
సంపదను సమాజానికి తిరిగి ఇవ్వడమే దాతృత్వం!
పారిశ్రామికవేత్త ఆండ్రూ కార్నెగీ 1889వ సంవత్సరం ‘ది గోస్పెల్ ఆఫ్ వెల్త్’ అనే పుస్తకం రాశారు. సంపన్నులు తమ సంపాదనను పేదలకు పంపిణీ చేయాలని పేర్కొన్నారు. సంపన్నులుగా మరణించడం సిగ్గుపడాల్సిన వ్యవహారమని వ్యాఖ్యానించారు. డబ్బుపై, దాతృత్వంపై కార్నెగీ అభిప్రాయాలు చాలామందిని ప్రభావితం చేశాయి. అపరిమితంగా సంపాదించినవారు మరణించడానికి ముందే తమ సంపదలను సమాజానికి ఇచ్చివేయడం అనేది పాశ్చాత్య దేశాల్లో ఒక సంప్రదాయంలా మారింది.
యూరప్‌లో క్రైస్తవ మత ధర్మాన్ని ఒకే ఒక్క మనిషి నిరసన సమూలంగా మార్చివేసింది. అదే ప్రొటెస్టంట్ సంస్కరణ. వచ్చే ఏడాదికి ఆ ఘటన 500 వార్షి కోత్సవం జరుపుకోబోతోంది. భారత్‌లో ఒకే రోజున ప్రచురితమైన రెండు వ్యాసాలు మరోసారి నాకు ప్రొటెస్టంట్ సంస్కరణను గుర్తుకు తెచ్చాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాల ఆదాయం 27 శాతం వృద్ధి సాధించినట్లు మే 25న ఒక వార్తా కథనం వచ్చింది. ‘‘పెరుగుతున్న పాపాలే’’ ఈ వృద్ధికి కారణ మని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ప్రజలు పాప కార్యాలు చేస్తున్నారని వాటి నుంచి బయటపడేందుకు ఆలయాలను సందర్శిస్తూ కానుకలు సమర్పించుకుంటున్నారని ఆయన అన్నారు.
అదే రోజు ఉదయ్‌పూర్ నుంచి మరొక వార్తా కథనం వచ్చింది. ‘‘పవిత్ర స్నానమొనరించి, రూ.11లు చెల్లిస్తే చాలు చేసిన పాపాల నుంచి విముక్తి’’ అని శీర్షిక. 11 రూపాయలు చెల్లించిన భక్తులకు సమస్త పాపాల నుంచి విముక్తి కలిగించే ధ్రువవత్రాన్ని ఇస్తామంటూ రాజస్థాన్‌లోని ఒక శివాలయం పూజారులు ఒక ప్రతిపాదన చేశారు. భక్తులు చెల్లించే ఈ రూ.11ల్లో కొంత భాగాన్ని దోష నివారణకు వెచ్చిస్తారట.
అంటే భవిష్యత్ విఘ్నాల తొలగింపు అన్నమాట.ప్రతి ఒక్కరూ చివరకు అమాయకులు కూడా పాపాలు చేస్తారని దీని అర్థం. ‘‘రైతులు సేద్యం పనులు చేస్తున్నప్పుడు అజాగ్రత్త వల్లో లేక అనుద్దేశపూర్వకంగా కూడా పెద్ద సంఖ్యలో పురుగులను, ఇతర ప్రాణులను చంపుతుంటారు. పక్షులు, పాకెడు జంతువుల గుడ్లను ధ్వంసం చేస్తుంటారు. ఇది వారిలో అపరాధ భావనను కలిగిస్తుంటుంది. పాపాలు చేశామన్న తలంపుతో వారు ఇక్కడికి వస్తుంటారు. ఇలా మొక్కు చెల్లించిన తర్వాత పాప భారం తొలిగిపోయిందన్న భావనతో వెళు తుంటారు’’ అని ఒక పూజారి వివరించారు కూడా.
దేవుడి తరపున పూజారులు ఇలా డబ్బు తీసుకునే సంప్రదాయం ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్నదే. యూరప్‌లో 500 ఏళ్ల క్రితమే ఇది భారీ స్థాయిలో జరుగుతూ వచ్చింది. రోమన్ కేథలిక్ చర్చ్.. ఫాదరీ శ్రీముఖాలు పేరిట కొన్ని పత్రాలను అమ్మేది. ఈ పేరుతో డబ్బు చెల్లించేవారు తాము చేసిన పాపాలకు గాను మరణానంతరం అనుభవించాల్సిన శిక్షలు తగ్గిపోతాయన్నమాట.
ఇలాంటి కేథలిక్ శ్రీముఖాలను క్రీ.శ. 1517 నాటికే చాలా విస్తృతంగా అమ్మే వారు. ఇలా అమ్మగా వచ్చిన డబ్బు వసూలుకు పోప్ తన తరపున ఒక వ్యక్తిని జర్మనీకి పంపేవారు. ఇలా సేకరించిన డబ్బును వాటికన్‌లోని సెయింట్ పీటర్స్ చర్చి నిర్మాణానికి వెచ్చించేవారు. దీన్ని నిరసిస్తూ ఒక జర్మన్ మతాచార్యుడు కేథలిక్ చర్చి విశ్వాసానికి హాని కలిగిస్తోందని ఆరోపిస్తూ ఒక ప్రకటన వెలువరిం చారు. ఇలా పాపవిముక్తి కోసం మతపరమైన శ్రీముఖాలను అమ్ముకునే అధి కారం పోప్‌కు లేదంటూ ఆ మతాచార్యుడు తన నిరసనను తన చర్చి తలుపుకు అతికించారు. అతడి పేరు మార్టిన్ లూథర్. ఈ చర్యే ప్రొటెస్టంట్ సంస్కరణకు దారితీసింది. ఈ ఉద్యమం క్రైస్తవ మతంలో చీలికలు తెచ్చింది. దీని వల్లే ఈరోజు అనేక యూరోపియన్ దేశాలు కేథలిక్ దేశాలుగా లేవు.
మార్టిన్ లూథర్ కాలపు యూరప్ లాగే, భారతదేశంలో కూడా మతం అనేది ఆర్థిక లావాదేవీలతో కూడి ఉంటోంది. దేవుడి ఆశీర్వాదం కోసం మనం ఆలయా లకు డబ్బు చెల్లిస్తుంటాం. సంపన్న భారతీయులు నగదు ఇవ్వరు. వారు బంగారాన్ని సమర్పిస్తుంటారు. ఎందుకు? ఎందుకంటే నగదు ఇస్తే ఆలయాల్లో ప్రసాదాల కోసం, ఇతర ధర్మ కార్యాలకోసం ఖర్చు పెట్టేస్తారు. కాని బంగారం మాత్రం దేవుడిని శాశ్వతంగా అంటిపెట్టుకుని ఉంటుంది.
తిరుపతి దేవస్థానం వెబ్‌సైట్ తెలుపుతున్న వివరాల ప్రకారం ఒకే ఒక సంవత్సర కాలంలో తిరుమల దేవాలయం 3,200 కేజీల వెండిని, 2.4 కేజీల వజ్రాలను భక్తుల నుంచి స్వీకరిస్తోంది. ప్రతి ఏటా సగటున దేవాలయానికి వెయ్యి కిలోల బంగారాన్ని భక్తులు చెల్లిస్తున్నారు. 2011వ సంవత్సరంలో ఇలా ఒక కిలో బంగారం (రూ. 28 లక్షలు) దేవుడికి కానుకగా ఇచ్చినవారికి క్యూలో వెళ్లనవసరం లేకుండానే వీఐపీ దర్శన భాగ్యం కల్పించారు. అంటే కోటి రూపాయలతో మొదలెట్టి ఇలా భారీ మొత్తాలను కానుకలుగా సమర్పించేవారికి దేవస్థానంవారు పలురకాల సౌకర్యాలను కల్పిస్తున్నారు.
ఈ సమాచారం భారతీయుల్లో చాలామందికి ఆశ్చర్యం కలిగించదు. ఎందు కంటే మన ప్రాంతంలో మతం అనేది లావాదేవీలతో ముడిపడి ఉంటోందని మనకు తెలుసు. కొన్ని నెలల క్రితం నేను కాశీకి వెళ్లాను. ఈ అతి పురాతన హిందూ నగరంలో ప్రతి మత సేవకూ ఒక వెల నిర్ణయించారు. దైవ హారతి సమ యంలో దేవుడి ఎదుట ఉండేందుకు పెద్ద మొత్తంలో ప్రజలనుంచి వసూలు చేస్తున్నారు. ప్రతి చోటా తీర్థ యాత్రికులను కస్టమర్లలాగా చూస్తున్నారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే యాత్రికులు కూడా దీన్ని పెద్దగా పట్టించుకుంటున్నట్లు లేదు. ఎందుకంటే ఇదంతా సంస్కృతిలో భాగం. మతానికి వెలువల వాస్తవ కారణాల కోసం భారత్‌లో చాలా తక్కువ ధర్మకార్యాలు జరుగు తుంటాయంటే మనం ఆశ్చర్యపోవలసిందేమీ లేదు.
సాపేక్షికంగా చూస్తే, విదేశాల్లో ప్రత్యేకించి దాతృత్వం, పరోపకారం రూపంలో వాణిజ్యవేత్తలు భారీ విరాళాలను ఇవ్వడమనేది ఇటీవలి పరిణామం మాత్రమే. అక్కడ 19వ శతాబ్ది వరకు సంస్థాగత దాతృత్వం దాదాపుగా లేదు. సంపన్న వ్యాపారులు నిర్దిష్ట మొత్తంలో చర్చికి నగదు చెల్లించేవారు. దశమాంశం లేదా పదో వంతు పేరిట జరిగే ఈ దాతృత్వ కార్యంలో తమ ఆదాయంలో 10 శాతాన్ని చర్చికి సమర్పించేవారు. 1889వ సంవత్సరంలో పారిశ్రామికవేత్త ఆండ్రూ కార్నెగీ ‘ది గోస్పెల్ ఆఫ్ వెల్త్’ (సంపద సువార్త) అనే పుస్తకం రాశారు. సంపన్నులు తమ సంపాదనను పేదలకు పంపిణీ చేయాలని, సంపన్నులుగా మరణించడం సిగ్గుపడాల్సిన వ్యవహారమని వ్యాఖ్యానించారు.
డబ్బుపై, దాతృత్వంపై కార్నెగీ అభిప్రాయాలు చాలామందిని ప్రభావితం చేశాయి. అపరిమితంగా సంపాదించినవారు మరణించడానికి ముందే తమ సంప దలను సమాజానికి ఇచ్చివేయడం అనేది పాశ్చాత్య దేశాల్లో ఒక సంప్రదాయంలా మారింది. బిల్‌గేట్స్, వారెన్ బఫెట్ వంటి వారు ఇప్పుడక్కడ అరుదైన దాతలుగా లేరు. అయితే యూరప్‌లో మహా సంపన్నులు మాత్రమే ఇలా చేయడం లేదు.
ఒక సగటు డచ్ పౌరుడు నేడు ఏడు ధర్మ కార్యాలకు నెలవారీగా విరాళాలు ఇస్తున్నారు. మరి భారత్‌లో జరుగుతున్నదేమిటి? భారత్‌లో ఇది మార్పు చెందనంతవరకు, స్వార్థ కారణాల కోసమే మతాన్ని ఒక ఆర్థిక లావాదేవీగా చూస్తుండటాన్ని మనం నిలిపివేయనంతకాలం, యూరప్‌ను సమూలంగా మార్చివేసిన నాటి మత సంస్కరణ ఇక్కడ చోటు చేసుకోదు. పరిస్థితి ఇలాగే ఉంటే మరో 500 సంవత్సరాలకు కూడా అలాంటి మార్పు ఇక్కడ జరగదని మనం నమ్మకం పెట్టుకోవచ్చు.
ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత
aakar.patel@icloud.com