ఈ నలుగురిలో వారసుడెవరు?  | Who is next rbi governor? | Sakshi
Sakshi News home page

ఈ నలుగురిలో వారసుడెవరు? 

Published Tue, Dec 11 2018 1:02 AM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM

Who is next rbi governor? - Sakshi

ఆర్‌బీఐ గవర్నరు పదవికి ఉర్జిత్‌ పటేల్‌ ఆకస్మికంగా రాజీనామా చేయటంతో కీలక పదవికి ఖాళీ ఏర్పడింది. బ్యాంకింగ్‌ రంగాన్ని నడిపించటమే కాదు... తద్వారా యావత్తు ఆర్థిక వ్యవస్థకూ దిశానిర్దేశం చేసే ఈ కీలక పదవి తదుపరి ఎవరిని వరిస్తుందనే విషయమై జోరుగా ఊహగానాలు సాగుతున్నాయి. ప్రస్తుతానికయితే ఆర్‌బీఐ డెప్యూటీ గవర్నరు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్, ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌తో పాటు ప్రస్తుత కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్, సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పేర్లు వినిపిస్తున్నాయి.  

విశ్వనాథన్‌ లేదా సుభాష్‌ చంద్రగార్గ్‌?  
డెప్యూటీ గవర్నర్లను గవర్నర్‌గా నియమించటమనే సంప్రదాయాన్ని చాలా సందర్భాల్లో ప్రభుత్వాలు పాటిస్తున్నాయి. ఉర్జిత్‌ పటేల్‌ కూడా అలా వచ్చినవారే. రఘురామ్‌ రాజన్‌కు తదుపరి పొడిగింపు ఇస్తారని అంతా ఊహిస్తున్న సమయంలో కొన్ని అంశాల్లో విభేదాల వల్ల కేంద్రం ఆయనకు మరోసారి పొడగింపు ఇవ్వలేదు. అప్పటికప్పుడు కొత్త గవర్నర్‌గా వచ్చే వ్యక్తికి ఆర్‌బీఐపై పూర్తి అవగాహన ఉండాలి కనక అప్పట్లో ఉర్జిత్‌ను ఎంచుకుందనే వాదనలు వినిపించాయి. ఇప్పుడు పరిస్థితి ఇంకాస్త భిన్నమనే చెప్పాలి. ఎందుకంటే పటేల్‌ రాజీనామా ముందుగా తెలిసినది కాదు. అకస్మాత్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు కనక... కొత్తగా వచ్చే గవర్నరు ఆ వ్యవస్థతో బాగా సంబంధం ఉన్నవారైతేనే నయమన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో సహజంగానే డెప్యూటీ గవర్నరు ఎన్‌ఎస్‌ విశ్వనాథన్‌ పేరు వినిపిస్తోంది. ఇప్పటికప్పుడు పరిస్థితిని చక్కదిద్దాలంటే సమర్థుడైన డెప్యూటీ గవర్నరుకే బాధ్యతలు అప్పగించటం మంచిదన్నది ఆర్థిక వర్గాల భావన. ఇక సుభాష్‌ చంద్ర గార్గ్‌ను తీసుకున్నా ఆయన ప్రస్తుతం ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శిగా ఉన్నారు. పైపెచ్చు ఈ హోదాలో ఆర్‌బీఐ బోర్డులోనూ కొనసాగుతున్నారు. కాబట్టే ఈయన పేరు కూడా తెరపైకి వస్తోంది.  
శక్తికాంత దాస్, అజయ్‌ త్యాగి కూడా... 

మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్మన్‌గా అజయ్‌ త్యాగి ప్రస్తుతం కొనసాగుతున్నారు. మార్కెట్లకు సంబంధించి పలు సంస్కరణలు తేవటంతో పాటు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు పలు అంశాల్లో దన్నుగా ఉంటూ వస్తున్నారు. ఇక ఆర్థిక వ్యవహారాల విభాగం మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్‌ గతంలో ఆ హోదాలో ఆర్‌బీఐ బోర్డులో కొన్నాళ్లున్నారు. ఆయనకూ ఆర్‌బీఐ గవర్నెన్స్‌ పట్ల అవగాహన ఉంది. పైపెచ్చు ఆయనకు మోదీ ప్రభుత్వంతో మంచి సంబంధాలే ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా గార్గ్, దాస్‌ పేర్లు కూడా గవర్నర్‌ పదవి రేసులో వినిపిస్తున్నాయి. 

తక్షణం తాత్కాలిక గవర్నర్‌ నియామకం 
ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా నేపథ్యంలో తక్షణం ప్రభుత్వం తాత్కాలిక గవర్నర్‌ను నియమించాల్సి ఉంటుందని అత్యున్నత స్థాయి అధికారి ఒకరు తెలిపారు. తరవాతే కొత్త గవర్నర్‌ నియామకం జరుపుతారన్నది ఆయన అభిప్రాయం. గవర్నర్‌ లేదా డిప్యూటీ గవర్నర్‌ రాజీనామా పరిస్థితుల్లో ప్రభుత్వం తనకు తానుగా కానీ లేదా ఆర్‌బీఐ బోర్డు సిఫారసుల ప్రాతిపదికనగానీ కొత్త నియామకం జరపాల్సి ఉంటుందని ఆర్‌బీఐ యాక్ట్, 1934 పేర్కొంటోంది. 

కేంద్రం తగిన నిర్ణయం 
ఆర్‌బీఐ కార్యకలాపాల పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉంది. ఆర్‌బీఐ– కేంద్రం మధ్య సన్నిహిత సహకారమూ అవసరమే. అందుకని గవర్నర్‌ నియామకంపై కేంద్రం తగిన నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తున్నా. 
– రాకేష్‌ మోహన్, 

ఆర్‌బీఐ మాజీ డెప్యూటీ గవర్నర్‌  కేంద్రానికి ‘ప్లాన్‌ బీ’ ఉంటుంది... 
ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలన్న దానిపై కేంద్రానికి ఎప్పుడూ ‘ప్లాన్‌ బీ’ ఉంటుంది. వెంటనే నియామకం జరిపితే, ఇప్పటికే ఒకరు ఎంపికైపోయారన్న భావన వ్యక్తమవుతుంది. వారం దాటిపోతే ఇదంతా రాజకీయమైపోతుంది. వీటన్నింటినీ సమతౌల్యం చేస్తూ నిర్ణయం ఉంటుంది 
– ప్రణబ్‌ సేన్, మాజీ చీఫ్‌ స్టాటిస్టీషియన్‌ 

ఇదీ... ఆర్‌బీఐ బోర్డు 
డెప్యూటీ గవర్నర్లు నలుగురు... 
ఎన్‌ఎస్‌ విశ్వనాథన్, విరాల్‌ ఆచార్య, 
బి.పి.కానుంగో, మహేశ్‌కుమార్‌ జైన్‌ 
డైరెక్టర్లు 12 మంది: 
పీకే మహంతి, డి.ఎస్‌.సంఘ్వీ, 
రేవతీ అయ్యర్, సచిన్‌ చతుర్వేది, నటరాజన్‌ చంద్రశేఖరన్, బీఎన్‌ జోషి, సుధీర్‌ మన్కడ్, అశోక్‌ గులాటీ, మనీష్‌ సబర్వాల్, 
ఎస్‌కే మరాఠీ, స్వామినాథన్‌ గురుమూర్తి, సుభాష్‌ చంద్రగార్గ్, రాజీవ్‌ కుమార్‌.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement