ఆర్‌బీఐ గవర్నరు రాజీనామా... | Urjit Patel resigns as RBI Governor | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ గవర్నరు రాజీనామా...

Published Tue, Dec 11 2018 12:51 AM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM

 Urjit Patel resigns as RBI Governor - Sakshi

(ముంబై, న్యూఢిల్లీ) : ఆరంభంలోనే పెద్ద నోట్ల రద్దులాంటి ఆర్థిక సునామీలను నిబ్బరంగా తట్టుకున్న భారత రిజర్వు బ్యాంకు గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌... ఆకస్మికంగా రాజీనామా చేసి అందరినీ నివ్వెరపరిచారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఎన్‌పీఏలు పెరిగిపోయిన బ్యాంకులపై కఠిన చర్యలు తీసుకోవటంతో పాటు కొన్ని కీలక అంశాలపై కేంద్రం, ఆర్‌బీఐ మధ్య కొన్నాళ్లుగా ఘర్షణ నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐలోని విరాళ్‌ ఆచార్య వంటి డెప్యూటీ గవర్నర్లు దీనిపై మాట్లాడారు గానీ.. మితభాషి, మృదుభాషిగా పేరున్న పటేల్‌ మాత్రం మాట్లాడలేదు. చివరికి రాజీనామా చేసేటపుడూ ప్రభుత్వాన్ని, ఆర్థికశాఖను పొగడటం, తెగడటం వంటివి చేయలేదు. పదవీకాలంలో సహకారం అందించిన సహోద్యోగులకు మాత్రం ధన్యవాదాలు తెలిపారు.  

నిజానికి రెండేళ్ల కిందట పెద్ద నోట్ల రద్దును ప్రధాన మంత్రి ప్రకటించినపుడు... జనం ఇబ్బందుల దృష్ట్యా ఆర్‌బీఐ గవర్నరు ఉర్జిత్‌ పటేల్‌పై పలు విమర్శలొచ్చాయి. ప్రభుత్వం చేతిలో కీలుబొమ్మ అనే అపవాదు పడింది. కానీ తరవాత దాన్నుంచి మెల్లగా బయటపడ్డారు. కఠిన నిర్ణయాలతో స్వతంత్రంగా తనదైన ముద్ర వేస్తూ వస్తున్నారు. దీంతో కొన్నాళ్లుగా ఆయన విధానాలు కేంద్రానికి ఇబ్బందికరంగా మారాయి. రిజర్వ్‌ బ్యాంక్‌ని లొంగదీసుకునేందుకు చేసిన ప్రయత్నాలపై సర్వత్రా విమర్శలు తలెత్తడంతో కేంద్రం వెనక్కి తగ్గింది కూడా. ఆ తర్వాత ఇరు వర్గాల మధ్య సంధి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంతలోనే అకస్మాత్తుగా పటేల్‌ రాజీనామా నిర్ణయాన్ని ప్రకటించారు. దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ దశలో ఆయన రాజీనామా నిర్ణయం రాజకీయంగానూ దుమారం రేపుతోంది. కేంద్ర ప్రభుత్వం ఏరి కోరి తెచ్చుకున్నప్పటికీ... పదవీకాలం మరో ఎనిమిది నెలలు ఉండగానే పటేల్‌ రాజీనామా చేయడం గమనార్హం.  

నోట్ల రద్దుకు నాయకత్వం...! 
2016లో ఆర్‌బీఐ గవర్నర్‌గా రఘురామ్‌ రాజన్‌ పదవీకాలాన్ని రెండో దఫా పొడిగించకుండా... ఆ స్థానంలో పటేల్‌ను (55) నియమించింది బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం. 2016 సెప్టెంబర్‌ 5న ఆయన ఆర్‌బీఐ 24వ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకు ముందు దాకా అప్పటి గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ సారథ్యంలో డెప్యూటీ గవర్నర్‌గా వ్యవహరించారు. 1992 తర్వాత అత్యంత తక్కువ కాలం ఈ హోదాలో ఉన్న గవర్నర్‌ ఉర్జిత్‌ పటేలే. మూడేళ్ల పాటు గవర్నర్‌గా నియమితులైన పటేల్‌ పదవీకాలం ముగియడానికి మరో ఎనిమిది నెలలుంది. రెండో దఫా పదవీకాలం పొడిగింపునకు కూడా అవకాశం ఉండేది. సాధారణంగా ఆర్‌బీఐ గవర్నర్‌గా నియమితులయ్యేందుకు ఎక్కువగా బ్యూరోక్రాట్లు, ఆర్థికవేత్తలకే ప్రాధాన్యం దక్కుతోంది. కానీ, కార్పొరేట్‌ నేపథ్యం కూడా ఉన్న కొద్ది మంది ఆర్‌బీఐ గవర్నర్లలో పటేల్‌ ఒకరు. రిజర్వు బ్యాంకుకు రావటానికి ముందు.. ఆయన అంతర్జాతీయ ద్రవ్య నిధితో (ఐఎంఎఫ్‌) పాటు బోస్టన్‌ కన్సల్టింగ్‌ గ్రూప్, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాల్లో పని చేశారు. డిప్యూటీ గవర్నర్‌గా సేవలందించి పూర్తి స్థాయి గవర్నర్‌గా ఎదిగిన వారి జాబితాలో పటేల్‌ది 8వ స్థానం. చివరిసారిగా వైవీ రెడ్డి ఇలాగే నియమితులయ్యారు. మరికొందరు డిçప్యూటీ గవర్నర్లు కూడా గవర్నర్‌గా విధులు నిర్వర్తించినప్పటికీ.. తాత్కాలికంగానే ఆ బాధ్యతలు చేపట్టారు. ఆర్‌బీఐ గవర్నర్లుగా చేసిన వారిలో చాలా మందికి ఐఎంఎఫ్‌తో కూడా అనుబంధం ఉంది. కొందరు ఐఎంఎఫ్‌లో పనిచేసిన తర్వాత గవర్నర్లుగా బాధ్యతలు చేపట్టగా.. మరికొందరు గవర్నర్లుగా పదవీ విరమణ అనంతరం ఐఎంఎఫ్‌లో సేవలందించారు. 

ప్రజలంతా ఆలోచించాల్సిన విషయం: రాజన్‌ 
ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా నేపథ్యంలో వృద్ధికి, దేశాభివృద్ధికి కీలక సంస్థలు పటిష్టంగా ఉండటం ఎంతగా అవసరమన్నది ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా బోర్డు సలహాదారు పాత్ర పోషిస్తూ వచ్చేదని, ఆర్‌బీఐ ప్రొఫెషనల్సే నిర్ణయం తీసుకునే వారని ఆయన పేర్కొన్నారు. కానీ కొన్నాళ్లుగా ఆర్‌బీఐ బోర్డు స్వభావంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయని, దానికి నిర్వహణపరమైన అధికారాలు పెరగడంతో ప్రొఫెషనల్‌ మేనేజ్‌మెంట్‌పై ప్రతికూల ప్రభావం పడుతుందని రాజన్‌ చెప్పారు. ఒకవేళ అదే చేయదల్చుకుంటే.. బోర్డులో కూడా ప్రొఫెషనల్సే ఉండాలి తప్ప ఇతరులకు చోటు కల్పించకూడదన్నారు. తద్వారా బోర్డులో ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతకర్త ఎస్‌ గురుమూర్తి, సహకార బ్యాంకింగ్‌ రంగ నిపుణుడు ఎస్‌కే మరాఠేల నియామకాన్ని పరోక్షంగా ఆక్షేపించారు.

రాజీనామాకు కారణాలు ఇవేనా..?
వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్‌ పటేల్‌ చెబుతున్నప్పటికీ.. అంతకు మించిన కారణాలే ఉన్నాయని ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు చెబుతున్నాయి. పలు అంశాలపై కేంద్రం, ఆర్‌బీఐ మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. వివాదాలు రేగాయి. ఇవే అంతిమంగా పటేల్‌ నిష్క్రమణకు దారి తీసి ఉంటాయన్నది ఆర్థిక నిపుణుల మాట. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తి విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవడం సరికాదని డెప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య అక్టోబƇ 26న ఒక ప్రసంగంలో వ్యాఖ్యానించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఒక దశలో ఆర్‌బీఐని కట్టడి చేసేందుకు కేంద్రం గతంలో ఎన్నడూ లేని విధంగా సెక్షన్‌ 7(ఎ) నిబంధనను ప్రయోగించిందనే వార్తలొచ్చాయి. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గింది. అయితే, పలు అంశాలకు సంబంధించి బోర్డులోని ప్రభుత్వ ప్రతినిధుల ద్వారా ఆర్‌బీఐపై ఒత్తిడి పెంచే చర్యలు కొనసాగించింది. అంతిమంగా పటేల్‌ రాజీనామాకు దారితీసిన అంశాలు దాదాపు ఆరు ఉన్నాయి. అవి..  

1 వడ్డీ రేట్లు 
ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లలో మార్పులు చేస్తుంది. అయితే వృద్ధి గణాంకాల కోసం తాపత్రయపడుతున్న కేంద్రానికి  సమస్యగా మారింది. ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గిస్తేనే రుణాలు పెరిగి, వృద్ధి రేటు పెరగటం సాధ్యమవుతుందన్నది కేంద్రం ఆలోచన. కానీ ద్రవ్యోల్బణం దృష్ట్యా అప్పటికి తగినట్లుగా ఆర్‌బీఐ వ్యవహరిస్తోంది. ఈ వైఖరిపై  అసంతృప్తిగా ఉన్న కేంద్రం... ఆర్‌బీఐ నియంత్రణలోని నిబంధనల్లో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించింది. దీంతో ఇరువర్గాల మధ్య అగ్గి రాజుకుంది. 

2 ఎన్‌పీఏల వర్గీకరణ.. 
బ్యాంకులు మొండి బకాయిలను (ఎన్‌పీఏ) వర్గీకరించడానికి సంబంధించిన నిబంధనలను ఆర్‌బీఐ మరింత కఠినతరం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి 12న జారీ చేసిన సర్క్యులర్‌ ఇరువురి మధ్య వివాదానికి ఆజ్యం పోసింది. ఇవి మరీ కఠినంగా ఉన్నాయని కేంద్రం భావించింది. తాజా సర్క్యులర్‌ కారణంగా ప్రభుత్వ బ్యాంకుల ఎన్‌పీఏలు మరింత పెరిగాయి.    దీంతో భారీ నష్టాలు నమోదు చేశాయి. 

3 నీరవ్‌ మోదీ కుంభకోణం.. 
అదే సమయంలో నీరవ్‌ మోదీ కుంభకోణంతో రెండింటి మధ్య సంబంధాలు మరింత దిగజారాయి. ఆర్‌బీఐ పర్యవేక్షణా లోపాలతోనే  స్కామ్‌లు జరుగుతున్నాయంటూ ప్రభుత్వ వర్గాలు విమర్శించాయి. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేట్‌ రంగ బ్యాంకుల్లాగా ఆజమాయిషీ చేసేందుకు తమకు పూర్తి అధికారాల్లేవని, మరిన్ని అధికారాలు ఇస్తే కచ్చితంగా నియంత్రించగలమంటూ పటేల్‌ కౌంటర్‌ ఇచ్చారు కూడా!!. 

4 ఎన్‌బీఎఫ్‌సీల సంక్షోభం.. 
ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ డిఫాల్ట్‌ పరిణామాల అనంతరం నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు (ఎన్‌బీఎఫ్‌సీ) లిక్విడిటీ కొరత ఏర్పడింది. కొత్తగా రుణాలు జారీ చేయటానికి.. తాము బాండ్ల ద్వారా సమీకరించిన మొత్తాన్ని తిరిగి చెల్లించడానికి కొన్ని ఎన్‌బీఎఫ్‌సీలు ఇబ్బందులు పడ్డాయి.  ఈ కష్టాల నుంచి  గట్టెక్కించాలని ఆర్‌బీఐకి కేంద్రం సూచించింది. కానీ వ్యవస్థలో తగినంత ద్రవ్య లభ్యత ఉందంటూ.. రిజర్వ్‌ బ్యాంక్‌ కేంద్రం ఒత్తిళ్లను పట్టించుకోలేదు.  

5 నచికేత్‌ మోర్‌ తొలగింపు.. 
పదవీకాలం ఇంకా రెండేళ్లు ఉండగానే ఆర్‌బీఐ బోర్డు సభ్యుడు నచికేత్‌ మోర్‌ను కనీసం ఆయనకు మాటమాత్రమైనా చెప్పకుండా కేంద్రం తొలగించింది. ఇది ఆర్‌బీఐని చికాకుపరిచింది. మరింత డివిడెండు ఇవ్వాలంటూ ఆర్‌బీఐపై కేంద్రం ఒత్తిడి తెస్తుండటాన్ని మోర్‌ గట్టిగా వ్యతిరేకించడమే ఆయన తొలగింపునకు దారి తీసిందన్న అభిప్రాయం నెలకొంది. 

6 పేమెంట్స్‌ సంస్థల నియంత్రణ అంశం.. 
గూగుల్, పేటీఎం తదితర చెల్లింపు సంస్థల నియంత్రణను రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ)కి కాకుండా వేరే నియంత్రణ సంస్థకు అప్పగించాలన్న ప్రభుత్వ నిర్ణయం కూడా వివాదాస్పదమైంది. దీన్ని తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నామో ఆర్‌బీఐ బహిరంగంగానే వివరణ నిచ్చింది.

బ్యాంకింగ్‌ను చక్కదిద్దారు: ప్రధాని 
గందరగోళంగా ఉన్న బ్యాంకింగ్‌ వ్యవస్థను చక్కదిద్దారని, క్రమశిక్షణలో పెట్టారని ఉర్జిత్‌ పటేల్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. చిత్తశుద్ధి గల ప్రొఫెషనల్‌ అని కితాబిచ్చారు.  ‘‘స్థూల ఆర్థిక అంశాలపై అపారమైన అవగాహన గల గొప్ప ఆర్థిక వేత్త ఉర్జిత్‌ పటేల్‌. బ్యాంకింగ్‌ వ్యవస్థను గందరగోళ పరిస్థితి నుంచి బయటపడేసి చక్కదిద్దారు. క్రమశిక్షణలో పెట్టారు. ఆయన సారథ్యంలో ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వాన్ని సాధించగలిగింది. ఆర్‌బీఐలో ఆరేళ్ల పాటు డిప్యుటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఆయనందించిన సేవలు విస్మరించరానివి’  అని మైక్రోబ్లాగింగ్‌ సైటు ట్విటర్‌లో మోదీ వివరించారు. 

పటేల్‌ సేవలు భేష్‌: జైట్లీ 
ఆర్‌బీఐ గవర్నర్‌గా పటేల్‌ ఎనలేని సేవలందించారని ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ప్రశంసించారు. ఆయన విజ్ఞానంతో తాను కూడా లబ్ధి పొందానని ట్విటర్‌లో పేర్కొన్నారు. ’ఆర్‌బీఐ డిప్యుటీ గవర్నర్‌గా, గవర్నర్‌గా ఉర్జిత్‌ పటేల్‌ దేశానికి ఎనలేని సేవలందించారు. రాబోయే రోజుల్లో కూడా ఆయన ప్రజాసేవలో కొనసాగాలని ఆకాంక్షిస్తున్నాను ’  అని జైట్లీ పేర్కొన్నారు. 

ఆర్థిక వ్యవస్థకు పెద్ద దెబ్బ.. 
ఎకానమీ పెను సవాళ్లు ఎదుర్కొంటున్న ప్రస్తుత రుణంలో ఉర్జిత్‌   రాజీనామా చేయడం దురదృష్టకరం. ఎకానమీకి ఇది పెద్ద దెబ్బ. 
– మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  

ఆర్‌బీఐ నిధులను  లాక్కోవాలని చూస్తోంది 
 ఉర్జిత్‌ రాజీనామా తనకు ఆశ్చర్యం కన్నా బాధ కలిగించిందని మాజీ  ఆర్థిక మంత్రి పి. చిదంబరం చెప్పారు. ద్రవ్య లోటు లక్ష్యాలను చేరుకునేందుకు ఆర్‌బీఐ నిధులను లాక్కోవాలనే ఎన్‌డీఏ ప్రభుత్వ అజెండానేతృత్వంలో ఆత్మగౌరవం ఉన్న ఏ నిపుణుడు పనిచేయలేరని ఆయన వ్యాఖ్యానించారు.
– మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం

విరాల్‌ రాజీనామా వదంతులు!
గవర్నర్‌గా ఉర్జిత్‌ రాజీనామా ప్రకటన వెలువడిన వెంటనే, డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య కూడా రాజీనామా చేశారన్న వదంతులు గుప్పుమన్నాయి. వీటిని ఆర్‌బీఐ ఖండించింది. ఈ వార్త నిరాధారం, వాస్తవదూరం అని ఆర్‌బీఐ ప్రతినిధి ప్రకటించారు.  పరపతి విధాన విభాగానికి ఇన్‌చార్జ్‌ కూడా అయిన విరాల్‌ ఆచార్య అక్టోబర్‌ 26వ తేదీన చేసిన ఒక ప్రసంగంలో... ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. 

వ్యక్తిగత కారణాల వల్లే... 
వ్యక్తిగత కారణాల రీత్యా, ప్రస్తుత హోదా నుంచి తక్షణమే తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నాను. కొన్నాళ్లుగా రిజర్వ్‌ బ్యాంక్‌లో వివిధ హోదాల్లో సేవలందించడం గర్వకారణంగా భావిస్తున్నా. ఇటీవలి కాలంలో బ్యాంకు సాధించిన విజయాలు ఆర్‌బీఐ సిబ్బంది, అధికారులు, యాజమాన్యం ఎనలేని సహకారంతోనే సాధ్యపడ్డాయి. ఈ సందర్భంగా నా సహోద్యోగులు, ఆర్‌బీఐ సెంట్రల్‌ బోర్డు డైరెక్టర్లందరికీ ధన్యవాదాలు తెలపదల్చుకున్నాను. 
– ఉర్జిత్‌ పటేల్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement