చిలుకూరు.. వెలుగురేఖలు! | 2 thousand people villagers Eye donation | Sakshi
Sakshi News home page

చిలుకూరు.. వెలుగురేఖలు!

Published Sun, Jan 25 2015 3:55 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

చిలుకూరు.. వెలుగురేఖలు! - Sakshi

చిలుకూరు.. వెలుగురేఖలు!

 - నేత్రదానానికి ముందుకొచ్చిన 2వేల మంది గ్రామస్తులు
 - రేపు అంగీకార పత్రాలపై సంతకాలు చేసేందుకు సన్నద్ధం  
 - ‘మాధవనేత్రం’ స్వచ్ఛంద సంస్థకు అప్పగించేందుకు సన్నాహాలు

మొయినాబాద్: హైదరాబాద్ మహానగరానికి కూతవేటు దూరంలో ఉన్న మొయినాబాద్ మండలంలోని చిలుకూరు గ్రామం అందరికీ సుపరిచితమే. చిలుకూరు గ్రామ పంచాయతీకి దేవంల్‌వెంకటాపూర్, అప్పోజీగూడ అనుబంధ గ్రామాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం జనాభా 7,265 మంది ఉన్నారు. వీరిలో పురుషులు 3,900 మంది, మహిళలు 3,365 మంది. గ్రామంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. చాలా మంది వ్యవసాయంపైనే జీవిస్తున్నారు. కొంత మంది యువకులు, మహిళలు చిలుకూరు బాలాజీ దేవాలయం వద్ద షాపులు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. అయితే చిలుకూరు గ్రామానికి చెందిన కొంత మంది యువకులకు నేత్రదానంపై ఆలోచన వచ్చింది.

దీంతో గ్రామపెద్దలు, స్థానిక యువజన సంఘాలతో చర్చించి నేత్రదానానికి శ్రీకారం చుట్టారు. గ్రామంలోని ఉషోదయ, చైతన్య, శివాజీ, అంబేద్కర్ యువజన సంఘాల సభ్యులతోపాటు మరికొన్ని యువజన సంఘాలు, మహిళా సంఘాల సభ్యులు నేత్రదానానికి ముందుకొచ్చారు. మొత్తం 10 సంఘాల్లోని సుమారు 500 మంది సభ్యులతోపాటు సుమారు 1500 మంది గ్రామస్తులు నేత్రదాన అంగీకార పత్రాలపై సంతకాలు చేసేందుకు సిద్ధమయ్యారు.

అంగీకార పత్రాలపై సంతకాలు చేసి ‘మాధవ నేత్రం’ సంస్థకు అప్పగించనున్నారు. అందుకోసం సోమవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా చిలుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పి.సునీతారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు.
 
ఇప్పటికే పలు గ్రామాల్లో...

చేవెళ్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు నేత్రదానం చేసేందుకు ఇప్పటికే ముందుకొచ్చారు. నాలుగేళ్ల క్రితం చేవెళ్ల మండలంలోని దేవునిఎర్రవల్లిలో సుమారు 2వేల మందికిపైగా నేత్రదానం చేసేందుకు అంగీకార పత్రాలపై సంతకాలు చేశారు. అదే విధంగా మొయినాబాద్ మండలంలోని రెడ్డిపల్లిలో సైతం యువజన సంఘాల సభ్యులు, గ్రామస్తులు నేత్రదానానికి ముందుకొచ్చారు.

2011లో నేత్రదాన పత్రాలపై సంతకాలు చేసి మాధవ నేత్రం సంస్థకు ఇచ్చారు. రెండు సంవత్సరాల క్రితం రెడ్డిపల్లికి చెందిన మోర యాదయ్య మరణించడంతో ఆయన కళ్లను మాధవ నేత్రం సంస్థకు అప్పగించారు. ఇదే స్ఫూర్తితో చిలుకూరు గ్రామస్తులు సైతం నేత్రదానానికి ముందుకురావడం అభినందనీయం.
 
అంధుల జీవితాల్లో వెలుగులు నింపాలనే..
అంధత్వంతో ఎంతో మంది బాధపడుతున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆలోచనతో నేత్రదాన కార్యక్రమాన్ని చేపట్టాలనుకున్నాం. గ్రామపెద్దలతో చర్చించి నేత్రదాన కార్యక్రమం చేపడుతున్నాం.
- మహేష్, యువజన సంఘం సభ్యుడు, చిలుకూరు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement