అవలోకనం
మన దేశంలో డేటా వినియోగం గత కొన్ని సంవత్సరాలుగా అయిదు రెట్లు మించి పెరిగింది. అనేకులు స్మార్ట్‌ఫోన్లవైపు మొగ్గడం, వాట్సాప్‌లో వచ్చే అంశాలను అందరికీ పంపే ధోరణి పెరగడం ఇందుకు రుజువు. ఈ కారణంగా మాధ్యమం విస్తృతి ఎంతగానో పెరిగింది. ఇలాంటపుడు సహజంగానే నకిలీవార్తల బెడద ఎక్కువగా ఉంటుంది. అయితే మనకు దీన్ని మించిన మరో సమస్య ఉంది. నిజమైన వార్తలపై ఆసక్తి కొరవడటమన్నదే ఆ పెను సమస్య.
కోల్‌కతాలో జరిగే సాహితీ సంరంభానికి వచ్చి ఈ వ్యాసం రాస్తున్నాను. గత పదేళ్లుగా ఇలాంటి పండుగలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇతర దేశాలకంటే మన దేశంలోనే ఇవి ఎక్కువ. నాకిది అసాధారణమే అనిపిస్తుంది. ఏదైనా రాయడం, సాహిత్యాన్ని చదవడం అనే సంస్కృతి మనకుంది. అలాగని మన సమాజంపై రచయిత ప్రభావం పెద్దగా ఉండదు. చెక్ రిపబ్లిక్ తొలి అధ్యక్షుడిగా ఎన్నికైన వాక్లవ్ హావెల్ లాంటివారు ఇక్కడ ఉద్భవించే అవకాశం లేదు. ఉపా ధ్యాయుల్లాగే రచయితలపై కూడా అందరికీ గౌరవం ఉంటుంది. కానీ వారిని అనుసరించే తత్వం ఎక్కడా ఉండదు. మరి ఇన్ని సాహితీ సంరంభాలెందుకు? ఒక్కో సంరంభానికి ఇన్ని వేలమంది, వారిలో అత్యధికంగా యువతే ఎందు కుంటున్నారు? నా పరిశీలనలో తేలిందేమంటే, ఇతరచోట్ల... ప్రత్యేకించి విశాల ప్రజానీకంలో చర్చించడానికి సాధ్యపడని అంశాలకు ఇలాంటి సమూహాల్లో చోటుండటమే అందుకు కారణం. కనుకనే చాలా సాహితీ ఉత్సవాల్లో పుస్తకాల గురించి, రచయితల గురించి కాక సమకాలీన ఘటనలపైనా, మారుతున్న సమాజ స్వభావంపైనా చర్చించడమే ఎక్కువ కనబడుతుంది. ఈ వారం నేను నకిలీ వార్తల (ఫేక్ న్యూస్)పై జరిగిన బృంద చర్చలో పాల్గొన్నాను.
ఈ నకిలీవార్తలను మనం రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి– అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాన్ని అర్ధం చేసుకున్న తీరులో. ఆయనకు న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, సీఎన్‌ఎన్‌లు ఆ కోవలో కనిపిస్తాయి. మిగిలిన ప్రపంచం, ప్రత్యేకించి పాత్రికేయ లోకం ఈ పత్రికలనూ, చానెళ్లనూ ప్రశంసించ దగ్గవిగా, సాధికారమైనవిగా భావిస్తాయి. తనను విమర్శిస్తాయి గనుక ట్రంప్ దృష్టిలో ఇవి నకిలీవార్తలను తయారుచేసేవే. ఈ ఫేక్‌న్యూస్‌ను మనం మరో రకంగా చెప్పొచ్చు. తప్పుడు వార్తగా, వండివార్చిన వార్తగా తెలిసినా దాన్ని దురు ద్దేశంతో ప్రత్యేకించి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో పెట్టే వార్తల్ని నకిలీ వార్తలని అనొచ్చు. ప్రపంచంలో ఒక మూల జరిగిన హింసాత్మక ఘటన తాలూకు ఫొటోను మరొకచోట జరిగినట్టుగా చూపే ప్రయత్నం చేయడాన్ని ఇందుకు ఉదాహరణగా తీసుకోవచ్చు.
అలాగే ఒక పరి స్థితిని లేదా ఒకరి వ్యక్తి త్వాన్ని వివరించే పేరిట అవాస్తవాలను ‘నిజాలు’గా ప్రచారం చేయడం కూడా ఈ కోవకిందికే వస్తుంది. వాట్సాప్ ద్వారా ఇలాంటి సరుకు అందరికీ వస్తూనే ఉంటుంది కనుక ఇంతకుమించి దీని లోతుల్లోకి వెళ్లను. ఫేక్‌న్యూస్ చర్చలో పాల్గొన్న బృందంలో నాతోపాటు అహ్మదాబాద్‌కు చెందిన ప్రతీక్ సిన్హా కూడా ఉన్నారు. ఆయన ఆల్ట్‌న్యూస్ డాట్ ఇన్(altnews.in) అనే వెబ్‌సైట్‌ను నడుపుతున్నారు. జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్నవాటిని ఎప్పటికప్పుడు పరిశీలించి అవి తప్పుడు వార్తలో, నిజమైనవో తేల్చడం ఆయన పని. దేశ పౌరులను తప్పుడు వార్తలతో, నిర్ధారణ కాని వార్తలతో చీల్చడానికి ప్రయత్నించేవారిని బట్టబయలు చేయడంలో ఆ వెబ్‌సైట్ ప్రశంసనీయమైన పాత్ర పోషిస్తోంది.
గత మే నెలలో పిల్లల కిడ్నాపర్ల గురించి ప్రచారంలోకొచ్చిన ఒక తప్పుడు వార్త పర్యవసానంగా జార్ఖండ్‌లో ఏడుగురిని ప్రజలు కొట్టిచంపారు. ప్రతీక్‌సిన్హా కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. మన దేశంలో డేటా విని యోగం గత కొన్ని సంవత్సరాల్లో అయిదు రెట్లు మించి పెరిగింది. ప్రజల్లో అనేకులు స్మార్ట్‌ఫోన్‌ల వైపు మొగ్గడం, వాట్సాప్‌లో వచ్చే అంశాలను అందరికీ పంపే ధోరణి పెరగడం ఇందుకు రుజువు. మాధ్యమం విస్తృతి పెరిగి అది ఎన్నో రకాలుగా రూపాంతరం చెందడం వల్ల చిన్న స్థాయి సంస్థలు, వ్యక్తులు కూడా ప్రచురణకర్తలుగా మారారు. ఇలాంటి పరిస్థితుల్లో దేన్నయినా ధ్రువీకరించగలిగే వర్గాల సంఖ్య కూడా పెరగాలి. అయితే మనకున్న పెద్ద సమస్య తప్పుడు వార్తలు కాదు... నిజమైన వార్తలపై ఆసక్తి కొరవడటమేనని నాకనిపిస్తుంది. ఉదాహరణకు మన దేశం ఆరోగ్య రంగానికి కేటాయించే మొత్తానికి పదిరెట్లు ఎక్కువగా రక్షణపై వ్యయం చేస్తుంది (ఆరోగ్యానికి చేసే ఖర్చు రూ. 40,000 కోట్లయితే... రక్షణ వ్యయం రూ. 4లక్షల కోట్లు). ఇది ఇటీవలి సంగతి కాదు. మనమెప్పుడూ ఆసు పత్రులు, వైద్యులు, మందుల కంటే శతఘ్నులు, విమానాలు, నౌకలు కొనడానికి ఎక్కువ ఖర్చుపెడుతుంటాం. అన్ని ప్రభుత్వాలూ ఇలాగే చేస్తాయి. ఏ పార్టీ కూడా దీన్ని వ్యతిరేకించదు.
ఈశాన్య భారతంలో ఆంతరంగిక భద్రత కోసం సైన్యాన్ని ఉపయోగించడం ప్రారంభించి ఈ ఏడాదితో అరవైయ్యేళ్లవుతుంది. ఇంత సుదీర్ఘకాలం దేశ పౌరులు సైనిక పాలనలో ఎందుకుండాలని మనం ప్రశ్నించలేమా? పదాల గారడీని పక్కన బెట్టి మాట్లాడుకోవాలంటే సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టం కింద బల వంతంగా ఒక జనాభా మొత్తాన్ని ఉంచడం సైనిక పాలన అనే అనాలి. కానీ దీనిపై మన రాజకీయ పార్టీలకు లేదా దేశంలోని ఇతర ప్రాంతాలకు చెందిన పౌరులకు ఆసక్తే ఉండదు. నేను చెప్పబోయే మూడో ఉదాహరణ ఇటీవలికాలానిదే. మన పాలక పార్టీ జాతీయవాదానికి తాను కట్టుబడి ఉన్నానని చెప్పుకుంటుంది. కానీ ఆచరణలో రాజకీయ వివక్షను పాటిస్తుంది.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ముస్లిం ఎమ్మెల్యేల సంఖ్యను ఒకసారి చూద్దాం: గుజరాత్–సున్నా, ఉత్తరప్రదేశ్–సున్నా, మహారాష్ట్ర–సున్నా, మధ్యప్రదేశ్–సున్నా, చత్తీస్‌గఢ్–సున్నా, జార్ఖండ్–సున్నా. ఇతరచోట్ల నామమాత్రం. మత ప్రాతిపదికన భారతీయుల్ని విడగొట్టడం మన కళ్లముందే జరుగుతోంది. మరి ఎందుకని అందరూ దాన్ని ఉపేక్షిస్తారు? ఎందుకని చర్చించరు? ఎందుకంటే అసమ్మతి స్వరాలు వినబడవు గనుక. అవి కేవలం సాహితీ ఉత్సవాల వంటి చోటే లేవనెత్తుతారు గనుక. ట్రంప్‌కూ, పాశ్చాత్య ప్రపం చానికీ నకిలీ వార్తల బెడద అంత ముఖ్యమూ కాదు. వాటికి పర్యవసానాలూ ఉండవు. కానీ భారత్‌లో అలాంటి వార్తలు ప్రాణాలు తీసే పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే నకిలీ వార్తల బెడద ఇక్కడ ఉన్నా లేకున్నా మన సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయని మాత్రం మనం అంగీకరించితీరాలి.
- ఆకార్ పటేల్
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత ‘ aakar.patel@icloud.com
Comments
Please login to add a commentAdd a comment