ లేదు) ఆ పార్టీ చెప్పడమే కాకుండా దీనికి ప్రభుత్వమే కారణమని ఆరోపించింది. ఈ ఉదంతాన్ని ఎవరు పరిశీలించినా సరే గాంధీలు చేసిన పని నేరపూరితం కాకున్నా అసం దర్భమైన రీతిలో ఉందని చాలా స్పష్టంగా బోధ పడుతుంది. ఆ ఆస్తికి సంబంధించిన లావాదేవీలో ఆర్థికంగా తమకు ఎలాంటి లబ్ధీ చేకూరలేదని, అది చట్టాన్ని కాస్త ఉల్లంఘించిందనుకున్నప్పటికీ ఎవరూ దాంట్లోంచి డబ్బు చేసుకోలేదని వారు వాదిస్తున్నారు. ఈ అంశంపై వీరు ఇంత సాధారణ వైఖరిని ప్రదర్శిం చడం పట్ల మనం ఆశ్చర్యపడకూడదు మరి.
వాస్తవమేమిటంటే, జీవించడానికి ఎన్నడూ పని చేయని వారు, మనందరిలాగా ఉద్యోగం కోసం ఎన్నడూ ప్రయత్నించనివారు, తమ జీవితాలను మొత్తంగా ప్రభుత్వ గృహాల్లోనే గడిపేసిన వారు.. వ్యక్తిగత ఆస్తికి, దానికి భిన్నమైనదానికి మధ్య తేడాను చూడలేకపోవడం సహజమే మరి.
న్యాయపోరాటం నుంచి రాజకీయ సమరంలోకి వ్యూహాన్ని మార్చాలని నిర్ణయించడానికి ముందు కాంగ్రెస్ నేతలు గులామ్ నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, భూపిందర్ సింగ్ హూడా, కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీలు సోనియాగాంధీకి సలహా ఇచ్చినట్లు ఒక ఆంగ్ల దినపత్రిక పేర్కొంది. ఈ ఆస్తి కేసులో మోతీలాల్ ఓహ్రా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శామ్ పిట్రోడాల పేర్లు కూడా ఉన్నాయి.
ఈ నేతలందరికీ వర్తించే ఉమ్మడి అంశం ఏమిటి? ఇక్కడ ప్రస్తావించిన వారిలో ఏ ఒక్కరూ లోక్సభలో లేరు. వీరిలో ఏ ఒక్కరికీ ఎన్నికల్లో గెలవవలసిన అవసరం కానీ, జనాలను ఎదుర్కోవలసిన అవసరం కానీ ఏమాత్రమూ లేదు. వారిచ్చిన సలహా వ్యక్తిగత మైనదే కానీ రాజకీయపరమైనది అయివుండకపోవచ్చు. వాళ్ల ఆకాంక్షలు మొత్తంగా ఆ కుటుంబాన్ని కాపా డటానికి ఉద్దేశించినట్లుగానే తప్ప.. పార్టీని కాపా డదామని, దానికి జరిగిన నష్టాన్ని పూరిద్దామనే ఉద్దేశంతో ఉన్నట్లు లేవు.
నేషనల్ హెరాల్డ్ ఆస్తి గొడవను సోనియా గాంధీ కుటుంబం కోర్టులో పోరాడి తేల్చుకోవాలి తప్ప దాన్ని రాజకీయ సమస్యగా మార్చవద్దని, పార్టీని ఈ వ్యవహారంలోంచి దూరం పెట్టాలని కాంగ్రెస్లో ఏ ఒక్కరూ పేర్కొన్నట్లు లేదు. ఎవరైనా ఈ అభిప్రాయానికి వచ్చి నాయకత్వానికి సూచించారనుకోండి.. అలాంటి వారిని వెంటనే కాంగ్రెస్నుంచి సాగనంపుతారు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇది మరొక వ్యత్యాసం.
ఒకవేళ నిజంగానే నరేంద్రమోదీ ఇలాంటి ఆరోప ణలను ఎదుర్కొన్నట్లయితే, అది బీజేపీలో అంతర్గతంగా అసమ్మతికి దారితీసి ఉండదంటే నమ్మశక్యం కాదు. బిహార్ ఎన్నికల్లో తీవ్రంగా పోరాడి కూడా ఎన్నికల్లో గెలుపు సాధించలేకపోయినందుకే పార్టీలో మోదీపై అసమ్మతి పెచ్చరిల్లింది. అలాంటి స్థితిలో ఆర్థికపరమైన అసంబద్ధత గురించిన ఆరోపణలు మోదీపై వచ్చి ఉంటే ఆయన మనగలగడం కష్టమయ్యేది. బీజేపీలో అసహనం గురించి ఎవర యినా చాలా చెప్పుకోవచ్చు కానీ, కాంగ్రెస్ కంటే అవినీతి విషయంలో అది చాలా తక్కువ సహన భావంతో ఉంటోందన్నది వాస్తవం.
నేషనల్ హెరాల్డ్ ఆస్తికి సంబంధించిన కేసును రాజకీయం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది కాబట్టే, పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించడానికి కాంగ్రెస్ సుదీర్ఘ జాబితాలో ఉన్న అంశాల్లో దిగువ కోర్టు కేసు కూడా ఒకటిగా మారింది. తాను మళ్లీ ప్రాధాన్యతా స్థితికి రావడం కోసం పార్లమెంటు చర్చను విచ్ఛిన్నపర్చడాన్ని ఒక సాధనంగా కాంగ్రెస్ ఉపయోగించుకుంటోంది. ఇది మంచిదే కావచ్చు కానీ అన్ని పార్టీలూ దీన్ని ఒక ఎత్తుగడగా ఉపయోగిస్తున్నాయి. అది ప్రభావశీలంగా ఉంటోంది కూడా. కానీ దీన్ని ఒకదాని తర్వాత మరొకటిగా ప్రతి సందర్భంలోనూ అన్వయించడం అర్థవంతమేనా? ఒక రోజు ఇది ముఖ్యమంత్రులు, విదేశాంగ మంత్రి అవినీతిపై చర్చగా మొదలవుతుంది. తర్వాతి రోజు వీకే సింగ్ అలవోకగానూ, నిర్లక్ష్యంగానూ చేసిన వ్యాఖ్యపై (అయితే ఉద్దేశపూర్వకంగా మాత్రం కాదు) చర్చగా మారుతుంది. మూడోరోజు అసహనంపై చర్చగా, నాలుగో రోజు వ్యక్తిగతమైన కోర్టు వ్యవహారంపై చర్చగా మారుతుంది. అయిదో రోజు మళ్లీ అవినీతిపై చర్చ మొదలవుతుంది. వాస్తవానికి ఈ వ్యూహం ఎవరి తలపు లోనో పుట్టుకురాగా, మరెవరో ఆమోదిస్తున్నట్లుగా మనలో సందేహాలు పుట్టుకొస్తుంటాయి. ప్రభుత్వం తల పెట్టిన కొన్ని కార్యక్రమాలపై నిశితచర్చ అవసరమైన సమయంలో ప్రతిపక్షం ఈ రకమైన చెత్త విషయాలను తీసుకురావడమనేది భారతీయులందరి దురదృష్టమే.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత: ఆకార్ పటేల్
aakar.patel@icloud.com