లాన్స్ నాయక్ యజ్ఙప్రతాప్ సింగ్
- ఆత్మహత్యకు ప్రేరేపిస్తున్నారు: జవాన్
- స్పందించిన ఆర్మీ చీఫ్.. ఇక ‘ఫిర్యాదుల పెట్టె’
న్యూఢిల్లీ: నిన్నటిదాకా భద్రతా బలగాలకే పరిమితం అయిన ‘జవాన్ వీడియోల’ వ్యవహారం మొదటిసారి భారత సైన్యం చోటుచేసుకుంది. ఇండియన్ ఆర్మీలో కొందరు అధికారులు జవాన్లతో చేయించకూడని పనులు చేయిస్తున్నరని, దీనిపై రాష్ట్రపతి, ప్రధానులకు లేఖరాసినందుకు ప్రతీకారంగా తాను టార్చర్‌కు గురవుతున్నానంటూ ఓ ఆర్మీ జవాన్ శుక్రవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్‌చేశాడు. భద్రతా బలగాల్లో పనిచేస్తోన్న జవాన్లకు సరైన భోజనం, జీతభత్యాలు అందడంలేదన్న బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్ జవాన్ల వీడియోలపై దుమారం చల్లారకముందే మూడోది బయటికిరావడం గమనార్హం.
డెహ్రాడూన్‌లోని 42వ ఇన్‌ఫంట్రీ బ్రిగేడ్‌లో లాన్స్ నాయక్‌గా పనిచేస్తోన్న యజ్ఙప్రతాప్ సింగ్.. శుక్రవారం యూట్యూబ్‌లో ఒక వీడియోను పోస్ట్‌చేశాడు. కొందరు అధికారులు.. కిందిస్థాయి జవాన్లతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, షూపాలిష్ లాంటి పనులు చేయిస్తున్నారని సింగ్ ఆరోపించాడు. ఇదే విషయమై గతంలో తాను.. రాష్ట్రపతి, ప్రధాని, రక్షణశాఖ, హోంశాఖలకు లేఖలు రాశారనిని, దీనిపై ప్రధాని కార్యాలయం వివరణ కూడా అడిగిందని గుర్తుచేశాడు.
‘ఫిర్యాదు చేసే సమయంలో నేను ఆర్మీ నిబంధనలను ఉల్లంఘించలేదు. ఎప్పుడైతే ప్రధాని కార్యాలయం రిపోర్టు అడిగిందో, అప్పటి నుంచి నాపై వేధింపులు రెట్టింపు అయ్యాయి. ఆత్మహత్యకు ప్రేరేపించేలా అధికారులు నన్ను దూషిస్తున్నారు. ఆత్మహత్య చేసుకోవడం ఆర్మీ నియమాలకు విరుద్ధం కాబట్టి నేనాపని చేయడంలేదు. ఇకనైనా ప్రభుత్వం స్పందించాలని వేడుకుంటున్నా’అని యజ్ఙప్రతాప్ సింగ్ వీడియోలో చెప్పారు. (భారత ‘బోర్డర్’లో సంచలనాలు)
ఫిర్యాదుల పెట్టె: ఆర్మీ చీఫ్
కాగా, భద్రతా బలగాలు, ఆర్మీ జవాన్ల వరుస వీడియోలపై ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ స్పందించారు. అత్యున్నత బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి శుక్రవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇకపై అన్ని చోట్లా ‘ఫిర్యాదుల పెట్టెలు’(Complaint Boxs) ఉంచుతామని తెలిపారు. ‘తమ సమస్యలపై జవాన్లు వీడియోలు పోస్ట్ చేయడం కన్నా, పై అధికారులకు ఫిర్యాదుచేస్తే బాగుంటుంది’అని రావత్ హితవు పలికారు. ఇప్పటివరకు వెలుగుచూసిన వీడియో ఉదంతాలపై విచారణ జరుగుతున్నదని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేసే క్రమంలో పాకిస్థాన్‌పై ఏక్షణంలోనైనా సర్జికల్ దాడులకు సిద్ధమని రావత్ పేర్కొన్నారు.