సమర్థ నేతలు కావలెను!!
గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు పరిపాలనపైనే దృష్టి పెట్టిన నరేంద్ర మోదీకి, ప్రధాని అయ్యాక కేంద్రంలో ప్రాధాన్యతలు మారాయి. శాసనాలు, విధానాల రూపకల్పన ఇప్పుడాయన ప్రధాన విధి. దానికి అత్యంత నమ్మకస్తులు, తెలివైన వారు అవసరం. గోవా ముఖ్యమంత్రి పారికర్ వీరిలో ఒకరు.
ఆరు నెలల క్రితం భారత కేంద్ర ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రెండు ముఖ్యమైన మంత్రి పదవులను ఒకే వ్యక్తికి అప్పగించారు. బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ రక్షణ, ఆర్థిక మంత్రిత్వ శాఖలు రెండింటినీ తనవద్దే అట్టిపెట్టుకు న్నారు. కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైనవిగా పరిగణిస్తున్న నాలుగు మంత్రిత్వ శాఖల్లో ఇవి రెండు. (మరో రెండు శాఖలు హోం, విదేశీ వ్యవహా రాలు). పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు జైట్లీ మాట్లాడుతూ కొద్ది వారాల వరకు అంటే మరొకరు దాన్ని స్వీకరించేంతవరకు మాత్రమే రక్షణ శాఖను తన వద్ద ఉంచుకుంటానని చెప్పారు. ఆ మరొకరు మరెవరో కాదు మాజీ జర్నలిస్టు అరుణ్ శౌరీనే అని ఆ సమయంలో ఒక అంచనా ఉండేది. ప్రధానమంత్రి మనస్సులో ఎవరు ఉండేవారో కానీ, ఆ వ్యక్తి ఉనికి బయటకు రాలేదు. ఈ లోగా మే నెల దాటి నవంబర్ కూడా వచ్చేసింది.
ఈ కారణం వల్లే భారతీయ జనతా పార్టీలో చక్కటి ఆలోచనాపరుడిగా కనిపిస్తున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్‌ను ఇప్పుడు కేంద్ర మంత్రివర్గంలోనికి తీసుకు వస్తు న్నారని పత్రికా వార్తలు సూచిస్తున్నాయి. అత్యంత సమర్థత కనబరుస్తున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తన పదవిని వదులు కుని ఢిల్లీకి ఎందుకు రావలసివస్తోందన్నది ప్రశ్న. ప్రత్యేకించి, ప్రధాని మోదీ ఎంపిక చేసుకోవడానికి 300 మందికి పైగా లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు అందుబాటులో ఉండగా, ఢిల్లీకి బయట ఉన్న వ్యక్తిని ఎందుకు తీసుకు వస్తున్నట్లు? ప్రతిభా లేమికి సంబంధించిన ఈ సమస్య ముందుకు రావడానికి రెండు కారణాలు ఉంటున్నాయి.
మొదటి సమస్య సాధారణమైంది. ప్రత్యేకించి, వాస్తవమైన లేదా తాము కనుగొన్న అన్యాయాలకు వ్యతిరేకంగా ఆగ్రహావేశాలను ప్రదర్శించడాన్ని ప్రాతిపదికగా కలిగి ఉన్న హిందుత్వ వంటి బలమైన భావజాలం ఒక రకం వ్యక్తులను సులభంగా ఆకర్షిస్తుంది. గురూజీ గోల్వాల్కర్, వీరసావర్కార్, దీనదయాళ్ ఉపాధ్యాయ్ వంటి వ్యక్తుల రచనలవైపు ఆకర్షితులయ్యే ఇలాంటి వ్యక్తులు వారి ఆలోచనల్లో మాత్రం సూక్ష్మతను, చురుకుదనాన్ని కలిగి ఉంటారని మనం భావించకూడదు. అందుకే ప్రస్తుతం దాదాపు 280 ఎంపీ స్థానాలున్న బీజేపీ కంటే, గతంలో 200 ఎంపీ స్థానాలు మాత్రమే ఉన్న కాంగ్రెస్ పార్టీలోనే సమర్థమైన, చురుకైన నాయకులు ఎక్కువగా ఉండే వారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపిక చేసుకోవడానికి ముగ్గురు అగ్ర శ్రేణి ఆర్థికమంత్రులు (మన్మోహన్ సింగ్‌తోపాటు చిదంబరం, ప్రణబ్ ముఖర్జీ) అందుబాటులో ఉండేవారు. కానీ నరేంద్ర మోదీకి మాత్రం రక్షణ శాఖకు కూడా సమయాన్ని వెచ్చించగలి గిన ఒకే ఆర్థిక మంత్రిని మాత్రమే ఉపయోగించుకోవల్సి వస్తోంది.తమ ఆలోచనల్లో నమ్రతను, కార్యదక్షతను ప్రదర్శించే బీజేపీ నేతలు (జైట్లీ, పారికర్) ఉన్నారు కానీ వీరు హిందుత్వ అంశాలపై తక్కువ సైద్ధాంతికతను కలిగి ఉండటమే కాకుండా, కాస్త సరళంగానూ ఉంటున్నారు.
రెండో సమస్య మరింత నిర్దిష్టమైనది. ఇది ప్రధాని అభద్రతకు సంబంధించిన విషయం. కేంద్ర మంత్రిమండలిలో కొంతమంది ప్రతిభావంతులు, అనుభవజ్ఞులు ఉన్నారు కానీ వారిని ఆయన ఉపయోగించదల్చుకోలేదు. దీనికి కారణం ఏమంటే వారు మరీ వృద్ధులైపోయారు (ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషీ ఇద్దరూ లోక్‌సభలో ఉన్నారు వారికి పనిలేదు) లేదా వారు మరీ చిన్నవారుగా ఉన్నారు (వరుణ్ గాంధీ, అత్యాశపరుడు, చురుకైనవాడు, మరిన్ని బాధ్యతల కోసం ఎదురుచూస్తుంటారు). వీరిని పక్కన ఉంచడానికి అసలు కారణం ఏమంటే, వీరు మోదీని గదమాయించగలరు. మంత్రిమండలిలోకి వీరిని తీసుకుంటే మోదీ వారితో వ్యవహరించలేరు. గుజరాత్‌లో కూడా మోదీ ఇలాగే చేశారు.
కేశుభాయ్ పటేల్, కాశీరామ్ రాణా వంటి అనుభవజ్ఞులైన నేతలను వారి మద్దతుదారులను కూడా మోదీ అధికార పదవులకు దూరంగా ఉంచారు. అయితే గుజరాత్‌లో తను చేసి చూపగలిగినదాన్ని ఢిల్లీలో కూడా ప్రతికల్పన చేయాలంటే ఒక అడ్డంకి ఉంది.అన్ని రాష్ట్ర ప్రభుత్వాల మాదిరే, గుజరాత్‌ను నడపడంలో మోదీ దృష్టి ప్రధానంగా పరిపాలనపైనే ఉండేది. స్పష్టంగా చెప్పాలంటే చాలావరకు కేంద్రం నుంచి వచ్చే విధానాలను అమలు చేయడమే. వాజ్‌పేయీ ప్రభుత్వం విద్యుత్ రంగం విషయంలో ప్రైవేట్ కంపెనీలకు తలుపులు తెరిచినప్పుడు దాన్ని గుజరాత్‌లో మోదీ అద్భుతంగా అమలు చేశారు. రాష్ట్రంలో విద్యుత్ మిగులు అధికంగా ప్రైవేట్ విద్యుత్ ఉత్పత్తి నుండి వచ్చేది.
కేంద్ర విధానాలను గుజరాత్‌లో అమలు చేయడానికి మోదీ ఉన్నతాధికారుల బృందాన్ని నియమించారు. వీరు మంత్రుల విధులతో వ్యవహరించేవారు. రాజకీయ నేతల జోక్యాన్ని తోసిపుచ్చారు. ఈ మొత్తం పనిపై కేవలం ఇద్దరు మంత్రులకు మాత్రమే వాస్తవంగా బాధ్యత ఉండేది (సౌరభ్ పటేల్, అమిత్ షా). వీరిలో ఏ ఒక్కరికీ కేబినెట్ స్థాయి ఉండేది కాదు. అలా వారు తమ పనిని బ్యూరోక్రాట్ల ద్వారా మోదీ నేరుగా పర్యవేక్షిస్తున్నారన్న అవగాహనతో ఉండేవారు.
ఢిల్లీకి తరలి వెళ్లాక, పని స్వభావం మారింది. మోదీ ఇప్పు డు శాసనాల రూపకల్పన, విధానాలపైనే దృష్టిని కేంద్రీకరిం చాల్సి ఉంది కాని వాటి అమలు పట్ల కాదు. ఇది ఆయన పని పద్ధతికి అంతరాయం కలిగించింది. గుజరాత్‌లో మాదిరే తాను నమ్ముతున్న పీయూష్ గోయెల్, నిర్మలా సీతారామన్ వంటి మంత్రులకు ఎక్కువ పని అప్పగించడం ద్వారా పరిస్థితులను తన అదుపులో ఉంచుకోవాలని మోదీ ప్రయత్నించారు. వీరి ద్దరూ మోదీకి ప్రీతిపాత్రమైన ఇంధనం, వాణిజ్యం, పరి శ్రమలు వంటి పోర్ట్‌ఫోలియోలను నిర్వహించారు.
అయితే, కేంద్ర ప్రభుత్వం ప్రధాన విధి ఏదంటే శాసన, విధాన రూపకల్పనే. దీన్ని నిర్వహించడం కోసం మోదీకి అత్యంత తెలివైన వ్యక్తులు అవసరం. కానీ అలాంటి వారు ఆయనకు అందుబాటులో లేరు. అయితే వారి దురదృష్టమో లేక ప్రభుత్వ దురదృష్టమో కానీ, మోదీ కోరుకోని వ్యక్తులే కేంద్ర మంత్రిమండలిలో ఉన్నారు.
(వ్యాసకర్త ప్రముఖ కాలమిస్టు, రచయిత)
ఆకార్ పటేల్