పాక్ ఆర్మీ చీఫ్ రిటైర్మెంట్ సస్పెన్స్‌కు తెర!
ఇస్లామాబాద్: గతకొన్ని వారాలుగా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ పదవీ విరమణపై నెలకొన్న సస్పెన్స్‌కు తెరపడింది. రహీల్ షరీఫ్ తన పదవీకాలం ముగిసిపోయినా.. భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ ఆయనకు పొడిగింపు లభించవచ్చునని కథనాలు వచ్చాయి. అయితే, తన హయాంలోనే పీవోకేలో భారత ప్రత్యేక బలగాల సర్జికల్ స్ట్రైక్స్‌తో గట్టి ఎదురుదెబ్బ తిన్న రహీల్ పదవి నుంచి తప్పుకునేందుకు సన్నాహాలు ప్రారంభించారు. మరో వారంలో తన పదవీకాలం ముగిసిపోతున్న నేపథ్యంలో ఆయన వీడ్కోలు యాత్ర మొదలుపెట్టారు.
లాహోర్‌ను సందర్శించి ఆర్మీ, రేంజర్స్, పారామిలిటరీ బలగాలను ఉద్దేశించి ప్రసంగించడం ద్వారా ఆయన ఈ యాత్రను ప్రారంభించారని పాక్ సైన్యం మీడియా విభాగం ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆయన త్వరలోనే కరాచీ, పెషావర్‌ను కూడా సందర్శిస్తారని తెలిపింది. జనరల్ రహీల్ షరీఫ్ పదవీకాలం ఈ నెల 29తో ముగిసిపోతుండటంతో కొత్త ఆర్మీ చీఫ్ నియామకాన్ని పాక్ ప్రభుత్వం ఖరారు చేసిందని, త్వరలోనే కొత్త సైన్యాధ్యక్షుడిని ప్రకటించవచ్చునని తెలుస్తోంది. భారత్‌కు బద్ధ విరోధిగా రహీల్ షరీఫ్ పేరొందారు. ఈ కారణంగానే షరీఫ్‌కు ఆర్మీ చీఫ్‌గా పొడిగింపు ఇవ్వాలని మాజీ సైన్యాధ్యక్షుడు ముషార్రఫ్‌లాంటి వాళ్లు డిమాండ్ చేశారు. ప్రస్తుత భారత్-పాక్ ఉద్రిక్తతల నడుమ ఆర్మీలో నాయకత్వ మార్పు చేపట్టకూడదన్న సలహాలు వచ్చాయి. అయితే, రహీల్ కొనసాగింపు ఉండదని తాజాగా పాక్ ప్రభుత్వం సంకేతాలు ఇచ్చింది.