
ఈ అవగాహనా రాహిత్యం ఆందోళనకరం
అవలోకనం
ప్రజలకు ఎంతగా జాతీయవాదాన్ని నూరిపోస్తామో అంత ఎక్కువగా కశ్మీరీలను దూరం చేసుకుంటాం. మన కొత్త ఆర్మీ చీఫ్ ఆ అశాంతికి కారణాలను అర్థం చేసుకున్నట్టు లేదు. కశ్మీరీలపై ప్రయోగించని కఠిన చర్యలు ఇంకా ఏవైనా ఉన్నాయా? పెల్లెట్ గన్స్‌ను ప్రయోగించి వందలాది మందిని అంధులను చేశాం. మొత్తంగా జనాభానే నేరస్తులుగా చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏం సాధించినా, మిలిటñ న్సీని అదుపు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. మనం దాన్ని అంగీకరించి, నూతన పరిష్కార మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలి.
కొత్త రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన కొన్ని వారాలకే వాటి నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. దొంగ 2,000 నోట్లు మొదట గుజరాత్‌లో దొరికాయి. ఇప్పుడు దేశం నలుమూలల నుంచి ఆ దొంగ నోట్ల వార్తలు వినవస్తున్నాయి. దొంగ నోట్ల సమస్యకు పెద్ద నోట్ల రద్దు అడ్డుకట్ట వేస్తుందంటూ దాన్ని కూడా అందుకు ఒక కారణంగా చెప్పారు. అది నిజం కాదని తేలిపోయింది.
దొంగ నోట్ల సమస్యను ప్రధాని ఉగ్రవాద హింసాకాండతో ముడిపెట్టారు. మిలిటెన్సీని, తీవ్రవాదాన్ని అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దును చేపట్టామన్నారు. ప్రధాని ఈ వాగ్దానాన్ని చేసి ఉండాల్సింది కాదు. మన దేశంలోని మిలిటెన్సీకి గల కారణాల పట్ల అవగాహనా రాహిత్యాన్ని ఇది బయటపెట్టింది. పెద్ద నోట్ల రద్దు జరిగినది చలికాలంలో. ఆ నెలల్లో కశ్మీర్‌లో సైన్యంపై జరిగే హింసాకాండ తక్కు వగా ఉంటుంది. మంచు కరిగే కొద్దీ ప్రతి ఏడాదిలాగే హింసాకాండ తిరిగి మొదలైంది. కాబట్టి పెద్ద నోట్ల రద్దు మిలిటెన్సీని అరికట్టడానికి తోడ్పడుతుందని చెప్పినది నిజం కాదు.
ఒక మేజర్ సహా నలుగురు సైనికులు ఇటీవల కశ్మీర్‌లో మరణించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల మిలిటెన్సీ స్థాయిలో ఎలాంటి తగ్గుదలా లేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల సైన్యంపై హింసాత్మక దాడులు తగ్గుతాయని చెప్పారు. కాబట్టి ఇది వారిని విస్మయపరచింది. ఇటీవల ‘‘స్థానిక ప్రజల’’ను తప్పు పడుతూ మన ఆర్మీ చీఫ్ ఆగ్రహపూరితమైన ప్రకటన చేశారు. వారు ‘‘కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులు తప్పించుకుపోవడానికి సైతం తోడ్పడుతున్నారు’’ అని, సైన్యం తన పనిని చేయ నివ్వకుండా నిరోధిస్తున్నారని ఆరోపించారు. మరింత ఆందోళనకరంగా ఆయన.. పాకిస్తానీ, ఇస్లామిక్ స్టేట్ జెండాలను ప్రదర్శిస్తున్న భారతీయులను ‘‘జాతి వ్యతి రేకులు’’గా పరిగణిస్తామని, తమ సైనికులు ‘‘వారిని పట్టుకుని’’ ‘‘కఠిన చర్యలు’’ చేపడతారని అన్నారు. ఆర్మీ చీఫ్‌గానీ, ఆయన సైనికులుగానీ ఏదైనా చర్యను నేరంగా భావిస్తే, వారు ఆ విషయాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేగానీ జెండాలు ఊపేవారికి, నినాదాలు చేసేవారికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం వారికి లేదు.
సైన్యం, కశ్మీర్ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ తెలిపారు. చాలామంది భారతీయులకు బహుశా తెలిసి ఉండని ఆ వాస్త వాన్ని ఆయన వెల్లడించారు. ‘‘మేం వారికి (ఉగ్రవాదులకు) వ్యతిరేకంగా సైనిక చర్యలను నిర్వహిస్తున్నప్పుడు, స్థానిక ప్రజలు భద్రతా బలగాల చర్యలకు ఏదో ఒక విధమైన మద్దతును తెలుపకపోవడం కనబడుతోంది’’ అని కూడా ఆయన అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వంలో అది కూడా భాగస్వామిగా ఉన్నది మరి.
వాస్తవాధీన రేఖకు అవతలి నుంచి పంపుతున్న కొన్ని శక్తులు కశ్మీర్‌లో దురాగతాలకు పాల్పడుతున్నాయని విశ్వసించడం వేరు. మొత్తంగా స్థానిక జనాభా అంతా మీపట్ల వ్యతిరేకతతో ఉన్నారని అంగీకరించడం వేరు. అది సరైనదైనా, కాకున్నా ఆ విషయాన్ని జనరల్ రావత్ అంగీకరించారు. ‘‘ప్రజలపట్ల మైత్రీపూర్వకంగా ఉండే సైనిక చర్యలను నిర్వహించాలనేదే మా లక్ష్యం. కాగా, ఆ చర్యలను నిర్వహించకుండా స్థానిక ప్రజలు మమ్మల్ని నిరోధిస్తున్న తీరు, కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులు తప్పించు కోవడానికి సైతం వారు మద్దతుగా నిలవడం... భద్రతా బలగాల నష్టాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమౌతున్న అంశాలు’’ అని ఆయన అన్నారు.
ఈ ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ఇప్పుడు సిగపట్లు పడుతున్నాయి. కానీ ఈ సమస్యకు సంబంధించి ఆ రెండిటి మధ్యా ఎలాంటి తేడా లేదు. అది గత 30 ఏళ్లుగా మనం అది చూస్తూనే ఉన్నాం. ఇటీవల కశ్మీర్‌లో జరుగుతున్న ఘటన లపట్ల కేంద్రం వైఖరిలోగానీ, మిగతా దేశం వైఖరిలో గానీ ఎలాంటి మార్పు లేని అదే ధోరణి కనిపిస్తోంది. ఈ వారం ఒక కశ్మీరీ విద్యార్థి ఉగ్రవాద ఆరోపణల నుంచి బయటపడ్డాడు. ఢిల్లీలో సదరు బాంబు పేలిన రోజున అతడు శ్రీనగర్‌లోని ఒక కళాశాలలో ఉన్నట్టు తేలింది. ఆ కళాశాల రిజిస్టర్‌లో ఆరోజున అతను కళాశాలకు హాజరైనట్టు నమోదై ఉంది. తనను ఇలా బలిపశువును చేయడానికి కారణం తాను ఒక కశ్మీరీ కావడమేనని ఆ విద్యార్థి విశ్వసిస్తున్నాడు. ఇది జరిగినది నరేంద్ర మోదీ ఎన్‌డీఏ ప్రభుత్వ పాలనలో కాదు, మన్మోహన్‌సింగ్ యూపీఏ ప్రభుత్వ హయాం లోని 2005లో.
భారత్, ప్రజలకు ఎంత బలంగా జాతీయవాదాన్ని నూరిపోస్తుంటుందో అంత ఎక్కువగా మనం కశ్మీరీలను దూరం చేసుకుంటాం. ఆ రాష్ట్రంలో నెలకొన్న అశాంతిని పెద్ద నోట్ల రద్దు పరిష్కరించలేదని మనం అర్థం చేసుకోవాలి. దానికి మరింత లోతైన కారణాలున్నాయి. దురదృష్టవశాత్తూ మన కొత్త ఆర్మీ చీఫ్ వాటిని అర్థం చేసుకున్నట్టు అనిపించడం లేదు. తన సొంత పౌరులనే ఉద్దేశించి చేసిన ఆ ప్రకటనలో ఆయన ఇంకా ఈ విషయాన్ని కూడా జోడించారు: ‘‘యువకులైన ఈ పిల్లలను చంపకూడదనేదే మా భావన. వారిని ప్రధాన స్రవంతిలోకి తిరిగి తేవా లనేదే మా యోచన. కానీ వారి తీరు ఇలాగే ఉంటే వారిని లక్ష్యాలుగా చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ కఠిన చర్యలను చేపడతాం’’.
కశ్మీరీలపై ఇంతకు ముందే ప్రయోగించని సాధ్యమైన కఠిన చర్యలు భారత్ వద్ద ఇంకా ఏవైనా ఉన్నాయా? గుంపులను చెదరగొట్టడానికి ఇప్పటికే మనం వారిపై పెల్లెట్ గన్స్‌ను (ఇనుప రవ్వలను చల్లే తుపాకులు) ప్రయోగించి వంద లాది మందిని అంధులను చేశాం. ఎలాంటి ఆలోచనా లేకుండా వారిపై క్రిమినల్ నేరాలను మోపాం. మొత్తంగా జనాభానే నేరస్తులుగా చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏ విజయాలను సాధించామనైనా చెప్పుకోవచ్చునేమోగానీ... మిలిటñ న్సీని అదుపు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. మనం దాన్ని అంగీకరించి, నూతన పరిష్కార మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ పరిష్కారాలను ఈ సమస్యను ఏదో కరెన్సీకి సంబంధించినదిగా వ్యవహరించేవి కాకూడదు. ఈ సమస్యకు బహిర్గత పార్శా్వలున్నంతగా, అంతర్గత పార్శా్వలు కూడా ఉన్నాయని భావించేవిగా ఆ పరిష్కారాలుండాలి.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com