న్యూఢిల్లీ: పాక్‌కు సరైన గుణపాఠం చెప్పేందుకు అవసరమైతే నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మరోసారి సర్జికల్ దాడులు నిర్వహిస్తామని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఎల్వోసీ వెంబడి ఉగ్రవాద స్థావరాలు ఉండటంతోనే సరిహద్దు చొరబాట్లు జరుగుతున్నాయని రావత్ స్పష్టం చేశారు.
దేశంలోకి ప్రవేశించే ఉగ్రవాదులను భూమికి రెండున్నర అడుగుల లోతులో పాతిపెట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత సైనికుల సాహసోపేత అనుభవాలపై జర్నలిస్టులు శివ్ అరూర్, రాహుల్ సింగ్‌లు రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్‌లెస్’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రావత్ విలేకరుల ప్రశ్నలకు ఈ మేరకు స్పందించారు.