
న్యూఢిల్లీ: లడఖ్‌లో సరిహద్దులు దాటి చైనా సైన్యం చొచ్చుకువచ్చిందన్న వార్తలపై ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్పందించారు. ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఆధ్యాత్మిక గురువు దలై లామా 84వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 6వ తేదీన కొందరు టిబెటన్లు లడఖ్‌లోని డెమ్‌చోక్ సెక్టార్‌లో ఉత్సవాలు జరుపుకున్నారని, ఆ సందర్భంగా వారు టిబెటన్ పతాకాలను ఎగురవేశారని తెలిపారు. ఆ సమయంలో భారత్ భూభాగంలోని వాస్తవ నియంత్రణ రేఖను దాటేందుకు యత్నించిన చైనా సైనికులను తాము అడ్డుకున్నామన్నారు. దీంతో వారు అక్కడ జరుగుతున్న ఉత్సవాలను గమనించి, అర్థగంట తర్వాత వెనక్కి వెళ్లిపోయారన్నారు. అంతేతప్ప, చైనీయులు ఎటువంటి ఆక్రమణకు పాల్పడలేదన్నారు. పాకిస్తాన్ సైన్యం ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా గట్టిగా బదులిస్తామని, ఉగ్ర చర్యలకు పాల్పడితే శిక్ష తప్పదని జనరల్ బిపిన్ రావత్ అన్నారు. ‘కార్గిల్ యుద్ధానికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వేతర శక్తులు బలపడి ఉగ్ర చర్యలకు పాల్పడుతుండటం కొత్త పరిణామం అని అన్నారు.