సినిమా : అలా చేస్తే వ్యక్తిగత విమర్శల దాడి చేస్తారని తెలుసు. అయినా ఐ డోంట్‌కేర్ అంటోంది నటి ఆండ్రియా. సంచలనాలకుకేంద్రబిందువు ఆండ్రియా అంటారు. ఆమె చర్యలు కూడా అలానే ఉంటాయి. అయితే మల్టీ టాలెంటెడ్ నటి ఈ బ్యూటీ. ఈమెలో నటి మాత్రమే కాకుండా మంచి గాయనీ, గీత రచయిత ఉన్నారు. అదే విధంగా బహుభాషా నటి కూడా. తనకు పాత్ర నచ్చితే అది ఏ తరహాదైనా నటించడానికి వెనుకాడదు. ఇటీవల వడచెన్నైలో ఏ హీరోయిన్ చేయడానికి సాహసించని పాత్రను చేసి మెప్పించింది. ప్రస్తుతం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలకు మారిన ఈ అమ్మడితో చిన్న చిట్‌చాట్.
ప్ర: బిడ్డకు అమ్మగా, మద్యం అలవాటు, దమ్ము కొట్టే అమ్మాయి, బూతులు మాట్లాడే మగువ లాంటి పాత్రలో నటిస్తున్నారు. విమర్శల వలయంలో చిక్కుకుంటారని భయం లేదా?
జ: నాకు కథా పాత్ర నచ్చితే ఇక దేని గురించి ఆలోచించను. నటించడానికి అస్సలు వెనుకాడను. నెగటీవ్ టచ్ ఉన్న పాత్రల్లో నటిస్తే నాపై వ్యక్తిగత విమర్శల దాడి చేస్తారని తెలుసు. అయినా అలాంటి వాటి గురించి భయపడను. ఒక్కసారి నటించాలని కమిట్ అయితే ఏ తరహా పాత్రనైనా చేయాలన్నది నా అభిప్రాయం. ఇమేజ్ గురించి ఆలోచిస్తే, ఆ చట్రంలోనే ఉండిపోవాల్సి వస్తుంది.
ప్ర:కమలహాసన్‌తో వరుసగా చిత్రాలు చేశారు. అంత పెద్ద నటుడితో నటించేటప్పుడు కంగారు, భయం లాంటివి ఎదుర్కొనేవారా?
జ: కమలహాసన్ నటుడిగానూ, రాజకీయనాయకుడిగానూ కొనసాగుతున్నారు. ఆయనంటే నాకెంతో గౌరవం. కమల్ ఉత్తమ నటుడు. అయితే సాధారణంగా నేను ఎక్కవ చిత్రాలు చూడను. నా పాత్రల్లో ఎలా నటించాలన్న దాని గురించే అలోచిస్తాను. అంతే కానీ సహ నటుల నటన గురించి ఎప్పుడూ భయపడింది లేదు. ఇక కమలహాసన్‌తో నటిస్తున్నప్పుడు, జంకు గానీ, భయం కానీ కలగదు. అదే విధంగా నేను కమల్ చిత్రాలు చూస్తూ ఎదిగిన నటిని కాదు. అందుకని ఆయనంటే భయం లేదు.
ప్ర: ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో మీటూ కలకలం సృష్టించడంపై మీ స్పందన?
జ:నిజం చెప్పాలంటే మీటూ గురించిన వార్తలను నేను సరిగా చదవలేదు. అయితే అన్ని కాలాల్లోనూ ఈ సమస్య ఉంది. ఇప్పుడే మహిళలకు తమకు జరిగిన అక్రమాల గురించి బహిరంగంగా చెప్పే ధైర్యం, బలం వస్తున్నాయి. భయం కారణంగానే ఇంతకాలం చాలా మంది మహిళలు నోరు మెదపకుండా ఉన్నారు. ఈ తరం వారు ఆ భయాన్ని దాటి మాట్లాడటానికి ధైర్యం చూపుతున్నారు. ఇది మంచి విషయమే. అయితే పది మంది కథలు చెబుతుంటారు. ఇద్దరు ముగ్గురే నిజం చెబుతుంటారు. అలాంటి వారిని మనం గౌరవించాలి.
ప్ర: నేత్రదాన అవగాహన కృషి చేస్తున్నారట?
జ: అవును. అందరూ నేత్ర దానం చేసేందుకు ముందుకు రావాలి. నేత్రదానం చేయడం మన బాధ్యత. మన జీవితం తరువాత అవి ఇతరులకు జీవితాన్నిస్తాయి. నేనిప్పటికే నేత్రదానం చేశాను.
Comments
Please login to add a commentAdd a comment