ఉన్మాదానికి విరుగుడు ఉపేక్షించడమే
అవలోకనం
భారత జాతీయ ప్రయోజనాల సంరక్షకులం మనమేనన్నట్టుగా మీడియాలో చాలా మందిమి నటిస్తుంటాం. కానీ రేటింగ్‌లకు మించిన ప్రయోజనాలేవీ మీడియాకు లేవు. మన యాంకర్‌లు ప్రదర్శించే ఆగ్రహావేశంలో చాలా వరకు ప్రేక్షకులు, దేశం కోరుకుంటున్నది అదేనని నమ్మడం వల్ల కలిగేదే. దేశం యుద్ధానికి దిగడం గురించి చర్చిస్తున్న సమయంలోనే, సమాజంలో పేరున్న ఒకరు తన కుమార్తెను హత్యగావించడానికి కూడా మీడియా అంతే ప్రాధాన్యం ఇస్తుంది. మీడియా వాళ్లు తమను తామే అంతగా పట్టించుకోరు. కాబట్టి ప్రభుత్వమూ పట్టించుకోకూడదు.
ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌తో భారత్ ఉద్దేశపూర్వకంగానే మెతకగా ఉంటోందని నమ్మేవారు చాలా కాలంగా ఉన్నారు. మన దేశంపై ఉగ్రవాద దాడి జరిగినప్పుడు హింసాత్మకంగా ప్రతిస్పందించాలని వారి అభిప్రాయం. ముంబై దాడులలోవలే పాకిస్తానీల ప్రమేయం ఉన్నదని ప్రత్యక్షంగా వెల్లడైన సందర్భా లలో కూడా భారత్ ప్రతి చర్యకు పాల్పడలేదు. నేను ప్రస్తావిస్తున్న ఈ బృందం దృష్టిలో అది తప్పు. ఆ దాడితో సంబంధం ఉన్న తమ పౌరులను పాక్ విచారిం చడం సరిపోదని, భారత్ ఇంకా ఎక్కువ చేయాలని వారి ఆలోచన.
మన ప్రభుత్వ క్రియారాహిత్యం ఉద్దేశపూర్వకమైనదని, పిరికితనమని, ప్రతీకారం తీర్చుకోవడానికి అవకాశం ఉన్నదని వారి భావన. భారత్‌లో ఉగ్రవాద దాడులు జరుగుతున్నా యుద్ధానికి దిగరాదనే ఈ విధానాన్ని ‘వ్యూహాత్మక సంయమనం’ అంటారు. సంక్షోభాన్ని విషమింపజేయరాదని భావించడం ద్వారా భారత్ ఉద్దేశపూర్వకంగా తన ఆగ్రహాన్ని దిగుకుంటోందని ఈ సిద్ధాంతం చెబు తుంది. లాభనష్టాలను బేరీజు వేసి చూస్తే తేలే నిర్ధారణలు యుద్ధానికి అను కూలంగా లేకపోవడమే అందుకు కారణం. 2001లో జైషే మొహమ్మద్ పార్లమెం టుపై దాడికి పాల్పడినప్పుడు అటల్ బిహారీ వాజ్‌పేయి, 2008లో లష్కరే తోయిబా ముంబై దాడులకు బరి తెగించినప్పుడు మన్మోహన్‌సింగ్ ఈ మార్గం వైపే మొగ్గు చూపారు.
ప్రధాని నరేంద్ర మోదీ చాలాకాలంగా ఏదో ఒకటి చేసి తీరాలనే ఈ బృందంలో ఒకరుగా ఉన్నారు. ఉడీ దాడి తదుపరి, తిప్పికొడతామన్న తన మునుపటి వాగ్దానాలకు ఆయన దూరంగా జరిగినట్టు లేదా తాను చేసి చూపుతానన్న క్రియాత్మక ప్రతిస్పందనకు తటపటాయిస్తున్నట్టు కనిపిస్తున్నారు. ఇందుకు చాలానే కారణాలు ఉండవచ్చు. ప్రధాని బాధ్యతలను స్వీకరించిన తర్వాత మునుపు తనకు తెలియని ఎన్నో విషయాలను ఆయన నేర్చుకుని ఉండటం అందుకు కారణం కావచ్చు. కారణం ఏదైనా, ఆయన తన మద్దతుదార్ల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు. నిజానికి వారి దృష్టిలో మోదీ అత్యంత గౌరవనీయుడు. అయితే పాక్ సమస్యతో సతమతమయ్యే నేటి రోజులు అందుకు భిన్నమైనవి. విమర్శనాత్మక వ్యాఖ్యలు చేస్తున్నవారు మోదీ తన వాగ్దానాలను నెరవేర్చడం లేదని భావిస్తున్నారు. ఆయన ఏం చేయాలి?
ప్రధానిగా మోదీకి ఉన్న సమాచారం ఈ విషయంపై వ్యాఖ్యానాలు చేస్తున్న వారి వద్ద లేదు. సాయుధ దళాలు, జాతీయ భద్రతా సలహాదారు, ఆర్థిక మంత్రి త్వశాఖల నివేదికలు ఆయన వద్ద ఉన్నాయి. అలాగే ఈ సంఘర్షణ యుద్ధంగా విస్తరిస్తే విదేశాల్లో కలిగే ప్రభావం ఎలా ఉంటుందనే దానిపై విదేశాంగ శాఖ నివేదిక, అది దేశంలో అంతర్గతంగా కలుగజేసే ప్రభావం గురించిన హోంశాఖ, గూఢచార వ్యవస్థల నివేదికలు కూడా ఆయన వద్ద ఉన్నాయి. భారత్‌కు ఎంచు కోడానికి అందుబాటులో ఉన్న అవకాశాలు ఏమిటనే దానికి సంబంధించిన అత్యు న్నత స్థాయి వివరాలను తెలుసుకునే అవకాశం అతి కొద్ది మందికే ఉంటుంది.
వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకుని మోదీ చేయాల్సిన పని ఒక్కటే... మీడియాను పట్టించుకోవడం మానే యడమే. నేను ముందే చెప్పినట్టు ఆయనకు ఉన్న సమాచారం దానికి లేదు. అయినా, ఆయనకు సలహాలు ఇవ్వకుండా, దిశా నిర్దేశన చేయకుండా... చెప్పినట్టు చేయకుంటే దుమ్మెత్తి పోయకుండా మనల్ని ఆపగలిగే దేమీ లేదు. భారత జాతీయ ప్రయోజనాల సంరక్షకులం మనమేనన్న ట్టుగా మనలో చాలా మందిమి నటిస్తుంటాం. కానీ రేటింగ్‌లకు మించిన ఉన్నత ప్రయోజనాలేవీ మీడియాకు లేవు. మనం అందుకు భిన్నంగా చెప్పుకున్నా నిజం మాత్రం అదే. మన యాంకర్‌లు ప్రదర్శించే ఆగ్రహావేశంలో చాలా వరకు ప్రేక్ష కులు, వారికి కొనసాగింపుగా దేశమూ కోరుకుంటున్నది అదేనని నమ్మడం వల్ల కలిగేదే. అది చాలా అర్థవంతమైనదే అయినా... దేశం యుద్ధానికి దిగడమనే అంశాన్ని గురించి చర్చిస్తున్న సమయంలోనే, సమాజంలోని ఒక ప్రముఖ వ్యక్తి తన కుమార్తెను హతమార్చిన ఘటనకు కూడా మీడియా అంత ప్రాధాన్యం ఇస్తుంది. మీడియా వాళ్లు తమను తామే అంతగా పట్టించుకోరు. కాబట్టి ప్రభుత్వం కచ్చితంగా పట్టించుకోకూడదు.
ఇక మోదీ చక్కగా విస్మరించగలిగిన రెండో అంశం, సామాజిక మాధ్యమాల్లో ఏం జరుగుతోందనేది. సామాజిక మాధ్యమాలకు సంబంధించి మోదీ ఒక చాంపియన్. ఆయనకు రెండు కోట్ల మంది ట్విటర్ ఫాలోయర్లున్నారు. దాన్ని ఆయన అద్భుతంగా ఉపయోగించుకున్నారు. సంప్రదాయక మీడియాకు తన పట్ల ఉన్న లేదా ఉన్నదనుకున్న పక్షపాత వైఖరిని తలకిందులు చేయడానికి సోషల్ మీడియా తోడ్పడిందని నిజంగానే ఆయన విశ్వసిస్తున్నారు. అయినా, ఆయన తన అనుయాయుల నుంచి ఆగ్రహాన్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. ఆయనను యుద్ధానికి దిగమని ముల్లుగర్రతో పొడిచినట్టు... ఒకప్పటి కటువైన ప్రకటనల లింకులను వారు పోస్ట్ చేస్తున్నారు.
ఉడీ దాడిపై తొలి స్పందన తదుపరి మోదీ రెండు లేదా మూడు రోజుల పాటూ ట్వీటింగ్ చేయకుండా గడిపేశారు. ఇలాంటి సమయాల్లో ఆయన ఇంకా ఎక్కువ సమయం కూడా దానికి దూరంగా ఉండగలగాలి. ఎట్టకేలకు ఈ దుమారం ఎలాగూ సద్దుమణిగి పోయేదే. కాబట్టి సామాజికమాధ్యమాల నుంచి, మీడియా నుంచి అందే అరకొర సమాచారంతో ఒక తీవ్ర చర్యను పరిగణనలోకి తీసుకోవడం తెలివితక్కువ పని అవుతుంది. నేను పని చేసిన ఒక వార్తా సంస్థ కొన్ని వారాల క్రితం నన్ను ‘దేశ వ్యతిరేకి’ అని ఆరోపించింది. ఉడీ ఉగ్రదాడి జరిగేసరికి నేను విదేశాల్లో ఉన్నాను. చానళ్లు అత్యుగ్ర రూపం దాల్చిన తొలి రెండు రోజులను నేను చూడలేకపోయాను. మా నాన్న నా గురించి ఆందోళన చెంది, ఫోన్‌లో అది వ్యక్తం చేశారు. వాస్తవం, టీవీ సెట్లో జరిగేదానికి భిన్నమైనదని నేనాయనకు చెప్పాను. స్విచ్ ఆఫ్ చేస్తే సరి, అదే పోతుంది. మోదీకైనా నేను చెప్పేది అదే.
ఆకార్ పటేల్,
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com