న్యూఢిల్లీ: చిన్నారులు అవయవ దానం చేసేలా ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా నేత్రదానంపై సానుకూల దృక్ఫథం ఏర్పడేలా చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక అధికారిక ప్రకటనను విడుదల చేశారు. చిన్నారుల్లో అవయవదానంపై అవగాహన కలిగేలా పాఠ్యపుస్తకాల్లో ఈ అంశాన్ని చేర్చాలని మానవ వనరుల అభివద్ధి శాఖకు సూచించినట్టు పేర్కొన్నారు.
హర్షవర్ధన్ శనివారం ఢిల్లీలో జరిగిన షరోఫ్ చారిటీ నేత్ర వైద్యశాల శతవార్షికోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్నియల్ బ్లైండ్ నెస్ తో బాధపడుతున్న వారి సంఖ్య భారత్‌లోనే అధికమని, దేశంలో ఏటా లక్ష కార్నియాలు కావాలని, అయిలే 17 వేలు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని చెప్పారు.