బ్యాంకులకు మరింత మూలధనం కావాలి | RBI seeks more funds for recapitalisation of banks | Sakshi
Sakshi News home page

బ్యాంకులకు మరింత మూలధనం కావాలి

Published Fri, Jun 12 2015 2:25 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM

బ్యాంకులకు మరింత మూలధనం కావాలి - Sakshi

బ్యాంకులకు మరింత మూలధనం కావాలి

2015-16లో రూ.7,940 కోట్లు
సరిపోవన్న ఆర్‌బీఐ - ఆర్థికశాఖకు లేఖ
న్యూఢిల్లీ:
ప్రభుత్వ రంగ బ్యాంకులకు తాజా మూలధనంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) కేంద్రం కేటాయించిన రూ.7,940 కోట్లు సరిపోవని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) అభిప్రాయపడింది. ఆర్థిక మంత్రిత్వశాఖ మరిన్ని నిధులను కేటాయించడం అవసరమని ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్‌ఎస్ ముంద్రా గురువారం ఇక్కడ విలేకరులతో అన్నారు.

మొండి బకాయిలు పెరిగిపోతుండడం, మరోవైపు రుణ వృద్ధి ద్వారా ఆర్థిక వృద్ధికి తోడ్పాటును అందించాల్సిన అవసరం ఉండడం వంటి అంశాల రీత్యా  బ్యాంకులకు కేంద్రం మరింత మొత్తంలో తాజా మూలధనాన్ని అందించాల్సి ఉందని ముంద్రా అన్నారు. ఈ మేరకు ఒక లేఖను సైతం ఆర్థికమంత్రిత్వశాఖకు ఆర్‌బీఐ రాసినట్లు ఆయన వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం కేంద్రం 9 ప్రభుత్వ రంగ బ్యాంకులకు వాటి పనితీరు ప్రాతిపదికన రూ.6,990 కోట్ల తాజా మూలధనం ఇచ్చింది. అయితే పనితీరు ప్రాతిపదికన బ్యాంకులకు మూలధనం సమకూర్చడం సరికాదని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.

ఎన్‌పీఏలపై సమగ్ర వ్యూహం
మొండిబకాయిల (ఎన్‌పీఏ) సమస్యలను పరిష్కరించడంలో అత్యుత్తమ వ్యూహాలను అవలంభించాల్సిన అవసరం ఉందని ముంద్రా అన్నారు. ఎన్‌పీఏలు తలెత్తే పరిస్థితిని దాచిపెట్టడం వల్ల ఎవరికీ ప్రయోజనం ఉండదని అన్నారు. ఏదైనా అకౌంట్ మొండిబకాయిగా మారుతున్నట్లయితే, ఆ అకౌం ట్‌కు సంబంధించి రుణ గ్రస్తునికి సాయంచేసే దిశలో బ్యాంకింగ్ తగిన చర్యలు తీసుకోవాలన్నారు.

2014 డిసెంబర్ నాటికి 27 ప్రభుత్వ రంగ బ్యాంకుల స్థూల మొండి బకాయిలు రూ. 2,50,531 కోట్లు. మొత్తం రుణాల్లో ఇవి దాదాపు 5.6 శాతం. మొత్తం మొండిబకాయిల్లో 30 టాప్ డిఫాల్టర్ల వాటా రూ.95,122 కోట్లు. బ్యాంకింగ్ వ్యవస్థలో మొండిబకాయిల భారం తీవ్రం కానుందని విశ్లేషణలు వస్తున్నాయి. గడచిన ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.4% కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఈ రేటు 5.3- 5.9% శ్రేణిలో ఉండే అవకాశం ఉందని అంచనా. మందగమనం నేపథ్యంలో పునర్‌వ్యవస్థీకరణ జరిగిన కొన్ని అకౌంట్లు మొండిబకాయిలుగా మారొచ్చని కొం దరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
 
ఎఫ్‌వీలలో తగ్గిన కంపెనీల పెట్టుబడులు
ముంబై:
ఫారిన్ వెంచర్ల (ఎఫ్‌వీ)లో భారత్ కంపెనీల ప్రత్యక్ష పెట్టుబడులు మే నెలలో 15 శాతం పడిపోయాయి. ఆర్‌బీఐ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2014 మే నెలలో ఈ పెట్టుబడుల విలువ 178 కోట్ల డాలర్లు. అయితే ఈ మొత్తం 2015 మేలో 151 కోట్ల డాలర్లకు పడిపోయింది. విదేశాల్లో భారీ పెట్టుబడుల పెట్టిన భారత్ కంపెనీల్లో ఫస్ట్‌సోర్స్ సొల్యూషన్స్ (18 కోట్ల డాలర్లు), విప్రో (14 కోట్ల డాలర్లు), గోద్రేజ్ కన్జూమర్ ప్రొడక్ట్స్ (13 కోట్ల డాలర్లు), పిరమాల్ ఎంటర్‌ప్రైజెస్ (5 కోట్ల డాలర్లు), స్టార్‌లింగ్ అండ్ వెల్‌సన్ (5 కోట్ల డాలర్లు), కెయిర్ ఇండియా (4 కోట్ల డాలర్లు) ఉన్నాయి.
 
అకౌంట్ తెరిచేందుకు ‘వినియోగ’ బిల్లు చాలు..
ముంబై:
బ్యాంకులో కానీ, లేదా మరేదైనా ఆర్థిక సంస్థలోకానీ అకౌంట్ ప్రారంభానికి సంబంధించి అడ్రస్ ధృవీకరణకు  పోస్ట్‌పెయిడ్ మొబైల్ సర్వీస్, పైప్డ్ గ్యాస్, విద్యుత్, టెలిఫోన్, నీటి సరఫరా వంటి యుటిలిటీ బిల్లులు సరిపోతాయని ఆర్‌బీఐ గురువారం పేర్కొంది. అయితే ఈ బిల్లులు రెండు నెలలకన్నా మించి పాతవి కాకూడదని ఆర్‌బీఐ ఒక నోటిఫికేషన్‌లో స్పష్టం చేసింది. బ్యాంక్ అకౌంట్ తేలిగ్గా తెరవడానికి వీలుగా ఈ సరళీకరణ విధానాన్ని అవలంభిస్తున్నట్లు, ‘అధికారిక చెల్లుబాటు పత్రాల్లో’ (ఓవీడీ) వీటిని చేర్చినట్లు నోటిఫికేషన్ తెలిపింది.

వీటితోపాటు వసతికి సంబంధించి ప్రభుత్వం, నియంత్రణ సంస్థలు, ప్రభుత్వం రంగ సంస్థలు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు, లిస్టెడ్ కంపెనీలు జారీ చేసే లెటర్ ఆఫ్ అలాట్‌మెంట్‌ను కూడా ఓవీడీ పరిధికి తెస్తున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లెసైన్సులు, పాన్ కార్డులు, వోటర్ ఐడెంటిటీ కార్డ్, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ జాబ్ కార్డ్, ఆధార్ నంబర్‌లను మాత్రమే ఓవీడీగా పరిగణించాలని గత ఏడాది జూలైలో ఆర్‌బీఐ  పేర్కొంది. కొన్ని వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో తాజా ఆదేశాలను జారీ చేసింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement