
ఈ ట్విట్టర్ ఫత్వాలు చట్టబద్ధమేనా?
అవలోకనం
నియమ నిబంధనలతో మన జాతి పనిచేయదని, యథేచ్చగా నిర్ణయాలు తీసుకుం టుంటారనే అనుమానాలు ఇప్పటికే ఉన్నాయి. అమెజాన్ అధికారులు చట్ట బద్ధంగా వీసాలను పొంది ఉంటే, వాటిని రద్దుచేస్తానని సుష్మ ఎలా అనగలరు?
ప్రపంచంలో అతి పెద్ద ఆన్‌లైన్ రిటైల్ సంస్థ అమెజాన్‌ను లొంగ దీసిన తర్వాత భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ మన జాతీయ గౌరవాన్ని స్పష్టంగానే పునఃస్థాపించినట్లుంది. భారత జాతీయ పతాక రంగులను పోలి ఉన్న కాళ్లు తుడుచుకునే డోర్‌మ్యాట్లను అమ్ముతున్న అమెజాన్ కెనడా ఆన్‌లైన్ స్టోర్ స్క్రీన్ షాట్‌ను జనవరి 11న ఒక భారతీయుడు సుష్మకు పంపుతూ ట్వీట్ చేశారు. ‘మేడమ్, అమెజాన్‌కు చీవాట్లు పెట్టండి. భారత జాతీయ పతాకతో కూడిన డోర్ మ్యాట్లను అమ్మవద్దని హెచ్చరించండి. దయచేసి చర్య తీసుకోండి’ అని ఆ వ్యక్తి సుష్మకు సూచించారు.
ఆ ప్రకారమే సుష్మ మూడు ట్వీట్లను సంధించారు. జనవరి 11 ఉదయం 5.43 గంటలకు తొలి ట్వీట్‌ను పంపారు. ‘కెనడాలోని ఇండియన్ హైకమిషన్ : ఇది ఏమాత్రం ఆమోదనీయం కాదు. అత్యున్నత స్థాయిలో అమెజాన్ దృష్టికి దీన్ని తీసుకెళ్లండి’. ఈ ఘటన తదుపరి పరిణామాల తీవ్రత నేపథ్యంలో సుష్మ ఆరోజు ఉదయం 6.41 గంటలకు రెండో ట్వీట్ చేశారు. ‘అమెజాన్ బేష రతుగా క్షమాపణ చెప్పాలి. మన జాతీయ పతాకను అవ మానిస్తున్న అన్ని ఉత్పత్తులను వెంటనే ఉపసంహరిం చుకోవాలి’. రెండు నిమిషాల తర్వాత మంత్రి మరో ట్వీట్ ద్వారా అమెజాన్‌కు హెచ్చరిక పంపారు. ‘తక్షణమే అలా చేయనట్లయితే, ఏ అమెజాన్ అధికారికీ మేము భారతీయ వీసాను మంజూరు చేయబోము. ఇంతకుముందే జారీ చేసిన వీసాలను కూడా రద్దు చేస్తాము’.
ఆ డోర్ మ్యాట్ల తయారీదారుకు భారతీయ సంస్కృ తితో పెద్దగా పరిచయం లేదు. పాశ్చాత్య డోర్‌మ్యాట్లపై సుస్వాగతం వంటి అక్షరాలను ముద్రిస్తుంటారు. ఇలాంటి వాటిపై ఎలాంటి సాంస్కృతిక పరమైన దూషణలూ ఉండవు కనుక వాటిపై అడుగుపెట్టడం చక్కగా ఉంటుంది. అయితే ఈ డోర్‌మ్యాట్లపై ఏదో ఒక జాతీయ పతాక రంగులను ముద్రిస్తుంటారు. చాలామంది ప్రజలు తమ జాతీయ జెండా రంగులను ముద్రించిన డోర్ మ్యాట్లను కొనుగోలు చేస్తూ తమ అభిమానాన్ని చూపి స్తుంటారు. కానీ భారత్‌లో లేక దక్షిణాసియాలో పాదా లను మురికితో కూడినవిగా భావిస్తుంటారు కాబట్టి డోర్ మ్యాట్లను ఇక్కడ మరొక దృష్టితో చూస్తుంటారు.
అమెజాన్ కెనడా విభాగం వెంటనే చర్యతీసుకుని ఆ డోర్ మ్యాట్లను అమ్ముతున్న విక్రేతకు చెందిన లింకును వెబ్‌సైట్ నుంచి వెనక్కు తీసుకుంది. సుష్మ తీసుకున్న చర్యలను ట్వీటర్ వ్యాఖ్యల్లో మెజారిటీ బలపర్చాయి. ఎందుకంటే జాతీయ గౌరవం భారత్‌లో బలంగా పని చేస్తుంటుంది. అయితే కొంతమంది మాత్రం సుష్మ మరీ అతిగా వ్యవహరించారని వ్యాఖ్యానించారు. వీరి ఉద్దే శ్యంలో భారతీయ ఆత్మగౌరవం, జాతీయ గౌరవం అనేవి డోర్‌మ్యాట్ల అమ్మకాలతోనే దెబ్బ తినేంత బలహీనంగా ఉండవు. రెండోది. అమెజాన్ సంస్థ భారత్‌లో బిలియన్ల కొద్దీ డాలర్లను మదుపు చేసింది కాబట్టి దానిపట్ల మరింత గౌరవంతో వ్యవహరించాల్సి ఉంది.
అయితే నావరకూ వ్యక్తి అయినా, సంస్థ అయినా పెద్ద తేడా ఉండదు. భారత ప్రభుత్వం అన్నిటినీ సమాన దృష్టితోటే చూడాలి. భారత్‌లో నియమ నిబంధనలను బట్టి కాకుండా యథేచ్చగా నిర్ణయాలు తీసుకుంటుంటా రనే అనుమానాలున్నాయి. అమెజాన్ అధికారులు సరైన దరఖాస్తుఫారంతో తమ వీసాలను పొంది ఉంటే, వాటిని రద్దుచేస్తానని సుష్మ ఏ చట్టం కింద హెచ్చరిస్తారు? నేరం జరిగిందని భావిస్తున్నట్లయితే, చట్టానికి విధేయురాలైన వ్యక్తిగా ఆమె మొదట ఎఫ్‌ఐఆర్ లేదా ఫిర్యాదును నమోదు చేయాలి. దానికి బదులుగా ఆమె ఒక నియం తలా ట్వీటర్ ఫత్వాను జారీ చేసేశారు.
అమెజాన్ ఒక గ్లోబల్ మార్కెట్ స్థలం లాంటిది. ఒకవేళ ఎవరో ఒకరి దేవుడిని, గురువును, ప్రవక్తను అవమానించిన ఘటనే జరిగి ఉందనుకోండి. డోర్ మ్యాట్ ఉత్పత్తిని తొలగించడం ద్వారా అది మార్పు చెందుతుం దని నేనయితే హామీ ఇవ్వలేను. నిజానికి, భారతీయ పతాకను కలిగిన షూలను కూడా అమ్ముతున్నారని మరు సటి దినం వార్తలు వచ్చాయి.
మూక జాతీయ వాదం నుంచి పుట్టుకొచ్చే ఈరక మైన ఆగ్రహం మన నాయకులకు సహజ లక్షణం. గత సంవత్సరం కూడా ఇదే సమయంలో మనం జాతీయ వాదం గురించి చర్చించుకున్నాం. 2016 ఫిబ్రవరిలో ఢిల్లీ లోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు చేసిన నినాదాలతో సమస్య తలెత్తింది. లోక్‌సభలో దీనిపై మూడు రోజులపాటు చర్చ జరిగింది. కేంద్ర విద్యా మంత్రి భావోద్వేగంతో తన తలను తానే కోసుకుంటానని బెదిరించే స్థాయికి వెళ్లిపోయారు. ఆ నినాదాల ఘటన వెనుక లష్కరే తోయిబా ఉన్నట్లు హోంమంత్రి పేర్కొ న్నారు. ప్రధాని స్వయంగా ఈ చర్చలో పాల్గొని సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. సత్యమే జయిస్తుంది అని దానర్థం. నేరారోపణకు గురైన యువకులు అరెస్టయ్యారు. వీరిలో ఒకరిని కస్టడీలో ఉండగానే చితకబాదారు.
ఈ మొత్తం డ్రామా పూర్తయ్యాక, అంతిమ ఫలితం ఏమిటి? బీజేపీ ప్రభుత్వం ఈ ఘటనపై చార్జిషీట్ కూడా సమర్పించలేకపోయింది. వంచనాత్మకమైన జాతీయ వాదం, భావోద్వేగంతో ఉన్నప్పటికీ ఈ అసంబద్దమైన, అవాస్తవమైన జాతీయవాద చ్ఛాయలను సుష్మాస్వరాజ్ మళ్లీ ఇప్పుడు ప్రదర్శించారు. నిజంగానే ఇది జాతి సమ యాన్ని, శక్తిని వృథా పర్చే విషయం. మంత్రులు ప్రత్యే కించి అతి పెద్ద బాధ్యతలను మోస్తున్నవారు ఇలాంటి సర్కస్‌లో పాలు పంచుకోకుంటేనే బాగుంటుంది.
ఆకార్ పటేల్
ఈమెయిల్: aakar.patel@icloud.com