న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణంపై న్యాయ ప్రక్రియ పూర్తయిన అనంతరమే ఎన్డీఏ ప్రభుత్వం ఈ దిశగా ఆర్డినెన్స్ తీసుకువస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నూతన సంవత్సరం తొలిరోజున ప్రధాని ఏఎన్‌ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ వ్యవహారంపై న్యాయ ప్రక్రియ నెమ్మదించేలా కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ పరిధిలో ఈ అంశానికి పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశాన్ని నాలుగు తరాల పాటు ఏలిన కాంగ్రెస్ పార్టీ పలు కుంభకోణాల్లో కూరుకుపోయిందని ధ్వజమెత్తారు. ఆర్థిక అవకతవకలతో బెయిల్ మీద ఆ పార్టీ అగ్రనేతలున్నారని ఎద్దేవా చేశారు.
వ్యక్తిగత కారణాలతోనే ఊర్జిత్ నిష్ర్కమణ
ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేశారని చెప్పారు. గత ఆరేడు నెలలుగా ఆయన తనను రిలీవ్ చేయాలని కోరుతున్నారని, చివరికి లిఖితపూర్వకంగా విజ్ఞప్తి చేసుకున్నారని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఊర్జిత్ రాజీనామా వ్యవహారంలో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, ఆర్బీఐ గవర్నర్‌గా ఆయన తన విధులను సమర్ధంగా నిర్వహించారని ప్రశంసించారు.
కూటమి వర్సెస్ ప్రజలు
2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు తమకే పట్టం కడతారని ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికలు మహాకూటమికి, ప్రజలకు మధ్య జరుగుతున్న పోరుగా మోదీ అభివర్ణించారు. ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలే తనకు కొండంత అండగా నిలుస్తాయన్నారు.
మెరుపు దాడులపై ఉత్తర్వులు..
పాక్ భూభాగంలో ఉగ్రవాద శిబిరాలను నేలమట్టం చేసేందుకు నిర్వహించిన మెరుపు దాడులకు తాను స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశానని చెప్పుకొచ్చారు. దాడులు చేపట్టే క్రమంలో మీరు విజయవంతమైనా, విఫలమైనా దాని గురించి ఆలోచించకుండా సూర్యోదయం అయ్యే సమయానికి తిరిగి చేరుకోవాలని సైన్యానికి సూచించానన్నారు. ఆపరేషన్‌ను అతితక్కువ సమయంలో పూర్తిచేయాలని, దాన్ని ఎక్కువసేపు కొనసాగించరాదని చెప్పానన్నారు. ఈ ఆపరేషన్ గురించి వివరించే క్రమంలో మోదీ కొంత భావోద్వేగానికి లోనైనట్టు కనిపించారు.
ట్రిపుల్ తలాక్‌పై నిషేధం ఎందుకంటే..
సుప్రీం కోర్టు తీర్పు అనంతరం ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను తమ ప్రభుత్వం తీసుకువచ్చిందని, రాజ్యాంగ పరిధిలో ఈ సమస్య పరిష్కారానికి చొరవ చూపుతామని బీజేపీ మేనిఫెస్టోలో పొందుపరిచామని ప్రధాని పేర్కొన్నారు. ట్రిపుల్ తలాక్‌ను పెద్దసంఖ్యలో ముస్లిం దేశాలు నిషేధించాయని చెప్పారు. పాకిస్తాన్‌లో సైతం ట్రిపుల్ తలాక్‌ను నిషేధించారన్నారు. ఇది ఎలాంటి మతానికి, విశ్వాసానికి సంబంధించిన అంశం కాదని, కేవలం లింగ సమానత్వం, సామాజిక న్యాయంతో ముడిపడిన వ్యవహారమని చెప్పారు.
శబరిమలపై విస్తృత చర్చ..
దేశంలో ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాలన్నది భారత్ అభిమతం..దేశంలో కొన్ని దేవాలయాలకు ప్రత్యేక సంప్రదాయాలున్నాయని శబరిమల ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని పేర్కొన్నారు. కొన్ని ఆలయాల్లో పురుషులకు ప్రవేశం లేదని గుర్తుచేశారు. శబరిమల విషయంలో సుప్రీం కోర్టులో మహిళా న్యాయమూర్తి కొన్ని వ్యాఖ్యలు చేశారని చెబుతూ, ఆయా అభిప్రాయాలను వ్యక్తం చేసే వారికి రాజకీయ కోణాలతో ముడిపెట్టరాదన్నారు. ఓ మహిళగా ఆమె చేసిన సూచనలపైనా చర్చ జరగాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment