సర్జికల్ స్ట్రైక్స్ కన్నా బెటర్ ఆప్షన్స్ ఉన్నాయి!
న్యూఢిల్లీ: దాయాది పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సర్జికల్ స్ట్రైక్స్ కన్నా ఎంతో మెరుగైన ప్రత్యామ్నాయాలు తమ వద్ద ఉన్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ తెలిపారు. ‘సులువైన ఏకపక్ష యుద్ధాన్ని చేయడం ద్వారా ప్రతిఫలాన్ని పొందాలని పాక్ భావిస్తోంది. కానీ మా వద్ద (సర్జికల్ స్ట్రైక్స్ కన్నా) మెరుగైన, ప్రభావవంతమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. మన సైన్యం ఆటవికమైనది కాదు. తలలు నరికి తీసుకురావాలని నేను కోరుకోను. మనది చాలా క్రమశిక్షణతో కూడిన దళం’ అని రావత్ మీడియాతో చెప్పారు. గత నెల 1న పాక్ జవాన్లు ఇద్దరు భారత సైనికుల తల నరికిన ఘటనను పేర్కొంటూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయెద్ సలహుద్దీన్‌ను అమెరికా అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడంపై స్పందిస్తూ.. ‘అతన్ని పాకిస్థాన్ కట్టడి చేస్తుందా? లేదా అన్నది చూడాలి. అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించిన నాడే అతను ప్రతిరోజూ ఆందోళనల కోసం క్యాలెండర్ జారీచేశాడు’ అని రావత్ అన్నారు. లష్కరే తోయిబా స్థాపకుడు, ఉగ్రవాద నేత హఫీజ్ సయీద్‌పై అమెరికా నజరానా ప్రకటించినప్పటికీ.. పాకిస్థాన్ అతన్ని కట్టడి చేయని విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.