
స్ఫూర్తి ప్రదాత రాజ్‌కుమార్
కంఠీరవుడి ప్రేరణతో నేత్రదానానికి సిద్ధమన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య
మొదటి, చివరి ఆటోగ్రాఫ్ రాజ్‌కుమార్‌దే: రజనీకాంత్
ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితం గడిపారు : చిరంజీవి
ఘనంగా డాక్టర్ రాజ్‌కుమార్ స్మారకం ఆవిష్కరణ
బెంగళూరు: ‘నేత్రదానం చేసి డాక్టర్ రాజ్‌కుమార్ ఈ సమాజానికి ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు. అదే ప్రేరణతో నేనూ నేత్రదానం చేయడానికి నిర్ణయించుకున్నాను’ అని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. అక్కడికక్కడే నేత్రదానానికి సంబంధించిన సమ్మతి పత్రాలపై ఆయన సంతకం చేశారు. శనివారమిక్కడి కంఠీరవ స్టూడియోలో డాక్టర్ రాజ్‌కుమార్ స్మారకాన్ని లాంఛనంగా ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. డాక్టర్ రాజ్‌కుమార్ వంటి మహోన్నత నటుడిని ఆదర్శనీయ వ్యక్తిగా కీర్తించడంతో పాటు ఆయన ఆదర్శాలను కూడా పాటించాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. దేశంలో ఎన్నో లక్షల మంది ప్రజలు అంధత్వంతో బాధపడుతున్నారని, నేత్రదానం వల్ల వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు సాధ్యమవుతుందని, ఇదే సందేశాన్ని రాజ్‌కుమార్ అందించారని తెలిపారు. కన్నడ సాంస్కృతిక రాయబారిగా వెలిగిన ఘనత రాజ్‌కుమార్‌కే దక్కుతుందని శ్లాఘించారు. సామాజిక, పౌరాణిక, చరిత్రాత్మక సినిమాలతో పాటు బాండ్ శైలి సినిమాల్లో సైతం రాజ్‌కుమార్ తన అమోఘ ప్రతిభను కనబరిచారని కొనియాడారు. ప్రస్తుతం రాజ్‌కుమార్ భౌతికంగా లేకపోయినప్పటికీ ప్రజల హృదయాల్లో నిలిచేఉంటారని అన్నారు.
మొదటి, చివరి సంతకం రాజ్‌కుమార్‌దే: రజనీకాంత్
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సూపర్‌స్టార్ రజనీకాంత్ కన్నడ భాషలో అనర్గళంగా రాజ్‌కుమార్ ఘనతను వర్ణించారు. కళా సరస్వతి వరపుత్రుడిగా జన్మించిన రాజ్‌కుమార్ ఇప్పటికీ ప్రజల మనసుల్లో సజీవంగా ఉన్నారని అన్నారు. ‘బేడర కన్నప్ప’తో చిత్రసీమలోకి అడుగుపెట్టిన రాజ్‌కుమార్ కన్నడ చిత్రసీమను 54 ఏళ్ల పాటు నిర్విరామంగా ఏలారని అన్నారు. భారతీయ చిత్రరంగంలో ఇంత సుదీర్ఘకాలం కథానాయకుడిగా కొనసాగిన మరే వ్యక్తినీ తానింత వరకు చూడలేదని అన్నారు. కనకదాసు, పురందర దాసు, బసవణ్ణ వంటి మహనీయుల పాత్రలతో పాటు రావణాసురుడు, హిరణ్యకసిపుడు వంటి పాత్రల్లో సైతం రాజ్‌కుమార్ అద్భుత నటనా ప్రతిభను కనబరిచారని శ్లాఘించారు. రాజ్‌కుమార్‌ను గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కిడ్నాప్ చేసిన ఉదంతాన్ని సైతం రజనీ తనదైన శైలిలో అభివర్ణించారు. ‘రాజ్‌కుమార్ వంటి మహానటుడిని వనదేవత కూడా ఓ సారి చూడాలనుకుంది. అందుకే ఆయన్ను తన వద్దకు పిలిపించుకుంది. 108 రోజుల పాటు ఆయన్ను చూసి సంతోషంతో మళ్లీ పంపించేసింది’ అని పేర్కొన్నారు. ‘నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు నగరంలోని శని మహాత్ముడి ఆలయం వద్దకు వెళ్లిన సమయంలో డాక్టర్ రాజ్‌కుమార్ ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. నేను నా జీవితంలో తీసుకున్న మొదటి, చివరి ఆటోగ్రాఫ్ రాజ్‌కుమార్‌దే. ఆ తర్వాత ఎవ్వరి వద్ద ఆటోగ్రాఫ్ తీసుకోలేదు’ అని రజనీకాంత్ గత స్మృతులను అభిమానులతో పంచుకున్నారు.
ఎంతో ఎత్తుకు ఎదిగినా సాధారణ జీవితమే: చిరంజీవి
కన్నడ సినీపరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగినా అత్యంత సాధారణ జీవితం గడిపిన మహావ్యక్తి డాక్టర్ రాజ్‌కుమార్ అని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. ‘నేను ఎన్నో సార్లు రాజ్‌కుమార్‌ను కలిశాను. ఎప్పుడు కలిసినా తెలుగులోనే మాట్లాడేవారు. ఆయనకు దేశ, విదేశాల్లో ఎంతో మంది అభిమానులున్నప్పటికీ ఆయనలో ఏ కోశాన గర్వం కనిపించేది కాదు. ఆయనలో ఓ గొప్ప మానవతావాదిని కూడా చూశాను. కర్ణాటక ప్రభుత్వం రాజ్‌కుమార్ స్మారకాన్ని ఏర్పాటు చేసినందుకు నేను వ్యక్తిగతంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని చిరంజీవి తెలిపారు.