ప్రజారోగ్యానికి పట్టం కడుతున్న బ్రిటన్‌ | britan spends more on peoples health | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యానికి పట్టం కడుతున్న బ్రిటన్‌

Published Sun, Jan 8 2017 12:52 AM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

ప్రజారోగ్యానికి పట్టం కడుతున్న బ్రిటన్‌

ప్రజారోగ్యానికి పట్టం కడుతున్న బ్రిటన్‌

అవలోకనం
బ్రిటన్‌ ప్రజారోగ్యం కోసం ఏడాదికి రూ. 9.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే ఒక్కొక్క పౌరునికి రూ. 1.5 లక్షలు. మన కేంద్ర వార్షిక ఆరోగ్య బడ్జెట్‌ రూ. 33,000 కోట్లు... ఒక్కొక్కరికి రూ. 260. మనది పేద దేశం నిజమే. కానీ ఈ ఏడాది బుల్లెట్‌ ట్రైన్‌ కోసం రూ. 99,000 కోట్లు వెచ్చిస్తున్నాం. అగ్రరాజ్యం కావడం అంటే యుద్ధ విమానాలు, జపాన్‌ సాంకేతికత ప్రదర్శన అని మనం భావిస్తాం. అదే బ్రిటన్‌లో అయితే నాగరిక దేశం అంటే ప్రతి మనిషికి స్వస్థతను చేకూర్చి, పోషించగలిగిన సమర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని రూపొందించుకోవడం.
 
నేనీ వ్యాసాన్ని విరిగిన కాలుతో  ఇంగ్లండ్‌లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ నుంచి రాస్తున్నా. బౌలింగ్‌ చేస్తుండగా నా ఎడమ కాలి పాదం లోపలికి మెలిదిరిగి పడ్డంతో నా చీలమండ పగిలింది. ఏదో తీవ్రమైన హానే జరిగిందని పడ్డప్పుడే అనుకున్నా. అయినా అదేదో బెణుకేనని, దానికదే నయమైపోతుందని పట్టించుకోలేదు. రెండు రోజులు గడిచేసరికి నా పాదం బెలూన్‌లాగా ఉబ్బిపోయింది. ఏం జరి గిందో తెలుసుకోడానికి డాక్టర్‌ను సంప్రదించాలనుకున్నా. 
 
లండన్‌ హార్లీ స్ట్రీట్‌లో ఉన్న డాక్టర్‌కు ఫోన్‌ చేశా. ఆ రోజు మధ్యాహ్నమే ఆయన నన్ను చూస్తానన్నాడు గానీ, ఎక్స్‌–రే రిపోర్టు మరుసటి రోజుకుగానీ రాదని చెప్పాడు. అంతసేపు ఆగలేక దగ్గర్లో ఉన్న ప్రజాసుపత్రి యాక్సిడెంట్‌ అండ్‌ ఎమర్జెన్సీ వార్డ్‌కు వెళ్లాను.
 
నేను బెంగళూరు నుంచి వచ్చానని, కొద్ది రోజుల్లో తిరుగు ప్రయాణం చేయాల్సి ఉందని అక్కడి వారికి చెప్పాను. అక్కడి సహాయకుడు నా కేసును రిజిస్టర్‌ చేసుకుని మరో డజను మందితో పాటూ నన్ను కూడా వేచి ఉండమని చెప్పాడు. వారిలో కొందరి పరిస్థితి నాకంటే అధ్వానంగా ఉంది.
 
దాదాపు ఓ అరగంట తర్వాత నన్ను ఒక నర్సును కలవమని పంపారు. ఆమె నన్ను చూసి ఎక్స్‌–రే తీయించడానికి పంపింది. అక్కడి రేడియాలజిస్టు రెండు ఎక్స్‌–రే ఫొటోలు తీసి ఎముక విరిగిందని చెప్పింది. మీరిలాగే నడుస్తున్నారా? అని అడిగితే, అవునన్నాను. వెంటనే ఓ వీల్‌ చైర్‌ తెప్పించి, డాక్టర్‌కు చూపించ డానికి నన్ను మరో భవనంలోకి తీసుకుపోయింది. మరో అరగంట వేచి చూశాక ఆ డాక్టర్‌ (అక్కడి డాక్టర్లలో చాలా మంది లేదా అత్యధికులు భారతీయులే) ఎక్స్‌–రే స్కాన్‌ చేసిన చిత్రాన్ని నాకు చూపాడు. చీలమండ ఎముక చుట్టూతా శంఖాకృతిలో పగిలి ఉంది. 
 
పాదానికి తొడుక్కునే ఓ మూసను ఇస్తామని డాక్టర్‌ చెప్పాడు. దాని కోసం మరో అరగంట వేచి ఉండాల్సి వచ్చింది. కొన్ని నిముషాలకు ఓ మహిళ గట్టిగా నా పేరు పిలిచి, నా బూటు సైజు ఎంతో అడిగింది. నేను పదకొండు అని చెప్పా. ఆమె పాదం మూసను తేవడానికి వెళ్లింది. తీరా చూస్తే అదో పెద్ద ప్లాస్టిక్‌ బూటు. బయటి కవచం గట్టిగా ఉండి, పాదానికి హాయిగా అమరేలా ఉబ్బేట్టు గాలిని నింపగలిగిన లోపలి భాగం ఉంది.
 
ఆ సాధనంతో పాటూ రెండు పొడవాటి మేజోళ్లు కూడా ఉన్నాయి. సహా యకురాలు లేదా నర్సు ఓపికగా, పట్టింపుతో ఎలా దాన్ని వేసుకోవాలో తొడిగించి చూపింది. ఆ తర్వాత ఆమె మీకు ఏదైనా సీడీ ఇచ్చారా? అని అడిగింది. ఇవ్వ లేదనేసరికి, నాతో పాటూ మొదటి భవనానికి వచ్చి ఓ సీడీని బర్న్‌ చేసి ఇచ్చింది.  వనం నుంచి బయటకు ఎలా వెళ్లాలో కూడా చెప్పింది. బయటకు వెళ్లడానికి మరో ఐదు నిముషాలు పట్టింది. 
 
ఈ మొత్తం వ్యవహారమంతటికీ నేను ఏమీ చెల్లించాల్సి రాలేదు. రిజిస్ట్రేషన్, కన్సల్టెన్సీ, ఎక్స్‌–రే, పోతపోసిన పాదం తొడుగు అన్నీ ఉచితమే. కుంటుకుంటూ ఆసుపత్రిలోకి వెళ్లాక, తిరిగి బయటకు రావడానికి రెండు గంటలు పట్టింది.
 
బ్రిటిష్‌ పత్రికలు ఎప్పుడూ నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌ (ఎన్‌హెచ్‌ఎస్‌) లేదా జాతీయ ఆరోగ్య సేవ ఎంత ఘోరంగా ఉందో వివరిస్తూ కథనాలను వెలు వరిస్తుంటాయి. అందుకే ఇదంతా రాయాల్సి వచ్చింది. శస్త్ర చికిత్సలాంటి వాటికి అపాయింట్‌మెంట్లు కావాలంటే రోజుల తరబడి ఎలా వేచి చూడాల్సివస్తుందో ఆ కథనాలు వివరిస్తుంటాయి. ఎన్‌హెచ్‌ఎస్‌ అందించే వైద్య సేవలు పౌరులందరికీ ఉచితమే. ఎమర్జెన్సీ, యాక్సిడెంట్‌ వైద్య సేవలు సైతం పర్యాటకులతో సహా అందరికీ ఉచితమేననేది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. నా దృష్టిలో ఇది ఎంతో నాగ రికమైన ప్రవర్తన.
 
బ్రిటిష్‌ పౌరుల అనుభవమూ, నాకు కలిగిన అనుభవమూ ఒకే విధమైనవి కాకపోవచ్చు. పైగా ప్రభుత్వ వైద్య సేవలపై తీర్పు చెప్పడానికి ఎమర్జెన్సీ విభాగం బహుశా ఉత్తమమైనది కాకపోవచ్చు. అయితే నా పట్ల చూపిన ఆ శ్రద్ధ, సమ ర్థతలు మాత్రం సక్రమంగా పనిచేసే వ్యవస్థ నుంచి ఉత్పన్నమైనవి కాకుండా ఉండటానికి వీల్లేదు. 
 
నా చికిత్సకు ఏమీ చెల్లించాల్సి రాకపోవడం వల్ల నాలో అపరాధ భావన కలిగింది. కానీ నేను మన దేశంలో కట్టిన పన్నులు బ్రిటన్‌కు వలస పోయిన వేలాది మంది భారత డాక్టర్లకు సబ్సిడీకి విద్యను అందించాయి.
 
బ్రిటన్‌ ఎన్‌హెచ్‌ఎస్‌ కోసం ఏడాదికి రూ. 9.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది. అంటే పౌరులు ఒక్కొక్కరికి దాదాపు రూ. 1.5 లక్షలు. భారత కేంద్ర ప్రభుత్వపు వార్షిక ఆరోగ్య బడ్జెట్‌ రూ. 33,000 కోట్లు. అంటే సగటున ఒక్కొక్కరికి రూ. 260. మనది పేద దేశం నిజమే. కానీ మనం గత ఏడాది 36 యుద్ధ విమానాలను కొనడానికి  రూ. 59,000 కోట్లు ఖర్చు చేశాం. ఈ ఏడాది బుల్లెట్‌ ట్రైన్‌ కోసం రూ. 99,000 కోట్లు ఖర్చు చేస్తున్నాం. 
 
ప్రజారోగ్య సేవలకు బదులుగా ఇలాంటి ఆట వస్తువుల కోసం ప్రభుత్వాలు మూర్ఖంగా ఖర్చు చేయడాన్ని బ్రిటన్‌ పౌరులు అనుమతిస్తారని అనుకోను. మన మీడియాలోనూ, దాని చర్చలలోనూ పెత్తనం చలాయించేది మధ్య తరగతే. అదే ఇలాంటి వాటిని ఎంపిక చేసి కోట్లాదిమంది పేదలపై వాటిని రుద్దుతుంది. అగ్ర రాజ్యం కావడం అంటే యుద్ధాలు చేయగలగడం, జపాన్‌వారి సాంకేతిక పరి జ్ఞానాన్ని ప్రదర్శించి చూపడం, భారీ విగ్రహాలను నిర్మించడమేనని మనం భావి స్తాం. అదే బ్రిటన్‌లో అయితే నాగరిక దేశం అంటే తమ పౌరుడు అయినా కాకున్నా మనిషన్న ప్రతివాడికి స్వస్థతను చేకూర్చగలిగిన, పోషించగలిగిన సమ ర్థవంతమైన ప్రభుత్వ యంత్రాంగాన్ని రూపొందించుకోగలగడం అని అర్థం.
 
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ఆకార్ పటేల్: aakar.patel@icloud.com 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement