పాక్పై దాడికి కార్టోశాట్-2సీ సాయం నిజమే
న్యూఢిల్లీ: పాకిస్థాన్ భూభాగంలోకి దూసుకెళ్లి ఉగ్రమూకల పనిపట్టడానికి ఇస్రో కూడా సాయం చేసినట్లు ఇద్దరు శాస్త్రవేత్తలు చెప్పగా దానిని ఆదివారం రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ ఏడాది జూన్ లో అంతరిక్షంలోకి కార్టోశాట్-2సీ ఉపగ్రహం ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఉపగ్రహం తీసిన ఛాయా చిత్రాలు మొన్న భారత ఆర్మీ జరిపిన సర్జికల్ దాడులకు అమితంగా ఉపయోగపడిందని ఆదివారం ఇండియన్ డిఫెన్స్ వార్తా కథనాలు తెలిపాయి. 'ఇస్రో పంపించిన ఛాయా చిత్రాలు మేం సాధించిన గొప్ప పురోభివృద్ది. వాటి వల్ల దేశానికి లబ్ధి చేకూరింది. ఇంతకంటే గొప్పది ఉంటుందని మేం అనుకోం' అంటూ ఇస్రో శాస్త్రవేత్త రతన్ సింగ్ బిష్త్ భారత ఆర్మీ పబ్లికేషన్ లో వెల్లడించారు.
గత సెప్టెంబర్ 18 ఉడీ సెక్టార్ పై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత తిరిగి పది రోజుల్లోపే భారత్ ప్రతీకారం తీసుకున్న విషయం తెలిసిందే. సరిహద్దు రేఖ దాటి మూడు కిలో మీటర్లు లోపలికి వెళ్లి భారత సైన్యం దాడులు నిర్వహించగా 38మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ దాడికి ప్రణాళిక సిద్ధం చేయడానికి ముందు ఇస్రోకు చెందిన కార్టోశాట్-2సీ ఉపగ్రహం ద్వారా లక్షిత ప్రాంతం, దానిని చేరుకునే మార్గాలు, కీలక ప్రదేశాలు ఫొటోలు తీశారు. అది పంపించిన చిత్రాల ఆధారంగా విజయవంతంగా దాడి చేశారు.ఈ నేపథ్యంలో కార్టోశాట్ 2సీ గొప్పపని చేసింది నిజమే అని తాజాగా మరోసారి రుజువైంది.