ప్యాకప్ పాకిస్తాన్ | Pakistani Cinemas Ban Bollywood Films As Indian | Sakshi
Sakshi News home page

ప్యాకప్ పాకిస్తాన్

Published Mon, Oct 17 2016 10:37 PM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM

ప్యాకప్ పాకిస్తాన్ - Sakshi

ప్యాకప్ పాకిస్తాన్

నిద్రపోతున్న 18 మంది భారతీయ జవాన్లను దారుణంగా కాల్చిన పాక్ తీవ్రవాదుల చర్యకు ఇండియా దీటైన జవాబిచ్చింది. ‘సర్జికల్’ దాడులు చేసి బుద్ధి చెప్పింది. దేశం పట్ల ప్రేమ భక్తి రూపం దాల్చింది. పాకిస్తాన్‌ను అన్ని విధాలా తిరస్కరించాలనే వాదన వచ్చింది.  స్నేహితుల్లా నటించి, శత్రువుల్లా ప్రవర్తించిన పాకిస్తాన్ నుంచి నటనా సామర్థ్యం మనం నేర్చుకోవాలా? ఆ నటీనటులు మనకు కావాలా?
 
లాలీవుడ్ నుంచి!
పాకిస్తానీ చిత్రసీమ (లాలీవుడ్) నటీనటులకు అంది వస్తున్న నిచ్చెన - మన హిందీ చిత్రసీమ. అక్కడి స్టార్స్ ఫవాద్ ఖాన్, అలీ జఫర్, మహిరా ఖాన్ లాంటి వాళ్ళు తమ సొంత గడ్డ వీడకుండానే ముంబయ్‌లో కాలూనడానికి ప్రయత్నిస్తున్నారు. వీళ్ళలో చాలామంది అక్కడి టీవీ తారలే. మన హిందీ సినిమాల్లో ఛాన్స్ వచ్చినప్పుడల్లా ముంబయ్‌కి వచ్చి హోటళ్ళలో, ఫ్లాట్స్‌లో గడిపేస్తున్నారు. అడపాదడపా తమ ఫ్యామిలీలను తీసుకొస్తున్నారు. సొంత హెయిర్, మేకప్ అసిస్టెంట్స్‌ను తీసుకువస్తే ఒక్కరికి వీసా సమస్య వచ్చినా టీమ్ మొత్తానికీ ఇబ్బంది కాబట్టి, వాళ్ళను తెచ్చుకోవడం లేదు. ఫవాద్ ఖాన్ అయితే సల్మాన్, ఆలియా భట్‌ల పబ్లిసిటీ మేనేజర్, స్టైలిస్ట్‌ల సేవలనే తానూ తీసుకుంటున్నారు.

పాకిస్తాన్ సింగర్ల విషయంలో ఎప్పుడైనా వీసా సమస్యలు వస్తే మన సంగీత దర్శకులు దుబాయ్‌కి వెళ్ళి అక్కడ పాటలు రికార్డు చేస్తుంటారు! పాకిస్తానీ తారలందరూ ఒకప్పుడు ‘బిజినెస్ వీసా’ మీద వచ్చేవాళ్ళు. కానీ, వీరంతా తమ దగ్గర సభ్యులు కావాల్సిందే అనీ, సాంస్కృతిక కార్యకలాపాలకు అనుమతించే వీసా మీదే రావాలనీ ‘సినీ అండ్ టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ రెండేళ్ళ క్రితం గొడవ పెట్టింది. దాంత ఇప్పుడు పాక్ తారల మొదలు బ్రిటీష్ పాస్‌పోర్ట్ ఉన్న కత్రినా కైఫ్ దాకా ప్రతి ఒక్కరూ ఇదే పద్ధతి అనుసరిస్తున్నారు. ఇక, ఇక్కడి బ్రాండ్‌లను సమర్థిస్తూ పాకిస్తాన్ తారలు అడ్వర్‌టైజ్‌మెంట్లలో నటించడం అరుదు. అయితే, ‘గియోవానీ’ దుస్తులు, ‘క్లియర్’ షాంపూ, ‘ఫెయిర్ అండ్ లవ్లీ ఫర్ మెన్’లకు ఫవాద్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ చేశారు. ఈ పాకిస్తానీ స్టార్ పారితోషికం మన దగ్గర ఒక్కో సినిమాకూ కోటిన్నర!
 
 ముంబయ్‌లో కరణ్ జోహార్ చాలా
 హడావిడిగా, ఆందోళనగా ఉన్నారు. నాలుగేళ్ళ తరువాత ‘యే దిల్ హై ముష్కిల్’తో మళ్ళీ డెరైక్షన్ చేపట్టిన ఈ ప్రముఖ నిర్మాత - దర్శకుడు ఆ మాత్రం హడావిడిగా ఉండడం మామూలుగా అయితే వింత ఏమీ కాదు. కానీ, ఈ దీపావళికి సినిమా రిలీజ్ దగ్గర పడుతున్న టైమ్‌లో ఆయన ఆందోళనకు కారణం వేరే ఉంది. చిత్రీకరణ పూర్తయిన ఆ సినిమాలో ఓ ముఖ్యపాత్ర పోషించిన పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ ముఖం బదులు తెరపైన మన భారతీయ నటుడు సైఫ్ అలీ ఖాన్ ముఖాన్ని సాంకేతికంగా అతికించాలన్న ఆలోచనపై కరణ్ జోహార్ యూనిట్ మల్లగుల్లాలు పడుతోంది.
 
 అలాగే, సినిమాలో అనూష్కా శర్మ, ఐశ్వర్యారాయ్ బచ్చన్ పోషించిన పాత్రల జాతీయత కూడా మార్చేస్తే మంచిదేమో అని తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ, ఫవాద్ ఖాన్ ముఖం ఉంటే తప్పేమిటి? సినిమాలో పాత్రలు ఏ దేశానికి చెందినవైతే ఏంటి? అలా అనుకోకండి. భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడు అదే పెద్ద సమస్య! ఫవాద్ ఖాన్ పాకిస్తానీ నటుడు కావడం, అనూష్కా శర్మ, ఐశ్వర్యారాయ్‌ల పాత్రలు పాకిస్తానీ మహిళా పాత్రలు కావడం వివాదం రేపుతోంది. పాకిస్తానీ తారలెవరూ మన సినిమాల్లో నటించకూడదన్న తాజా వివాదంతో కరణ్ బృందం తిప్పలు పడుతోంది.
 
 గత నెలలో సరిహద్దుల్లో ‘ఉడీ’లో మన సైనిక శిబిరంపై పాకిస్తానీ ముష్కరులు చేసిన దొంగ దాడిలో 18 మంది భారతీయ సైనికులు వీరమరణం పొందారు. స్నేహహస్తం అందిస్తున్నా పాకిస్తాన్ ఇలా తెగబడుతుండడం సహజంగానే మనవాళ్ళలో ఆగ్రహం తెప్పించింది. అందుకే, ఇప్పుడు భారతీయ సినిమాల్లో పాకిస్తానీ నటుల నిషేధమనే వాదన పైకి వచ్చింది. దేశమంతటా పాకిస్తాన్ వ్యతిరేక గాలులు వీస్తుండడంతో స్క్రిప్ట్‌ను కొద్దిగా మార్చి, అనూష్కా శర్మ, ఐశ్వర్యారాయ్‌లను పాకిస్తానీ మహిళలుగా కాకుండా వేరే దేశానికి చెందినవారిగా డైలాగ్స్‌లో మార్పు చేయాలని కరణ్ జోహార్ తంటాలు పడుతున్నారు. వెరసి, కొద్ది వారాలుగా భారత - పాక్ సరిహద్దుల్లో తూటాలు పేలినప్పుడల్లా కరణ్ జోహార్ గుండెల్లో బాంబులు పేలుతున్నాయి.
 
 నిషేధం వాదన... మొదలైందిలా!
 ‘పాకిస్తానీ యాక్టర్లపై బ్యాన్’తో చిక్కుల్లో పడ్డ దర్శక, నిర్మాతలు ఇంకా ఉన్నారు. అసలింతకీ ఈ నిషేధం మాట ఎలా పైకి వచ్చిందంటే... మహారాష్ట్రలోని ‘మహారాష్ట్ర నవనిర్మాణ సేన’ (ఎం.ఎన్.ఎస్) ఈ వాదన లేవదీసింది. హిందీ చిత్రసీమలో పనిచేస్తున్న పాకిస్తానీ కళాకారులు 48 గంటల్లో భారతదేశాన్ని విడిచిపెట్టి పోవాలంటూ అల్టిమేటమ్ ఇచ్చింది. లేదంటే, బలవంతాన బయటకు నెడతామని హెచ్చరించింది. పాకిస్తానీయులు నటించిన హిందీ చిత్రాలైన ‘యే దిల్ హై ముష్కిల్’, షారుఖ్‌ఖాన్ ‘రయీస్’ల రిలీజ్‌లను అడ్డుకుంటామని కూడా బెదిరించింది. దీంతో ఒక్కసారిగా కలకలం రేగింది.
 
 నటులపై... నిర్మాతల బ్యాన్! రిలీజ్‌పై... థియేటర్ల బ్యాన్!!
 పాక్ ప్రేరేపిత తీవ్రవాదుల దొంగదాడితో ఇప్పుడు దేశమంతటా పాక్ వ్యతిరేక భావన నెలకొంది. దేశంలో సుదీర్ఘకాలంగా నడుస్తున్న నిర్మాతల సంఘం ‘ఇండియన్ మోషన్ పిక్చర్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్’ (ఐ.ఎం.పి.పి.ఎ) సైతం ఆ భావాన్ని అందిపుచ్చుకుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు సాధారణ స్థితికి వచ్చేదాకా సరిహద్దు ఆవలి నటీనటుల్ని మన సినిమాల్లో పని చేయనివ్వకుండా నిషేధిస్తూ, ఏకంగా తీర్మానమే చేసింది. అయితే ఇప్పటికే షూటింగ్ అయిపోయిన సినిమాల రిలీజ్‌ను తాము వ్యతిరేకించబోమని చెప్పింది. కాగా, తాజాగా నాలుగు రోజుల క్రితం ‘సినిమా ఓనర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ సిన్మాల రిలీజ్‌కు కూడా నో చెప్పింది. ‘సినిమా హాళ్ళకు నిప్పు పెడితే భద్రత ఎవరు?’ అంటూ దీపావళికి రానున్న ‘యే దిల్ హై ముష్కిల్’ సహా పాక్ నటులున్న సినిమాల్ని థియేటర్లలో ప్రదర్శించబోమని తేల్చిచెప్పింది. కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో, మహారాష్ట్ర, గుజరాత్, గోవాలలో ఈ నిషేధాన్ని థియేటర్ ఓనర్లు అమలు చేయనున్నారు. ఇతర రాష్ట్రాలకూ తమ నిర్ణయం తెలియజేస్తున్నారు.
 
 బాలీవుడ్‌లో పాక్ ముసలం
 నటి ప్రియాంకా చోప్రా, రాధికా ఆప్టే, నాగేశ్ కుకునూర్, మహేశ్‌భట్‌లతో సహా పలువురేమో కళాకారులపై తీవ్రవాద ముద్ర వేయవద్దని వాదిస్తుంటే, మన స్నేహాన్ని చేతకానితనంగా పాక్ భావిస్తుంటే వాళ్ళ నటులతో మనకేం పని అని అత్యధికులు అభిప్రాయపడ్డారు. దాంతో, పాకిస్తానీ నటులకు వ్యతిరేక, అనుకూల వర్గాలుగా హిందీ చిత్రసీమ రెండు శిబిరాలుగా చీలిపోయింది. పాకిస్తానీ కళాకారులకు మద్దతుగా మొట్టమొదట పెదవి విప్పింది - అగ్ర హీరో సల్మాన్ ఖాన్. రాజకీయ నాయకులు ఇచ్చిన నిషేధం పిలుపుపై ఆయన స్పందిస్తూ, ‘వాళ్ళు ఆర్టిస్టులే తప్ప, టైస్టులు కాదుగా! వాళ్ళకు పర్మిట్లు, వీసాలు ఇచ్చింది ప్రభుత్వమే కదా!’ అన్నారు. అదే సమయంలో ‘నియంత్రణ రేఖ’ (ఎల్.ఒ.సి)కి అవతల ఉన్న పాకిస్తానీ తీవ్రవాద శిబిరాలపై భారత సైన్యం జరిపిన మెరుపు దాడుల్ని సమర్థించారు. దాన్ని సరైన స్పందనగా అభివర్ణించారు. పాకిస్తానీ ఆర్టిస్టుల్ని సమర్థిస్తూ సల్మాన్ చేసిన వ్యాఖ్యలు సహజంగానే దుమారం రేపాయి.
 
 పెదవి విప్పిన పాకిస్తానీ కళాకారులు
 బాలీవుడ్‌లో ఇంత రచ్చ, దీనిపై పాకిస్తాన్‌లో అంతకు మించిన చర్చ జరుగుతున్న నేపథ్యంలో పాకిస్తానీ కళాకారుల పరిస్థితి ‘కరవమంటే కప్పకు కోపం... విడవమంటే పాముకు కోపం’గా తయారైంది. గతంలో ప్యారిస్ దాడులు సహా అనేక వాటిని ఖండించిన పాక్ స్టార్స్ ‘ఉడీ’ ఘటనపై నోరు మెదప లేదు. భారతీయ సైనికులపై దాడి జరిగితే ఇక్కడి సొమ్ము తీసుకుంటూ, ఇక్కడి సినిమాల్లో నటిస్తున్న, పాడుతున్న పాకిస్తానీ కళాకారులు కనీసం పెదవి విప్పకపోవడంపై సహజంగానే తీవ్ర విమర్శలు వచ్చాయి.
 
 అన్ని వర్గాల నుంచి అంతకంతకూ పెరుగుతున్న ఒత్తిడితో చివరకు పాకిస్తానీ ఆర్టిస్టులు తమ శీలపరీక్షకు సిద్ధపడ్డారు. గాయకుడు షఫ్‌కత్ అమానత్ అలీ, నటుడు ఫవాద్ ఖాన్ ‘ఉడీ’ దాడుల్ని ఖండిస్తూ ప్రకటనలిచ్చారు. షారుఖ్ ఖాన్ సరసన ‘రయీస్’తో బాలీవుడ్‌లో రంగప్రవేశం చేస్తున్న నటి మహిరా ఖాన్ కూడా తీవ్రవాదాన్ని ఖండిస్తూ, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయాల్సి వచ్చింది.గమత్తేమిటంటే, ఇలా రెండు దేశాల మధ్య భావోద్వేగాలు పెచ్చరిల్లిన ప్రస్తుత పరిస్థితుల్లోనే నజీరుద్దీన్ షాతో కలసి భారత - పాకిస్తాన్ సంస్థల సంయుక్త నిర్మాణంలో ‘జీవన్ హాథీ’ చిత్రం తయారవుతోంది.
 
 ఆ సినిమాలో పాకిస్తానీ నటి హినా దిల్పాజీర్ తెరపై కనిపించనున్నారు. ‘భారత, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తత పెరుగుతున్న ప్రస్తుత సమయంలో శాంతిదూతలుగా సామరస్యం నెలకొల్పగలిగేది - కళాకారులే!’ అని ఆమె అభిప్రాయపడ్డారు. అయితే, దేశభక్తి, కళాసంస్కృతుల మధ్య పోటీ వచ్చినపుడు దేశభక్తి వైపు మొగ్గడంలో తప్పేముంది అన్న మెజారిటీ ప్రశ్నకు - భావోద్వేగాలు హద్దులు దాటుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అంత తేలికగా జవాబు  దొరకదేమో!                     
 
 ఇండియా యాక్షన్... పాకిస్తాన్ రియాక్షన్...
 మీడియా మొఘల్ ‘జీ’ టీవీ సుభాష్ చంద్ర తమ ‘జీ ఎంటర్‌టైన్‌మెంట్ గ్రూప్’లోని ‘జిందగీ’ చానల్ కోసం పాకిస్తాన్ సహా ఇతర దేశాల నుంచి టీవీ షోలు తీసుకొంటూ ఉన్నారు. ‘ఉడీ’ ఘటన తర్వాత ఆయన తన దేశభక్తిని ప్రకటిస్తూ, ఆ షోలన్నిటినీ చానల్‌లో ఆపేశారు. అటు పాక్ సర్కారూ తక్కువేమీ తినలేదు. అక్కడ మన భారతీయ సినిమాల్నీ టీవీ చానళ్ళనీ నిషేధించింది.
 
 ఈ నిషేధం వల్ల అక్కడ మన సినిమాల పైరసీ పెరుగుతుందని అంచనా. నిజానికి, ఇండియన్ ఫిల్మ్స్‌పై బ్యాన్ వల్ల పాక్ సినీసీమకూ దెబ్బే. అక్కడి సినిమా హాళ్ళు నడవాలంటే మన సినిమాలు తప్పనిసరి. ఎందుకంటే పాక్‌లో ఏటా తయారయ్యే సినిమాల సంఖ్యే చాలా తక్కువ. అక్కడి హాళ్ళు నడిచేలా ప్రతి వారం తగినన్ని కొత్త సినిమాలు కావాలంటే భారతీయ హిందీ సినిమాలు కావాల్సిందే! ఆ మాటెలా ఉన్నా, ప్రస్తుతానికి మన సినిమాలపై నిషేధం వల్ల అక్కడ నుంచి మనకొచ్చే ఆదాయానికి గండి పడినట్లే!
 
 పీకల లోతు కష్టాల్లో షారుఖ్
 ‘అసహనం’పై రేగిన చర్చలో పెదవి విప్పి, చాలామందిని చెడు చేసుకున్న షారుఖ్ గత ఏడాది ‘దిల్‌వాలే’తో దెబ్బతిన్నారు. ఈ ఏడాది వచ్చిన ‘ఫ్యాన్’ కూడా ఫ్లాపే. అలా చేతులు కాలిన ఆయన ఇప్పుడీ పాకిస్తానీ తారల వివాదంలోని మూడు సినిమాల్లోనూ ఏదో ఒక రకంగా భాగస్వామే. ‘యే దిల్ హై ముష్కిల్’లో ఆయన అతిథి పాత్రధారి. ‘డియర్ జిందగీ’, ‘రయీస్’లు రెండిట్లోనూ ప్రధాన పాత్రధారే కాక నిర్మాణ భాగస్వామి కూడా. మరీ ముఖ్యంగా, గుజరాత్ నేపథ్యంలోని యాక్షన్ థ్రిల్లర్ ‘రయీస్’లో ఈ సూపర్‌స్టార్ ముస్లిమ్ మాఫియా డాన్‌గా నటిస్తున్నారు. 1993 ముంబయ్ పేలుళ్ళ కేసులో అనుమానితుడైన అబ్దుల్ లతీఫ్ జీవితం ఈ ‘రయీస్’ చిత్రానికి ఆధారం. పైగా, ఈ సినిమా వచ్చే మన రిపబ్లిక్ డే నాడే రిలీజ్. కానీ, ‘ఉడీ’లో పాక్ ఉగ్రవాదుల దొంగదెబ్బలు, ఆ తరువాత మన సైనికుల ‘సర్జికల్ స్ట్రైక్స్’ నేపథ్యంలో ఇప్పుడు దేశమంతా పాక్ వ్యతిరేకత నెలకొంది. మరి ఈ టైమ్‌లో ఈ సినిమా కరెక్టేనా? షారుఖ్‌కు కష్టాలు తీరేనా?
 
 150 కోట్ల దెబ్బ: రాగల కొద్ది వారాల్లో రిలీజవ్వాల్సిన భారతీయ హిందీ సినిమాలు తాజా వివాదంతో చిక్కుల్లో పడ్డాయి.  ఇబ్బంది పడుతున్న సినిమాల్లో ముఖ్యమైనవి మూడు. ఈ సినిమాలపై కనీసం రూ. 150 కోట్ల పైగా పణం ఒడ్డుతున్నారు.
 
 కరణ్ జోహార్ దర్శకత్వంలోని
 యే దిల్ హై ముష్కిల్.
 ఈ ప్రేమకథా చిత్రంలో
 ప్రముఖ పాకిస్తాన్ స్టార్ ఫవాద్ ఖాన్‌ది కీలకమైన అతిథి పాత్ర.
 రిలీజ్ డేట్: అక్టోబర్ 28

 
 గౌరీ షిండే దర్శకత్వంలో షారుఖ్,
 కరణ్ జోహార్ కలసి రూపొందిస్తున్న  డియర్ జిందగీ. ఇందులో షారుఖ్ ఖాన్, ఆలియా భట్, ఆదిత్యారాయ్ కపూర్, కునాల్ కపూర్‌లతో పాటు పాకిస్తానీ సింగర్ - యాక్టర్ అలీ జఫర్ నటిస్తున్నారు.
 రిలీజ్ డేట్: నవంబర్ 25

 
 షారుఖ్ ఖాన్ నటిస్తున్న
 రయీస్.  ఇందులో సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ సరసన పాకిస్తానీ నటి మహిరాఖాన్ హిందీ సినీరంగప్రవేశం చేస్తున్నారు.
 రిలీజ్ డేట్: 2017 జనవరి 26

 
    - రెంటాల జయదేవ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement