రాజన్ వెళ్లెన్.. ఉర్జిత్ వచ్చెన్
♦ ఆర్‌బీఐ కొత్త గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్...
♦ బాధ్యతలు అప్పగించిన రఘురామ్ రాజన్
♦ ద్రవ్యోల్బణంపై పోరు కొనసాగిస్తారని వ్యాఖ్య
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ ఆదివారం తన పదవీ బాధ్యతలను ఉర్జిత్ పటేల్‌కు అప్పగించి ఆర్‌బీఐలో మూడేళ్ల ప్రయాణాన్ని ముగించారు. కాగా, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ రాజన్‌కు గౌరవపూర్వకంగా శనివారం వీడ్కోలు విందు(డిన్నర్)ను ఏర్పాటు చేసింది. దీనికి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పాటు ఆర్థిక శాఖకు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ద్రవ్యోల్బణం కట్టడికి తాము ప్రారంభించిన చర్యలను ఉర్జిత్ కొనసాగించగలరని రాజన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
వీడ్కోలు నేపథ్యంలో ఫారెక్స్ డీలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘గడిచిన మూడేళ్లుగా ఆర్‌బీఐ ద్రవ్యపరపతి విధానానికి సంబంధించి ఉర్జిత్ చాలా కీలకంగా పనిచేశారు. రానున్నకాలంలో ద్రవ్యోల్బణం లక్ష్యాలను సాధించే విషయంలో ఆయన పరపతి విధాన కమిటీ(ఎంపీసీ)కి సమర్థంగా దిశానిర్ధేశం చేయగలరన్న సంపూర్ణ విశ్వాసం ఉంది’ అని రాజన్ వ్యాఖ్యానించారు. కాగా, ఆదివారం నుంచే పటేల్ పదవీకాలం మొదలైనప్పటకీ నేడు సోమవారం వినాయక చవితి సెలవు నేపథ్యంలో 6న ఆయనకు గవర్నర్ రోజువారీ కార్యకలాపాల్లోకి అడుగుపెట్టే తొలి రోజు కానుంది.
ద్రవ్యోల్బణం దిగొస్తుంది...: 2017 మార్చికల్లా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని 5 శాతానికి తగ్గించాలన్నది ఆర్‌బీఐ లక్ష్యం కాగా, ప్రస్తుతం ఇది 6 శాతానికి పైగానే(జూలైలో) ఉండటాన్ని రాజన్ ప్రస్తావిస్తూ... రానున్న నెలల్లో కచ్చితంగా దిగొస్తుందని అభిప్రాయపడ్డారు. ద్రవ్యోల్బణాన్ని 4 శాతం స్థాయికి(2 శాతం అటూఇటుగా) కట్టడి చేయాని ఆర్‌బీఐకి ప్రభుత్వం లక్ష్యంగా నిర్ధేశించడం తెలిసిందే. మరోపక్క, వడ్డీరేట్లను రాజన్ తగ్గించడం లేదంటూ విమర్శించినవాళ్లకు ఇప్పుడు కొత్త గవర్నర్ ఉర్జిత్ పటేల్‌పై అంచనాలు చాలా పెరిగాయి. మరోపక్క, ఆఖరి పాలసీ సమీక్ష(ఆగస్టు)లో రాజన్ పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించిన సంగతి తెలిసిందే.
ప్రధానంగా 2015 నుంచి చూస్తే రాజన్ కీలకమైన రెపో రేటును 1.5 శాతం తగ్గించగా.. బ్యాంకులు మాత్రం తమ రుణరేట్ల తగ్గింపులో ఈ ప్రయోజనాన్ని దాదాపు సగం మేరకు మాత్రమే తమ కస్టమర్లకు బదలాయించడం గమనార్హం. ప్రధానంగా కుప్పలుగా పేరుకుపోతున్న మొండిబకాయిల(ఎన్‌పీఏ)తో బ్యాంకుల లాభదాయకత ఘోరంగా దెబ్బతినడమే దీనికి కారణంగా నిలుస్తోంది. ప్రభుత్వం రంగ బ్యాంకులు 2015-16లో ఎన్‌పీఏల కారణంగా ఏకంగా రూ.17,999 కోట్ల నికర నష్టాలను చవిచూడటం దీనికి నిదర్శనం. ఇదే కాలంలో స్థూల ఎన్‌పీఏలు రూ.6 లక్షల కోట్లకు వీటిపై ప్రొవిజనింగ్ రూ.1.8 లక్షల కోట్లకు(87 శాతం పెరిగింది) ఎగబాకింది.
రాక్‘స్టార్’ రాజన్...
‘నా పేరు రాజన్.. నేను ఏం చేయాలో అది చేస్తా’ ఆర్‌బీఐ గవర్నర్‌గా మూడేళ్ల క్రితం తనను తాను పరిచయం చేసుకుంటూ రఘురామ్ గోవింద్ రాజన్ అన్న మాటలివి. ఈ మాటలకు తగ్గట్టే.. తన పదవీ కాలంలో ఎన్నో సంచలన నిర్ణయాలు, చాకచక్యమైన విధానాలతో తన సమర్ధతను నిరూపించుకున్నారు రాజన్. అంతేకాదు ఆ స్థాయిలో వివాదాస్పద వ్యాఖలు, కుండబద్దలుకొట్టేలా మాట్లాడిన మాటలతో కూడా ఆయన పేరు మార్మోగింది. ‘బాండ్ ఆఫ్ మింట్ స్ట్రీట్’, ‘రాక్‌స్టార్’ సెంట్రల్ బ్యాంకర్ అంటూ కొందరు ఆయనను కీర్తించగా... మరికొందరు ఆయన ముక్కుసూటితనాన్ని జీర్ణించుకోలేక వ్యక్తిగత విమర్శలతో దాడి చేసిన సంఘటనలూ జరిగాయి.
మూడేళ్ల పదవీకాలంలో ద్రవ్యోల్బణంపై అలుపెరుగని పోరాటం.. బ్యాంకుల మొండిబకాయిల సమస్యకు ‘క్లిష్టతరమైన చికిత్స’తో పాటు ఇంకా అనేక కీలక అంశాలపై రాజన్ దృష్టిసారించారు. అయితే, ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు అధికార పక్షానికి ఇబ్బందిగా మారడంవల్లే రెండో ఇన్నింగ్స్‌కు అవకాశం ఇవ్వలేదన్న వాదనలూ ఉన్నాయి. భారత్ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అంశాన్ని పేర్కొంటూ ‘గుడ్లివాళ్ల దేశంలో ఒంటికన్ను ఉన్నోడే రాజు’ అంటూ ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా నిలిచింది. రాజన్ కావాలనే వడ్డీరేట్లను తగ్గించకుండా ఆర్థిక వ్యవస్థను దెబ్బతీశారని, అసలు ఆయనకు దేశభక్తే లేదని, భారతీయుడు కూడా కాదంటూ బీజేపీకి చెందిన సుబ్రమణ్యస్వామి రాజన్‌పై విరుచుకుపడటం తెలిసిందే.
ఇక మళ్లీ అధ్యాపక వృత్తిలోకి...
2008 నాటి ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని ముందుగానే ఊహించి చెప్పి అంతర్జాతీయంగా పేరుప్రఖ్యాతులు సంపాదించిన ఘనత 53 ఏళ్ల రాజన్ సొంతం. గతంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎంఎఫ్) చీఫ్ ఎకనమిస్ట్‌గా, కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారుగా ఆయన కీలక బాధ్యతలు నిర్వహిచారు. ఇక ఆర్‌బీఐకి విడ్కోలు చెప్పాక మళ్లీ ఆయన తన పాత అధ్యాపక వృత్తిలోకి వెళ్లిపోనున్నారు. షికాగో యూనివర్సిటీకి చెందిన బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఆన్‌లీవ్ ప్రొఫెసర్‌గా ఉన్న రాజన్ మళ్లీ త్వరలోనే అక్కడ పాఠాలను బోధించేందుకు సిద్ధమవుతున్నారు.
ఉర్జిత్‌పై భారీ అంచనాలు...
ఆర్‌బీఐ ద్రవ్యోల్బణం కట్టడి విధానం రూపకల్పనకు నేతృత్వం వహించిన ఉర్జిత్ పటేల్ గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఇప్పుడు రాజన్ స్థానంలో కొత్త గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆయనపై అటు కార్పొరేట్లకు ఇటు ప్రభుత్వానికి భారీ అంచనాలే ఉన్నాయి. అయితే, ద్రవ్యోల్బణం కట్టడితో పాటు రాజన్ పూర్తిచేయకుండా వెళ్తున్న బ్యాంకుల మొండిబకాయిల(ఎన్‌పీఏ)కు చికిత్స అనేవి ఆయన తక్షణ కర్తవ్యంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఎన్‌పీఏలను తగ్గించే అంశం పటేల్‌కు ఇప్పుడున్న పరిస్థితుల్లో సవాలేననేది వారి అభిప్రాయం.
ఎందుకంటే ఈ విషయంలో ఆర్‌బీఐ చాలా అత్యుత్సాహం చూపిందని, పెట్టుబడుల వాతావరణం దెబ్బతిందంటూ పలు బ్యాంకులు, కార్పొరేట్లు ఇతరత్రా వర్గాలు వాదిస్తూ వస్తున్నాయి. అంతేకాదు, ప్రపంచ మార్కెట్లు తీవ్ర కల్లోలంలో ఉన్న సమయంలో, రూపాయి విలువ పాతాళానికి పడిపోయిన పరిస్థితుల్లో రాజన్ బాధ్యతలు చేపట్టగా.. ఉర్జిత్‌కు ఇప్పుడు ఇలాంటి తీవ్ర సమస్యలేవీ లేవు. గతంలో ఉర్జిత్ పటేల్ రిలయన్స్ సహా కొన్ని కంపెనీల్లో డెరైక్టర్‌గా కూడా పనిచేశారు. ఈ నేపథ్యంలో మొండిబకాయిల సమస్య పరిష్కారం కోసం ఆర్‌బీఐ ప్రవేశపెట్టిన అసెట్ క్వాలిటీ రివ్యూ(ఏక్యూఆర్) కారణంగా కంపెనీలు, బ్యాంకులు ఎదుర్కొంటున్న సమస్యలను మెరుగ్గా అర్థం చేసుకోగలరనేది కార్పొరేట్ కంపెనీలు, బ్యాంకర్ల అభిప్రాయం.
ఉర్జిత్ గురించి...
⇔ 1963, అక్టోబర్ 28న గుజరాత్‌లో పుట్టారు.
⇔ ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ(1986)లో ఎంఫిల్, యేల్ యూనివర్సిటీ(1990)లో పీహెచ్‌డీ(ఎకనమిక్స్) చేశారు.
⇔ 1990 నుంచి 1995 వరకూ ఐఎంఎఫ్‌లో పనిచేశారు. ఆతర్వాత 1996-97లో డిప్యూటేషన్‌పై ఆర్‌బీఐకి ఆయన బదిలీ అయ్యారు. రెండేళ్లపాటు విధులు నిర్వర్తించారు.
⇔ అంతేకాకుండా ఆర్థిక శాఖకు చెందిన ఆర్థిక వ్యవహరాల విభాగంలో మూడేళ్లపాటు కన్సల్టెంట్‌గానూ పనిచేశారు.
⇔ ప్రస్తుతం ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ నుంచి గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.