లోక్‌సభకు విజయ్ గోయల్
Published Wed, Oct 23 2013 11:09 PM | Last Updated on Fri, Sep 1 2017 11:54 PM
సాక్షి, న్యూఢిల్లీ: అధిష్టానం ఒత్తిడికి తలొగ్గి భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసు నుంచి వైదొలగిన విజయ్ గోయల్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ నుంచి పోటీచేసే అవకాశముంది. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయరని, లోక్‌సభ కు పోటీచేయవలసిందిగా పార్టీ చేసిన ప్రతిపాదనకు అంగీకరించారని ఆయన అభిమానులు తెలిపారు. ఆయన ఢిల్లీ బీజేపీ అధ్యక్షపదవినుంచి వైదొలగరని వారు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి అభ్యర్థి రేసు నుంచి విజయ్‌గోయల్ రెండు రోజుల కిందటే వైదొలగారని వారు తెలిపారు. బుధవారం ఉదయం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ముందు పార్టీ కార్యాలయానికి వచ్చిన విజయ్ గోయల్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా డా. హర్షవర్ధన్‌కు మద్దతునివ్వాలని తన అభిమానులను కోరారు.
ముఖ్యమంత్రి అభ్యర్థిగా తనను ఎంపికచేయకపోవడంపై అసంతృప్తి ఏమీలేదని విజయ్ గోయల్ ప్రకటించారు. క్రమశిక్షణగల కార్యకర్తగా పార్టీ పార్లమెంటరీ బోర్డు నిర్ణయానికి తలొగ్గుతానని ఇదివరకే చెప్పానని ఆయన తెలిపారు. పార్లమెంటరీ బోర్డు నిర్ణయం మేరకు ముఖ్యమంత్రి అభ్యర్థిగా డా. హర్షవర్ధన్‌కు అందరూ సహకరించాలని తాను పార్టీ కార్యకర్తలకు చెప్పానని గోయల్ తెలిపారు. పార్టీ ఒక్కతాటిపై ఉందని ఆయన ప్రకటించారు. పార్టీని గెలిపించడమే తమ ఏకైక లక్ష్యమన్నారు. గడచిన ఎనిమిది నెలలుగా పార్టీ నిర్మాణానికి కష్టపడి పనిచేశామని ఆయన చెప్పారు. 40 ఏళ్లుగా పార్టీలో తాను క్రమశిక్షణగల కార్యకర్తగా సేవలందిస్తున్నానని ఈ సందర్భంగా గోయల్ ప్రకటించారు. కొన్నిసార్లు పార్టీ నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉండనంత మాత్రాన బాధపడాల్సిందేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నాననేది మీడియా సృష్టేనని ఆయన ఆరోపించారు. తాను రాజీనామా చేయలేదని, చేయబోనని, పార్టీ కోసమే పనిచేస్తానని స్పష్టం చేశారు.
నష్టం తెచ్చిన ఒంటెత్తు పోకడ
అధ్యక్షుడిగా నియంతృత్వ ధోరణి, ఒంటెత్తు పోకడల వల్లే బీజేపీ ఢిల్లీ శాఖ అధ్యక్షుడు విజయ్ గోయల్ సీఎం అభ్యర్ధిత్వం నుంచి తొలగాల్సి వచ్చిందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. కొన్ని నెలల కిందట ఆర్‌ఎస్‌ఎస్ ఆశీస్సులతో ఆ పార్టీ నాయకుడు ఆర్తీ మెహ్రా ఇచ్చిన విందులో పలువురు బీజేపీ సీనియర్ నాయకులు హాజరైన విషయం తెలిసిందే. ఆ సమయంలో ఢిల్లీలో జిల్లా, రాష్ర్ట కార్యవర్గాల నియామకాల తీరుపై చర్చ రాగా, పలువురు స్థానిక నేతలు గోయల్‌పై ఫిర్యాదులు చేశారు. కార్యవర్గాల ఎంపికలో ఆయన ఒంటెత్తు పోకడకు పోయాడని, స్థానిక నాయకులెవరినీ పరిగణనలోకి తీసుకోలేదని విమర్శలు గుప్పించారు. దాంతో పార్టీకి నష్టం కలిగించే విధంగా గోయల్ చర్యలు ఉంటున్నాయన్న భావనతో ఆర్‌ఎస్‌ఎస్ సైతం సీఎం పదవికి తగిన అభ్యర్థిగా హర్షవర్ధన్ వైపు మొగ్గు చూపినట్లు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Advertisement
Advertisement