మతపరమైన మనోభావాలకు అతీతం యోగా
అవలోకనం
ఆసనాల్లోనే అత్యంత సమగ్రమైన ఆసనం సూర్య నమస్కారాలు. మీరే మతానికి, జాతికి చెందినవారైనా సరే, ఎవ్వరైనా చేయగలిగిన అత్యుత్తమ వ్యాయామమిది. ముస్లిం బృందాలు ఇలాంటి విషయాల్లో మరింత ఉదారంగా ఉండాలి. ఇలాంటి కార్యక్రమం వివాదరహితంగా అన్ని మతాలకూ, వర్గాలకూ చేరాలి. అలా చేరనట్లయితే అది ప్రభుత్వ స్వయంకృతాపరాధమే అవుతుంది.
భారతీయ పాఠశాలల్లో శారీరక వ్యాయామాన్ని, ప్రత్యేకించి యోగాను మరింతగా అమలు చేయడం మంచిదేనని నేననుకుం టున్నాను. యోగా (శారీరక భంగిమలు అని అర్థం) ఏమంత పురాతనమైనది కాదని, అది ఇటీవలి వ్యవహారమేనని పండితురాలు వెండీ డోనిగెర్ రాశారు. పతంజలి యోగసూత్రాల్లో ఎలాంటి భంగి మలను పేర్కొనలేదు. ఆధునిక యోగా 18, 19 శతాబ్దాలలో యూరో పియన్ల ద్వారా భారత్‌లో అడుగుపెట్టింది. వ్యాయామంలో ఉన్న ప్రయోజనాలను వారు పసిగట్టారు. రూసో రచన ‘ఎమిలి’ వంటి పుస్తకాల ద్వారా వారు ఉత్తేజం పొందారు. ఈ వాస్తవంతో పలువురు విభేదిస్తూ యోగా పురాతనమైనదని భావిస్తున్నారు. సత్యం ఏదైనా కావచ్చు కానీ యోగా అనేది కోట్లాది భారతీయులు ఎరుకతో ఆచ రిస్తున్న అభ్యాసమన్నది వాస్తవం. అథ్లెటిక్స్, జిమ్నాస్టిక్స్ వంటి శరీర వ్యాయామ శిక్షకుల కంటే ఎక్కువగా యోగా.. పాఠశాల విద్యార్థులకు సులువుగా నేర్పగలదన్న విషయాన్ని కనుగొనడం పెద్ద కష్టమైన పనేం కాదు.
చాలా సంవత్సరాల క్రితం ఆర్ట్ ఆఫ్ లివింగ్ కోర్సు చేస్తున్న సమయంలో యోగా ద్వారా కలిగే కొన్ని ప్రయోజనాలను నేను తెలుసుకున్నాను. యోగా ద్వారా మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి శరీరం ఉపయోగపడుతుందన్నది నేను తెలుసుకున్న ఉపయోగాల్లో ఒకటి. సుదర్శన క్రియ అనే శ్వాస ప్రక్రియను నేర్చుకుంటున్న సెషన్‌లో నాకు ఈ విషయం బోధపడింది.
ఆ సెషన్‌లో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ రవిశంకర్ ఫొటోను తరగతి ముందు అమర్చారు. ఇష్టమైతే ఎవరైనా ఆ ఫొటోకు నమస్కరించవచ్చు. కాని అది తప్పనిసరి కాదు. నాకు ఆ వ్యవహారం కాస్త అసౌకర్యంగా అనిపించింది. దీంతో నేను ఆ ఫొటో వందనం నుంచి తప్పుకున్నాను. తన పేరుకు ముందు రెండు శ్రీలను ఎందుకు పెట్టుకున్నారంటూ ఒకరడిగిన ప్రశ్నకు రవిశంకర్ ఇచ్చిన కొంటె సమాధానం కూడా నన్ను సంతృప్తిపర్చలేదు. మా తరగతి టీచర్ చెప్పిందాని ప్రకారం, త న పేరుకు మూడు శ్రీలు తగిలించుకుంటే మరీ ఎక్కువ. ఒకే శ్రీని జోడిస్తే మరీ తక్కు వగా ఉంటుందని ఆయన చెప్పారట. ఏదేమైనా, యోగాతో ఎవరైనా ప్రయోజనం పొందగలరనీ, ఎలాంటి మతపరమైన మనోభావాలకు గురికాకుండానే దాని గ్రూప్ సెషన్లలో పాలు పంచుకోవచ్చుననీ చెప్పడానికే నేను ఈ కథనాన్ని మళ్లీ గుర్తు చేశాను.
జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పాఠశాలల్లో నిర్వహించనున్న వివిధ ఆసనాల నుంచి (భంగిమలని అర్థం) సూర్య నమస్కారాలను ఉపసంహరించుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఈ వారం తీవ్ర ఒత్తిడికి గురయింది. ముస్లిం విద్యా ర్థులు హిందూ మత ఆచారాలను పాటించేలా భారతీయ జనతా పార్టీ బలవంత పెడుతోందని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ నుంచి వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయానికి వచ్చింది. నాకయితే ఇది బాధాకరమైన విషయమే. ఎందుకంటే, సూర్య నమస్కారం అనేది అత్యంత సమగ్రమైన ఆసనం. అంతే కాకుండా మీరే మతానికి, జాతికి చెందినవారైనా సరే, బహుశా ఎవ్వరైనా చేయగలిగిన అత్యుత్తమమైన వ్యాయామం అది.
సూర్యనమస్కారాలనేవి నిటారుగా నిలబడటం, శరీరాన్ని విల్లులాగా వెను కకు వంచడం, భూమికి సమాంతరంగా శరీరాన్ని ఉంచి పైకిలేవటం వంటి ఆసనా లతో కూడి ఉంటాయి. వీటిని అభ్యసించే క్రమంలో మన కాళ్లు వెనుకకు వం గుతూ స్ప్రింగ్ లాగా ముందుకు వస్తుంటాయి. సూర్య నమస్కారాల్లో తేలికపాటి కసరత్తు, బాడీ వెయిట్ ఎక్సర్‌సైజ్ మిళితమై ఉంటాయి. సూర్య నమస్కారాలు మత సంబంధమైనవేనా? నేనయితే అలా అను కోవడం లేదు. యోగాను అభ్యసించేవారిలో కొద్దిమంది సూర్య నమస్కారాలను కూడా చేస్తుంటారు. ఇక లక్షలాదిమంది అమెరికన్లు, యూరోపియన్లు వీటిని సూర్య ఆరాధనా రూపంగా చూస్తున్నారు. ఇది మంచి వ్యాయామం కాబట్టే వారు దాన్ని చేస్తున్నారు.
నా అభిప్రాయం ప్రకారం ముస్లిం బృందాలు ఇలాంటి విష యాల్లో మరింత సరళత పాటించవలసిన అవసరం ఉంది. తమ సమస్యను వీరు ఘర్షణాత్మకరూపంలో సమర్పించవలసిన అవసరం లేదనుకుంటున్నాను. ఇలా అంటున్నానని ముస్లిం బృందాలు అతిగా స్పందిస్తున్నాయని అర్థమా? ప్రభుత్వం దాని మంత్రుల చరిత్ర, నేపథ్యం మనల్ని మరోలా భావించేలా చేస్తున్నాయి. బాధ్యతాయుత స్థానాల్లో ఉన్న మహిళలు, పురుషుల నిందాపూర్వకమైన వ్యాఖ్యల ద్వారా మైనారిటీ బృందాలను నిత్యం లక్ష్యంగా చేసుకోవటం జరుగుతోంది.
బీజేపీ మాటలు, చేతల ద్వారా తాము ముట్టడికి, బెదిరింపులకు గురవుతున్నట్లు అనేక ముస్లిం బృందాలు భావిస్తున్న విషయాన్ని మనం తప్పక అంగీకరించాలి. తమను రెచ్చగొడుతున్నారని వారు భావించినట్లయితే అందుకు మనం ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు.
అయితే యోగాను ప్రోత్సహించడంలో ప్రభుత్వం చెడుగా వ్యవ హరిస్తోందని నేను భావించటం లేదు. ప్రధాని నరేంద్రమోదీ వ్యక్తి గతంగా దీనిపట్ల తీవ్రమైన ఉద్వేగం ప్రదర్శిస్తున్నారు. నేను గతంలో పని చేసిన గుజరాతీ దినపత్రికలో మోదీ ప్రతిరోజూ యోగాసనాలు వేసేవారన్న వార్త వచ్చింది. వివిధ ఆసన భంగిమలలో ఆయన ఫొటోలను కూడా మోదీ కార్యా లయం పంపించేది. మోదీ అభ్యర్థన మేరకు జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రకటించడం, 175 దేశాలు దానికి మద్దతు ప్రకటించడం అనేది మోదీకి వ్యక్తిగత విజయమని చెప్పాలి.
దీంతో ఉత్సాహపడిన కేంద్ర ప్రభుత్వం అతి పెద్దదైన రైల్వేలతోపాటు తన శాఖలన్నింటినీ రోజువారీగా కొన్ని యోగాసనాలను వేయవలసిందిగా కోరింది. అయితే జూన్ 21 ఆదివారం కావడంతో ఇది కాస్త వివాదాస్పదమైంది. ఏదేమైనా ఈ విషయంలో ప్రభుత్వం వివాదాలకు దూరం జరిగితే మంచిది. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పినట్లు, యోగాసనాలు మంచివి, ఇవి అందరికీ, ప్రత్యేకించి పిల్లలకు మేలు చేకూరుస్తాయి. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైనట్లయితే అది ఒకమేరకు స్వయంకృతాపరాధమే అవుతుంది. ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమం అన్ని కమ్యూనిటీలనూ చేరాలి. అయితే తన గత చరిత్ర, ప్రతిష్ట రీత్యా చూసినప్పుడు ఈ కార్యక్రమం కొంతమేరకు సమస్యాత్మకం అవుతుందని ప్రభుత్వమే ముందుగా ఊహించి ఉండాలి.
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com)
ఆకార్ పటేల్