
ఈ ‘రాక్ స్టార్’ సంబరాల నేపథ్యం వినోదమే!
గత 16 నెలలుగా మనం మరీ ఎక్కువగా చూస్తూ వస్తున్న విదేశాల్లోని భారతీయుల గురించిన కథనం ఇది.
అవలోకనం
గత 16 నెలలుగా మనం మరీ ఎక్కువగా చూస్తూ వస్తున్న విదేశాల్లోని భారతీయుల గురించిన కథనం ఇది. మన కాలంలో అత్యంత సూక్ష్మబుద్ధి కల రాజకీయనేతల్లో ఒకరు, తనకు ముందటి రాజకీయ నేతల్లో ఎవరికీ లేనంతగా విదే శాల్లోని భారతీయుల్లో గుర్తింపు కలిగిన నేత అయిన మన ప్రధానమంత్రి చుట్టూ మూగుతున్న విదేశీ భారతీయుల గురించే ప్రస్తావిస్తున్నాను.
ప్రధానమంత్రిగా పదవీస్వీకారం చేసింది మొదలుగా ఇండియా వెలుపల చేసిన ప్రతి సందర్శనలోనూ నరేంద్రమోదీ భారతీయుల మధ్య మునిగి తేలుతున్నారు. చైనాలో, అమెరికాలో (ఇక్కడయితే ఆయన ప్రేరణ కోసమో లేక ఆశీర్వదించటానికో.. స్టార్ వార్స్ సినిమాలోని - శక్తి మీతోనే ఉండు గాక - అనే వాక్యాన్ని ప్రయోగించడం ద్వారా అమెరికాలోని పలువురు విద్యావంతులను, చైతన్యవంతులైన భారత సంతతిని విభ్రాంతికి గురిచేసి ఉండవచ్చు), లేదా గల్ఫ్‌లో, ప్రతిచోటా ప్రధాని విదేశాల్లోని భారతీయులను విపరీతంగా ఆకర్షించారు.
నరేంద్ర మోదీని ఇలా విదేశాల్లోని భారతీయులు చుట్టుముట్టడాన్ని మన మీడియా అత్యుత్సాహపూరితమైన పదాలతో వర్ణించింది. మోదీకి మనవాళ్లు రాక్ స్టార్ తరహాలో స్వాగతం పలికారని మీడియా పేర్కొంటోంది. దీనర్థం ఏమిటి? రాక్‌స్టార్‌లకు జనంలో ఉన్న అభిమానం అనేది వారి జనాకర్షణ నుంచే వస్తుంది. వారిలోని మానవత్వం లేదా వారిలోని అత్యున్నత గుణాల వల్ల జనం వారిని అభిమానించటం లేదు. ప్రజల్లో వారికి ఉన్న గుర్తింపునుంచి పుట్టుకొస్తున్న కృత్రిమ ధీరోదాత్తత అది.
అది పైపై మెరుగులతో కూడిన ప్రేమ, కృత్రిమ ప్రేమ మాత్రమే. ఒక అత్యున్నత విలువలు కలిగిన రాజనీతిజ్ఞుడి విషయంలో ఇలాంటి ప్రేమ వాంఛనీయం కాదు. ఇక్కడ మనం ముఖస్తుతి, విపరీత ప్రశంసల గురించి చర్చించడం లేదు. నాయకుడి సంభాషణలో, చేతల్లో వ్యక్తమయ్యే కొన్ని రకాల ధోరణులే ఇలాంటి స్పందనను కలిగిస్తుంటాయి. గాంధీ ఇలాంటి రాక్ స్టార్ గుర్తింపును పొందుతారని మనం ఊహించలేం. ఎందుకంటే ఆయన దాన్ని కోరుకోరు కూడా.
నిజానికి రాక్‌స్టార్ గుర్తింపు అనేది ఒక క్షణభంగురమైన, అనిశ్చితమైన, అశాశ్వతమైన మనోభావం మాత్రమే. పైగా రాక్‌స్టార్లు, సినీ నటులు ఒక పరిమిత పరిధిలోని గవ్వలాంటి జీవితం గడుపుతుంటారు. ఈ అంశాన్ని ప్రస్తుతానికి వదిలేద్దాం. ఈ కథనం ప్రధానాంశం మోదీ గురించి కాదు. మోదీ చుట్టూ గుమిగూడుతున్న విదేశాల్లోని భారతీయుల గురించే ప్రస్తుత చర్చ. విదేశీ భారతీయులు ఎందుకిలా చేస్తున్నారో చూద్దాం మరి.
అన్నిటికంటే ముఖ్యమైన, మొట్టమొదటి అంశం ఏదంటే, ఇతర దేశాల ప్రజల కంటే భారతీయులు అత్యంత అధికంగా జాతీయవాద తత్వంలో ఓలలాడుతుంటారు. మాతృదేశం గురించి పాటలు పాడుతుంటేనే మన కళ్లలోంచి కన్నీటి ధారలు కారిపోతుంటాయి. కొన్ని తరాలకు ముందే పాశ్చాత్య ప్రపంచంలో స్థిరపడిన భారతీయులు నేటికీ ఇండియాతో తాదాత్మ్యం చెందుతుంటారు. క్రీడా పోటీలు జరుగుతున్నప్పుడు తాము నివసిస్తున్న దేశానికి చెందిన జట్టు భారత్‌తో ఆడుతున్నప్పపుడు కూడా భారతీయులు మాతృదేశానికే మద్దతు పలుకుతూ ఊగిపోతుంటారు.
ఇక రెండో అంశం ఏదంటే వెంటాడుతున్న అపరాధ భావన. ఉదాహరణకు ఇండియాలో రాయితీ ఫీజులతో చదువుకున్న డాక్టర్లు, ఇంజనీర్లు ధనసంపాదనకు విదేశీ అవకాశాలను ఎంచుకుంటున్నారు. మెరుగైన జీవితం కోసం అలా చేయడం వారికి సహజమే కావచ్చు. కానీ అలా మాతృదేశం వదిలి వచ్చినందుకు చాలామందిని అపరాధభావన ఇంకా వెంటాడుతూనే ఉంది. మోదీ కార్యక్రమాల వంటి వేడుకకు హాజరు కావడం అనేది వీరిలోని జాతీయభావానికి మరింతగా రెక్కలు తొడుగుతుంది. అది తాము భారత్‌ను నేటికీ బలపరుస్తున్నామన్న సంతృప్తిని వారికిస్తుంది. అదే సమయంలో తాము భారత్‌ను వదిలిపెట్టి వచ్చామని మనసులో ఎక్కడో దాగి ఉన్న మనోభావాన్ని కాస్త ఉపశమింప జేస్తుంది కూడా.
మోదీ సమావేశాలకు హాజరు కావడంలో మూడవ ప్రేరణ ఏమిటంటే ఆత్మన్యూనతా భావం. అంత పెద్ద సంఖ్యలో ఒకచోట చేరడం వల్ల, తాము వాస్తవంగా జీవిస్తున్న దానికంటే మరింత ప్రాధాన్యత ఏదో తమకుందన్న అనుభూతిని వారికి కలిగిస్తుంటుంది. వలస వచ్చిన తోటి భారతీయులను ఇంత పెద్ద కార్యక్రమంలో కలుసుకోవడం అనేది తామంతా ఒకటి అనే ఉమ్మడి భావనను కలిగిస్తుంది. పైగా ప్రవాస భారతీయులలో చాలామంది తమకు నీడనిస్తున్న దేశంతో ప్రత్యేకించి సాంస్కృతిక పార్శ్వంలో ఇప్పటికీ పూర్తిగా మిళితం కాలేకపోతున్నారు.
ఉదాహరణకు పటేళ్లను తీసుకోండి. పటేల్ ఎందుకు మోటల్ (హోటల్) బిజినెస్‌ను ఎంచుకుంటుంటాడు? ప్రత్యేకించి మోటల్ రంగంలో పటేల్ సాధించిన ఈ ఘనవిజయాన్ని మనం గొప్పగా చెప్పుకుంటుంటాము. కానీ ఈ రంగాన్నే అతడు ఎందుకు ఎంచుకున్నాడనే విషయంలో అంత స్పష్టమైన విశ్లేషణ జరగటం లేదు.
నా బంధువులు అనేకమంది మోటల్ రంగంలో పనిచేస్తున్నారు. ఈ అంశంపై వారు కాస్త సాధికారతతో మాట్లాడగలరు కూడా. వాస్తవానికి, అమెరికాలో మోటళ్లను నడపటం వల్ల పటేళ్లకు క్యాష్ కౌంటర్ వద్ద తప్పితే అమెరికన్లతో పెద్దగా వ్యవహరించవలసిన అవసరం ఉండదు. అతడి వెనుక వంటశాలలో మజ్జిగ పులుసును చేస్తుంటారు. విశ్రాంతి గదిలోని టీవీలో రామాయణం సీరియల్ వస్తుంటుంది. అమెరికాలోనూ పటేళ్లు నిలుపుకుంటూ వస్తున్న భారతీయ సంస్కృతి ఇదే.
విదేశాల్లోని గుజరాతీయులు పరస్పరం కలిసి ఉంటారు. వీళ్లకు స్థానిక అమెరికన్లతో స్నేహం కూడా తక్కువగానే ఉంటుంది. పండుగలు, తదితర సంద ర్భాల్లో తోటి పటేళ్లను కలుసుకోవటం వారికి అమితానందం కలిగిస్తుంటుంది. అలాగే ఆలయాలు నిర్మించడానికి స్వదేశానికి తిరిగి రావటం, తమ ఆధ్యాత్మిక గురువులను కలుసుకోవడం కూడా వారికి పరమ సంతోషాన్ని కలిగిస్తుంటుంది. ఇతర కమ్యూనిటీల విషయంలో కూడా ఇది నిజం. అత్యంత అధిక బల ప్రదర్శనతో మోదీ వంటి వారితో వారు జరిపే సమావేశాలు తమవారిని ఆకర్షించే సహజ స్థలాలుగా ఉంటాయి మరి.
అయితే ఇలాంటి సమావేశాల్లో వ్యక్తమవుతున్న అపార శక్తి ప్రదర్శన ఫలితం ఎలాంటిది? సమాధానం ఏమిటంటే పెద్దగా ఫలితం ఉండదనే. సంగీత కచ్చేరి లేదా ప్రదర్శన ముగియగానే రాక్‌స్టార్ అక్కడినుంచి నిష్ర్కమించే విధంగానే, మోదీ వంటి వారి సమావేశాలకు హాజరవుతున్న వారు కూడా అవి ముగిసిన మరుక్షణం తమ అర్థాన్ని, ఐక్యతను కోల్పోతుంటారు. మోదీతో భారీ జన సందోహం, విదేశీ భారతీయుల అట్టహాసం వంటి వాటి వెనుక ఉన్న తమాషా వెనుక ఉన్న వాస్తవం ఏమిటంటే అవి కేవలం వినోదప్రాయం మాత్రమే.
- ఆకార్ పటేల్
(వ్యాసకర్త కాలమిస్టు, రచయిత) aakar.patel@icloud.com