Army Chief Bipin Rawat
-
సరిహద్దు శిబిరాలకు ఆర్మీ చీఫ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి రద్దు అనంతరం పాక్‌తో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, ఆ దేశ నాయకుల రెచ్చగొట్టే ప్రకటనల నేపథ్యంలో భారత్ అప్రమత్తమయింది. ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం శ్రీనగర్‌కు చేరుకున్నారు. నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వెంబడి సైనిక పోస్టులను సందర్శించారు. బలగాల కార్యాచరణ సన్నద్ధత, ముఖ్యంగా ఎల్వోసీ వెంట వాస్తవ పరిస్థితులపై సైనిక కమాండర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాదామీబాగ్‌లోని ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశంలో రాష్ట్రంలో అంతర్గత పరిస్థితులపైనా ఆయన సమీక్షించనున్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్న అనంతరం ఆర్మీ చీఫ్ రాష్ట్రంలో పర్యటించడం ఇదే ప్రథమం. ఇలా ఉండగా, కశ్మీర్ లోయతోపాటు శ్రీనగర్‌లో శుక్రవారం ప్రార్థనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా నిషేధాజ్ఞలు విధించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ఉందని సమాచార, ప్రసార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. మలయాళ మనోరమ న్యూస్ కాంక్లేవ్‌లో ఆయన మాట్లాడారు. -
మన భూభాగంలోకి చైనా సైన్యం రాలేదు
న్యూఢిల్లీ: లడఖ్‌లో సరిహద్దులు దాటి చైనా సైన్యం చొచ్చుకువచ్చిందన్న వార్తలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఆధ్యాత్మిక గురువు దలై లామా 84వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన కొందరు టిబెటన్లు లడఖ్‌లోని డెమ్చోక్ సెక్టార్లో ఉత్సవాలు జరుపుకున్నారని, ఆ సందర్భంగా వారు టిబెటన్ పతాకాలను ఎగురవేశారని తెలిపారు. ఆ సమయంలో భారత్ భూభాగంలోని వాస్తవ నియంత్రణ రేఖను దాటేందుకు యత్నించిన చైనా సైనికులను తాము అడ్డుకున్నామన్నారు. దీంతో వారు అక్కడ జరుగుతున్న ఉత్సవాలను గమనించి, అర్థగంట తర్వాత వెనక్కి వెళ్లిపోయారన్నారు. అంతేతప్ప, చైనీయులు ఎటువంటి ఆక్రమణకు పాల్పడలేదన్నారు. పాకిస్తాన్ సైన్యం ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా గట్టిగా బదులిస్తామని, ఉగ్ర చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ‘కార్గిల్ యుద్ధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వేతర శక్తులు బలపడి ఉగ్ర చర్యలకు పాల్పడుతుండటం కొత్త పరిణామం అని అన్నారు. -
పాక్‌కు ఆర్మీ చీఫ్ వార్నింగ్
సాక్షి, శ్రీనగర్ : జమ్ము కశ్మీర్లోకి ఉగ్రవాదులను పంపి హింసను ప్రేరేపించడాన్ని పాకిస్తాన్ నిలిపివేయాలని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ హెచ్చరించారు. పాకిస్తాన్ శాంతి, సామరస్యాలను కాంక్షిస్తే తక్షణం ఉగ్రవాదులను ప్రోత్సహించడానికి స్వస్తి పలకాలని అన్నారు. జమ్ము కశ్మీర్లో ప్రశాంత వాతావరణం కొనసాగితే ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను నిలిపివేతను పొడిగించే అవకాశం ఉందని రావత్ పేర్కొన్నారు. అయితే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దుందుడుకు చర్యలు చేపడితే భద్రతా దళాలు దీటుగా బదులిస్తాయని హెచ్చరించారు. భారత్ సరిహద్దుల్లో శాంతిని కాంక్షిస్తోందని, అయితే పాకిస్తాన్ మాత్రం వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని, ఫలితంగా ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ కవ్వింపులకు పాల్పడితే తాము ప్రతిస్పందిచాల్సివస్తుందని, చేతులు ముడుచుకుని కూర్చోలేమని ఆయన స్పష్టం చేశారు. శాంతియుత వాతావరణం మనగలగాలంటే సీమాంతర ఉగ్రవాదానికి అడ్డుకట్ట పడాల్సిందేనని చెప్పారు. రంజాన్ సందర్భంగా జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాద ఏరివేత కార్యక్రమానికి భద్రతా దళాలు నెలరోజుల పాటు విరామం ప్రకటించాయి. -
చైనా బలమైన దేశం కావొచ్చు.. కానీ భారత్!
సాక్షి, న్యూఢిల్లీ: తన భూభాగంలో దురాక్రమణకు దిగితే భారత్ సహించబోదని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ అన్నారు. చైనా బలమైన దేశం అయితే అవ్వొచ్చుకానీ, భారత్ బలహీనమైన దేశం కాదని ఆయన తేల్చిచెప్పారు. భారత్ తూర్పు సరిహద్దులపై దృష్టి సారించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన తెలిపారు. తూర్పు సరిహద్దుల్లో చైనా పాల్పడుతున్న సరిహద్దు ఉల్లంఘనలను ఎదుర్కొనే సత్తా దేశానికి ఉందన్నారు. చైనా ఇటీవల భారత సరిహద్దుల్లో కార్యకలాపాలు పెంచి దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి. మన ప్రాంతంలో చైనా మన ప్రాబల్యాన్ని క్రమంగా పెంచుకుంటూ భారత పొరుగు దేశాలను మచ్చిక చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే, భారత తన పొరుగు దేశాలను దూరం చేసుకోబోదని, చైనాకు అవి దగ్గర కాకుండా చూసుకుంటున్నదని ఆయన అన్నారు. -
సర్జికల్ స్ట్రైక్స్... ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు
పుణే : ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వెంబడి సర్జికల్ స్ట్రైక్స్ లాంటి ప్రయత్నం మరోసారి చేయకపోవటమే మంచిదని ఆయన వ్యాఖ్యానించారు. ‘‘సరిహద్దు రేఖ వెంబడి మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయకూడదనే భావిస్తున్నాం. ఎందుకంటే అందులో కొత్తదనం ఏం ఉండబోదు కాబట్టి. ఒకవేళ మేం సర్‌ప్రైజ్‌లే ఇవ్వాలనుకుంటే కొత్తరకంగా ఉపాయం వేసుకుంటాం. అది ఎలా ఉంటుందంటే అవతలివాళ్లు ఊహించని విధంగా.. సర్జికల్ స్ట్రైక్స్ కంటే మరింత సమర్థవంతంగా ఉంటాయి’’ అని ఆయన పేర్కొన్నారు. 2015లో మయన్మార్, 2016లో పీఓకే వెంబడి నిర్వహించిన సునిశిత దాడుల ఆపరేషన్ల గురించి, ఆయా సందర్భాల గురించి వివరించిన ఆయన.. ప్రస్తుతం ఉత్తర, తూర్పు సరిహద్దులో ఉన్న పరిస్థితులు, బలగాల మోహరింపు మొదలైన అంశాల కూలంకశంగా వివరించారు. శుక్రవారం పుణేలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
మరిన్ని డోక్లామ్‌లకు సిద్ధమవ్వాల్సిందే
జమ్మూ: భారత్–చైనా సరిహద్దులో భవిష్యత్‌లో డోక్లామ్ లాంటి ఉద్రిక్తతలు తలెత్తితే ఎదుర్కొనడానికి సైన్యం సర్వసన్నద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ పిలుపునిచ్చారు. పర్వత ప్రాంతాల్లో శత్రువుల్ని నిలువరించేందుకు, ఎదురుదాడి చేసేందుకు మోహరించే ‘17 కోర్’ను ప్రబల నిరోధక శక్తిగా మార్చే ప్రక్రియను చేపట్టినట్లు వెల్లడించారు. శనివారం నాడిక్కడ జరిగిన ఓ కార్యక్రమంలో దేశానికి అందించిన సేవలకు గుర్తింపుగా 47వ ఆర్మర్డ్ రెజిమెంట్‌కు ‘ప్రెసిడెంట్ స్టాండర్డ్’ విశిష్ట గౌరవాన్ని అందజేశారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు రావత్ సమాధానాలిచ్చారు. 17 కోర్‌ను చైనాను దృష్టిలో ఉంచుకునే ఏర్పాటు చేస్తున్నారా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ..‘అలా అని ఎందుకు అనుకోవాలి? శత్రువుల చొరబాటును అడ్డుకోవడానికి, దేశ రక్షణకు ప్రమాదకరంగా మారే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి వీటిని ఏర్పాటు చేస్తున్నాం’ అని జవాబిచ్చారు. 2014 జనవరిలో ప్రధాని నేతృత్వంలోని కేబినెట్ కమిటీ(రక్షణ) ‘17 కోర్’ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 90,274 సైనికులతో 2021 నాటికి ఈ విభాగం పూర్తిస్థాయిలో సిద్ధం కానుంది. కాగా, కశ్మీర్‌లోని యువతలో తీవ్రవాద భావజాలం పెంపొందడానికి సామాజిక మాధ్యమాలే కారణమని రావత్ అన్నారు. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. నియంత్రణా రేఖ(ఎల్వోసీ) వెంట పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఇప్పటికీ ఉగ్రవాద శిక్షణా కేంద్రాలు కొనసాగుతున్నాయన్నారు. -
అవసరమైతే మరోసారి సర్జికల్ దాడులు: రావత్
న్యూఢిల్లీ: పాక్‌కు సరైన గుణపాఠం చెప్పేందుకు అవసరమైతే నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మరోసారి సర్జికల్ దాడులు నిర్వహిస్తామని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఎల్వోసీ వెంబడి ఉగ్రవాద స్థావరాలు ఉండటంతోనే సరిహద్దు చొరబాట్లు జరుగుతున్నాయని రావత్ స్పష్టం చేశారు. దేశంలోకి ప్రవేశించే ఉగ్రవాదులను భూమికి రెండున్నర అడుగుల లోతులో పాతిపెట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత సైనికుల సాహసోపేత అనుభవాలపై జర్నలిస్టులు శివ్ అరూర్, రాహుల్ సింగ్‌లు రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రావత్ విలేకరుల ప్రశ్నలకు ఈ మేరకు స్పందించారు. -
సర్జికల్ స్ట్రైక్స్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి!
న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సర్జికల్ స్ట్రైక్స్ కన్నా ఎంతో మెరుగైన ప్రత్యామ్నాయాలు తమ వద్ద ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ‘సులువైన ఏకపక్ష యుద్ధాన్ని చేయడం ద్వారా ప్రతిఫలాన్ని పొందాలని పాక్ భావిస్తోంది. కానీ మా వద్ద (సర్జికల్ స్ట్రైక్స్ కన్నా) మెరుగైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మన సైన్యం ఆటవికమైనది కాదు. తలలు నరికి తీసుకురావాలని నేను కోరుకోను. మనది చాలా క్రమశిక్షణతో కూడిన దళం’ అని రావత్ మీడియాతో చెప్పారు. గత నెల 1న పాక్ జవాన్లు ఇద్దరు భారత సైనికుల తల నరికిన ఘటనను పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయెద్ సలహుద్దీన్ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంపై స్పందిస్తూ.. ‘అతన్ని పాకిస్థాన్ కట్టడి చేస్తుందా? లేదా అన్నది చూడాలి. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నాడే అతను ప్రతిరోజూ ఆందోళనల కోసం క్యాలెండర్ జారీచేశాడు’ అని రావత్ అన్నారు. లష్కరే తోయిబా స్థాపకుడు, ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్‌పై అమెరికా నజరానా ప్రకటించినప్పటికీ.. పాకిస్థాన్ అతన్ని కట్టడి చేయని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. -
ఈ అవగాహనా రాహిత్యం ఆందోళనకరం
అవలోకనం ప్రజలకు ఎంతగా జాతీయవాదాన్ని నూరిపోస్తామో అంత ఎక్కువగా కశ్మీరీలను దూరం చేసుకుంటాం. మన కొత్త ఆర్మీ చీఫ్ ఆ అశాంతికి కారణాలను అర్థం చేసుకున్నట్టు లేదు. కశ్మీరీలపై ప్రయోగించని కఠిన చర్యలు ఇంకా ఏవైనా ఉన్నాయా? పెల్లెట్ గన్స్‌ను ప్రయోగించి వందలాది మందిని అంధులను చేశాం. మొత్తంగా జనాభానే నేరస్తులుగా చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏం సాధించినా, మిలిటñ న్సీని అదుపు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. మనం దాన్ని అంగీకరించి, నూతన పరిష్కార మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలి. కొత్త రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన కొన్ని వారాలకే వాటి నకిలీ నోట్లు పట్టుబడ్డాయి. దొంగ 2,000 నోట్లు మొదట గుజరాత్లో దొరికాయి. ఇప్పుడు దేశం నలుమూలల నుంచి ఆ దొంగ నోట్ల వార్తలు వినవస్తున్నాయి. దొంగ నోట్ల సమస్యకు పెద్ద నోట్ల రద్దు అడ్డుకట్ట వేస్తుందంటూ దాన్ని కూడా అందుకు ఒక కారణంగా చెప్పారు. అది నిజం కాదని తేలిపోయింది. దొంగ నోట్ల సమస్యను ప్రధాని ఉగ్రవాద హింసాకాండతో ముడిపెట్టారు. మిలిటెన్సీని, తీవ్రవాదాన్ని అరికట్టడానికి పెద్ద నోట్ల రద్దును చేపట్టామన్నారు. ప్రధాని ఈ వాగ్దానాన్ని చేసి ఉండాల్సింది కాదు. మన దేశంలోని మిలిటెన్సీకి గల కారణాల పట్ల అవగాహనా రాహిత్యాన్ని ఇది బయటపెట్టింది. పెద్ద నోట్ల రద్దు జరిగినది చలికాలంలో. ఆ నెలల్లో కశ్మీర్లో సైన్యంపై జరిగే హింసాకాండ తక్కు వగా ఉంటుంది. మంచు కరిగే కొద్దీ ప్రతి ఏడాదిలాగే హింసాకాండ తిరిగి మొదలైంది. కాబట్టి పెద్ద నోట్ల రద్దు మిలిటెన్సీని అరికట్టడానికి తోడ్పడుతుందని చెప్పినది నిజం కాదు. ఒక మేజర్ సహా నలుగురు సైనికులు ఇటీవల కశ్మీర్లో మరణించారు. పెద్ద నోట్ల రద్దు వల్ల మిలిటెన్సీ స్థాయిలో ఎలాంటి తగ్గుదలా లేదు. పెద్ద నోట్ల రద్దు వల్ల సైన్యంపై హింసాత్మక దాడులు తగ్గుతాయని చెప్పారు. కాబట్టి ఇది వారిని విస్మయపరచింది. ఇటీవల ‘‘స్థానిక ప్రజల’’ను తప్పు పడుతూ మన ఆర్మీ చీఫ్ ఆగ్రహపూరితమైన ప్రకటన చేశారు. వారు ‘‘కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులు తప్పించుకుపోవడానికి సైతం తోడ్పడుతున్నారు’’ అని, సైన్యం తన పనిని చేయ నివ్వకుండా నిరోధిస్తున్నారని ఆరోపించారు. మరింత ఆందోళనకరంగా ఆయన.. పాకిస్తానీ, ఇస్లామిక్ స్టేట్ జెండాలను ప్రదర్శిస్తున్న భారతీయులను ‘‘జాతి వ్యతి రేకులు’’గా పరిగణిస్తామని, తమ సైనికులు ‘‘వారిని పట్టుకుని’’ ‘‘కఠిన చర్యలు’’ చేపడతారని అన్నారు. ఆర్మీ చీఫ్‌గానీ, ఆయన సైనికులుగానీ ఏదైనా చర్యను నేరంగా భావిస్తే, వారు ఆ విషయాన్ని జమ్మూకశ్మీర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. అంతేగానీ జెండాలు ఊపేవారికి, నినాదాలు చేసేవారికి వ్యతిరేకంగా చర్యలు చేపట్టే రాజ్యాంగబద్ధమైన అధికారం వారికి లేదు. సైన్యం, కశ్మీర్ ప్రజల వ్యతిరేకతను ఎదుర్కొంటోందని ఆర్మీ చీఫ్ జనరల్ రావత్ తెలిపారు. చాలామంది భారతీయులకు బహుశా తెలిసి ఉండని ఆ వాస్త వాన్ని ఆయన వెల్లడించారు. ‘‘మేం వారికి (ఉగ్రవాదులకు) వ్యతిరేకంగా సైనిక చర్యలను నిర్వహిస్తున్నప్పుడు, స్థానిక ప్రజలు భద్రతా బలగాల చర్యలకు ఏదో ఒక విధమైన మద్దతును తెలుపకపోవడం కనబడుతోంది’’ అని కూడా ఆయన అన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఆందోళన కలిగించాల్సిన విషయం. రాష్ట్ర ప్రభుత్వంలో అది కూడా భాగస్వామిగా ఉన్నది మరి. వాస్తవాధీన రేఖకు అవతలి నుంచి పంపుతున్న కొన్ని శక్తులు కశ్మీర్లో దురాగతాలకు పాల్పడుతున్నాయని విశ్వసించడం వేరు. మొత్తంగా స్థానిక జనాభా అంతా మీపట్ల వ్యతిరేకతతో ఉన్నారని అంగీకరించడం వేరు. అది సరైనదైనా, కాకున్నా ఆ విషయాన్ని జనరల్ రావత్ అంగీకరించారు. ‘‘ప్రజలపట్ల మైత్రీపూర్వకంగా ఉండే సైనిక చర్యలను నిర్వహించాలనేదే మా లక్ష్యం. కాగా, ఆ చర్యలను నిర్వహించకుండా స్థానిక ప్రజలు మమ్మల్ని నిరోధిస్తున్న తీరు, కొన్ని సందర్భాల్లో ఉగ్రవాదులు తప్పించు కోవడానికి సైతం వారు మద్దతుగా నిలవడం... భద్రతా బలగాల నష్టాల సంఖ్య ఎక్కువగా ఉండటానికి కారణమౌతున్న అంశాలు’’ అని ఆయన అన్నారు. ఈ ప్రకటనపై బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ ఇప్పుడు సిగపట్లు పడుతున్నాయి. కానీ ఈ సమస్యకు సంబంధించి ఆ రెండిటి మధ్యా ఎలాంటి తేడా లేదు. అది గత 30 ఏళ్లుగా మనం అది చూస్తూనే ఉన్నాం. ఇటీవల కశ్మీర్లో జరుగుతున్న ఘటన లపట్ల కేంద్రం వైఖరిలోగానీ, మిగతా దేశం వైఖరిలో గానీ ఎలాంటి మార్పు లేని అదే ధోరణి కనిపిస్తోంది. ఈ వారం ఒక కశ్మీరీ విద్యార్థి ఉగ్రవాద ఆరోపణల నుంచి బయటపడ్డాడు. ఢిల్లీలో సదరు బాంబు పేలిన రోజున అతడు శ్రీనగర్‌లోని ఒక కళాశాలలో ఉన్నట్టు తేలింది. ఆ కళాశాల రిజిస్టర్లో ఆరోజున అతను కళాశాలకు హాజరైనట్టు నమోదై ఉంది. తనను ఇలా బలిపశువును చేయడానికి కారణం తాను ఒక కశ్మీరీ కావడమేనని ఆ విద్యార్థి విశ్వసిస్తున్నాడు. ఇది జరిగినది నరేంద్ర మోదీ ఎన్డీఏ ప్రభుత్వ పాలనలో కాదు, మన్మోహన్సింగ్ యూపీఏ ప్రభుత్వ హయాం లోని 2005లో. భారత్, ప్రజలకు ఎంత బలంగా జాతీయవాదాన్ని నూరిపోస్తుంటుందో అంత ఎక్కువగా మనం కశ్మీరీలను దూరం చేసుకుంటాం. ఆ రాష్ట్రంలో నెలకొన్న అశాంతిని పెద్ద నోట్ల రద్దు పరిష్కరించలేదని మనం అర్థం చేసుకోవాలి. దానికి మరింత లోతైన కారణాలున్నాయి. దురదృష్టవశాత్తూ మన కొత్త ఆర్మీ చీఫ్ వాటిని అర్థం చేసుకున్నట్టు అనిపించడం లేదు. తన సొంత పౌరులనే ఉద్దేశించి చేసిన ఆ ప్రకటనలో ఆయన ఇంకా ఈ విషయాన్ని కూడా జోడించారు: ‘‘యువకులైన ఈ పిల్లలను చంపకూడదనేదే మా భావన. వారిని ప్రధాన స్రవంతిలోకి తిరిగి తేవా లనేదే మా యోచన. కానీ వారి తీరు ఇలాగే ఉంటే వారిని లక్ష్యాలుగా చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ కఠిన చర్యలను చేపడతాం’’. కశ్మీరీలపై ఇంతకు ముందే ప్రయోగించని సాధ్యమైన కఠిన చర్యలు భారత్ వద్ద ఇంకా ఏవైనా ఉన్నాయా? గుంపులను చెదరగొట్టడానికి ఇప్పటికే మనం వారిపై పెల్లెట్ గన్స్‌ను (ఇనుప రవ్వలను చల్లే తుపాకులు) ప్రయోగించి వంద లాది మందిని అంధులను చేశాం. ఎలాంటి ఆలోచనా లేకుండా వారిపై క్రిమినల్ నేరాలను మోపాం. మొత్తంగా జనాభానే నేరస్తులుగా చూస్తున్నాం. పెద్ద నోట్ల రద్దు వల్ల ఏ విజయాలను సాధించామనైనా చెప్పుకోవచ్చునేమోగానీ... మిలిటñ న్సీని అదుపు చేయడంలో మాత్రం విఫలమయ్యారు. మనం దాన్ని అంగీకరించి, నూతన పరిష్కార మార్గాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ పరిష్కారాలను ఈ సమస్యను ఏదో కరెన్సీకి సంబంధించినదిగా వ్యవహరించేవి కాకూడదు. ఈ సమస్యకు బహిర్గత పార్శా్వలున్నంతగా, అంతర్గత పార్శా్వలు కూడా ఉన్నాయని భావించేవిగా ఆ పరిష్కారాలుండాలి. - ఆకార్ పటేల్ వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com -
లాన్స్‌నాయక్ హనుమంతప్పకు సేనా మెడల్
న్యూఢిల్లీ: దుర్భరమైన హిమాలయాల్లో 30 అడుగుల లోతులో మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రతలో మంచు పెళ్లల కింద ఆరురోజులపాటు మృత్యువుతో పోరాడి అనంతరం ఆస్పత్రిలో మరణించిన వీరసైనికుడు లాన్స్ నాయక్ హనుమంతప్ప కొప్పాడ్‌ను సైన్యం సేనా పతకంతో సత్కరించింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సియాచిన్ యుద్ధభూమిలో గత ఫిబ్రవరి 3న మంచుతుపాన్‌లో 10 మంది సైనికులు సజీవ సమాధి కాగా ఒక్క హనుమంతప్పను మాత్రం ఆరు రోజుల తర్వాత సహాయక దళాలు ప్రాణాలతో బయటికి తీశాయి. అనంతరం అతన్ని సైనిక ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఫిబ్రవరి 11న మరణించాడు. ఆర్మీడే సందర్భంగా ఆదివారం ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ హనునమంతప్ప భార్య మహాదేవి అశోక్ బిలేబల్‌కు ఈ అవార్డు అందజేశారు. కర్ణాటకలోని ధార్వాడ్ జిల్లా బెటాదుర్ గ్రామానికి చెందిన హనుమంతప్ప మద్రాస్ రెజిమెంట్‌లో సైనికుడిగా పనిచేశాడు. -
మాతో పంచుకోండి
ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ సూచన న్యూఢిల్లీ: వృత్తిగత సమస్యలనుఆర్మీ, ఇతర భద్రతా విభాగాల సిబ్బంది ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. ఫిర్యాదు చేసేందుకు సైనికులు సోషల్ మీడియాను కాకుండా త్వరలో ఏర్పాటు చేయనున్న ఫిర్యాదుల పెట్టెల్ని ఉపయోగించుకోవాలన్నారు. ఫిర్యాదుల్ని అంతర్గత వ్యవస్థల ద్వారానే పరిష్కరించుకోవాలన్నారు. ఎవరికైనా ఏదైనా ఫిర్యాదు ఉంటే తనతో ప్రత్యక్షంగా పంచుకోవచ్చన్నారు. సీనియర్లు ఫిర్యాదుల్ని పరిష్కరిస్తారనే నమ్మకం సైనిక దళాల్లో ఉండాలన్నారు. ‘మనమంతా ఒక బృందం... భారతదేశం భద్రంగా, శాంతియుతంగా ఉండేందుకు ఒక దళంగా పనిచేయాలి’ అని రావత్ పిలుపునిచ్చారు. అన్ని ఆర్మీ కమాండ్ ప్రధాన కేంద్రాలతో పాటు దిగువ స్థాయి ప్రాంతాల్లోనూ ఫిర్యాదు పెట్టెల్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఫిర్యాదులు, సలహాల పెట్టెల ఏర్పాటుకు ఆదేశాలిచ్చానని తెలిపారు. సామాజిక మాధ్యమం రెండు వైపులా పదునున్న ఆయుధమని దాన్ని అనుకూలంగా, ప్రతికూలంగానూ ఉపయోగించుకోవచ్చం టూ సున్నితంగా హెచ్చరించారు. బాధ్యతలూ పంచుకోవాలి! పురుషులతో సమానంగా అవకాశాలిచ్చినప్పుడు అంతే స్థాయిలో మహిళలు బాధ్యతలు పంచుకోవాల్సి ఉంటుందని రావత్ స్పష్టం చేశారు. యుద్ధ భూమిలోకి వెళ్లాలనుకొనే మ హిళా జవాన్లకు ప్రత్యేక వసతుల కల్పన ఉండదన్నారు. కనుక ఈ బృందంలో ఉండాలా వద్దా అనేది వారే నిర్ణయించుకోవాలన్నారు. శాంతి వద్దంటే సర్జికల్ దాడే! భారత్‌లో శాంతికి విఘాతం కలిగిస్తే.. పాక్‌పై మరిన్ని సర్జికల్ దాడులు తప్పకపోవచ్చన్నారు. భవిష్యత్తులోనూ భారత్‌కు ప్రచ్ఛన్నయుద్ధం, ఉగ్రవాదం వంటి సవాళ్లు తప్పవన్నారు. నవంబర్ 23న ఇరు దేశాల డీజీఎంవోలు చర్చించిన తర్వాత నియంత్రణ రేఖ వద్ద గతంలో కంటే పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయన్నారు. -
ఇండియన్ ఆర్మీలో ఆర్డర్లీ: సంచలన వీడియో
-
ఇండియన్ ఆర్మీలో ఆర్డర్లీ: సంచలన వీడియో
- ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు: జవాన్ - స్పందించిన ఆర్మీ చీఫ్.. ఇక ‘ఫిర్యాదుల పెట్టె’ న్యూఢిల్లీ: నిన్నటిదాకా భద్రతా బలగాలకే పరిమితం అయిన ‘జవాన్ వీడియోల’ వ్యవహారం మొదటిసారి భారత సైన్యం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీలో కొందరు అధికారులు జవాన్లతో చేయించకూడని పనులు చేయిస్తున్నరని, దీనిపై రాష్ట్రపతి, ప్రధానులకు లేఖరాసినందుకు ప్రతీకారంగా తాను టార్చర్‌కు గురవుతున్నానంటూ ఓ ఆర్మీ జవాన్ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్చేశాడు. భద్రతా బలగాల్లో పనిచేస్తోన్న జవాన్లకు సరైన భోజనం, జీతభత్యాలు అందడంలేదన్న బీఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్ జవాన్ల వీడియోలపై దుమారం చల్లారకముందే మూడోది బయటికిరావడం గమనార్హం. డెహ్రాడూన్‌లోని 42వ ఇన్ఫంట్రీ బ్రిగేడ్‌లో లాన్స్ నాయక్‌గా పనిచేస్తోన్న యజ్ఙప్రతాప్ సింగ్.. శుక్రవారం యూట్యూబ్‌లో ఒక వీడియోను పోస్ట్చేశాడు. కొందరు అధికారులు.. కిందిస్థాయి జవాన్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, షూపాలిష్ లాంటి పనులు చేయిస్తున్నారని సింగ్ ఆరోపించాడు. ఇదే విషయమై గతంలో తాను.. రాష్ట్రపతి, ప్రధాని, రక్షణశాఖ, హోంశాఖలకు లేఖలు రాశారనిని, దీనిపై ప్రధాని కార్యాలయం వివరణ కూడా అడిగిందని గుర్తుచేశాడు. ‘ఫిర్యాదు చేసే సమయంలో నేను ఆర్మీ నిబంధనలను ఉల్లంఘించలేదు. ఎప్పుడైతే ప్రధాని కార్యాలయం రిపోర్టు అడిగిందో, అప్పటి నుంచి నాపై వేధింపులు రెట్టింపు అయ్యాయి. ఆత్మహత్యకు ప్రేరేపించేలా అధికారులు నన్ను దూషిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం ఆర్మీ నియమాలకు విరుద్ధం కాబట్టి నేనాపని చేయడంలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నా’అని యజ్ఙప్రతాప్ సింగ్ వీడియోలో చెప్పారు. (భారత ‘బోర్డర్’లో సంచలనాలు) ఫిర్యాదుల పెట్టె: ఆర్మీ చీఫ్ కాగా, భద్రతా బలగాలు, ఆర్మీ జవాన్ల వరుస వీడియోలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇకపై అన్ని చోట్లా ‘ఫిర్యాదుల పెట్టెలు’(Complaint Boxs) ఉంచుతామని తెలిపారు. ‘తమ సమస్యలపై జవాన్లు వీడియోలు పోస్ట్ చేయడం కన్నా, పై అధికారులకు ఫిర్యాదుచేస్తే బాగుంటుంది’అని రావత్ హితవు పలికారు. ఇప్పటివరకు వెలుగుచూసిన వీడియో ఉదంతాలపై విచారణ జరుగుతున్నదని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో పాకిస్థాన్‌పై ఏక్షణంలోనైనా సర్జికల్ దాడులకు సిద్ధమని రావత్ పేర్కొన్నారు.