ఒకపరి భ్రమణం | Padma Priya You Again Book Review | Sakshi
Sakshi News home page

ఒకపరి భ్రమణం

Published Mon, Aug 24 2020 12:02 AM | Last Updated on Mon, Aug 24 2020 12:05 AM

Padma Priya You Again Book Review - Sakshi

ఆఫీసు నుంచి ట్యాక్సీలో ఇంటికి తిరిగివస్తూ, రోడ్డుకటువైపున తనలాగానే ఉన్న అమ్మాయిని చూసి ఆబెగేల్‌ ఉలిక్కిపడి ట్యాక్సీ ఆపేయించి దిగిపోతుంది. రోడ్డుదాటి దగ్గరనుంచి పరీక్షగా చూస్తే ఆ అమ్మాయి తనే, కచ్చితంగా తనే – సరిగ్గా ఇరవై రెండేళ్లప్పటి తను! ఆబెగేల్‌ విభ్రమంలోనుంచి తేరుకోకమునుపే ఆమె ఇంకొక యువకుడితో కలిసి వెళ్లిపోతుంది. ఆబెగేల్‌కి ఒక్క క్షణం అంతా  అగమ్యగోచరంగా ఉంటుంది. తనే, తనకి కనిపించటం ఏమిటి? నలభైఆరేళ్ల ఆబెగేల్‌ జీవితంలోకి ఇరవైరెండేళ్లప్పటి తన పూర్వరూప ప్రవేశంతో కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఆమెకి ‘ఏ’ అని పేరు పెట్టుకుంటుంది ఆబెగేల్‌. చిత్రకారిణి ఆబెగేల్, శిల్పకారుడు డెనిస్‌ వివాహానంతరం జీవికకోసం కళలను పక్కనపెట్టి ఉద్యోగాలు చేస్తూంటారు. ఇద్దరు టీనేజ్‌ పిల్లలతో హాయిగానే సాగిపోతూ ఉంటుంది వారి జీవితం. ‘ఏ’ తనకు కనిపించటం, పరిచయం కొనసాగటం, సంభాషించటం అసహజమనిపించినా అది పని ఒత్తిడి వల్ల కలిగిన భ్రమేనని తోసిపారేస్తుంది ఆబెగేల్‌. ఉద్యోగం కోల్పోయిన డెనిస్‌ శిల్పకళపట్ల దృష్టిపెట్టి ఎదుగుతుండగా, ఉద్యోగం చేస్తూనే అభిరుచిని మెరుగుపరుచుకోవడానికి ఆర్ట్‌క్లాసులో చేరుతుంది ఆబెగేల్‌.

భార్యాభర్తలిద్దరికీ ఒకరిపట్ల ఒకరికీ, పిల్లలపట్లా ప్రేమానురాగాలున్నా, జీవితంలో అస్పష్టమైన అసంతృప్తులు, స్తబ్దతల కారణంగా ఇద్దరూ వివాహేతర సంబంధాలపట్ల ఆకర్షితులౌతారు. ‘ఏ’ ప్రవేశంతో, తన గతజీవితంలో జరిగిన సంఘటనలు – ఈలైతో ప్రేమకథా జ్ఞాపకాలతో సహా – కొన్ని ఆబెగేల్‌కి గుర్తుకొచ్చి నిర్వచించలేని గందరగోళానికి గురిచేస్తాయి. జీవితంలో తను చేసిన తప్పులు ‘ఏ’ చేయకూడదని ఆబెగేల్‌ తాపత్రయపడినా, ఇరవైరెండేళ్లప్పడు తను జీవించదలచుకున్న, ఇప్పుడు జీవిస్తున్న పద్ధతుల మధ్యనున్న అంతరం గురించి ‘ఏ’ ఆమెను ప్రశ్నిస్తున్నట్టు ఉంటుందామెకి. తరచూ తలనొప్పీ, తలతిరగడంలాంటి సమస్యలతో బాధపడే ఆబెగేల్‌కి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలో ఆమెకు ఈలైతో జరిగిన సంఘటన ఒకటి గుర్తొస్తుంది. చిత్రకళకు సంబంధించి తన వివరాలున్న కవర్‌ని ఈలై అకారణంగా తగలబెట్టడానికి ప్రయత్నించటం, బాల్కనీలో జరిగిన పెనుగులాటలో తామిద్దరూ కొన్ని అంతస్తుల మీదనుంచి కిందపడిపోవటం, అతను చనిపోవటం, తానుమాత్రం తలకు బలమైన గాయాలతో బయటపడటం గుర్తొస్తుందామెకు. అస్వస్థత తీవ్రమై మెదడుకు సంబంధించిన ఆపరేషన్‌ చేశాక, ఆబెగేల్‌ కోమాలోకి వెళ్తుంది. తిరిగి మామూలయిన ఆమెకు ‘ఏ’ మళ్లీ కనిపించదు; భ్రాంతిమయమైన జీవితం నుంచి కాంతిమయమైన ఆవరణలోకి అడుగుపెట్టిన అనుభూతి కలుగుతుంది. పిల్లలు స్థిరపడటం, తనూ భర్తా తమ కళలలో నైపుణ్యతని పెంపొందించుకుంటూ, రాణించడంతోపాటు ఆర్థిక  స్థిరత్వం కోసం ఆబెగేల్‌ తన ప్రతిభని ఉపయోగించగలిగిన ఉద్యోగంలో చేరి ముందుకు సాగడంతో నవల ముగుస్తుంది. 

ఆబెగేల్‌ ప్రస్తుత జీవితానికీ ఇరవైరెండేళ్లప్పటి గతానికీ మధ్య ఊగిసలాడుతూ ముందుకూ వెనక్కూ సాగే కథ రకరకాల జీవితఘట్టాలని పరిచయం చేస్తుంది. భ్రాంతుల్లో చిక్కుకున్న ఆమె చెప్పే పాక్షిక కథనం పూర్తిగా నమ్మటానికి వీలులేనట్టుంటే, మిగతా కథ ఆబెగేల్‌ జర్నల్‌ రూపంలో కొంతా, మానసిక వైద్యురాలి నోట్స్‌ ద్వారా కొంతా, ఒక ఫిజిసిస్ట్, న్యూరాలజిస్ట్‌ మధ్య మెయిల్స్‌ రూపంలో మరికొంతా  చెప్పబడుతుంది. ఆబెగేల్‌ తలకు దాదాపు పాతికేళ్ల క్రితం తగిలిన దెబ్బ వల్ల ఆమె మెదడులో లోపం ఏర్పడిందనీ, అందువల్ల ఆమెకు భ్రాంతులు కలగవచ్చనీ న్యూరాలజిస్ట్‌ అంటే, క్వాంటం ఫిజిక్స్‌ సిద్ధాంతాల ప్రకారం కాలపు పొరలను చీల్చుకుని ఆబెగేల్‌ తన వర్తమాన భూతకాలాలని ఒకేసారి దర్శించగలుగుతోందన్నది ఫిజిసిస్ట్‌ ప్రతిపాదన. ఎవరి సిద్ధాంతాలు ఏవైనప్పటికీ, జీవితం వాటికి అతీతంగా తనదైన పద్ధతిలో సాగిపోతూనే ఉంటుంది. ‘‘రంగు అనేది వైయక్తిక దర్శనం. ఇది జీవితానికీ వర్తిస్తుంది. మనం చూసే ప్రతీదీ మనదైన ప్రత్యేక భావప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఏ ఇద్దరూ ఒకే ప్రపంచంలో ఉండరు. నువ్వుచూసే ఆకుపచ్చరంగు, నేను చూసే ఆకుపచ్చరంగు కాదు!’’ అన్న తన ప్రొఫెసర్‌ మాటలని ఆబెగేల్‌ గుర్తు చేసుకుంటుంది. నెరవేరని ఆశల గురించి, కాలవిన్యాసం గురించి తాత్వికమైన, మేధోపరమైన చర్చలను లేవదీసిన అమెరికన్‌ రచయిత్రి డెబ్రా జో ఎమెర్గట్‌ నవల యూ అగైన్‌ పాఠకుడిని ప్రభావితం చేసే దిశగా ఆలోచింపజేస్తుంది!  
పద్మప్రియ 
నవల: యు ఎగైన్‌ 
రచన: డెబ్రా జో ఎమెర్గట్‌ 
ప్రచురణ: ఎకో; 2020 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement