Cancellation of big banknotes
-
మోదీని సాగనంపే సమయం
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పాలనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదేళ్ల మోదీ పాలన అత్యంత వినాశకరంగా, బాధాకరంగా సాగిందని విమర్శించారు. ప్రజాస్వామ్య సంస్థలతో పాటు యువత, రైతులు, వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో మోదీకి అనుకూలంగా ఎలాంటి ఊపులేదన్న మన్మోహన్, ఆయన్ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమయిందన్నారు. ఈ విషయంలో ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయం తీసేసుకున్నారని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో ఆదివారం పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చిన మన్మోహన్, ఆర్థిక వ్యవస్థతో పాటు పెద్దనోట్ల రద్దు, ఉగ్రదాడులు సహా పలు అంశాలపై ముచ్చటించారు. నోట్ల రద్దు అతిపెద్ద కుంభకోణం.. ఎన్డీయే పాలనలో అవినీతి పతాక స్థాయికి చేరిందని మన్మోహన్ సింగ్ విమర్శించారు. ‘పెద్దనోట్ల రద్దు స్వతంత్ర భారత చరిత్రలోనే పెద్ద కుంభకోణంగా నిలిచింది. నోట్లరద్దుతో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాగా, సంఘటిత, అసంఘటిత రంగాల్లో కోట్లాది మంది ఉపాధి కోల్పోయారు. అచ్ఛే దిన్(మంచి రోజులు) తీసుకొస్తామని వారు అధికారంలోకి వచ్చారు. ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా పబ్బం గడుపుకోవడానికి, రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇచ్చారు. కానీ భవిష్యత్ భారత్ సురక్షితంగా ఉండేందుకు బీజేపీని తిరస్కరించాలని ప్రజలంతా ఇప్పటికే నిర్ణయించుకున్నారు’ అని మన్మోహన్ విమర్శించారు. విదేశీ విధానంలో అస్థిరత.. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానాన్ని మన్మోహన్ తప్పుపట్టారు. ‘మన విదేశాంగ విధానం ఇప్పటివరకూ దేశ ప్రయోజనమే పరమావధిగా సాగింది తప్ప నేతల వ్యక్తిత్వ నిర్మాణం, పేరు–ప్రఖ్యాతుల కోసం జరగలేదు. ఇతర దేశాలతో సున్నితత్వం, నిగ్రహం పాటించడం, వారి ఆందోళనను అర్థం చేసుకోవడం, అంతిమంగా భారత ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేయడం విదేశాంగ విధానంలో భాగం. దురదృష్టవశాత్తూ ఎన్డీయే ప్రభుత్వ విదేశాంగ విధానంలో ఇవే అదృశ్యమయ్యాయి. పాక్‌తో భారత విదేశాంగ విధానాన్నే చూసుకుంటే స్థిరమైన ఆలోచన, వ్యూహం అన్నది లోపించింది. ఆహ్వానం లేకుండానే పాకిస్తాన్‌కు వెళ్లడం, పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌కు పాక్ నిఘాసంస్థ ఐఎస్ఐ ప్రతినిధుల్ని ఆహ్వానించడం ఇందుకు నిదర్శనం’ అని దుయ్యబట్టారు. ఉగ్రదాడులు అమాంతం పెరిగాయి.. ఐదేళ్లలో ఉగ్రదాడులు తగ్గిపోయాయన్న ప్రధాని వ్యాఖ్యలను మన్మోహన్ ఖండించారు. ‘ఓ అబద్ధాన్ని 100 సార్లు చెప్పినంత మాత్రాన అది నిజమైపోదు. ఐదేళ్లలో ఉగ్రవాద దాడులు భారీగా పెరిగాయి. ఒక్క జమ్మూకశ్మీర్లోనే ఉగ్రదాడులు 176 శాతానికి చేరుకున్నాయి. పాక్ కాల్పుల విరమణ ఉల్లంఘనలు వెయ్యింతలు దాటాయి. పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సమయంలో ప్రధాని మోదీ భద్రతా కేబినెట్ కమిటీతో అత్యవసర భేటీ నిర్వహించకుండా జిమ్‌కార్బెట్ జాతీయ పార్కులో సినిమా షూటింగుల్లో గడపడం దురదృష్టకరం. జాతీయభద్రత విషయంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది’ అని విమర్శించారు. మోదీకి దార్శనికత లేదు.. మోదీకి ‘ఆర్థిక దార్శనికత’ ఏమాత్రం లేదని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యానించారు. ‘మోదీ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఇబ్బందుల్లో చిక్కుకుంది. ఈ ఏడాది జనవరి–ఏప్రిల్ మధ్యకాలంలో జీడీపీ వృద్ధిరేటు 6.5 శాతానికి పడిపోయింది. ఆర్థిక వ్యవస్థను ప్రభుత్వం అతిగా నియంత్రిస్తోంది. ఆర్థిక విధానాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటున్నాయి’ అని తెలిపారు. జీఎస్టీ 2.0 తెస్తాం.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వస్తుసేవల పన్ను చట్టాన్ని(జీఎస్టీ) సమీక్షిస్తామని మన్మోహన్ తెలిపారు. ‘ఎన్డీయే తెచ్చిన జీఎస్టీ చట్టాన్ని సమీక్షించి దాని స్థానంలో జీఎస్టీ 2.0(కొత్త చట్టం) తీసుకొస్తామని తెలిపారు. కనీస ఆదాయ భద్రత పథకం (న్యాయ్) వల్ల మధ్యతరగతి ప్రజలకు అదనపు పన్నుభారం పడబోదని మన్మోహన్ సింగ్ స్పష్టం చేశారు. -
‘ముసద్దిలాల్’పై మనీలాండరింగ్ కేసు
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు సమయంలో నల్లధనాన్ని మార్చుకునేందుకు బోగస్ విక్రయాలకు పాల్పడిన కేసులో ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝళిపించింది. ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) పోలీ సులు మొత్తం రూ. 110.85 కోట్ల గోల్‌మాల్‌కు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేయగా తాజా గా ఈడీ మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసింది. ముసద్దీలాల్‌తోపాటు దాని అనుబంధ సంస్థలు, కుంభకోణంతో ప్రమేయమున్న సంస్థలు, కైలాష్ గుప్తా సహా కొందరు యజమానుల ఇళ్లపై బుధ, గురువారాల్లో వరుస దాడులు చేసింది. ఈ సోదాల్లో లభించిన రూ. 82.11 కోట్ల విలువైన 145.89 కేజీల బంగారాన్ని సీజ్ చేసినట్లు ఈడీ అధికారులు గురువారం వెల్లడించారు. ఈ కేసులో తమ దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. ఐటీశాఖ ఫిర్యాదుతో బయటపడ్డ స్కాం 2016 నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు ప్రకటన వెలువడగా ముసద్దిలాల్ యాజమాన్యం తమ వద్ద ఉన్న నల్లధనాన్ని మార్చుకోవడానికి భారీ కుట్ర చేసింది. తమ ప్రధాన సంస్థ ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థలు ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, వైష్ణవి బులియన్ ప్రైవేట్ లిమిటెడ్‌ల కేంద్రంగా ‘విక్రయాల’స్కెచ్ రెడీ చేసింది. ఆ రోజు రాత్రి 9 నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య మొత్తం 5,200 మంది వినియోగదారులు రూ. 97.85 కోట్ల విలువైన 340 కేజీల బంగారం ఖరీదు చేసినట్లు బోగస్ అడ్వాన్స్ పేమెంట్ రసీదులు సృష్టించింది. బోగస్ రసీదులతోపాటు కస్టమర్ల వివరాలంటూ కొందరి ఆధార్ కార్డుల నకళ్లను జత చేసింది. వినియోగదారుల పాన్ నంబర్ దాఖలు చేయాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ప్రతి లావాదేవీని రూ. 2 లక్షలలోపు చూపింది. ఆ మొత్తాన్ని హైదరాబాద్ పంజాగుట్టలోని ఎస్బీఐ, బంజారాహిల్స్‌లోని యాక్సెస్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ఈ లావాదేవీలపై అనుమానం వచ్చిన ఆదాయపుపన్నుశాఖ అధికారులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. యాజమాన్యం సమర్పించిన గుర్తింపుపత్రాలకు చెందిన వ్యక్తులను పోలీసులు విచారించగా ఆ రోజు తాము బంగారమేదీ కొనలేదని వారు చెప్పారు. ముసద్దిలాల్ సంస్థల వద్ద ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా నోట్ల రద్దు రోజున కేవలం 67 మంది వినియోగదారులే వచ్చినట్లు వెల్లడైంది. అలాగే బిల్లులన్నీ నోట్ల రద్దు తేదీ తర్వాతే నమోదయ్యాయని పోలీసులు స్వాధీనం చేసుకున్న కంప్యూటర్ను విశ్లేషించి ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించింది. దీంతో సంస్థ మోసం బయటపడింది. అరెస్టును తప్పించుకునేందుకూ ప్రయత్నాలు సీసీఎస్ పోలీసుల దర్యాప్తు నేపథ్యంలో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముసద్దిలాల్ యాజమాన్యం అనేక ప్రయత్నాలు చేసింది. ఏకంగా రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (ఆర్వోసీ) రికార్డుల్నీ తారుమారు చేసింది. ముసద్దిలాల్ సంస్థలకు డైరెక్టర్లుగా కైలాష్ చంద్ గుప్తా, ఆయన కుమారులు నితిన్ గుప్తా, నిఖిల్ గుప్తా, కోడలు నేహాగుప్తా ఉండగా వారి పేర్లు మారుస్తూ రికార్డులు సృష్టించింది. మరోవైపు నల్లధనాన్ని వ్యాపారం రూట్లో డిపాజిట్ చేయడానికి ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాలు సైతం తెరిచింది. ముసద్దిలాల్ సంస్థలు, యాజమాన్యాలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఆయా రోజుల్లో అయిన డిపాజిట్లు, మళ్లింపులపై సీసీఎస్ పోలీసులు దృష్టి పెట్టగా రూ. 80 కోట్ల మేర అష్టలక్ష్మీ గోల్డ్, శ్రీ బాలాజీ గోల్డ్ సంస్థల ఖాతాల్లోకి మళ్లినట్లు తేల్చారు. ఆ డబ్బుతో ఆయా సంస్థల నుంచి హోల్‌సేల్‌గా బంగారం కొన్నట్లు కాగితాల్లో చూపారని నిర్ధారించారు. ఇందుకు సహకరించినందుకు ఆయా వ్యాపారులకు 10 నుంచి 30 శాతం వరకు కమీషన్లు ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి అరెస్టయిన కైలాష్‌చంద్ గుప్తా, ఆయన కుమారులు సహా మొత్తం 10 మంది నిందితులు, ముసద్దిలాల్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్, అనుబంధ సంస్థలపై చార్జిషీట్ దాఖలు చేశారు. దీని ఆధారంగా రంగంలోకి దిగిన ఈడీ... ఈ స్కాంలో లబ్ధి పొందిన డబ్బుతో ముసద్దిలాల్ యాజమాన్యం 270 కేజీల బంగారం ఖరీదు చేసి వ్యాపారం చేసినట్లు తేల్చింది. ఈ నేపథ్యంలోనే బుధ, గురువారాల్లో హైదరాబాద్, విజయవాడల్లో యజమానుల ఇళ్లలో సోదాలు జరిపి భారీగా బంగారం సీజ్ చేసింది. -
రూ. 2,000 నోటుకు కళ్లెం!!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్ల ముద్రణను రిజర్వ్ బ్యాంక్ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. క్రమంగా ఈ నోట్ల చలామణీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పన్నులు ఎగవేసేందుకు, మనీల్యాండరింగ్‌కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వీటి ముద్రణ నిలిచిపోనుందని పేర్కొన్నాయి. అయితే, చలామణీని తగ్గించడమంటే రూ. 2,000 నోట్లు చెల్లకుండా పోవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లు యథాప్రకారం చెల్లుబాటవుతాయని, అయితే వీటిని దశలవారీగా తొలగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి. మరోవైపు, రూ. 2,000 నోట్ల వార్తలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు .. వీటి ముద్రణను ’కనిష్ట’ స్థాయికి తగ్గించినట్లు తెలిపాయి. ముద్రించాల్సిన కరెన్సీ పరిమాణంపై ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధారణమేనని వివరించాయి. చలామణీలో ఉన్న నగదును ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టినప్పుడే క్రమంగా వీటి ముద్రణ తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ‘రూ. 2,000 కరెన్సీ నోట్ల ముద్రణను గణనీయంగా తగ్గించడం జరిగింది. కనిష్ట స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇలాంటివి కొత్తేమీ కాదు’ అని వివరించారు. మొత్తం కరెన్సీలో 37 శాతం నోట్లు.. బ్లాక్‌మనీని కట్టడి చేసే లక్ష్యంతో 2016 నవంబర్‌లో రూ.1,000, రూ. 500 డినామినేషన్ల పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో భారీ స్థాయిలో ఏర్పడిన నగదు కొరతను సత్వరం అధిగమించేందుకు ప్రభుత్వం రూ. 2,000 నోట్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది. ఆర్బీఐ గణాంకాల ప్రకారం 2017 మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న 2,000 నోట్ల సంఖ్య సుమారు 328.5 కోట్లుగా ఉంది. ఏడాది తర్వాత 2018 మార్చి ఆఖరు నాటికి ఇది స్వల్పంగా పెరిగి 336.3 కోట్ల నోట్లకు చేరింది. 2017 మార్చి ఆఖరు నాటికి మొత్తం కరెన్సీ విలువలో రూ. 2,000 నోట్ల వాటా 50.2 శాతంగా ఉండగా.. 2018 మార్చి ఆఖరు నాటికి ఇది 37.3 శాతానికి తగ్గింది. గతేడాది మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ. 18.03 లక్షల కోట్లు కాగా ఇందులో సుమారు 37 శాతం (దాదాపు రూ. 6.73 లక్షల కోట్ల విలువ) రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఉన్నాయి. మరో 43 శాతం (విలువ సుమారు రూ. 7.73 లక్షల కోట్లు) రూ. 500 నోట్లు ఉన్నాయి. మిగతా నోట్లు అంతకన్నా తక్కువ విలువ గలవి. అప్పట్లోనే విమర్శలు.. పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్‌కు ఉపయోగపడుతోందన్న కారణంతో 2016 నవంబర్‌లో రూ.1,000 నోట్లను రద్దు చేసిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల రూపంలో అంతకన్నా అధిక విలువ గల నోట్లను ప్రవేశపెట్టడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. పన్ను ఎగవేతదారులకు, మనీల్యాండరర్స్కు ఈ అధిక విలువ కరెన్సీ నోట్లు మరింత బాగా ఉపయోగపడతాయని, మనీల్యాండరింగ్ లాంటివి అరికట్టడమే తమ ధ్యేయమని చెప్పుకునే కేంద్రం లక్ష్యాల సాధనకు ఇవి ప్రతికూలమని విమర్శలు వెల్లువెత్తాయి. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం కోటక్ మహీంద్రా బ్యాంక్ ఎండీ ఉదయ్ కోటక్ వంటి ప్రముఖులు కూడా దీన్ని ప్రశ్నించిన వారిలో ఉన్నారు. దీనికి తగ్గట్లుగానే గతేడాది పలు నగరాల్లో తీవ్ర స్థాయిలో నగదు కొరత ఏర్పడింది. రాష్ట్రాల్లో ఎన్నికలు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో నీరవ్ మోదీ కుంభకోణం నేపథ్యంలో చాలా మంది ఈ పెద్ద నోట్లను భారీ స్థాయిలో దాచి పెట్టుకుని ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. వీటిని రుజువు చేస్తూ ఆదాయ పన్ను శాఖ సోదాల్లో పలు చోట్ల భారీ ఎత్తున రూ. 2,000 నోట్లు బయటపడ్డాయి. -
ఈ నలుగురిలో వారసుడెవరు?
ఆర్బీఐ గవర్నరు పదవికి ఉర్జిత్ పటేల్ ఆకస్మికంగా రాజీనామా చేయటంతో కీలక పదవికి ఖాళీ ఏర్పడింది. బ్యాంకింగ్ రంగాన్ని నడిపించటమే కాదు... తద్వారా యావత్తు ఆర్థిక వ్యవస్థకూ దిశానిర్దేశం చేసే ఈ కీలక పదవి తదుపరి ఎవరిని వరిస్తుందనే విషయమై జోరుగా ఊహగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికయితే ఆర్బీఐ డెప్యూటీ గవర్నరు ఎన్ఎస్ విశ్వనాథన్, ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌తో పాటు ప్రస్తుత కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్, సెబీ చైర్మన్ అజయ్ త్యాగి పేర్లు వినిపిస్తున్నాయి. విశ్వనాథన్ లేదా సుభాష్ చంద్రగార్గ్? డెప్యూటీ గవర్నర్లను గవర్నర్‌గా నియమించటమనే సంప్రదాయాన్ని చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. ఉర్జిత్ పటేల్ కూడా అలా వచ్చినవారే. రఘురామ్ రాజన్‌కు తదుపరి పొడిగింపు ఇస్తారని అంతా ఊహిస్తున్న సమయంలో కొన్ని అంశాల్లో విభేదాల వల్ల కేంద్రం ఆయనకు మరోసారి పొడగింపు ఇవ్వలేదు. అప్పటికప్పుడు కొత్త గవర్నర్‌గా వచ్చే వ్యక్తికి ఆర్బీఐపై పూర్తి అవగాహన ఉండాలి కనక అప్పట్లో ఉర్జిత్‌ను ఎంచుకుందనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు పరిస్థితి ఇంకాస్త భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే పటేల్ రాజీనామా ముందుగా తెలిసినది కాదు. అకస్మాత్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు కనక... కొత్తగా వచ్చే గవర్నరు ఆ వ్యవస్థతో బాగా సంబంధం ఉన్నవారైతేనే నయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సహజంగానే డెప్యూటీ గవర్నరు ఎన్ఎస్ విశ్వనాథన్ పేరు వినిపిస్తోంది. ఇప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దాలంటే సమర్థుడైన డెప్యూటీ గవర్నరుకే బాధ్యతలు అప్పగించటం మంచిదన్నది ఆర్థిక వర్గాల భావన. ఇక సుభాష్ చంద్ర గార్గ్‌ను తీసుకున్నా ఆయన ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా ఉన్నారు. పైపెచ్చు ఈ హోదాలో ఆర్బీఐ బోర్డులోనూ కొనసాగుతున్నారు. కాబట్టే ఈయన పేరు కూడా తెరపైకి వస్తోంది. శక్తికాంత దాస్, అజయ్ త్యాగి కూడా... మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌గా అజయ్ త్యాగి ప్రస్తుతం కొనసాగుతున్నారు. మార్కెట్లకు సంబంధించి పలు సంస్కరణలు తేవటంతో పాటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పలు అంశాల్లో దన్నుగా ఉంటూ వస్తున్నారు. ఇక ఆర్థిక వ్యవహారాల విభాగం మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్ గతంలో ఆ హోదాలో ఆర్బీఐ బోర్డులో కొన్నాళ్లున్నారు. ఆయనకూ ఆర్బీఐ గవర్నెన్స్ పట్ల అవగాహన ఉంది. పైపెచ్చు ఆయనకు మోదీ ప్రభుత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా గార్గ్, దాస్ పేర్లు కూడా గవర్నర్ పదవి రేసులో వినిపిస్తున్నాయి. తక్షణం తాత్కాలిక గవర్నర్ నియామకం ఉర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో తక్షణం ప్రభుత్వం తాత్కాలిక గవర్నర్‌ను నియమించాల్సి ఉంటుందని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. తరవాతే కొత్త గవర్నర్ నియామకం జరుపుతారన్నది ఆయన అభిప్రాయం. గవర్నర్ లేదా డిప్యూటీ గవర్నర్ రాజీనామా పరిస్థితుల్లో ప్రభుత్వం తనకు తానుగా కానీ లేదా ఆర్బీఐ బోర్డు సిఫారసుల ప్రాతిపదికనగానీ కొత్త నియామకం జరపాల్సి ఉంటుందని ఆర్బీఐ యాక్ట్, 1934 పేర్కొంటోంది. కేంద్రం తగిన నిర్ణయం ఆర్బీఐ కార్యకలాపాల పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఆర్బీఐ– కేంద్రం మధ్య సన్నిహిత సహకారమూ అవసరమే. అందుకని గవర్నర్ నియామకంపై కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నా. – రాకేష్ మోహన్, ఆర్బీఐ మాజీ డెప్యూటీ గవర్నర్ కేంద్రానికి ‘ప్లాన్ బీ’ ఉంటుంది... ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై కేంద్రానికి ఎప్పుడూ ‘ప్లాన్ బీ’ ఉంటుంది. వెంటనే నియామకం జరిపితే, ఇప్పటికే ఒకరు ఎంపికైపోయారన్న భావన వ్యక్తమవుతుంది. వారం దాటిపోతే ఇదంతా రాజకీయమైపోతుంది. వీటన్నింటినీ సమతౌల్యం చేస్తూ నిర్ణయం ఉంటుంది – ప్రణబ్ సేన్, మాజీ చీఫ్ స్టాటిస్టీషియన్ ఇదీ... ఆర్బీఐ బోర్డు డెప్యూటీ గవర్నర్లు నలుగురు... ఎన్ఎస్ విశ్వనాథన్, విరాల్ ఆచార్య, బి.పి.కానుంగో, మహేశ్‌కుమార్ జైన్ డైరెక్టర్లు 12 మంది: పీకే మహంతి, డి.ఎస్.సంఘ్వీ, రేవతీ అయ్యర్, సచిన్ చతుర్వేది, నటరాజన్ చంద్రశేఖరన్, బీఎన్ జోషి, సుధీర్ మన్కడ్, అశోక్ గులాటీ, మనీష్ సబర్వాల్, ఎస్కే మరాఠీ, స్వామినాథన్ గురుమూర్తి, సుభాష్ చంద్రగార్గ్, రాజీవ్ కుమార్. -
రాజీ నుంచి... రాజీనామాకు!!
పటేల్ రాజీనామాకు బీజం ఎప్పుడు పడిందో తెలుసా? ఈ ఏడాది ఆగస్టు 8న. ఆ తరవాత ఆయన రాజీనామా చేస్తారనే వదంతులూ వచ్చాయి. అప్పట్లో పరిస్థితి సర్దు మణిగినా... ఇప్పుడు తప్పలేదు. ఆ పరిణామాలు చూస్తే... 2018 ఆగస్టు 8: ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి, సహకార బ్యాంకింగ్ రంగ నిపుణుడు సతీష్ మరాఠీలను ఆర్బీఐ సెంట్రల్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించింది. సెప్టెంబర్ మధ్యలో: ఆర్బీఐ సెంట్రల్ బోర్డు సభ్యుడు, ప్రముఖ బ్యాంకరు నచికేత్ మోర్‌కు అర్ధాంతరంగా ఉద్వాసన పలికింది. అక్టోబర్ 10: డజను పైగా డిమాండ్లకు అంగీకరించేలా రిజర్వ్ బ్యాంక్ మెడలు వంచేందుకు గతంలో ఎన్నడూ ఉపయోగించని ఆర్బీఐ చట్టంలోని సెక్షన్ 7 నిబంధనను ప్రయోగిస్తూ ఆర్బీఐకి కేంద్రం మూడు లేఖలు రాసింది. వీటికి ఆర్బీఐ వారం రోజుల తర్వాత సమాధానాలిచ్చింది. అక్టోబర్ 23: ఆర్బీఐ దాదాపు ఎనిమిది గంటలపాటు మారథాన్ సమావేశం నిర్వహించింది. కా నీ ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలపై పరిష్కారం లభించకుండానే భేటీ ముగిసింది. అక్టోబర్ 26: ఆర్బీఐ అటానమీని కాపాడాల్సిన అవసరంపై డిప్యుటీ గవర్నర్ విరల్ ఆచార్య బహిరంగంగానే వ్యాఖ్యలు చేశారు. కాపాడకుంటే మార్కెట్ల ఆగ్రహం చవిచూడాల్సి వస్తుందంటూ వ్యాఖ్యానించారు. అక్టోబర్ 29: మరో డిప్యుటీ గవర్నర్ ఎన్ఎస్ విశ్వనాథన్ కూడా గళమెత్తారు. బ్యాంకుల మూలధన నిష్పత్తులను తగ్గించే విషయంలో ఆర్బీఐ విముఖతను స్పష్టం చేశారు. అక్టోబర్ 31: ఆర్బీఐకి స్వయం ప్రతిపత్తి చాలా ముఖ్యమేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే మరింత మెరుగైన గవర్నెన్స్ అవసరమని పేర్కొంది. నవంబర్ 3: మార్కెట్ సూచీలు, రూపాయి, క్రూడ్ ధరలు అన్నీ బాగానే పుంజుకుంటున్నాయంటూ... కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్సీ గర్గ్ వ్యాఖ్యానించారు. తద్వారా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తిపై విరల్ ఆచార్య వ్యాఖ్యలకు వ్యంగ్యంగా సమాధానమిచ్చారు. అదే నెల 9వ తారీఖున.. ఆర్బీఐ దగ్గర అసలు ఎన్ని నిధులు ఉండాలన్నది నిర్ణయించేందుకు చర్చలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆర్బీఐ, ప్రభుత్వం మధ్య ప్రతిష్టంభన నెలకొనడం మంచిది కాదని గురుమూర్తి వ్యాఖ్యానించారు. కీలక రంగాలకు నిధులందకుండా చేయడం ద్వారా వృద్ధికి విఘాతం కలిగించకూడదంటూ నవంబర్ 17న ఆర్బీఐ బోర్డు సమావేశానికి రెండు రోజులు ముందు.. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వ్యాఖ్యానించారు. నవంబర్ 19: పది గంటల పాటు ఆర్బీఐ సెంట్రల్ బోర్డు భేటీ. రిజర్వ్ బ్యాంక్ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్నది తేల్చేందుకు ప్యానెల్ ఏర్పాటుకు నిర్ణయం. చిన్న సంస్థలకు ఊరటనిచ్చే చర్యలు. డిసెంబర్ 5: ఆర్బీఐ, కేంద్రం మధ్య సంధి వార్తల నేపథ్యంలో విభేదాలపై స్పందించేందుకు పటేల్ నిరాకరణ. డిసెంబర్ 10: వ్యక్తిగత కారణాలతో గవర్నర్ పదవికి పటేల్ రాజీనామా. -
ఆర్బీఐ గవర్నరు రాజీనామా...
(ముంబై, న్యూఢిల్లీ) : ఆరంభంలోనే పెద్ద నోట్ల రద్దులాంటి ఆర్థిక సునామీలను నిబ్బరంగా తట్టుకున్న భారత రిజర్వు బ్యాంకు గవర్నరు ఉర్జిత్ పటేల్... ఆకస్మికంగా రాజీనామా చేసి అందరినీ నివ్వెరపరిచారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎన్పీఏలు పెరిగిపోయిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు కొన్ని కీలక అంశాలపై కేంద్రం, ఆర్బీఐ మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐలోని విరాళ్ ఆచార్య వంటి డెప్యూటీ గవర్నర్లు దీనిపై మాట్లాడారు గానీ.. మితభాషి, మృదుభాషిగా పేరున్న పటేల్ మాత్రం మాట్లాడలేదు. చివరికి రాజీనామా చేసేటపుడూ ప్రభుత్వాన్ని, ఆర్థికశాఖను పొగడటం, తెగడటం వంటివి చేయలేదు. పదవీకాలంలో సహకారం అందించిన సహోద్యోగులకు మాత్రం ధన్యవాదాలు తెలిపారు. నిజానికి రెండేళ్ల కిందట పెద్ద నోట్ల రద్దును ప్రధాన మంత్రి ప్రకటించినపుడు... జనం ఇబ్బందుల దృష్ట్యా ఆర్బీఐ గవర్నరు ఉర్జిత్ పటేల్‌పై పలు విమర్శలొచ్చాయి. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అనే అపవాదు పడింది. కానీ తరవాత దాన్నుంచి మెల్లగా బయటపడ్డారు. కఠిన నిర్ణయాలతో స్వతంత్రంగా తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఆయన విధానాలు కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి. రిజర్వ్ బ్యాంక్‌ని లొంగదీసుకునేందుకు చేసిన ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు తలెత్తడంతో కేంద్రం వెనక్కి తగ్గింది కూడా. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అకస్మాత్తుగా పటేల్ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ దశలో ఆయన రాజీనామా నిర్ణయం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్నప్పటికీ... పదవీకాలం మరో ఎనిమిది నెలలు ఉండగానే పటేల్ రాజీనామా చేయడం గమనార్హం. నోట్ల రద్దుకు నాయకత్వం...! 2016లో ఆర్బీఐ గవర్నర్‌గా రఘురామ్ రాజన్ పదవీకాలాన్ని రెండో దఫా పొడిగించకుండా... ఆ స్థానంలో పటేల్‌ను (55) నియమించింది బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. 2016 సెప్టెంబర్ 5న ఆయన ఆర్బీఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు దాకా అప్పటి గవర్నర్ రఘురామ్ రాజన్ సారథ్యంలో డెప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించారు. 1992 తర్వాత అత్యంత తక్కువ కాలం ఈ హోదాలో ఉన్న గవర్నర్ ఉర్జిత్ పటేలే. మూడేళ్ల పాటు గవర్నర్‌గా నియమితులైన పటేల్ పదవీకాలం ముగియడానికి మరో ఎనిమిది నెలలుంది. రెండో దఫా పదవీకాలం పొడిగింపునకు కూడా అవకాశం ఉండేది. సాధారణంగా ఆర్బీఐ గవర్నర్‌గా నియమితులయ్యేందుకు ఎక్కువగా బ్యూరోక్రాట్లు, ఆర్థికవేత్తలకే ప్రాధాన్యం దక్కుతోంది. కానీ, కార్పొరేట్ నేపథ్యం కూడా ఉన్న కొద్ది మంది ఆర్బీఐ గవర్నర్లలో పటేల్ ఒకరు. రిజర్వు బ్యాంకుకు రావటానికి ముందు.. ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్) పాటు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి కార్పొరేట్ దిగ్గజాల్లో పని చేశారు. డిప్యూటీ గవర్నర్‌గా సేవలందించి పూర్తి స్థాయి గవర్నర్‌గా ఎదిగిన వారి జాబితాలో పటేల్‌ది 8వ స్థానం. చివరిసారిగా వైవీ రెడ్డి ఇలాగే నియమితులయ్యారు. మరికొందరు డిçప్యూటీ గవర్నర్లు కూడా గవర్నర్‌గా విధులు నిర్వర్తించినప్పటికీ.. తాత్కాలికంగానే ఆ బాధ్యతలు చేపట్టారు. ఆర్బీఐ గవర్నర్లుగా చేసిన వారిలో చాలా మందికి ఐఎంఎఫ్‌తో కూడా అనుబంధం ఉంది. కొందరు ఐఎంఎఫ్‌లో పనిచేసిన తర్వాత గవర్నర్లుగా బాధ్యతలు చేపట్టగా.. మరికొందరు గవర్నర్లుగా పదవీ విరమణ అనంతరం ఐఎంఎఫ్‌లో సేవలందించారు. ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం: రాజన్ ఉర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో వృద్ధికి, దేశాభివృద్ధికి కీలక సంస్థలు పటిష్టంగా ఉండటం ఎంతగా అవసరమన్నది ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా బోర్డు సలహాదారు పాత్ర పోషిస్తూ వచ్చేదని, ఆర్బీఐ ప్రొఫెషనల్సే నిర్ణయం తీసుకునే వారని ఆయన పేర్కొన్నారు. కానీ కొన్నాళ్లుగా ఆర్బీఐ బోర్డు స్వభావంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని, దానికి నిర్వహణపరమైన అధికారాలు పెరగడంతో ప్రొఫెషనల్ మేనేజ్మెంట్పై ప్రతికూల ప్రభావం పడుతుందని రాజన్ చెప్పారు. ఒకవేళ అదే చేయదల్చుకుంటే.. బోర్డులో కూడా ప్రొఫెషనల్సే ఉండాలి తప్ప ఇతరులకు చోటు కల్పించకూడదన్నారు. తద్వారా బోర్డులో ఇటీవల ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి, సహకార బ్యాంకింగ్ రంగ నిపుణుడు ఎస్కే మరాఠేల నియామకాన్ని పరోక్షంగా ఆక్షేపించారు. రాజీనామాకు కారణాలు ఇవేనా..? వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ పటేల్ చెబుతున్నప్పటికీ.. అంతకు మించిన కారణాలే ఉన్నాయని ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు చెబుతున్నాయి. పలు అంశాలపై కేంద్రం, ఆర్బీఐ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. వివాదాలు రేగాయి. ఇవే అంతిమంగా పటేల్ నిష్క్రమణకు దారి తీసి ఉంటాయన్నది ఆర్థిక నిపుణుల మాట. ఆర్బీఐ స్వయం ప్రతిపత్తి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని డెప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య అక్టోబƇ 26న ఒక ప్రసంగంలో వ్యాఖ్యానించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఒక దశలో ఆర్బీఐని కట్టడి చేసేందుకు కేంద్రం గతంలో ఎన్నడూ లేని విధంగా సెక్షన్ 7(ఎ) నిబంధనను ప్రయోగించిందనే వార్తలొచ్చాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. అయితే, పలు అంశాలకు సంబంధించి బోర్డులోని ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా ఆర్బీఐపై ఒత్తిడి పెంచే చర్యలు కొనసాగించింది. అంతిమంగా పటేల్ రాజీనామాకు దారితీసిన అంశాలు దాదాపు ఆరు ఉన్నాయి. అవి.. 1 వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్బీఐ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది. అయితే వృద్ధి గణాంకాల కోసం తాపత్రయపడుతున్న కేంద్రానికి సమస్యగా మారింది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గిస్తేనే రుణాలు పెరిగి, వృద్ధి రేటు పెరగటం సాధ్యమవుతుందన్నది కేంద్రం ఆలోచన. కానీ ద్రవ్యోల్బణం దృష్ట్యా అప్పటికి తగినట్లుగా ఆర్బీఐ వ్యవహరిస్తోంది. ఈ వైఖరిపై అసంతృప్తిగా ఉన్న కేంద్రం... ఆర్బీఐ నియంత్రణలోని నిబంధనల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరువర్గాల మధ్య అగ్గి రాజుకుంది. 2 ఎన్పీఏల వర్గీకరణ.. బ్యాంకులు మొండి బకాయిలను (ఎన్పీఏ) వర్గీకరించడానికి సంబంధించిన నిబంధనలను ఆర్బీఐ మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 12న జారీ చేసిన సర్క్యులర్ ఇరువురి మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. ఇవి మరీ కఠినంగా ఉన్నాయని కేంద్రం భావించింది. తాజా సర్క్యులర్ కారణంగా ప్రభుత్వ బ్యాంకుల ఎన్పీఏలు మరింత పెరిగాయి. దీంతో భారీ నష్టాలు నమోదు చేశాయి. 3 నీరవ్ మోదీ కుంభకోణం.. అదే సమయంలో నీరవ్ మోదీ కుంభకోణంతో రెండింటి మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆర్బీఐ పర్యవేక్షణా లోపాలతోనే స్కామ్‌లు జరుగుతున్నాయంటూ ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్ రంగ బ్యాంకుల్లాగా ఆజమాయిషీ చేసేందుకు తమకు పూర్తి అధికారాల్లేవని, మరిన్ని అధికారాలు ఇస్తే కచ్చితంగా నియంత్రించగలమంటూ పటేల్ కౌంటర్ ఇచ్చారు కూడా!!. 4 ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం.. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ డిఫాల్ట్ పరిణామాల అనంతరం నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలకు (ఎన్బీఎఫ్సీ) లిక్విడిటీ కొరత ఏర్పడింది. కొత్తగా రుణాలు జారీ చేయటానికి.. తాము బాండ్ల ద్వారా సమీకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి కొన్ని ఎన్బీఎఫ్సీలు ఇబ్బందులు పడ్డాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కించాలని ఆర్బీఐకి కేంద్రం సూచించింది. కానీ వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉందంటూ.. రిజర్వ్ బ్యాంక్ కేంద్రం ఒత్తిళ్లను పట్టించుకోలేదు. 5 నచికేత్ మోర్ తొలగింపు.. పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉండగానే ఆర్బీఐ బోర్డు సభ్యుడు నచికేత్ మోర్‌ను కనీసం ఆయనకు మాటమాత్రమైనా చెప్పకుండా కేంద్రం తొలగించింది. ఇది ఆర్బీఐని చికాకుపరిచింది. మరింత డివిడెండు ఇవ్వాలంటూ ఆర్బీఐపై కేంద్రం ఒత్తిడి తెస్తుండటాన్ని మోర్ గట్టిగా వ్యతిరేకించడమే ఆయన తొలగింపునకు దారి తీసిందన్న అభిప్రాయం నెలకొంది. 6 పేమెంట్స్ సంస్థల నియంత్రణ అంశం.. గూగుల్, పేటీఎం తదితర చెల్లింపు సంస్థల నియంత్రణను రిజర్వ్ బ్యాంక్(ఆర్బీఐ)కి కాకుండా వేరే నియంత్రణ సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. దీన్ని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో ఆర్బీఐ బహిరంగంగానే వివరణ నిచ్చింది. బ్యాంకింగ్‌ను చక్కదిద్దారు: ప్రధాని గందరగోళంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను చక్కదిద్దారని, క్రమశిక్షణలో పెట్టారని ఉర్జిత్ పటేల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. చిత్తశుద్ధి గల ప్రొఫెషనల్ అని కితాబిచ్చారు. ‘‘స్థూల ఆర్థిక అంశాలపై అపారమైన అవగాహన గల గొప్ప ఆర్థిక వేత్త ఉర్జిత్ పటేల్. బ్యాంకింగ్ వ్యవస్థను గందరగోళ పరిస్థితి నుంచి బయటపడేసి చక్కదిద్దారు. క్రమశిక్షణలో పెట్టారు. ఆయన సారథ్యంలో ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలిగింది. ఆర్బీఐలో ఆరేళ్ల పాటు డిప్యుటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఆయనందించిన సేవలు విస్మరించరానివి’ అని మైక్రోబ్లాగింగ్ సైటు ట్విటర్లో మోదీ వివరించారు. పటేల్ సేవలు భేష్: జైట్లీ ఆర్బీఐ గవర్నర్‌గా పటేల్ ఎనలేని సేవలందించారని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రశంసించారు. ఆయన విజ్ఞానంతో తాను కూడా లబ్ధి పొందానని ట్విటర్లో పేర్కొన్నారు. ’ఆర్బీఐ డిప్యుటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ దేశానికి ఎనలేని సేవలందించారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను ’ అని జైట్లీ పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ.. ఎకానమీ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత రుణంలో ఉర్జిత్ రాజీనామా చేయడం దురదృష్టకరం. ఎకానమీకి ఇది పెద్ద దెబ్బ. – మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆర్బీఐ నిధులను లాక్కోవాలని చూస్తోంది ఉర్జిత్ రాజీనామా తనకు ఆశ్చర్యం కన్నా బాధ కలిగించిందని మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ద్రవ్య లోటు లక్ష్యాలను చేరుకునేందుకు ఆర్బీఐ నిధులను లాక్కోవాలనే ఎన్డీఏ ప్రభుత్వ అజెండానేతృత్వంలో ఆత్మగౌరవం ఉన్న ఏ నిపుణుడు పనిచేయలేరని ఆయన వ్యాఖ్యానించారు. – మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం విరాల్ రాజీనామా వదంతులు! గవర్నర్‌గా ఉర్జిత్ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, డిప్యూటీ గవర్నర్ విరాల్ ఆచార్య కూడా రాజీనామా చేశారన్న వదంతులు గుప్పుమన్నాయి. వీటిని ఆర్బీఐ ఖండించింది. ఈ వార్త నిరాధారం, వాస్తవదూరం అని ఆర్బీఐ ప్రతినిధి ప్రకటించారు. పరపతి విధాన విభాగానికి ఇన్చార్జ్ కూడా అయిన విరాల్ ఆచార్య అక్టోబర్ 26వ తేదీన చేసిన ఒక ప్రసంగంలో... ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే... వ్యక్తిగత కారణాల రీత్యా, ప్రస్తుత హోదా నుంచి తక్షణమే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కొన్నాళ్లుగా రిజర్వ్ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఇటీవలి కాలంలో బ్యాంకు సాధించిన విజయాలు ఆర్బీఐ సిబ్బంది, అధికారులు, యాజమాన్యం ఎనలేని సహకారంతోనే సాధ్యపడ్డాయి. ఈ సందర్భంగా నా సహోద్యోగులు, ఆర్బీఐ సెంట్రల్ బోర్డు డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు తెలపదల్చుకున్నాను. – ఉర్జిత్ పటేల్ -
క్యాష్ ఈజ్ కింగ్!
న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రూపంలో ఇంటింటి పొదుపులు గణనీయంగా పెరిగాయి. 2017–18లో స్థూల జాతీయ డిస్పోజబుల్ ఇన్కమ్(జీఎన్‌డీఐ–ఆదాయపు పన్నులు తదితర వ్యయాల తర్వాత ఖర్చులకు, పొదుపుకు కుటుంబం వద్ద ఉండే మొత్తమే డిస్పోజబుల్ ఇన్కమ్)తో పోల్చిచూస్తే, నగదు రూపంలో ఇంటింటి పొదుపు 2.8%కి పెరిగింది. ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి. రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) తాజా గణాంకాల్లో మరిన్ని వివరాలు... 82016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు జరిగింది. అటు తర్వాత గృహ పొదుపులు అసలు పెరక్కపోగా అంతక్రితం ఏడాది (2015–16) తో పోల్చితే 2016–17లో 2 శాతం క్షీణించింది. 82016–17లో జీఎన్‌డీఐలో గృహ ఫైనాన్షియల్ సేవింగ్స్ కూడా 6.7% క్షీణించాయి. 2015–16లో ఏకంగా 8.1% వృద్ధి నమోదయ్యింది. అయితే 2017–18లో ఈ రేటులో 7.1% వృద్ధి నమోదైంది. 8డిపాజిట్ల రూపంలో పొదుపులు డీమోనిటైజేషన్ ఇయర్ (2016–17) లో 6.3 శాతం పెరిగితే, 2017–18లో ఈ రేటు 2.9 శాతానికి జారిపోయింది. 8షేర్లు, డిబెంచర్లలో పొదుపులు 2015–16లో 0.3 శాతం ఉంటే, 2017–18లో 0.9 శాతానికి ఎగశాయి. స్టాక్ మార్కెట్ బూమ్‌కు ఇది నిదర్శనం. -
కంచికి చేరని కరెన్సీ కష్టాలు
• ఐదు నెలలు దాటినా తీరని వెతలు • మళ్లీ నవంబర్ నాటి పరిస్థితులు • ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు • బ్యాంకుల్లో అడుగంటిన నగదు నిల్వలు • మళ్లీ పడిపోతున్న వ్యాపారాలు పెద్ద నోట్ల రద్దు.. ప్రజలెవ్వరూ ఊహించని పరిణా మం. ఆర్థిక వ్యవస్థ మూలాలనే కదిలించిన నిర్ణయం. నెలలు గడుస్తున్నా కరెన్సీ కష్టాలు ఇప్పట్లో సమసిపోయే పరిస్థితులు కన్పించడంలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపు పేరుతో మార్చిలో బ్యాంకులు విధించిన ఆంక్షలు.. ఏప్రిల్‌లో కూడా కొనసాగిస్తుండడంతో కరెన్సీ కష్టాలు రెట్టింపయ్యాయి. ఏ ఏటీఎం వద్దకెళ్లినా నోక్యాష్ బోర్డులు దర్శనమిస్తుంటే.. అడుగంటిన నగదు నిల్వల కారణంగా బ్యాంకుల్లో సైతం ఆర్థిక లావాదేవీలు తగ్గిపోయాయి. మళ్లీ నవంబర్ నాటి పరిస్థితులు పునరావృతమయ్యాయి. విశాఖపట్నం/విశాఖ సిటీ : జిల్లాలో ప్రతిరోజు కనీసం రూ.100 కోట్ల నుంచి రూ.150 కోట్ల వరకు లావాదేవీలు జరుగుతుంటాయి. ప్రస్తుతం రోజుకు కనీసం రూ.50కోట్ల మధ్య లావేదేవీలు జరగని పరిస్థితి కన్పిస్తోంది. జిల్లాలో 1100 ఏటీఎంలుండగా.. వాటిలో కనీసం వంద ఏటీఎంల్లో కూడా డబ్బుల్లేని పరిస్థితి. గడిచిన 20 రోజుల్లో ఆర్బీఐ నుంచి జిల్లాకు రూ.350 కోట్ల కరెన్సీ వచ్చింది. ఈ మొత్తంలో 70 శాతం ఏటీఎంలకు తరలించగా.. 30 శాతం మాత్రమే బ్యాంకుల్లో ఉంచారు. ఏటీఎంల్లో క్యాష్ దాదాపు పూర్తి కావడంతో అన్ని నో క్యాష్ బోర్డులతో వెక్కిరిస్తున్నాయి. బ్యాంకుల్లో కూడా నగదు నిల్వలు అడుగంటడం, డిపాజిట్లు పెద్దగా లేకపోవడంతో నగదు చెల్లింపులపై ఆంక్షలు విధిస్తున్నారు. రూ.పది వేలు అడుగుతున్న వారికి ఐదువేలు.. ఐదు వేలు అడుగుతున్న వారికి రెండు వేలతో సరిపెడుతున్నారు. పెద్దనోట్ల రద్దుకు ముందు జిల్లాలో 10 నుంచి 15 శాతం మాత్రమే ఆన్లైన్ లావాదేవీలు జరిగేవి. ప్రస్తుతం ఆన్లైన్ లావాదేవీలు 40 శాతం పెరిగాయని అధికారులు చెబుతున్నప్పటికీ, వాస్తవంగా మాత్రం 25 శాతం మించి జరగడం లేదు. ఏటీఎం కార్డుపై నగదురహిత లావాదేవీలు చేసేందుకు సామాన్య, మధ్య తరగతి ప్రజలు భయపడతున్నారు. ఉన్నత విద్యావంతులు, పెద్ద ఉద్యోగాలు చేస్తున్న వారు కాస్తో కూస్తో ఆన్లైన్ లావాదేవీలతో బండినెట్టుకొస్తున్నా.. చిరుద్యోగులు, చిన్న వ్యాపారులు నరకయాతన పడుతున్నారు. ఆన్లైన్ చెల్లింపులు ఎలా చెయ్యాలో తెలీక.. సరైన సమయానికి డబ్బులు అందక వేలాది మంది మనోవేదనకు గురవుతున్నారు. సాంకేతిక లోపాల కారణంగా చెల్లింపులు జరిగినట్టుగా మెస్సేజ్ రావడం.. తీరా అవతల ఖాతాలకు జమ కాకపోవడంతో డబ్బు ఏమైయ్యాయో తెలియక గగ్గోలు పెడుతున్నారు. తగ్గిన స్వైపింగ్ వినియోగం పెద్దనోట్ల రద్దుకు ముందు 6,084 స్వైపింగ్ మెషిన్లు జిల్లాలో ఉండేవి. ఆ తర్వాత వాటి సంఖ్య 9 వేలకు చేరినప్పటికి ప్రస్తుతం వినియోగంలో 4 వేలకు మించిలేవు. వేలిముద్ర ద్వారా నగదు చెల్లింపుల కోసం ఇటీవల ప్రారంభించిన ‘భీమ్యాప్’డివైస్‌లకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పటి వరకు 600 వరకు మాత్రమే వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. స్వైపింగ్ మెషిన్ల స్థానే వీటిని తీసుకురావాలంటే కనీసం 40 వేల డీవైఎస్లు అవసరమని అంచనా వేస్తున్నారు. గతేడాది నవంబర్, డిసెంబర్లలో దాదాపు 80 శాతం మేర పడిపోయిన వ్యాపారాలు.. జనవరిలో కాస్త గాడిలో పడ్డాయి. ప్రస్తుతం 50 నుంచి 60 శాతానికి మించి వ్యాపార లావాదేవీలు జరగడం లేదని వ్యాపారవర్గాలు వాపోతున్నాయి.