
మూడు దశాబ్దాల అన్యాయానికి ముగింపు లేదా?
అవలోకనం
భారత్‌లో అల్లర్లకు సంబంధించిన సాధారణ అంశం ఏదంటే అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని కొనసాగిస్తుంది. కాబట్టి దర్యాప్తు ప్రక్రియే వెన్నుపోటుకు గురవుతుంది. కాంగ్రెస్ పాలనలో చాలాసార్లు ఇలాగే జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక సాధనం అందుబాటులో ఉంది. సిట్‌కి అది మరొకసారి పొడిగింపు ఇవ్వకూడదు, తాజా విచారణపై ప్రజలకు నివేదిక ఇవ్వాలి. సకాలంలో న్యాయం చేకూర్చకపోవడం అంటే న్యాయాన్ని తిరస్కరిస్తున్నట్లే లెక్క. ఈ సందర్భంలో కూడా మరోసారి అదే జరిగితే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు.
సిక్కులపై 1984లో జరిగిన హత్యాకాండలో బాధితులకు న్యాయం చేయడంపై భారత ప్రభుత్వం ఎంత చిత్తశుద్ధితో ఉంది? భారతీయులందరూ ఆసక్తి చూపవ లసిన ప్రశ్న ఇది. ఎందుకంటే ఇది మూక హింసాకాండ ఘటనలు జరిగిన సంద ర్భాల్లో ఈ దేశం న్యాయం చేకూర్చగలదా అనే అంశాన్ని నిర్ధారించే ప్రశ్న. ఇందిరా గాంధీ హత్యానంతరం జరిగిన మారణ కాండలో దేశవ్యాప్తంగా 3,325 మంది హత్యకు గురైతే, ఒక్క ఢిల్లీలోనే 2,733మందిని వధించారు. ఈ హత్యాకాండలో పాల్గొన్న వారిలో శక్తిమంతులైన కాంగ్రెస్ నేతలు ఉన్నట్లు ఆరోపించారు. వీరిలో హెచ్‌కెఎల్ భగత్ వంటి వారు విచారణను ఎదుర్కొనకుండానే మరణించారు. ఇక సజ్జన్ కుమార్, జగదీష్ టైట్లర్, కమల్‌నాథ్ వంటివారు ఇప్పటికీ బతికే ఉన్నారు. ఈ మారణకాండపై మొదట విచారించిన రంగనాథ్ మిశ్రా కమిషన్ వీరి ప్రకటన లను బాధితుల పరోక్షంలో రికార్డు చేసింది. పైగా హత్యాకాండ ఆరోపణల నుంచి రాజీవ్ గాంధీ ప్రభుత్వాన్ని విముక్తి చేసింది.
గత 32 ఏళ్లుగా కేంద్రంలో డజనుకు పైగా కాంగ్రెస్, కాంగ్రెసేతర ప్రభు త్వాలు వచ్చాయి, వెళ్లాయి కానీ ఈ కేసుల్లో ఎలాంటి పురోగతీ లేదు. వాజ్‌పేయి ప్రభుత్వం నానావతి కమిషన్‌ని నియమించింది. ఈ కమిషన్ తన నివేదికను మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అందచేసింది. ఈ నివేదికను బహిరంగ పర్చారు. అది వెల్లడించిన సమాచారం దేశాన్ని దిగ్భ్రాంతి పర్చింది. మన్మోహన్ కాంగ్రెస్ పార్టీ తరపున దేశానికి క్షమాపణలు చెప్పారు. బాధితులకు న్యాయం జరగలేదు.
మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ మారణకాండపై చర్య తీసుకుం టానని వాగ్దానం చేసి, 2014 డిసెంబర్ 23న జీపీ మాథుర్ నేతృత్వంలో కమిటీని నియమించింది. ఈ కేసుల విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పర్చాల్సిం దిగా మాథుర్ సిఫార్స్ చేశారు. పోలీస్ స్టేషన్లకు వెళ్లడం, గత కమిటీలు సేకరించిన సాక్ష్యాధారాలతో కూడిన ఫైళ్లను సిట్ చూడగలుగుతుంది. పైగా సాక్ష్యాధారాలు లభిస్తే తాజాగా నేరారోపణ చేసే అధికారం కూడా దీనికి ఉంటుంది.
సిట్‌ను 2015 ఫిబ్రవరి 12న ఏర్పర్చారు. అది ఆనాటి నుంచి పని ప్రారం భించింది కాని తాజా ఛార్జిషీటును నమోదు చేయలేకపోయింది. దీంతో 2015 ఆగస్టులో సిట్ బాధ్యతలను సంవత్సరం పాటు పొడిగించారు. అయితే 2016 ఆగస్టు నాటికి కూడా సిట్ తాజా ఛార్జిషీటును నమోదు చేయలేకపోయింది. దీని విచారణను బహిరంగంగా వెల్లడించలేదు. తర్వాత సిట్‌ను రెండోసారి పొడిగిం చారు. ఈ ఫిబ్రవరి 11కు దాని బాధ్యతలు ముగియనున్నాయి. ఈ గడువు తేదీ కూడా న్యాయాన్ని ప్రసాదించకపోతే నాటి మారణకాండలో మృతులు, బాధితుల పట్ల అది అన్యాయమే అవుతుంది.
1984 నాటి అల్లర్లకు సంబంధించి 650 కేసులను నమోదు చేసినట్లు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటిలో 18 కేసులను రద్దు చేయగా, 268 కేసులు అతీ గతీ లేవు. ఈ అన్ని కేసులనూ సిట్ మళ్లీ విచారించింది. ఈ నేపథ్యంలో హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన చేస్తూ ఇంతవరకు 218 కేసులను వివిధ దశల్లో పరిశీలిస్తున్నామని తెలిపింది. ఇంతవరకు 22 కేసులను తదుపరి విచారణ కోసం గుర్తించారు. వీటిపై తదుపరి పరిశీలనకు పోలీసులకు సిట్ నోటీసులిచ్చింది.
ప్రాథమిక సమాచార నివేదికలు గురుముఖి లేదా ఉర్దూ భాషలో ఉన్నందున ఈ కేసుల తనిఖీలో జాప్యం చోటుచేసుకుందని హోం శాఖ తెలిపింది. అయితే ఈ భాషల నుంచి అనువదించగల నిపుణులకు భారత్‌లో కొరత లేదు కాబట్టి హోం శాఖ ప్రకటనను నమ్మడం కష్టమే. హోంశాఖ ఇంకా ఇలా చెప్పింది. "ఈ కేసులు చాలా పాతవి, రికార్డులను వెతికి తనిఖీ చేయడం కష్టంగా ఉంటోంది... ఈ కష్టా లను పక్కనపెట్టి సిట్ వీటిని సవాలుగా తీసుకుంది, సూక్ష్మ స్థాయిలో ఈ కేసుల పరిశీలనకు అన్ని ప్రయత్నాలూ జరుగుతున్నాయి. ప్రభావిత కుటుంబాలకు న్యాయం చేకూర్చడానికి ఈ కేసుల పరిశీలన విషయంలో తగిన జాగ్రత్తలు తీసు కోవడమైనది" దురదృష్టవశాత్తూ, ఈ విచారణల్లో ఏదైనా పురోగతి ఉందా అనేందుకు ఎలాంటి ఆధారాలూ లేవు.
నేను పనిచేస్తున్న ఆమ్నెస్టీ ఇండియా సంస్థ ఈ అంశంపై గత ఏడాది ఢిల్లీలో ఒక సదస్సు నిర్వహించింది. నాటి మారణకాండలో హతులు, బాధితులకు ప్రాతినిధ్యం వహిస్తున్న వివిధ బృందాలతో కలిసి పని చేశాము కానీ వీరిలో ఎవరూ అంత సీరియస్‌గా ఉన్నట్లు కనిపించలేదు. ఉదా హరణకు, నాడు జరిగిన నేరాలకు సాక్షీభూతులై నిలిచి నేటికీ బతికి ఉన్నవారిలో ఎవరూ తమ ప్రకటనలను తిరిగి నమోదు చేయించడానికి లేదా మరేదైనా తనిఖీకి సిట్‌ను సంప్రదించినట్లు లేదు. ఇది సమస్యాత్మకమే. ఎందుకంటే బాధితుల్లో ఆ కేసులపై ఆసక్తి లేదని పైగా తగిన చర్య తీసుకోవడానికి వారు ఉద్దేశపూర్వకంగానే అయిష్టత ప్రదర్శిస్తున్నారని ఇది సూచిస్తోంది. తగిన విచారణ లేకుండా తాజా నేరారోపణలకు ఎవరు పూనుకుంటారు, వారికి న్యాయం ఎలా లభిస్తుంది? భార తీయ అల్లర్లకు సంబంధించిన సాధారణ విషయం ఏమిటంటే అధికారంలో ఉన్న పార్టీ అధికారాన్ని కొనసాగిస్తుంది. (దురదృష్టవశాత్తూ అలాంటి హింస వివిధ కమ్యూనిటీలను మరింతగా కూడగట్టడానికే తోడ్పడుతుంది) కాబట్టి దర్యాప్తు ప్రక్రియే వెన్నుపోటుకు గురవుతుంది. కాంగ్రెస్ పాలనలో భారతదేశంలో చాలా సార్లు ఇలాగే జరిగింది.
మూక హింస వల్ల ఒక సమాజంగా దెబ్బతింటున్న వారికి జరిగిన నష్టం పూరించేందుకు ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం వచ్చింది. ప్రస్తుతం పంజాబ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న పార్టీలన్నీకూడా 1984లో జరిగిన మారణకాండ బాధితులకు న్యాయం చేకూరుస్తామని తమ తమ ఎన్నికల ప్రణా ళికల్లో వాగ్దానం చేయడానికి అంగీకరించినవే. ఇది మంచి విషయం కూడా. ఏదేమైనప్పటికీ ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక సాధనం అందుబాటులో ఉంది. సిట్‌కి అది మరొకసారి పొడిగింపు ఇవ్వకూడదు, తాజా విచారణకు సంబంధించి ప్రజలకు నివేదిక ఇవ్వాలి. సకాలంలో న్యాయం చేకూర్చకపోవడం అంటే న్యాయాన్ని తిరస్కరిస్తున్నట్లే అవుతుంది. ఈ సందర్భంలోకూడా మరోసారి అదే జరిగితే అంతకుమించిన విషాదం మరొకటి ఉండదు.
వ్యాసకర్త కాలమిస్టు, రచయిత aakar.patel@icloud.com
ఆకార్ పటేల్