Surgical attacks
-
ప్రధాని మోదీకి ఎంపీ ముఖ్యమంత్రి సవాల్!
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ కేంద్రంపై మరోసారి విమర్శలు గుప్పించారు. సర్జికల్ స్ట్రైక్స్‌ను రాజకీయంగా వాడుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, ఆ దాడికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టాలని సవాల్ విసిరారు. భారత సైన్యంపై తనకు ఎనలేని గౌరవం ఉందని, అదే సమయంలో కేంద్ర వైఖరిపై అనుమానాలు ఉన్నాయని అన్నారు. మీడియాలో వచ్చిన కథనాలను నమ్మలేమని, సర్జికల్ స్ట్రైక్స్‌ను చేపట్టామని చెప్పుకుంటున్న కేంద్రం ఇంతవరకు ఫోటో, గణాంక ఆధారాలను ఎందుకు బయటపెట్టలేదని విమర్శించారు. అంతా మీడియాలో గొప్పలు చెప్పుకున్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు. కాగా, ఉరి సెక్టార్‌లోని భారత ఆర్మీ స్థావరాలపై 2016లో పాకిస్థాన్ టెర్రరిస్ట్‌లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. దానికి ప్రతిగా భారత సైన్యం సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టింది. పాకిస్థాన్‌కు గట్టి గుణపాఠం చెప్పింది. ఇక గతేడాది పుల్వామా దాడికి ప్రతీకారంగా భారత వాయుసేన బాలాకోట్‌పై యుద్ధ విమానాలతో విరుచుకుపడింది. జైషే శిక్షణా శిబిరాల్లో ఉన్న ఉగ్రవాదులను భారత వాయుసేన దళాలు మట్టుబెట్టాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే, బాలాకోట్ దాడులకు సంబంధించి కూడా పక్కా ఆధారాలు లభించలేదు. ఉరి ఘటన.. సర్జికల్ స్ట్రైక్స్ నేపథ్యంలో వచ్చిన బాలీవుడ్ చిత్రం ‘ఉరి’ ఘన విజయం సాధించింది. చదవండి: సీఎంపై విచారణకు హోంశాఖ ఆమోదం -
మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ అప్పుడే..
-
మందిర నిర్మాణానికి ఆర్డినెన్స్ అప్పుడే..
న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై న్యాయ ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా ఆర్డినెన్స్ తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నూతన సంవత్సరం తొలిరోజున ప్రధాని ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ వ్యవహారంపై న్యాయ ప్రక్రియ నెమ్మదించేలా కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ పరిధిలో ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని నాలుగు తరాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ పలు కుంభకోణాల్లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఆర్థిక అవకతవకలతో బెయిల్ మీద ఆ పార్టీ అగ్రనేతలున్నారని ఎద్దేవా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే ఊర్జిత్ నిష్ర్కమణ ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని చెప్పారు. గత ఆరేడు నెలలుగా ఆయన తనను రిలీవ్ చేయాలని కోరుతున్నారని, చివరికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఊర్జిత్ రాజీనామా వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన తన విధులను సమర్ధంగా నిర్వహించారని ప్రశంసించారు. కూటమి వర్సెస్ ప్రజలు 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలు మహాకూటమికి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరుగా మోదీ అభివర్ణించారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే తనకు కొండంత అండగా నిలుస్తాయన్నారు. మెరుపు దాడులపై ఉత్తర్వులు.. పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు నిర్వహించిన మెరుపు దాడులకు తాను స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశానని చెప్పుకొచ్చారు. దాడులు చేపట్టే క్రమంలో మీరు విజయవంతమైనా, విఫలమైనా దాని గురించి ఆలోచించకుండా సూర్యోదయం అయ్యే సమయానికి తిరిగి చేరుకోవాలని సైన్యానికి సూచించానన్నారు. ఆపరేషన్‌ను అతితక్కువ సమయంలో పూర్తిచేయాలని, దాన్ని ఎక్కువసేపు కొనసాగించరాదని చెప్పానన్నారు. ఈ ఆపరేషన్ గురించి వివరించే క్రమంలో మోదీ కొంత భావోద్వేగానికి లోనైనట్టు కనిపించారు. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం ఎందుకంటే.. సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రాజ్యాంగ పరిధిలో ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచామని ప్రధాని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను పెద్దసంఖ్యలో ముస్లిం దేశాలు నిషేధించాయని చెప్పారు. పాకిస్తాన్లో సైతం ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారన్నారు. ఇది ఎలాంటి మతానికి, విశ్వాసానికి సంబంధించిన అంశం కాదని, కేవలం లింగ సమానత్వం, సామాజిక న్యాయంతో ముడిపడిన వ్యవహారమని చెప్పారు. శబరిమలపై విస్తృత చర్చ.. దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నది భారత్ అభిమతం..దేశంలో కొన్ని దేవాలయాలకు ప్రత్యేక సంప్రదాయాలున్నాయని శబరిమల ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని పేర్కొన్నారు. కొన్ని ఆలయాల్లో పురుషులకు ప్రవేశం లేదని గుర్తుచేశారు. శబరిమల విషయంలో సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెబుతూ, ఆయా అభిప్రాయాలను వ్యక్తం చేసే వారికి రాజకీయ కోణాలతో ముడిపెట్టరాదన్నారు. ఓ మహిళగా ఆమె చేసిన సూచనలపైనా చర్చ జరగాలన్నారు. -
10 సర్జికల్ దాడులతో బదులిస్తాం: పాక్
ఇస్లామాబాద్: భారత్ తమపై ఒక్క సర్జికల్ దాడి చేస్తే ప్రతీకారంగా తాము అటువంటి 10 దాడులు చేస్తామని పాక్ హెచ్చరించింది. పాక్ సైన్యాధ్యక్షుడు జనరల్ కమర్ జావెద్ బజ్వాతోపాటు లండన్‌లో మీడియాతో మాట్లాడిన సైన్యం అధికార ప్రతినిధి మేజర్ జనరల్ అసిఫ్ గఫూర్ ఈ హెచ్చరికలు చేసినట్లు పాక్ రేడియో పేర్కొంది. ‘భారత్ చేసే ప్రతి సర్జికల్ స్ట్రైక్‌కు సమాధానంగా 10 దాడులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మాకు వ్యతిరేకంగా దుస్సాహసానికి పాల్పడాలనుకునే వారు, మా సామర్థ్యాన్ని గురించి సందేహ పడవద్దు’అంటూ వ్యాఖ్యానించారు. దాదాపు రూ.3లక్షల కోట్లతో చేపట్టే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్(సీపీఈసీ) భారీ ప్రాజెక్టు సంరక్షణ బాధ్యతను సైన్యం తీసుకుంటుందన్నారు. దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కావడాన్ని సైన్యం కోరుకుంటోందని ఆ కథనంలో పాక్ రేడియో తెలిపింది. -
మోదీ ఇమేజ్ పెంచుకునేందుకే వీడియో విడుదల చేశారు
-
‘బీజేపీ దిగజారుడుతనానికి సాక్ష్యం ఈ వీడియో’
సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ నరేంద్ర మోదీ తన ఇమేజ్ను పెంచుకునేందుకే సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో విడుదల చేశారని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. గురువారం మీడియా సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా మాట్లాడుతూ.. సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన ఘనత భారత సైనికులకు ఇవ్వకుండా బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. రాజకీయంగా లాభపడేందుకే సైనికులకు చెందాల్సిన ఘనత మోదీకి కట్టబెట్టడం వారి అధికార దాహానికి నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఈవిధంగానే సిగ్గు లేకుండా సైనికుల త్యాగాన్ని తమ ఖాతాలో వేసుకుని ఓట్లు సంపాదించాలని చూసిందని విమర్శించారు. వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకే... మోదీ ప్రభుత్వ వైఫల్యాలు బయట పడినపుడు, అమిత్ షా వ్యూహాలు ఫలించని సమయాల్లో ఇటువంటి దిగజారుడు చర్యలకు పాల్పడటం వారికి అలవాటేనంటూ సుర్జేవాలా విమర్శించారు. మెదీ ప్రభుత్వం అసమర్థత వల్లే 146 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. 1600 సార్లు పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం, 79 ఉగ్రదాడులు జరగడం ప్రభుత్వ వైఫల్యం కాక మరేమిటని ప్రశ్నించారు. శత్రువుల దాడులను ఎదుర్కొనేందుకు అధునాతన పరికరాలు కొనుగోలు చేసేందుకు నిధులు అందించలేని మోదీ ప్రభుత్వం సర్జికల్ స్ట్రైక్స్ గురించి చెప్పుకోవడం సిగ్గుచేటాన్నరు. మాజీ ప్రధానులు అటల్‌బిహారీ వాజపేయి, మన్మోహన్ సింగ్‌లు భద్రతా ప్రమాణాల దృష్ట్యా సర్జికల్ స్ట్రైక్స్ చేపట్టారు కానీ తమ గొప్పను ప్రదర్శిచుకోవడానికి వాటిని ఉపయోగించుకోలేదన్నారు. మోదీ, బీజేపీ చేస్తోన్న రాజకీయాలకు బలికాకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయన హెచ్చరించారు. కాగా, ఉడీ ఘటనకు ప్రతీకారంగా పాక్ అక్రమిత కశ్మీర్‌లోని(పీఓకే) ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత ఆర్మీ నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్‌కు సంబంధించిన వీడియో బుధవారం రాత్రి వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ వీడియో నిజమైనదేనని సర్జికల్ స్ట్రైక్స్‌కు ఇంచార్జ్‌గా వ్యవహరించిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా నిర్ధారించారు. -
సర్జికల్ దాడులపై ఓ సినిమా, రెండు పుస్తకాలు
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్(పీవోకే)లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం సర్జికల్ దాడులు నిర్వహించి సెప్టెంబర్ 28 నాటికి ఏడాది పూర్తయిన వేళ ఈ ఘటనను ఆధారంగా తీసుకుని ఓ చిత్రంతో పాటు రెండు పుస్తకాలు రానున్నాయి. ‘ఉడీ’ పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అధియా ధార్ దర్శకత్వం వహిస్తుండగా, రోన్నీ స్క్రూవాలా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇందులో భారత బృందానికి నేతృత్వం వహించిన కమాండర్‌గా విక్కీ కౌశల్ నటిస్తున్నారు. దీంతోపాటు జర్నలిస్ట్, రచయిత నితిన్ గోఖలే రాసిన ‘ఇన్ సెక్యూరింగ్ ఇండియా ది మోదీ వే: పఠాన్ కోట్, సర్జికల్ స్ట్రైక్స్ అండ్ మోర్’ పుస్తకాన్ని శుక్రవారం ఢిల్లీలో ఆవిష్కరించనున్నారు. సర్జికల్ దాడులతోపాటు భారత సైనికుల ప్రదర్శించిన అసమాన సాహసాలతో శివ్ అరూర్, రాహుల్ సింగ్‌లు రచించిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్: ట్రూ స్టోరీస్ ఆఫ్ మోడ్రన్ మిలటరీ హీరోస్’ పుస్తకం ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. -
అవసరమైతే మరోసారి సర్జికల్ దాడులు: రావత్
న్యూఢిల్లీ: పాక్‌కు సరైన గుణపాఠం చెప్పేందుకు అవసరమైతే నియంత్రణ రేఖ(ఎల్వోసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మరోసారి సర్జికల్ దాడులు నిర్వహిస్తామని భారత ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ తెలిపారు. ఎల్వోసీ వెంబడి ఉగ్రవాద స్థావరాలు ఉండటంతోనే సరిహద్దు చొరబాట్లు జరుగుతున్నాయని రావత్ స్పష్టం చేశారు. దేశంలోకి ప్రవేశించే ఉగ్రవాదులను భూమికి రెండున్నర అడుగుల లోతులో పాతిపెట్టేందుకు సైన్యం సర్వసన్నద్ధంగా ఉందని ఘాటుగా వ్యాఖ్యానించారు. భారత సైనికుల సాహసోపేత అనుభవాలపై జర్నలిస్టులు శివ్ అరూర్, రాహుల్ సింగ్‌లు రాసిన ‘ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్’ పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న రావత్ విలేకరుల ప్రశ్నలకు ఈ మేరకు స్పందించారు. -
దేశం కోసమే..
♦ సర్జికల్ దాడులు, నోట్లరద్దు, జీఎస్టీపై మోదీ ♦ భారత సంతతి ప్రజలతో ప్రధాని సమావేశం యాంగాన్: భారతదేశ ప్రయోజనాల్లో భాగమే నోట్లరద్దు, సర్జికల్ దాడులు, జీఎస్టీ నిర్ణయాలని ప్రధాని పేర్కొన్నారు. మయన్మార్‌లో భారత సంతతి ప్రజల్ని ఉద్దేశించి బుధవారం ప్రధాని మోదీ ప్రసంగించారు. ‘రాజకీయాలపై కంటే దేశమే ముఖ్యమని భావించడం వల్లే అలాంటి కీలక నిర్ణయాలు తీసుకోగలుతున్నాం. సర్జికల్ దాడులు, నోట్ల రద్దు, జీఎస్టీ ఇలా ఏ నిర్ణయమైనా ఎలాంటి భయం, సంకోచం లేకుండా తీసుకున్నాం’ అని చెప్పారు. నోట్ల రద్దు గురించి మాట్లాడుతూ.. ‘నల్లధనం, అవినీతి నిర్మూలనకు ఆ నిర్ణయం తీసుకున్నాం. ఆదాయపు పన్ను చెల్లించకుండా బ్యాంకుల్లో కోట్లు దాచుకున్న లక్షల మందిని గుర్తించగలిగాం. మనీ ల్యాండరింగ్‌తో సంబంధమున్న రెండు లక్షల కంపెనీల రిజిస్ట్రేషన్ల్ని రద్దు చేశాం. జీఎస్టీ అమల్లోకి వచ్చాక నిజాయతీగా వ్యాపారం చేసే వాతావరణాన్ని కల్పించాం. సంస్కరణలే కాకుండా దేశ పరివర్తన కోసం కృషిచేస్తున్నాం. 2022 నాటికి నవభారతాన్ని నిర్మించడమే లక్ష్యం’ అని అన్నారు. ‘అభివృద్ధి ఫలాల్ని పొరుగుదేశాలతో పంచుకోవాలని భారత్ విశ్వసిస్తుంది. కష్టసమయాల్లో సాయపడుతోంది. కొన్ని నెలల క్రితం సార్క్ దేశాల కోసం దక్షిణాసియా శాటిలైట్‌ను ప్రయోగించాం. నేపాల్ భూకంపం, మాల్దీవుల్లో తాగునీటి సమస్య, మయన్మార్ తుపాను సమయంలో భారత్ ముందుగా స్పందించింది’ అని చెప్పారు. ్ర బిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వారి త్యాగాలకు గుర్తుగా నేతాజీ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ(ఐఎన్ఏ) స్మారకాన్ని మయన్మార్‌లో ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు. ‘మీ రక్తాన్ని ఇవ్వండి.. నేను మీకు స్వాతంత్య్రం ఇస్తా’ అని మయన్మార్‌లో నేతాజీ సుభాష్ చంద్ర బోస్ ఇచ్చిన పిలుపునకు వేలాది మంది స్పందించారని మోదీ గుర్తుచేశారు. -
‘సర్జికల్’ను ఎవరూ తప్పుబట్టలేదు!
సార్వభౌమత్వం కాపాడుకునేందుకు ఏమైనా చేయగలం ► మూడేళ్లలో ఒక్క అవినీతి మరక లేకుండా పాలన ► విదేశాల్లో ఉంటున్న భారతీయుల కలలు సాకారం చేస్తాం ► భారత అమెరికన్లకు ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వాషింగ్టన్: పాకిస్తాన్‌పై గతేడాది జరిపిన సర్జికల్ దాడులపై ప్రపంచాన్ని ఒప్పించటంలో భారత్ విజయవంతమైందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్ల డించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని దోషులుగా నిలబెట్టడంలో అనుకున్నది సాధించగలిగామన్నారు. వర్జీనియాలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భారతీయ అమెరికన్లనుద్దేశించి భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రధాని మోదీ ప్రసంగించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రకేంద్రాలపై సెప్టెంబర్ 29న భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులపై.. ఒక్కదేశం కూడా మనల్ని తప్పబట్టలేదని గుర్తుచేశారు. ఆనాటి దాడులు తన సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు భారత్ ఏమైనా చేయగలదని నిరూపించాయని 600 మందికిపైగా ఆహూతులనుద్దేశించి ప్రధాని తెలిపారు. ‘20 ఏళ్ల క్రితం ఉగ్రవాదం గురించి మనం మాట్లాడినపుడు చాలా దేశాలు దీన్ని అర్థం చేసుకోకుండానే శాంతిభద్రతల సమస్యగా పేర్కొన్నాయి. కానీ ఇప్పుడు ఉగ్రవాదులే వారికి ఉగ్రవాదాన్ని అర్థం చేయించారు. మనమేమీ చేయలేదు’ అని ప్రపంచదేశాల్లో ఇటీవల పెరిగిన ఉగ్రఘటనలను ఉటంకిస్తూ మోదీ వ్యాఖ్యానించారు. ‘అంతర్జాతీయ చట్టాలకు కట్టుబడి ఉండటమే భారత్ విధానం. వసుధైక కుటుంబం (ప్రపంచమంతా ఒకే కుటుంబం) అనే సూత్రాన్ని భారత్ విశ్వసిస్తుంది. ఇదే మా స్వభావం, వ్యక్తిత్వం’ అని మోదీ తెలిపారు. భారత సార్వభౌమత్వానికి, భద్రతకు, దేశ ప్రజల శాంతి, అభివృద్ధికి అడ్డుగా నిలిస్తే ఎవరిపైనైనా కఠినంగా వ్యవహరించటంలోనూ వెనుకాడేదిలేదని స్పష్టీకరణ. సుష్మపై ప్రశంసలు దౌత్యవిధానానికి కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ కొత్త నిర్వచనం చెప్పారని ప్రధాని ప్రశంసించారు. సామాజిక మాధ్యమాన్ని సమర్థవంతంగా వినియోగించుకుని సుపరిపాలన అందించటంలో సుష్మ చాలా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారన్నారు. ప్రపంచం నలుమూలల ఇబ్బందుల్లో ఉన్న భారతీయులను ఆమె ఆదుకుంటున్నారని పొగడ్తల వర్షం కురిపిం చారు. ‘సామాజిక మాధ్యమం చాలా శక్తివంతమైంది. నేను కూడా దీంతో అనుసంధానితమయ్యా ను. కానీ సుష్మా స్వరాజ్ సామాజిక మాధ్యమం వినియోగంలో ఉదాహరణగా నిలిచారు. సమస్యల్లో ఉన్నామని ట్వీట్ చేస్తే అర్ధరాత్రి 2గంటలకైనా సరే 15 నిమిషాల్లోనే సమాధానం ఇస్తున్నారు. వేగంగా స్పందించి వారిని కాపాడుతున్నారన్నారు’ అని తెలిపారు. దీంతో సభ కరతాళధ్వనులతో మార్మోగింది. మూడేళ్లలో 80వేల మంది భారతీయులను (వివిధ దేశాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని) సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చినట్లు మోదీ వెల్లడించారు. ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వంపై ఒక్క అవినీతి మరకా లేదన్నారు. అవినీతిని పెకలించివేసేందుకు తమ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని తెలిపారు. ‘పాలనలో సాంకేతిక పద్ధతుల వినియోగంతో లీకేజీలను అరికడుతున్నాం. ప్రత్యక్ష నగదు బదిలీ విధానం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకే డబ్బులు వెళ్తున్నాయి. ఒక్క పిలుపుతోనే లక్షల మంది తమ సిలిండర్ సబ్సిడీలను వదులుకున్నారు. ఆ డబ్బులతో పేదలకు ఉచితంగా సిలిండర్లు ఇస్తున్నాం’ అని ప్రధాని పేర్కొన్నారు. అంతకుముందు, సీఈవోలతో జరిగిన సమావేశంలో.. సుందర్ పిచాయ్, టిమ్‌కుక్, జెఫ్ బెజోస్ వంటి బడా కంపెనీల సారథులు మాట్లాడుతున్నప్పుడు వారి ప్రసంగాల్లోని ముఖ్యాంశాలను మోదీ వివరంగా నోట్ చేసుకున్నారు. జీఎస్టీని ఎలా అమలుచేస్తారనేది చాలా కీలకం, అత్యంత కష్టమని గూగుల్ సీఈఓ పిచాయ్ వ్యాఖ్యానించారు. మోదీ – ట్రంప్ భేటీలో ‘హెచ్1బీ’! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రధాని నరేంద్ర మోదీతో శ్వేతసౌధంలో తొలిసారిగా భేటీకానున్నారు. వ్యూహాత్మక అంశాలపై వ్యక్తిగతంగా వీరిద్దరూ విస్తృతమైన చర్చలు జరపనున్నారు. ఉగ్రవాదం, వాణిజ్యం సహా పరస్పర ప్రయోజనాలున్న అంశాలపై వీరు మాట్లాడుకోనున్నారు. వీరి భేటీ సందర్భంగా హెచ్1బీ వీసాల అంశంకూడా చర్చకు రానుందని సమాచారం. వ్యక్తిగతంగా, తమ తమ బృందాలతో కలిసి వీరిద్దరి సమావేశం నాలుగున్నరగంటలకు పైగా సాగనుందని వైట్‌హౌజ్ వర్గాలు వెల్లడించాయి. ‘వీరిద్దరి భేటీలో ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాలు, ఇండో–పసిఫిక్ ప్రాంతంలో రక్షణ భాగస్వామ్యం, వాణిజ్యం, చట్టాల అమలు, శక్తి తదితర రంగాల్లో పరస్పర సహకారంపై చర్చిస్తారు’ అని శ్వేతసౌధం ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ వెల్లడించారు. ట్రంప్ దంపతుల స్వాగతంతో మొదలై.. అధ్యక్షుడు ట్రంప్తోపాటుగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా మోదీకి స్వాగతం పలకనున్నారు. అనంతరం ఓవల్ కార్యాలయంలో వీరిద్దరూ కాసేపు వ్యక్తిగతంగా భేటీ అవుతారు. అనంతరం తమ డెలిగేషన్స్తో కలిసి కేబినెట్ రూమ్‌లో మళ్లీ చర్చలు జరపనున్నారు. ఈ కార్యక్రమంలో మోదీతోపాటుగా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్, అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్ సర్నాతోపాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. అమెరికా తరపున ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, రక్షణ కార్యదర్శి జేమ్స్ మాటిస్, విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ తదితరులు హాజరుకానున్నారు. అనంతరం రోజ్ గార్డెన్లో సంయుక్త మీడియా సమావేశంలో మోదీ–ట్రంప్ పాల్గొననున్నారు. అనంతరం శ్వేతసౌధంలోని చారిత్రక భవనం బ్లూ రూమ్‌లో మోదీతోపాటుగా భారత బృందం విందులో పాల్గొననున్నారు. అనంతరం మోదీ నెదర్లాండ్స్‌కు పయనమవుతారు. -
అతి త్వరలో సర్జికల్ దాడి వీడియో!
-
అతి త్వరలో సర్జికల్ దాడి వీడియో!
న్యూఢిల్లీ: అసలు భారత్ ఎలాంటి దాడులు నిర్వహించలేదని, ఆదేశం నాటకాలాడుతోందని పాకిస్థాన్, అక్కడి పత్రికలు కథనాలు వెలువరించడం పట్ల కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. భారతీయ జవానులు ప్రపంచం ఆశ్చర్యపోయేలా శౌర్యపరాక్రమాలు చూపించారని అన్నారు. ఒక్క భారత్ మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా తాము సర్జికల్ దాడులు నిర్వహించామని తెలుసని.. ఈ దాడులు నిర్వహించే సమయంలో భారత జవానులు దేశం గర్వించే స్థాయిలో సాహసాలు చేశారని, పోరాటపటిమ చూపారని అన్నారు. భారత్ అసలు దాడులే చేయలేదని, చేసి ఉంటే ఫుటేజీ విడుదల చేస్తుంది కదా అని అనుమానం రేకెత్తించడంపై ఆయన స్పందిస్తూ 'కొద్దిగా ఎదురుచూడండి.. తిలకించండి' అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం త్వరలోనే సర్జికల్ దాడులకు సంబంధించిన ఫుటేజీని మొత్తంగాగానీ, లేదా కొన్ని భాగాలుగాగానీ కేంద్ర రక్షణశాఖ విడుదల చేసే అవకాశం ఉంది. -
పాక్‌పై దాడికి కార్టోశాట్-2సీ సాయం నిజమే
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి ఉగ్రమూకల పనిపట్టడానికి ఇస్రో కూడా సాయం చేసినట్లు ఇద్దరు శాస్త్రవేత్తలు చెప్పగా దానిని ఆదివారం రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఏడాది జూన్ లో అంతరిక్షంలోకి కార్టోశాట్-2సీ ఉపగ్రహం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉపగ్రహం తీసిన ఛాయా చిత్రాలు మొన్న భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు అమితంగా ఉపయోగపడిందని ఆదివారం ఇండియన్ డిఫెన్స్ వార్తా కథనాలు తెలిపాయి. 'ఇస్రో పంపించిన ఛాయా చిత్రాలు మేం సాధించిన గొప్ప పురోభివృద్ది. వాటి వల్ల దేశానికి లబ్ధి చేకూరింది. ఇంతకంటే గొప్పది ఉంటుందని మేం అనుకోం' అంటూ ఇస్రో శాస్త్రవేత్త రతన్ సింగ్ బిష్త్ భారత ఆర్మీ పబ్లికేషన్ లో వెల్లడించారు. గత సెప్టెంబర్ 18 ఉడీ సెక్టార్ పై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత తిరిగి పది రోజుల్లోపే భారత్ ప్రతీకారం తీసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దు రేఖ దాటి మూడు కిలో మీటర్లు లోపలికి వెళ్లి భారత సైన్యం దాడులు నిర్వహించగా 38మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడికి ప్రణాళిక సిద్ధం చేయడానికి ముందు ఇస్రోకు చెందిన కార్టోశాట్-2సీ ఉపగ్రహం ద్వారా లక్షిత ప్రాంతం, దానిని చేరుకునే మార్గాలు, కీలక ప్రదేశాలు ఫొటోలు తీశారు. అది పంపించిన చిత్రాల ఆధారంగా విజయవంతంగా దాడి చేశారు.ఈ నేపథ్యంలో కార్టోశాట్ 2సీ గొప్పపని చేసింది నిజమే అని తాజాగా మరోసారి రుజువైంది. -
పాక్‌ను ‘ఉడి’కిస్తోన్న భారత్!
ఉగ్రదాడికి ముందు.. తర్వాత... (సాక్షి, ప్రత్యేక ప్రతినిధి) ‘ఉడీ ఘటనపై తగిన సమయంలో తగిన విధంగా స్పందిస్తాం’ - 18మంది భారత జవాన్లను బలిగొన్న ఉగ్రదాడి జరిగిన రోజు భారత డెరైక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ) లెఫ్టినెంట్ జనరల్ రణబీర్‌సింగ్. ‘ఉడీదాడిని భారత్ ఎన్నటికీ మరచిపోదు. భారత జవాన్ల త్యాగాలు వృథా కానివ్వం. ఉగ్రవాదాన్ని ఓడించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం’ - కోజికోడ్‌లో జరిగిన బీజేపీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ ఉద్వేగపూరిత ప్రసంగం.. ఈ రెండు స్పందనలు చాలు.. పాకిస్తాన్ ఉగ్రవాద ముష్కరుల విషయంలో భారత్ కఠినమైన నిర్ణయాలు తీసుకోబోతున్నదని తెలుసుకోవడానికి. భారత సైన్యం బుధవారం జరిపిన లక్ష్యిత దాడులు (సర్జికల్ ఎటాక్స్) వాటిని రుజువు చేశాయి. ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌తో భారత్ కావాలనే మెతకగా వ్యవహరిస్తోన్నదని విమర్శించేవారికి ఈ దాడులు గట్టి సమాధానం చెప్పాయి. అందుకే దేశవ్యాప్తంగా అందరూ ఈ దాడులకు హర్షామోదాలు వెలిబుచ్చుతున్నారు. 2001లో జైషే మొహమ్మద్ దుండగులు పార్లమెంటుపై దాడికి తెగబడినప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, 2008లో లష్కరే తోయిబా ముష్కరులు ముంబై దాడులకు బరితెగించినప్పుడు మన్మోహన్ సింగ్ చేయలేని పనిని ఇపుడు ప్రధాని నరేంద్రమోదీ చేసి చూపించారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. జూలైలోనే వేడెక్కిన సరిహద్దు నిజానికి ఉడి ఉగ్రదాడికి ముందు నుంచే భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో అలజడి చెలరేగింది. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీని జూలై 8న భద్రతా దళాలు మట్టుబెట్టిన తరుణంలో కాశ్మీర్ రగులుకుంది. సామాన్య ప్రజలకు, సాయుధ దళాలకు మధ్య జరిగిన ఘర్షణలలో 56 మంది వరకు మరణించారు. వందలమంది గాయపడ్డారు. ఆగస్టు9న స్పందించిన ప్రధాని గత ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరికి భిన్నంగా దూకుడుగా వ్యవహరించారు. వేర్పాటువాదులతో చర్చల ప్రసక్తిలేదని, దేశభద్రత విషయంలో రాజీ సమస్యే లేదని అఖిలపక్ష సమావేశంలో స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కశ్మీర్ భూభాగాన్ని (పీవోకేను) భారత్‌లో విలీనం చేయడమే దేశ ప్రధాన ఎజెండా అని పేర్కొన్నారు. అంతేకాదు బలూచిస్తాన్‌లో పాక్ సైన్యం సృష్టిస్తున్న హింసాకాండను ప్రపంచం దృష్టికి తీసుకురావాలని వ్యాఖ్యానించారు. ఉడీ కల్లోలం... సరిహద్దులోని భారత సైనిక స్థావరం ఉడీపై సెప్టెంబర్ 18న పాక్ ఉగ్రవాద ముష్కరులు చేసిన దాడిలో 17మంది జవాన్లు మరణించడం యావద్దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. భారత సైనికుల దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు తెల్లవారుజామున చీకటిమాటున దాడి చేశారు. స్థావరంలోని తాత్కాలిక గుడారాలలో సైనికులు నిద్రిస్తుండగా దాడి జరగడంతో పెద్ద నష్టం జరిగింది. ఒక రెజిమెంటు స్థానంలో మరో రెజిమెంటు బాధ్యతలను స్వీకరించడం కోసం వచ్చిన సమయం చూసి ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. వరుస పరిణామాల నేపథ్యంలో సరిహద్దులోని మన సైనిక స్థావరాలపై భారీ ఉగ్రదాడి జరిగే అవకాశాలున్నాయని నిఘా విభాగం నుంచి సమాచారం ఉన్నప్పటికీ అప్రమత్తం కాకపోవడం వల్లనే ఈ దారుణం చోటుచేసుకున్నదన్న విమర్శలున్నాయి. అధీనరేఖకు కూతవేటు దూరంలో 15 వేల నుంచి 16 వేల మంది సైనికులుండే పెద్ద స్థావరంపైనే దాడికి తెగబడడం మన భద్రతా వ్యవస్థపైనే అనుమానాలు రేకెత్తించింది. అంతర్జాతీయ వేదికపై పాక్ ఆక్రోశం.. దొంగే దొంగా దొంగా అని అరిచినట్లు.. ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను ఆడిపోసుకోవడం ఆది నుంచి జరుగుతున్నదే. ఉడీ ఘటనానంతరం జరిగిన ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలలో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కశ్మీర్ అంశాన్ని, హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీ ఎన్కౌంటర్ ఘటనను ప్రస్తావించారు. కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితికి విజ్ఞప్తి చేశారు. అయితే అంతర్జాతీయంగా మద్దతు లభిస్తుందన్న పాక్ ప్రధాని ఆశలను వమ్ముచేస్తూ కశ్మీర్‌సహా అన్ని ద్వైపాక్షిక సమస్యలను భారత్, పాక్‌లే చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని ఐరాస ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ స్పష్టం చేశారు. పాక్ ఉగ్రవాద దేశమని, ఉగ్రవాదాన్ని పావుగా వాడుకుని యుద్ధనేరాలకు పాల్పడుతోందని భారత్ సమితి సమావేశాలలో తూర్పారబట్టింది. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తున్న దేశాలను ఏకాకులను చేయాలని పిలుపునిచ్చింది. పాకిస్తాన్‌తో స్నేహం కోసం ప్రయత్నిస్తే దానికి బదులుగా భారత్‌కు ఉగ్రదాడులు లభించాయని భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ వ్యాఖ్యానించారు. మొత్తానికి పాకిస్తాన్‌ను భారత్ ఏకాకిని చేయగలిగింది. దక్షిణాసియాలో ఒంటరైన పాక్ ఐక్యరాజ్యసమితిలో ఎవరి మద్దతు లేకుండా చేయగలిగిన భారత్... దక్షిణాసియా దేశాలలోనూ పాకిస్తాన్‌ను ఒంట రిని చేయగలిగింది. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కారాదని భారత్ నిర్ణయించడంతో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్కూడా దానిని అనుసరించాయి. చివరకు సదస్సు వాయిదా పడినట్లు సార్క్ అధ్యక్ష దేశం నేపాల్ ప్రకటించింది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్‌లు పాకిస్తాన్‌ను పరోక్షంగా తిట్టిపోశాయి. నెత్తుటేర్లకు నీళ్లతో సమాధానం ఉగ్రవాదులను ఎగదోస్తూ నెత్తుటేర్లు పారిస్తున్న పాకిస్తాన్‌కు ‘నీళ్ల దండన’ విధించాలని భారత్ భావిస్తోంది. పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న నదుల నీటిని గరిష్టంగా వినియోగించుకోవడం ద్వారా ఆ దేశాన్ని కట్టడి చేయాలని భారత్ నిర్ణయించింది. 56 ఏళ్ల నాటి భారత్- పాక్ సింధు జలాల ఒప్పందంపై ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. జల విద్యుత్ ప్రాజెక్టులు, సాగునీరు, తాగునీటి నిల్వ కోసం ఇక నుంచి సింధు, చీనాబ్, జీలం నదుల్లోంచి గరిష్ట స్థాయిలో నీటిని వినియోగించాలంటూ అవగాహనకు వచ్చారు. అధ్యయనం కోసం టాస్క్ ఫోర్స్ బృందాల్ని ఏర్పాటు చేయనున్నారు. ‘నెత్తురు, నీళ్లు కలసి ఒకేసారి ప్రవహించలేవు’ అన్న మోదీ వ్యాఖ్య చాలు.. పాకిస్తాన్ విషయంలో భారత్ ఎంత కఠినంగా వ్యవహరించబోతున్నదో తెలియడానికి.