న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల మోదీ పాలన అత్యంత వినాశకరంగా, బాధాకరంగా సాగిందని విమర్శించారు. ప్రజాస్వామ్య సంస్థలతో పాటు యువత, రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మోదీకి అనుకూలంగా ఎలాంటి ఊపులేదన్న మన్మోహన్, ఆయన్ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. ఈ విషయంలో ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన మన్మోహన్, ఆర్థిక వ్యవస్థతో పాటు పెద్దనోట్ల రద్దు, ఉగ్రదాడులు సహా పలు అంశాలపై ముచ్చటించారు.
నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం..
ఎన్డీయే పాలనలో అవినీతి పతాక స్థాయికి చేరిందని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ‘పెద్దనోట్ల రద్దు స్వతంత్ర భారత చరిత్రలోనే పెద్ద కుంభకోణంగా నిలిచింది. నోట్లరద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాగా, సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. అచ్ఛే దిన్(మంచి రోజులు) తీసుకొస్తామని వారు అధికారంలోకి వచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ భవిష్యత్ భారత్ సురక్షితంగా ఉండేందుకు బీజేపీని తిరస్కరించాలని ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని మన్మోహన్ విమర్శించారు.
విదేశీ విధానంలో అస్థిరత..
ఈ సందర్భంగా ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని మన్మోహన్ తప్పుపట్టారు. ‘మన విదేశాంగ విధానం ఇప్పటివరకూ దేశ ప్రయోజనమే పరమావధిగా సాగింది తప్ప నేతల వ్యక్తిత్వ నిర్మాణం, పేరు–ప్రఖ్యాతుల కోసం జరగలేదు. ఇతర దేశాలతో సున్నితత్వం, నిగ్రహం పాటించడం, వారి ఆందోళనను అర్థం చేసుకోవడం, అంతిమంగా భారత ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేయడం విదేశాంగ విధానంలో భాగం. దురదృష్టవశాత్తూ ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇవే అదృశ్యమయ్యాయి. పాక్‌తో భారత విదేశాంగ విధానాన్నే చూసుకుంటే స్థిరమైన ఆలోచన, వ్యూహం అన్నది లోపించింది. ఆహ్వానం లేకుండానే పాకిస్తాన్‌కు వెళ్లడం, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు పాక్ నిఘాసంస్థ ఐఎస్‌ఐ ప్రతినిధుల్ని ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం’ అని దుయ్యబట్టారు.
ఉగ్రదాడులు అమాంతం పెరిగాయి..
ఐదేళ్లలో ఉగ్రదాడులు తగ్గిపోయాయన్న ప్రధాని వ్యాఖ్యలను మన్మోహన్ ఖండించారు. ‘ఓ అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. ఐదేళ్లలో ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి. ఒక్క జమ్మూకశ్మీర్‌లోనే ఉగ్రదాడులు 176 శాతానికి చేరుకున్నాయి. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు వెయ్యింతలు దాటాయి. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సమయంలో ప్రధాని మోదీ భద్రతా కేబినెట్ కమిటీతో అత్యవసర భేటీ నిర్వహించకుండా జిమ్‌కార్బెట్ జాతీయ పార్కులో సినిమా షూటింగుల్లో గడపడం దురదృష్టకరం. జాతీయభద్రత విషయంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’ అని విమర్శించారు.
మోదీకి దార్శనికత లేదు..
మోదీకి ‘ఆర్థిక దార్శనికత’ ఏమాత్రం లేదని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘మోదీ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్యకాలంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికి పడిపోయింది. ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం అతిగా నియంత్రిస్తోంది. ఆర్థిక విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి’ అని తెలిపారు.
జీఎస్టీ 2.0 తెస్తాం..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తుసేవల పన్ను చట్టాన్ని(జీఎస్టీ) సమీక్షిస్తామని మన్మోహన్ తెలిపారు. ‘ఎన్డీయే తెచ్చిన జీఎస్టీ చట్టాన్ని సమీక్షించి దాని స్థానంలో జీఎస్టీ 2.0(కొత్త చట్టం) తీసుకొస్తామని తెలిపారు. కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్) వల్ల మధ్యతరగతి ప్రజలకు అదనపు పన్నుభారం పడబోదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు.
మోదీని సాగనంపే సమయం
Published Mon, May 6 2019 4:13 AM | Last Updated on Mon, May 6 2019 4:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment