రూ. 2,000 నోటుకు కళ్లెం!! | RBI stops printing, circulating Rs 2,000 currency notes | Sakshi
Sakshi News home page

రూ. 2,000 నోటుకు కళ్లెం!!

Published Fri, Jan 4 2019 12:12 AM | Last Updated on Fri, Jan 4 2019 8:06 AM

RBI stops printing, circulating Rs 2,000 currency notes - Sakshi

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రవేశపెట్టిన రూ. 2,000 నోట్ల ముద్రణను రిజర్వ్‌ బ్యాంక్‌ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది. క్రమంగా ఈ నోట్ల చలామణీని తగ్గించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. పన్నులు ఎగవేసేందుకు, మనీల్యాండరింగ్‌కు ఈ పెద్ద నోట్లను కొన్ని వర్గాలు  దుర్వినియోగం చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం అనుమానిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే వీటి ముద్రణ నిలిచిపోనుందని పేర్కొన్నాయి. అయితే, చలామణీని తగ్గించడమంటే రూ. 2,000 నోట్లు చెల్లకుండా పోవని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం చలామణీలో ఉన్న నోట్లు యథాప్రకారం చెల్లుబాటవుతాయని, అయితే వీటిని దశలవారీగా తొలగించే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వివరించాయి.

మరోవైపు, రూ. 2,000 నోట్ల వార్తలపై స్పందించిన కేంద్ర ఆర్థిక శాఖ వర్గాలు .. వీటి ముద్రణను ’కనిష్ట’ స్థాయికి తగ్గించినట్లు తెలిపాయి. ముద్రించాల్సిన కరెన్సీ పరిమాణంపై ఆర్‌బీఐ, కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం సాధారణమేనని వివరించాయి. చలామణీలో ఉన్న నగదును ఇందుకు ప్రాతిపదికగా తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నాయి. రూ. 2,000 నోట్లను ప్రవేశపెట్టినప్పుడే క్రమంగా వీటి ముద్రణ తగ్గించాలని నిర్ణయించుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ‘రూ. 2,000 కరెన్సీ నోట్ల ముద్రణను గణనీయంగా తగ్గించడం జరిగింది. కనిష్ట స్థాయికి పరిమితం చేయాలని నిర్ణయించారు. ఇలాంటివి కొత్తేమీ కాదు’ అని వివరించారు.

మొత్తం కరెన్సీలో 37 శాతం నోట్లు..
బ్లాక్‌మనీని కట్టడి చేసే లక్ష్యంతో 2016 నవంబర్‌లో రూ.1,000, రూ. 500 డినామినేషన్ల పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అప్పట్లో భారీ స్థాయిలో ఏర్పడిన నగదు కొరతను సత్వరం అధిగమించేందుకు ప్రభుత్వం రూ. 2,000 నోట్లను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెచ్చింది. ఆర్‌బీఐ గణాంకాల ప్రకారం 2017 మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న 2,000 నోట్ల సంఖ్య సుమారు 328.5 కోట్లుగా ఉంది. ఏడాది తర్వాత 2018 మార్చి ఆఖరు నాటికి ఇది స్వల్పంగా పెరిగి 336.3 కోట్ల నోట్లకు చేరింది.

2017 మార్చి ఆఖరు నాటికి మొత్తం కరెన్సీ విలువలో రూ. 2,000 నోట్ల వాటా 50.2 శాతంగా ఉండగా.. 2018 మార్చి ఆఖరు నాటికి ఇది 37.3 శాతానికి తగ్గింది. గతేడాది మార్చి ఆఖరు నాటికి చలామణీలో ఉన్న మొత్తం కరెన్సీ విలువ రూ. 18.03 లక్షల కోట్లు కాగా ఇందులో సుమారు 37 శాతం (దాదాపు రూ. 6.73 లక్షల కోట్ల విలువ) రూ. 2,000 డినామినేషన్‌ నోట్లు ఉన్నాయి. మరో 43 శాతం (విలువ సుమారు రూ. 7.73 లక్షల కోట్లు)  రూ. 500 నోట్లు ఉన్నాయి. మిగతా నోట్లు అంతకన్నా తక్కువ విలువ గలవి.

అప్పట్లోనే విమర్శలు..
పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్‌కు ఉపయోగపడుతోందన్న కారణంతో 2016 నవంబర్‌లో రూ.1,000 నోట్లను రద్దు చేసిన మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రూ.2,000 నోట్ల రూపంలో అంతకన్నా అధిక విలువ గల నోట్లను ప్రవేశపెట్టడంపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వచ్చాయి. పన్ను ఎగవేతదారులకు, మనీల్యాండరర్స్‌కు ఈ అధిక విలువ కరెన్సీ నోట్లు మరింత బాగా ఉపయోగపడతాయని, మనీల్యాండరింగ్‌ లాంటివి అరికట్టడమే తమ ధ్యేయమని చెప్పుకునే కేంద్రం లక్ష్యాల సాధనకు ఇవి ప్రతికూలమని విమర్శలు వెల్లువెత్తాయి.

ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ దిగ్గజం కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ వంటి ప్రముఖులు కూడా దీన్ని ప్రశ్నించిన వారిలో ఉన్నారు. దీనికి తగ్గట్లుగానే గతేడాది పలు నగరాల్లో తీవ్ర స్థాయిలో నగదు కొరత ఏర్పడింది. రాష్ట్రాల్లో ఎన్నికలు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌లో నీరవ్‌ మోదీ కుంభకోణం నేపథ్యంలో చాలా మంది ఈ పెద్ద నోట్లను భారీ స్థాయిలో దాచి పెట్టుకుని ఉండొచ్చన్న సందేహాలు వ్యక్తమయ్యాయి.     వీటిని రుజువు చేస్తూ ఆదాయ పన్ను శాఖ   సోదాల్లో పలు చోట్ల భారీ ఎత్తున రూ. 2,000 నోట్లు బయటపడ్డాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement