‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నిజం కానుందా? | opinion on 'congress mukt bharat' by aakar patel | Sakshi
Sakshi News home page

‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నిజం కానుందా?

Published Sun, Apr 24 2016 1:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నిజం కానుందా? - Sakshi

‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ నిజం కానుందా?

అవలోకనం
 
క్షేత్రస్థాయిలో పార్టీ ఉనికిలో ఉండి, ప్రభుత్వ వ్యతిరేక గాలి అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో సైతం విజయాన్ని సాధించగల జీవశక్తి కాంగ్రెస్‌లో ఉన్నట్టు అనిపించడం లేదు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల విషయంలోనూ, శాశ్వత కాషాయ రాష్ట్రాలుగా మారిన గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి  రాష్ట్రాల విషయంలోనూ కూడా ఇది నిజం. కాంగ్రెస్‌కు సౌకర్యవంతంగా ఉన్నదని చె ప్పగల రాష్ట్రం దేశంలో ఒక్కటైనా లేదు. ఈ దఫా జరుగుతున్న శాసనసభ ఎన్నికలు గాంధీ కుటుంబానికి ఘోర దుర్వార్తలను మోసుకురానున్నాయి. అవి చర్చను తిరిగి ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’కు తీసుకు వస్తాయి. అది ఈసారి జరగకపోతే ఎప్పుడు జరగనున్నదనేదే మిగిలే ప్రశ్న.
 

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ ఇచ్చిన పిలుపుగా మనం మొదటిసారిగా ‘కాంగ్రెస్-ముక్త్ భారత్’ అనే మాట విన్నాం. కాంగ్రెస్‌ను తుడిచిపెట్టేయండని దాని అర్థం. బీజేపీ ఆ వాగ్దానాన్ని నెరవేర్చడంలో ఎంత వరకు సఫలమైంది? మొత్తంగా పరిస్థితిని ఒక్కసారి పరికించి చూద్దాం. మొత్తం ఏడు రాష్ట్రాలలో భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వాలున్నాయి. వీటిలో ఈశాన్యంలోని మూడు చిన్న రాష్ట్రాలైన మిజోరాం, మణిపూర్, మేఘా లయలూ, దక్షిణాదిలోని రెండు ప్రధాన రాష్ట్రాలైన కేరళ, కర్ణాటకలూ, ఉత్తరా దిలోని రెండు చిన్న రాష్ట్రాలు హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ఉన్నాయి. ఉత్త రాఖండ్‌లో కాంగ్రెస్ తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలుగుతుందా? అనే అను మానాలున్నాయి. కాబట్టి దాన్ని ఈ విశ్లేషణ నుంచి మినహాయిద్దాం. అక్కడ వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. గత నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు దఫాలవారీగా అధికారాన్ని మార్చుకుంటున్నాయి. కాబట్టి ఈసారి అక్కడ కాంగ్రెస్ తిరిగి గెలిచే అవకాశాలు చాలా తక్కువ.

హిమాచల్‌ప్రదేశ్‌లో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఆదాయానికి మించిన ఆస్తులను కలిగి ఉన్నారనే ఆరోప ణలపై సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. ముఖ్యమంత్రిగా ఆయన ఎంత కాలం మనగలరనేది చెప్పడం సులువేమీ కాదు. పైగా అక్కడ ప్రతి పక్షంలో ఉన్న బీజేపీకి సుప్రసిద్ధుడైన స్టార్ నేత ఉన్నారు. ఆయన, అత్యంత శక్తివంతమైన భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అధిపతి అనురాగ్ ఠాకూర్. ఆయనకు సాటి రాగల కరిష్మాగల నేతలెవరూ ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు లేరు.
 
ఇక కేరళలో, ఈసారి ఎన్నికల్లో వామపక్ష కూటమి చేతుల్లో కాంగ్రెస్ ఓడిపోతుందని అభిప్రాయ సేకరణలు చెబుతున్నాయి. ఎన్నికల ఫలితాలు మే 19న వెలువడతాయి. ఆ రాష్ట్ర రాజకీయాలను పరిశీలిస్తున్న వారికి కాంగ్రెస్ ఓటమి ఆశ్చర్యం కలిగించదు. ఆ ఎన్నికల్లో గమనించదగ్గ అంశాలు రెండే. ఒకటి, దేశవ్యాప్తంగా తుడిచిపెట్టుకుపోయిన కమ్యూనిస్టుల చేతుల్లో కూడా ఓడిపోగల సామర్థ్యాన్ని కాంగ్రెస్ ప్రదర్శించడం. రెండు, మళయాళీ హిందువు లలో మెల్లగా మద్దతును పెచుకుంటున్న బీజేపీ ఓట్ల శాతం పెరగడం.
 
కర్ణాటకలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి వరుసగా పలు కుంభకోణాలను ఎదు ర్కోవాల్సి వచ్చింది. వాటిలో ఒకటి, ఆయన తన స్థోమతకు మించిన విలా సవంతమైన వాచీలను ధరించడం (అవి తనకు కానుకలుగా ఇచ్చినవని ఆయన అంటున్నారు). ప్రభుత్వ కాంట్రాక్టులను పొందిన ఒక కంపెనీలో ఆయన కుమారుడు భాగస్వామిగా ఉండటం మరొకటి. అక్కడి మరో ముఖ్య పరిణామం, బీజేపీ మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప తిరిగి ఆ పార్టీ నాయకునిగా రంగప్రవేశం చేయడం. అవినీతి ఆరోపణల కారణంగా ఆయన గత శాసనసభకు రాజీనామా చేయాల్సి వచ్చింది. అయినా పెద్ద సంఖ్యలో ఉన్న లింగాయతులలో ఆయనకు బాగా పలుకుబడి ఉంది. ఆయన తిరిగి పార్టీలోకి రావడమంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపునకు ఎక్కువ అవకాశాలు న్నాయనే అర్థం. మరో రెండేళ్లలో అక్కడ ఎన్నికలు జరుగుతాయి.
 
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రెండు రాష్ట్రాలలో ఒకటైన అస్సాంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. రెండవది, బెంగాల్. అస్సాంలో బీజేపీ సునాయాసంగా, మంచి ఆధిక్యతతో గెలుస్తుందని జనాభిప్రాయ సేకరణలు తెలుపుతున్నాయి. ఆ అంచనాలు 2014 జాతీయ ఎన్నికల ఫలితాల సరళికి అనుగుణంగానే ఉన్నాయి. బంగ్లాదేశ్ నుంచి ముస్లింలు వలస రావడం అక్కడి ఎన్నికల ప్రచారంలో ప్రధాన చర్చనీయాంశంగా మారడంతో బీజేపీ దాని వల్ల ప్రయోజనం పొందడంలో అత్యంత అనుకూల స్థానంలో ఉంది.
 
ఇక బెంగాల్‌లో కాంగ్రెస్, బాగా బలహీనపడ్డ వామపక్షాలతో చేయి కలిపి మమతా బెనర్జీ పార్టీతో తలపడుతోంది. జనాభిప్రాయ సేకరణలు పోటీ తీవ్రంగా ఉంటుందని చెబుతున్నాయి. అయితే, మమత ప్రభుత్వం అవినీతి, అసమర్థత, ఆశించిన ఫలితాలను అందించలేకపోవడం తదితర సమస్యలను ఎదుర్కొంటున్నా తృణమూల్ కాంగ్రెస్ గెలుస్తుందని అవి సూచిస్తున్నాయి. క్షేత్ర స్థాయిలో పార్టీ ఉనికిలో ఉండి, ప్రభుత్వ వ్యతిరేకత గాలి తనకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాలలో సైతం విజయాన్ని సాధించగల జీవశక్తి కాంగ్రెస్‌లో ఉన్నట్టు అనిపించడం లేదు. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌ల విషయం లోనూ, శాశ్వత కాషాయ రాష్ట్రాలుగా మారిన గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ వంటి  రాష్ట్రాల విషయంలోనూ కూడా ఇది నిజం.
 
ఈశాన్యంలో, రాజకీయాలు నిజంగానే భావజాలపరమైనవి కావు. స్థానిక నేతలు ఢిల్లీ గద్దెపై ఏ రాజకీయ పార్టీ ఉంటే దానితో జత కలుస్తారు. అక్కడ ఇప్పుడున్న మూడు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలూ అదృశ్యమైపోయే అవకాశమూ ఉంది. కాంగ్రెస్‌కు సౌకర్యవంతంగా ఉన్నదని చె ప్పగల రాష్ట్రం ఒక్కటైనా లేదు. రాజకీయేతర విషయాలకు సంబంధించి కూడా జాతీయ మీడియాలో ఆ పార్టీ ప్రతిష్ట 2011 నుంచి, అన్నా హజారే ఉద్యమ కాలం నుంచి దెబ్బ తింటూ వస్తూనే ఉన్నట్టనిపిస్తోంది.
 
జాతీయవాదం, ఉగ్రవాదం, అవినీతి వంటి సమస్యలపై  ఆ పార్టీ రక్షణ స్థితిలో ఉంది. రాహుల్ గాంధీ, ఆయన బావ రాబర్ట్ వాద్రా అతి తరచుగా ప్రతికూలమైన విషయాలతో వార్తలకెక్కుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీ పెద్ద మార్పును ఏమీ సాధించలేని అశక్తతను ప్రదర్శిస్తున్నా  కాంగ్రెస్ ఆ కథనాన్ని వినియోగించుకోలేకపోతోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికంటే ఎక్కువగా గాంధీ కుటుంబం వార్తల ఎజెండాగా ఏమి ఉండాలనేదాన్ని నిర్ణయించలేకపోతోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీలు, నితీశ్ కుమార్ లాంటి రాష్ట్ర స్థాయి నేతలు కాంగ్రెస్‌ను దెబ్బతీస్తూ ప్రతిపక్ష నాయ కులుగా విశ్వసనీయతను సంపాదించుకుంటున్నారు.
 
ఈ దఫా జరుగుతున్న శాసనసభ ఎన్నికలు గాంధీ కుటుంబానికి ఘోర దుర్వార్తలను మోసుకురానున్నాయి. అవి చర్చను తిరిగి ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’కు తీసుకు వస్తాయి. కాకపోతే అది ఈసారి జరగకపోతే ఎప్పుడు జరగనున్నదనేదే మిగిలే ప్రశ్న.

వ్యాసకర్త: ఆకార్ పటేల్ (కాలమిస్టు, రచయిత)
aakar.patel@icloud.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement