
న్యూఢిల్లీ: 2016లో నోట్ల రద్దు తర్వాత తొలిసారి చలామణిలోకి వచ్చిన రూ.2000 నోటు ముద్రణను నిలపివేసినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గత రెండేళ్లుగా రూ.2000 నోటును ముద్రించడం ఆపివేసినట్లు సోమవారం జరిగిన లోక్‌సభ సమావేశాల్లో కేంద్రం ప్రకటించింది. ఈ అంశంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.
2018, మార్చి 30నాటికి మొత్తం 336.2 కోట్ల రూ.2000 నోట్లు చెలామణిలో ఉన్నాయని, 2021, ఫిబ్రవరి 26 నాటికి వీటి సంఖ్య 249.9 కోట్లకు తగ్గిందని మంత్రి పేర్కొన్నారు. లావాదేవీల డిమాండ్ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటుందని మంత్రి తెలిపారు. కాగా, నల్లధనానికి అడ్డుకట్ట వేసే ఉద్దేశంతో 2016లో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి రూ.2000 నోటును చలామణిలోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment