పదమూడు రోజుల కిడ్నాప్‌ ముందూ, వెనుకా | Review OF An Untamed State Book | Sakshi
Sakshi News home page

పదమూడు రోజుల కిడ్నాప్‌ ముందూ, వెనుకా

May 21 2018 1:38 AM | Updated on Apr 4 2019 3:25 PM

Review OF An Untamed State Book - Sakshi

కొత్త బంగారం
‘ఒకానొకప్పుడు నా జీవితం అద్భుత కథ. ఆ తరువాత, నేను ప్రేమించిన ప్రతీదాన్నుంచీ దొంగిలించబడ్డాను... మరణిస్తూ మరణిస్తూ గడిపిన ఎన్నో రోజుల తరువాత, నేనిప్పుడు మృతురాలిని’ అని ప్రారంభించిన ‘ఎన్‌ అన్‌టేమ్డ్‌ స్టేట్‌’, రాక్సీన్‌ గే తొలి నవల. 
నవలకున్న రెండు భాగాల్లో మొదటిదైన, ‘తర్వాత కలకాలం సుఖంగా’, ‘మిరీ’ అనబడే మిరయ్య జువ్వాల్‌ జామిసన్‌ దృష్టికోణంతో కొనసాగుతుంది. అమెరికాలో లాయర్‌గా ఉండి, హైతీలో ఉన్న పుట్టింటికి– అమెరికన్‌ భర్త మైకెల్‌తోనూ, పసికందైన కొడుకుతోపాటూ వచ్చిన మిరీ జీవితం సవ్యంగా సాగుతుంటుంది. ధనికులైన తల్లితండ్రుల ఇంట్లో అడుగు పెట్టినప్పుడే– ద్వీపంలో ఉన్న పేదవారికీ, ధనిక వర్గానికీ మధ్యనున్న ఉద్రిక్తతలను గమనిస్తుంది. ఒక రోజు, తల్లిదండ్రుల ఇంటినుండి బయటకి వస్తుండగా, భారీ ఆయుధాలు పట్టుకున్న గుంపొకటి ఆమెని అపహరిస్తుంది. తన్ని తాను ‘కమాండర్‌’ అని పిలుచుకునే వ్యక్తి ఆమెని బందీగా ఉంచి, విడుదల చేయడానికి ఆమె తండ్రిని, పది లక్షల యూఎస్‌ డాలర్లు అడుగుతాడు. డబ్బు చెల్లించిన తరువాత కూడా, కిడ్నాపర్లు తిరిగి మరింత డబ్బు కావాలంటారేమో అనుకున్న తండ్రి నిరాకరించినప్పుడు, గ్రహిస్తుంది: ‘కోపంతో గడిపే దేశంలో మనం నమ్మేవాళ్ళెవరూ ఉండరు.’ ఒక గదిలో నీళ్ళూ, తిండీ కూడా ఎక్కువ లేకుండా గడిపిన దృఢచిత్తం ఉన్న యీ యువతి, 13 రోజులు– దెబ్బలూ, హింసా, సామూహిక అత్యాచారాన్నీ ఎదుర్కుంటుంది. 
నవల రెండవ భాగం (ఒకానొకప్పుడు)లో– చెరనుంచి బయటకి వచ్చిన మిరీ, ‘స్వేచ్ఛ పొందినప్పటికీ, నేనింకా నిర్బంధంలోనే ఉన్నాను... హైతీ ఆశ్చర్యకరమైన వ్యత్యాసాలున్న దేశం. ఎంత అందంగా ఉంటుందో, అంతే కఠోరమైనది’ అనుకుంటుంది. విడుదల తరువాత, తన జీవితాన్ని చక్కబెట్టుకోవడానికి మిరీ చేసే ప్రయత్నాల ప్రయాణాన్ని నవల అనుసరిస్తుంది. చిందరవందరగా అయిన మిరీ మనఃస్థితి వల్ల– గతం, వర్తమానం, కొత్త సంఘటనలు మసగ్గా అవుతాయి. అపహరింపు వరకూ తిరిగి వెళ్ళిన మిరీ జ్ఞాపకం అక్కడే తిష్ట వేసుకుంటుంది.
ఆమె తిరిగి యూఎస్‌కు వెళ్ళినప్పుడు, అత్తగారు లొరైన్‌ ఆమెకి శుశ్రూష చేసి, పూర్వస్థితికి తీసుకు వస్తుంది. ‘నాకు ఏడుపు రాలేదు... నేనూ ఆవిడా కూడా మాట్లాడుకోలేదు. కూర్చున్నాం అంతే. భద్రంగా ఉండటం అంటే ఏమిటో అర్థం అయింది’ అంటుంది.
ఎల్లవేళలా భయపడుతూ ఉండటం మాని, మిరీ జీవితాన్ని య«థావిధిగా కొనసాగిస్తుంది. తిరిగి భర్తతో కాపురం చేయడం నేర్చుకుంటుంది. అప్పుడే హైతీలో 2010లో వచ్చిన భూకంపాల వల్ల తండ్రి మీద పగతో, మళ్ళీ పుట్టింటికి తిరిగి వస్తుంది. అయితే, ఆమె మానవత్వం, ఆమె ప్రతీకారాన్ని జయించినప్పుడు, ‘నేను ఆయన మొహం చూసినప్పుడు, నాకు కనిపించినదల్లా తను చేసిన ఘోరమైన తప్పువల్ల జీవితాంతం కుములుతూ గడిపే ఒక ముసలి వ్యక్తి మాత్రమే’ అంటూ, ‘తనలో ఇంకా మంచితనం’ మిగిలే ఉందని గుర్తిస్తుంది. 
గతానికీ, వర్తమానానికీ అద్భుతంగా మార్చి రాసిన నవల ఏ సంబంధాన్నీ విశ్లేషించకుండా వదిలిపెట్టదు.
నవల, ‘అపహరింపు’ అన్న అంశం మీదనే కాక, ఆ సంఘటన పరిణామాల గురించినది కూడా. రచయిత్రి శైలి స్పష్టంగా, సరళంగా, బిగుతుగా ఉంటుంది. పాఠకులకు మానసిక అలసట కలిగించినప్పటికీ, బలవంతంగా ముందుకి నెట్టి మరీ చదివించే పుస్తకం ఇది.   
హైతీలో ఆచరణలో ఉండే– ‘గుర్తింపు, ప్రత్యేకాధికారం’ అన్న జఠిలమైన అంశాలని నిలదీస్తారు గే. గ్యాంగ్‌ రేప్‌ సీన్ల, చిత్రహింస నడుమ– అనేకమైన కథనాత్మకాలని అల్లుతారు.
పుస్తకం మొదట 2014లో ‘గ్రోవ్‌ అట్లాంటిక్‌’ పబ్లిష్‌ చేసింది. ఆడియో పుస్తకం ఉంది. సినిమాగా కూడా తీస్తున్నారు.
-కృష్ణ వేణి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement