కాంగ్రెస్ ధ్వజం ఎన్నికల్లో విజయంపై ధీమా
న్యూఢిల్లీ: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) నేతలతో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ సమావేశం కావడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుబట్టింది. ఆర్‌ఎస్‌ఎస్ అనేది ఎలాంటి జవాబుదారీలేని రిమోట్ కంట్రోల్ అని, ఆ రిమోట్ చేతిలో మోడీ ఓ కీలుబొమ్మ అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు. ఆయన ఆదివారమిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. మోడీని ఆర్‌ఎస్‌ఎస్ నియంత్రిస్తోందని దుయ్యబట్టారు. యూపీఏ ప్రభుత్వాన్ని రిమోట్ కంట్రోల్ ద్వారా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నడిపిస్తున్నారంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై అభిషేక్ తీవ్రంగా మండిపడ్డారు.
తమ అధినేత్రిని విమర్శిస్తున్న మోడీ.. ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో కీలుబొమ్మ అని ఎద్దేవా చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు. కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలను ప్రస్తావించగా.. 2004, 2009 సార్వత్రిక ఎన్నికల్లోనూ వారు ఇలాంటి ప్రకటనలే చేశారని సింఘ్వీ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ వారణాసిలో ప్రచారం చేసిన నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థి అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని వ్యాఖ్యానించారు.
ఆర్‌ఎస్‌ఎస్ చేతిలో మోడీ కీలుబొమ్మ
Published Mon, May 12 2014 1:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement