అతి త్వరలో సర్జికల్ దాడి వీడియో!
న్యూఢిల్లీ: అసలు భారత్ ఎలాంటి దాడులు నిర్వహించలేదని, ఆదేశం నాటకాలాడుతోందని పాకిస్థాన్, అక్కడి పత్రికలు కథనాలు వెలువరించడం పట్ల కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. భారతీయ జవానులు ప్రపంచం ఆశ్చర్యపోయేలా శౌర్యపరాక్రమాలు చూపించారని అన్నారు.
ఒక్క భారత్ మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా తాము సర్జికల్ దాడులు నిర్వహించామని తెలుసని.. ఈ దాడులు నిర్వహించే సమయంలో భారత జవానులు దేశం గర్వించే స్థాయిలో సాహసాలు చేశారని, పోరాటపటిమ చూపారని అన్నారు. భారత్ అసలు దాడులే చేయలేదని, చేసి ఉంటే ఫుటేజీ విడుదల చేస్తుంది కదా అని అనుమానం రేకెత్తించడంపై ఆయన స్పందిస్తూ 'కొద్దిగా ఎదురుచూడండి.. తిలకించండి' అంటూ ఆయన సమాధానం ఇచ్చారు. దీని ప్రకారం త్వరలోనే సర్జికల్ దాడులకు సంబంధించిన ఫుటేజీని మొత్తంగాగానీ, లేదా కొన్ని భాగాలుగాగానీ కేంద్ర రక్షణశాఖ విడుదల చేసే అవకాశం ఉంది.