మహాలక్ష్మి
ఆడపిల్ల పుట్టగానే మహాలక్ష్మి పుట్టిందంటారు.
అది మన సంస్కృతి... మన సంప్రదాయం.
తల్లిదండ్రులకే కాదు... ఒక వ్యవస్థకే అరుంధతి వరమైంది.
భారతీయ స్టేట్ బ్యాంకును ప్రాఫిట్ బాట పట్టించింది.
భారతీయులనే ఆ మాట అక్షరాలా నిజమైంది.
మహాలక్ష్మి స్వరూపం అరుంధతిలో ఉంది.
‘ఏడు’ అరుంధతికి కలిసి వస్తుందా? కలిసొస్తే గనుక ఆమె ఈ ఏడాది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు గవర్నర్ అవుతారని అనుకోవచ్చు. ’77లో ఆమె ఎస్.బి.ఐ.లో చేరారు. మూడేళ్ల క్రితం 7వ తేదీన (అక్టోబర్) ఎస్.బి.ఐ. ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు! ఇప్పుడిక రాజన్ నిష్ర్కమణ తర్వాత ఆర్.బి.ఐ. గవర్నర్ పదవికి ఏడుగురిలో ఒకరిగా బరిలో ఉన్నారు. ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయంలో 18వ అంతస్థులో ఉన్న తన ఆఫీస్‌కి ‘ఎలివేటర్స్’లో కాకుండా, ఒక్కో మెట్టూ ఎక్కుతూ చేరుకున్న ఈ బ్యాంకింగ్ రంగ నిర్వహణా దక్షురాలు.. తను కూర్చున్న ఎత్తుకు మించి ఎస్.బి.ఐ.ని తీసుకెళ్లారు. అంతకుమించిన ఎత్తులో మహిళల శక్తి సామర్థ్యాలను.. ఒక దివిటీలా నిలబెట్టారు.
1977 టు 2016. దాదాపు 40 ఏళ్లు! ఒకే సంస్థలో ఉద్యోగం. ఒకే సంస్థలో అనేక హోదాలు. ఒకే సంస్థలో పోటీలు. ఒకే సంస్థలో దేశవిదేశాలకు బదిలీలు. కానీ.. 22 ఏళ్ల వయసులో ఉద్యోగంలో చేరిన కొత్తలో ఎంత ఉత్సాహంగా ఉన్నారో... ఈ 60 ఏళ్ల వయసులో ఇవాళ్టికీ అంతే ఉత్సాహంగా ఉన్నారు అరుంధతీ భట్టాచార్య. క్షణం తీరికలేకుండా పనిలో పడిపోవడం ఆమె విజయ రహస్యం. ఆత్మవిశ్వాసం అందులోని అంతర్ రహస్యం.
మొదటిదీ, చివరిదీ?
కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీ. డిగ్రీ ఫైనల్ ఇయర్. హాస్టల్‌లో ఉంటున్నారు అరుంధతి. ఒకరిద్దరు రూమ్మేట్స్. గుట్టలకొద్దీ కాంపిటీటివ్ బుక్స్. గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూలు. క్యాంపస్ సెలక్షన్స్‌లో జాబ్ కొట్టేశారు అరుంధతి! అదే ఆమె మొదటి ఉద్యోగం. బహుశా చివరిది కూడానేమో! ఎస్.బి.ఐ.లో పుట్టి, ఎస్.బి.ఐ.లో పెరిగి, ఎస్.బి.ఐ.లో పదవీ విరమణ దగ్గరకు వచ్చేశారు అరుంధతి. ఒకవేళ ఆర్.బి.ఐ. గవర్నర్‌గా ఆమెకు చాన్స్ వస్తే అది రెండో ఉద్యోగం అవుతుంది.
ఛైర్‌పర్సన్‌గా తొలిరోజు
ఎస్.బి.ఐ. ఛైర్‌పర్సన్‌గా అరుంధతి తొలిరోజు రెప్ప మూసి తెరిచేలోపు పూర్తయింది! 208 ఏళ్ల చరిత్ర కలిగిన ఒక అతి పెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుకు ఛైర్‌పర్సన్ అయిన ఉద్వేగభరిత భావనలోకి మునిగిపోకుండా, పనులన్నీ ఆమెను ముంచేశాయి. మర్నాడే ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ మీటింగ్. దానికి అటెండ్ అవ్వాలి. పాయింట్స్ నోట్ చేసుకోవాలి. ఇక నుంచీ జీవితం ఇలాగే ఉండబోతోందా అని అనుకోడానికైనా ఆ రోజు టైమ్ దొరకలేదు అరుంధతికి. 1977లో ఉద్యోగంలో చేరిన మొదటి రోజు కూడా అరుంధతికి ఇలాగే గడిచింది. చెక్కులను చెక్ చేసి, నోట్ చేసే పని అప్పగించారు ఆమెకు. అవి దుర్గాదేవి పండుగ రోజులు. మర్నాడు బ్యాంకు సెలవు కావడంతో డబ్బు తీసుకోడానికి వచ్చిన కస్టమర్లతో బ్యాంకు కిక్కిరిసిపోయింది. ఆ సీన్ చూసి అప్పుడే అనుకున్నారు అరుంధతి. ఏదైనా చేయాలని. ఏదైనా అంటే... కస్టమర్లకు సులువుగా ఉండేదీ, బ్యాంకు సిబ్బందికి స్ట్రెస్‌ను తగ్గించేది.
జర్నలిస్టు అవాలనుకున్నారు!
బ్యాంకులో వచ్చిందని చేరారు తప్ప, బ్యాంకులోనే చేరాలని చేరలేదు అరుంధతి. జర్నలిజం ఆమె ఫస్ట్ ఆప్షన్. ఎప్పటికైనా ఒక గొప్ప పుస్తకం రాయడం ఆమె కల. ఎం.ఎ.లో అరుంధతిది ఇంగ్లిష్ లిటరేచర్. లెక్క ప్రకారం అయితే ఆమె ఇంజినీర్ అవాలి. తండ్రి భిలాయ్ స్టీల్ ప్లాంట్‌లో ఇంజినీర్ కాబట్టి. ఆయన ‘‘నీ ఇష్టం’’అన్నారు. అరుంధతి లిటరేచర్‌లోకి వచ్చేశారు. అరుంధతి కలకత్తాలో, బొకారోలో చదువుకున్నారు. ఐదో తరగతి వరకు ఆమె మామూలు అమ్మాయి. బొకారోలోని సెయింట్ జేవియర్స్‌లో చేరాక తెలివైన అమ్మాయి అయింది.
అందరూ కలిసి ఆఫీస్‌కి పంపారు!
ఉద్యోగం చాలావాటిని మిస్ చేస్తుంది. ఫ్రెండ్స్ బర్త్ డే లని, పెళ్లిళ్లనీ, పర్సనల్ లైఫ్‌ని, ముఖ్యంగా అమ్మానాన్నల్ని. బ్యాంకర్ అయ్యాక వీటన్నిటినీ పోగొట్టుకున్నారు అరుంధతి. అయితే బాధతో పోగొట్టుకోలేదు. బాధ్యతల వల్ల పోగొట్టుకున్నారు. సుకృతి పుట్టాక (ఇప్పుడామె వయసు 21) ప్రితిమోయ్ భట్టాచార్య రంగంలోకి దిగారు. అరుంధతి భర్త ఆయన. ఖరగ్‌పూర్ ఐ.ఐ.టి.లో ప్రొఫెసర్. అతడు ఆమెకు సపోర్ట్‌గా ఉన్నారు. కూతురితో పాటు అరుంధతి కూడా చకచకా ఎదుగుతోంది. ఆ సమయంలో తల్లికి, కూతురికి మధ్య ఉద్యోగం; తల్లికి, ఉద్యోగానికి మధ్య కూతురు ఒక నిర్బంధ బంధమై అడ్డుపడకుండా అరుంధతి కుటుంబ సభ్యులంతా తలా ఒక చెయ్యి వేసి ఉయ్యాల ఊపారు. తలా ఒక పని అందుకుని ఆమెను ఆఫీసుకు పంపారు. భర్త-కూతురు-తల్లిదండ్రులు... ఈ ముగ్గురి మధ్య ఉన్న అవగాహన.. అరుంధతి దేన్నైనా సాధించగల శక్తిని, ఉత్సాహాన్ని ఇచ్చింది.
పాపను వదిలి న్యూయార్క్‌లో!
బ్రాంచి ఫెర్ఫార్మెన్స్ ఇన్‌చార్జిగా అరుంధతి న్యూయార్క్ వెళ్లినప్పుడు సుకృతి రెండేళ్ల పిల్ల. పాపను చూసుకోడానికని అరుంధతి పిన్నిగారు కూడా ఆమె వెంట న్యూయార్క్ వెళ్లారు. కొన్నాళ్లు అక్కడ ఉన్నారు. అయితే వీసా పొడిగింపు రాకపోవడంతో ఆ పిన్నిగారు వెనక్కి రావలసి వచ్చింది. కూతుర్ని ఆమెకు ఇచ్చి కలకత్తా పంపడం తప్ప వేరే దారి లేకపోయింది అరుంధతికి. కలకత్తాలో పాపను ఆపడం కష్టమైంది. ఆ విషయం తెలిస్తే అరుంధతి ఎక్కడ తల్లడిల్లిపోతుందోనని పిన్నిగారు పాపను బొకారోకి తీసుకెళ్లారు. అక్కడ అరుంధతి తల్లి, సోదరితో పాటు పిన్నిగారు పాప ఆలనపాలన చూసుకున్నారు. ‘‘మా పిన్ని రుణం తీర్చుకోలేను’’ అని ఇప్పటికీ అంటుంటారు అరుంధతి.
తనేమిటో చూపించారు
2009. బ్యాంకింగ్ రంగంలో అరుంధతి తన తడాఖా చూపించిన సంవత్సరం. ఆ ఏడాది ఆమె ఎస్.బి.ఐ. చీఫ్ జనరల్ మేనేజర్ అయ్యారు. కొత్తగా జనరల్ ఇన్సూరెన్స్, మొబైల్ బ్యాంకింగ్ ఆప్షన్‌లను తీసుకొచ్చారు. మొబైల్ బ్యాంకింగ్ ఎంతగా హిట్ అయిందంటే.. ఎస్.బి.ఐ. లాభాలను అది విపరీతంగా పెంచేసింది! ఆ తర్వాత ‘ఇన్-టచ్’ టెక్నాలజీ, ‘క్యాష్‌లెస్ బ్రాంచి’ వంటివాటిని అరుంధతి ప్రవేశపెట్టారు. ఖాతా తెరవడానికి బ్యాంకు వరకు రాకుండా ‘కియోస్క్’లు ఏర్పాటు చేశారు. ఫొటో, ఫింగర్ ప్రింట్స్, డాక్యుమెంట్స్.. వీటిని స్కాన్ చేస్తే చాలు... డిజిటల్ సిగ్నేచర్‌తో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది. యూత్ అప్పటికే డిజిటల్ వరల్డ్‌లో జీవిస్తోంది. బ్యాంకుకు వెళ్లడం, క్యూలలో గంటలు గంటలు నిలుచోవడం.. వాళ్లకు ఇష్టం ఉండదు. అందుకని అరుంధతే వాళ్ల డిజిటల్ ప్రపంచంలోకి వెళ్లిపోయారు. హాయిగా, తీరిగ్గా నాలుగు కీబోర్డ్ బటన్లేవో నొక్కితే చాలు పని అయిపోయేలా ఎస్.బి.ఐ.ని టెక్నాలజీతో అప్‌డేట్ చేశారు.
ఆధునికతకు, ప్రాచీనతకు పొంతన ఉండదు. కానీ చిత్రంగా ఇవి రెండూ అరుంధతి దగ్గర చక్కటి సమన్వయంతో ఒద్దికగా ఉంటాయి. ప్రొఫెషన్‌లో అరుంధతి మోడ్రన్. వ్యక్తిగతంగా ఆమె ఇష్టపడేది ప్రాచీనత. అరుంధతికి మ్యూజియంలు అంటే ఆసక్తి. పురావస్తువులను, పాతకాలం నాటి కళాకృతులను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. వాటికి సంబంధించిన పుస్తకాలను కూడా ఇష్టంగా చదువుతుంటారు.
మహిళకు గుర్తింపు.. మరీ అంత తేలిక కాదు!
అరుంధతి వారానికి ఏడు రోజులు పనిచేయాల్సిందే. బాధ్యతలు అలాంటివి. సెలవులు ఉన్నా, తీసుకోడానికి ఉండదు. ఆమె వృత్తి నిబద్ధత అలాంటిది. మరి పని ఒత్తిడి నుంచి ఆమె ఎలా రిలాక్స్ అవుతారు? పుస్తకాలు. సంగీతం. చిన్న చిన్న విరామాల్లో ఒకేసారి ఆమె రెండు మూడు పుస్తకాలు చదివేస్తారు. మొదట్లో ఫిక్షన్ చదివేవారు. ఇప్పుడు నాన్‌ఫిక్షన్‌ను ఇష్టపడుతున్నారు. తరచు కొత్త కొత్త రెస్టారెంట్‌లకు వెళుతుంటారు. ఆమె పరిపూర్ణమైన భోజన ప్రియురాలు. ఇష్టం లేనివి, ఇష్టం ఉన్నవి అంటూ ఏవీ లేవ ని ఆమే చెబుతుంటారు. ఇక ఈ నాలుగు దశాబ్దాల కెరీర్‌లో అనుభవం మీద అరుంధతి తెలుసుకున్నది ఏమిటంటే.. ప్రతిభ మాత్రమే గుర్తింపు తెస్తుందనీ, మహిళలైతే ఎంత ప్రతిభ ఉన్నా గుర్తింపు కోసం మరింతగా కష్టపడవలసి ఉంటుందనీ!
మరికొన్ని విశేషాలు
⇒ఫోర్బ్స్ ‘100 మోస్ట్ పవర్‌ఫుల్ ఉమన్’ జాబితాలో అరుంధ తీ భట్టాచార్య ఈ ఏడాది 25వ స్థానంలో ఉన్నారు. నిరుడు 30 వ స్థానంలో ఉన్నారు.
⇒ గత మూడేళ్ల ఎస్.బి.ఐ. లాభాలు కేవలం అరుంధతి ప్రవేశపెట్టిన సంస్కరణల వల్ల సాధ్యమైనవే.
⇒అరుంధతికి ఇంగ్లిష్‌లో చక్కటి ప్రావీణ్యం ఉంది.
⇒ఎస్.బి.ఐ. 208 ఏళ్ల చరిత్రలో ఛైర్‌పర్సన్ అయిన తొలి మహిళ అరుంధతి. ముగ్గురు పురుష సమఉజ్జీలను దాటుకుని ఆమె ఈ అత్యున్నత హోదాను సాధించారు.
⇒మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేయకుండానే, బ్యాంకింగ్ రంగాన్ని వ్యాపార దక్షతతో నడుపుతున్నారు అరుంధతి.
⇒ఎస్.బి.ఐ.లోని తన 39 ఏళ్ల కెరియర్‌లో అరుంధతి.. ఫారిన్ ఎక్స్ఛేంజి, ట్రెజరీ, రిటైల్ ఆపరేషన్స్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్... ఇలా మొత్తం 11 బాధ్యతలను ఏక కాలంలో 11 ఉద్యోగాల్లా విజయవంతంగా నిర్వహించారు.
⇒అతికొద్దిమందికి మాత్రమే తెలిసిన విషయం ఏమిటంటే.. 2006లో ఒకసారి ఉద్యోగం వదిలేయాలన్న నిర్ణయానికి వచ్చేశారు అరుంధతి! అందుకు కారణం.. వాళ్ల అమ్మాయిని చదివించడానికి మంచి స్కూలు దొరక్కపోవడమే. అప్పుడామె లక్నోలో జనరల్ మేనేజర్‌గా ఉన్నారు. ఆమె బాస్ ఎం.ఎస్.వర్మ కల్పించుకుని ‘అది మంచి ఆలోచన కాదేమో’ అనడంతో ఆమె ఆ ఉద్యోగంలో కొనసాగారు.
అరుంధతీ భట్టాచార్య (60), ఎస్.బి.ఐ. ఛైర్‌పర్సన్
జన్మస్థలం : కోల్‌కతా
జన్మదినం : 18 మార్చి 1956
చదువు : ఇంగ్లిష్ లిటరేచర్
కొలువు : ఎస్.బి.ఐ.
తల్లిదండ్రులు : {పద్యుత్ కుమార్ ముఖర్జీ (భిలాయ్ స్టీల్ ప్లాంట్ పూర్వపు ఉద్యోగి) కల్యాణి ముఖర్జీ (హోమియోపతి కన్సల్టెంట్)
తోబుట్టువు : అదితి బసు (అక్క)
భర్త : {పితిమోయ్ భట్టాచార్య (ఐఐటి, ఖరగ్‌పూర్ మాజీ ప్రొఫెసర్)
కూతురు : సుకృతి