జైపూర్ : అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలన్న ఓ యువతి కల ఎట్టకేలకు నెరవేరింది. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ జోక్యంతో దిగొచ్చిన అమెరికా రాయబార కార్యాలయం ఆ యువతికి వీసా మంజూరు చేసింది.
జలల్‌పూర్ గ్రామానికి చెందిన భానుప్రియ హరిట్‌వాల్ 2015- పదో తరగతి పరీక్షల్లో స్టేట్ ర్యాంకర్. భాను తండ్రి సోహన్ లాల్ ఓ ప్రైవేట్ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తున్నాడు. హిందీ మాధ్యమంలోనే ఆమె ఈ ఘనత సాధించటం విశేషం. దీంతో రాజస్థాన్ ప్రభుత్వం భానుతోసహా టాప్‌లో నిలిచిన ముగ్గురు విద్యార్థులకు కోటి రూపాయల స్కాలర్ షిప్ ప్రకటించింది.
ఇటీవలె 12వ తరగతి పూర్తి చేసిన భానుప్రియ కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించేందుకు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఉత్తీర్ణ పరీక్షల్లో(SAT మరియు IELTS) మంచి స్కోర్‌తోపాటు స్కాలర్ షిప్‌కు అర్హత కూడా సాధించింది. కానీ, ఆమె వీసా దరఖాస్తును మాత్రం యూఎస్ ఎంబసీ రెండుసార్లు తిరస్కరించింది. దీంతో ఆమె తండ్రితో కలిసి సికర్ నియోజకవర్గ ఎంపీ స్వామి సుమేధానంద్ ను ఆశ్రయించింది.
ఆయన భానుప్రియను వెంటపెట్టుకుని కొద్దిరోజుల క్రితం సుష్మా దగ్గరకు తీసుకెళ్లి మొత్తం వివరించారు. ప్రతిభ ఉన్న విద్యార్థిని కావటంతో సుష్మా సానుకూలంగా స్పందించారు. వెంటనే అమెరికా రాయబార కార్యాలయం అధికారులతో సుష్మా ఫోన్‌లో మాట్లాడారు. భానుప్రియకు శుక్రవారం వీసా మంజూరు అయినట్లు విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. మరోవైపు సుష్మాకు, ఎంపీ సుమేధానంద్‌కు భాను కుటుంబం కృతజ్ఞతలు తెలియజేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment