18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్‌ | These stars reunite after a long time | Sakshi
Sakshi News home page

18 ఏళ్ల తర్వాత చిరు-త్రిష.. 38 ఏళ్ల తర్వాత రజనీ-సత్యరాజ్‌

Published Sat, Nov 23 2024 10:27 AM | Last Updated on Sat, Nov 23 2024 10:42 AM

These stars reunite after a long time

‘దేవుడ దేవుడా తిరుమల దేవుడా... చూడర చూడరా కళ్లు విప్పి చూడరా...’ అంటూ ‘చంద్రముఖి’ సినిమాలో జోరుగా స్టెప్పులేశారు రజనీకాంత్‌. ఆ పాటలో ‘రిపీట్టే’ అని ఉంటుంది. 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌–సత్యరాజ్‌ కాంబినేషన్‌ రిపీట్‌ అవుతోంది. ఇలా లాంగ్‌ గ్యాప్‌తో ‘రిపీట్టే’ అంటూ స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్న స్టార్స్‌ గురించి తెలుసుకుందాం.

పద్దెనిమిదేళ్ల తర్వాత... 
హీరో చిరంజీవి, హీరోయిన్‌ త్రిషల జోడీ పద్దెనిమిదేళ్ల తర్వాత రిపీట్‌ అవుతోంది. ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వం వహించిన ‘స్టాలిన్‌’ సినిమాలో వీరిద్దరూ తొలిసారి జంటగా నటించారు. 2006లో విడుదలైన ఈ మూవీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలైన పద్దె నిమిదేళ్ల తర్వాత చిరంజీవి, త్రిష రెండోసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంటున్నారు. ‘విశ్వంభర’ సినిమాలో వీరు జంటగా నటిస్తున్నారు. వశిష్ఠ దర్శకత్వంలో వంశీ, ప్రమోద్, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. సోషియో ఫ్యాంటసీ అడ్వెంచరస్‌ ఫిల్మ్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో భీమవరం దొరబాబు పాత్రలో చిరంజీవి నటిస్తున్నారని సమాచారం. ఈ సినిమాతో సంక్రాంతి బరిలోకి దిగాలనుకున్నారు చిరంజీవి. 2025 జనవరి 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు కూడా. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్‌ హీరోగా రూపొందిన ‘గేమ్‌ చేంజర్‌’ కోసం ‘విశ్వంభర’ విడుదలని వాయిదా వేశారు. ఇక ‘విశ్వంభర’ వేసవిలో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ‘విశ్వంభర’ యూనిట్‌ జపాన్‌లో ఉంది. అక్కడ చిరంజీవి–త్రిషపై ఓ పాట చిత్రీకరిస్తున్నారు.  

 38 ఏళ్ల తర్వాత...
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కూలీ’. కమల్‌హాసన్‌తో ‘విక్రమ్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తెరకెక్కించిన లోకేశ్‌ కనగరాజ్‌ ‘కూలీ’కి దర్శకుడు. ఈ సినిమాలో  సత్యరాజ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. దాదాపు 38 ఏళ్ల తర్వాత రజనీకాంత్‌–సత్యరాజ్‌ కలిసి నటిస్తుండటం విశేషం. 1986లో వచ్చిన ‘మిస్టర్‌ భరత్‌’లో సత్యరాజ్‌ తండ్రి పాత్ర చేయగా, రజనీకాంత్‌ ఆయన కొడుకుగా నటించారు. అయితే కావేరీ జలాల వివాదం సందర్భంగా రజనీకాంత్‌పై సత్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. ఈ కారణంగా అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించలేదు. రజనీకాంత్‌ హీరోగా నటించిన ‘శివాజీ’ (2007) చిత్రంలో సత్యరాజ్‌ని విలన్‌గా తీసుకోవాలకున్నారు దర్శకుడు శంకర్‌. అయితే సత్యరాజ్‌ ఆ అవకాశాన్ని తిరస్కరించడంతో ఆ పాత్రని సుమన్‌ చేశారని కోలీవుడ్‌ టాక్‌. తాజాగా ‘కూలీ’ సినిమా కోసం రజనీకాంత్‌–సత్యరాజ్‌లను ఒప్పించారు లోకేశ్‌ కనగరాజ్‌. ఈ మూవీలో రజనీ స్నేహితుడిగా ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రంలో తెలుగు స్టార్‌ నాగార్జున, కన్నడ స్టార్‌ ఉపేంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. కళానిధి మారన్‌ నిర్మిస్తున్న ‘కూలీ’ వచ్చే ఏడాది విడుదల కానుంది.  

ఇరవై ఏళ్ల తర్వాత...  
మలయాళ చిత్ర పరిశ్రమలో హిట్‌ జోడీగా పేరొందిన మోహన్‌ లాల్, శోభన మరోసారి కలిసి నటిస్తున్నారు. అది కూడా దాదాపు ఇరవైఏళ్ల తర్వాత కావడం విశేషం. మోహన్‌ లాల్‌ హీరోగా తరుణ్‌ మూర్తి దర్శకత్వంలో ‘ఎల్‌ 360’ (వర్కింగ్‌ టైటిల్‌) సినిమా రూపొందుతోంది. ఎమ్‌. రంజిత్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శోభన కథానాయికగా నటిస్తున్నారు. 1985లో వచ్చిన ‘అవిడతే పోలే ఇవిడెయుమ్‌’ సినిమాలో తొలిసారి కలిసి నటించారు మోహన్‌ లాల్, శోభన. ఆ తర్వాత ఈ ఇద్దరూ యాభైకి పైగా సినిమాల్లో నటించారు. వీరిద్దరూ చివరిగా నటించిన చిత్రం ‘తేన్మావిన్‌ కొంబాట్‌’ 1994లో విడుదలైంది. ఆ తర్వాత స్క్రీన్‌ షేర్‌ చేసుకోని వీరు (‘సాగర్‌ ఆలియాస్‌ జాకీ రీ లోడెడ్‌’ సినిమాలో మోహన్‌ లాల్‌ హీరోగా నటించగా, శోభన అతిథి పాత్ర చేశారు) ఇరవై ఏళ్ల తర్వాత ‘ఎల్‌ 360’ కోసం మరోసారి తెరని పంచుకుంటున్నారు. కాగా ఇది వీరిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న 56వ సినిమా కావడం విశేషం.

పాన్‌ ఇండియా సినిమా కోసం
మలయాళ స్టార్స్‌ మమ్ముట్టి, మోహన్‌లాల్‌ల కాంబినేషన్‌ ఓ పాన్‌ ఇండియా సినిమాకి కుదిరింది. వీరిద్దరి కాంబినేషన్‌ లో దాదాపు యాభైకి పైగా సినిమాలు వచ్చాయి. అయితే జోషి దర్శకత్వం వహించిన ‘ట్వంటీ 20’ (2008) చిత్రం తర్వాత మోహన్‌ లాల్, మమ్ముట్టి కలిసి ఓ పుల్‌ లెంగ్త్‌ మూవీ చేయలేదు. అయితే మమ్ముట్టి హీరోగా నటించిన ‘కాథల్‌ కదన్ను ఒరు మాతుకుట్టి’ (2013) చిత్రంలో మోహన్‌ లాల్‌ ఓ అతిథి పాత్ర చేశారు. కాగా పదహారేళ్ల తర్వాత వీరిద్దరూ లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మహేశ్‌ నారాయణన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఆంటో జోసెఫ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం బుధవారం శ్రీలంకలో ఘనంగా ప్రారంభమైంది. ‘‘మలయాళ సినిమా చరిత్రను తిరగ రాయడానికి సిద్ధంగా ఉన్న క్రేజీ పాన్‌ ఇండియా  ప్రాజెక్ట్‌ ఇది. శ్రీలంక, అబుదాబీ, అజర్‌ బైజాన్, లండన్, థాయ్‌ల్యాండ్, విశాఖపట్నం, హైదరాబాద్, ఢిల్లీ, కొచ్చితో సహా పలు ప్రాంతాల్లో 150 రోజుల పాటు ఈ మూవీ షూటింగ్‌ జరపనున్నాం’’ అని పేర్కొన్నారు మేకర్స్‌.  

38 ఏళ్ల తర్వాత...  
హీరో రాజేంద్ర ప్రసాద్, డైరెక్టర్‌ వంశీ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాల్లో ‘లేడీస్‌ టైలర్‌’కి ప్రత్యేక స్థానం ఉంది. ఈ చిత్రంలో ఆయనకు జోడీగా అర్చన నటించారు. 1986లో విడుదలైన ఈ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత వీరిద్దరూ కలిసి నటించలేదు. దాదాపు 38 ఏళ్ల తర్వాత ‘షష్ఠిపూర్తి’ సినిమా కోసం రాజేంద్రప్రసాద్, అర్చన కలిశారు. పవన్‌ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, అర్చన జోడీగా నటిస్తున్నారు. రూపేష్, ఆకాంక్షా సింగ్‌ మరో జంటగా నటిస్తున్నప్పటికీ ఈ కథ రాజేంద్రప్రసాద్, అర్చన చుట్టూనే తిరుగుతుందట. రాజేంద్రప్రసాద్‌ భార్యగా అర్చన నటిస్తున్నారు. ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో షష్ఠిపూర్తి కథాంశంతో ఈ మూవీ సాగుతుంది. రూపేష్‌ నిర్మించిన ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే ‘లేడీస్‌ టైలర్‌’ సినిమాకు సంగీతం అందించిన ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఇళయరాజాయే ‘షష్ఠిపూర్తి’కి కూడా స్వరాలు సమకూర్చడం విశేషం.

పంతొమ్మిదేళ్ల తర్వాత...  
తమిళ చిత్ర పరిశ్రమలో హీరో సూర్య, హీరోయిన్‌ త్రిషలది హిట్‌ జోడీ. వీరి కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా తాజాగా నాలుగో సినిమా రానుందని టాక్‌. సూర్య హీరోగా ఆర్‌జే బాలాజీ దర్శకత్వంలో మైథలాజికల్‌ నేపథ్యంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం త్రిషను సంప్రదించారట ఆర్‌జే బాలాజీ. కథ, తన పాత్ర నచ్చడంతో ఆమె కూడా ఈ మూవీలో నటించేందుకు ఆసక్తిగా ఉన్నారని కోలీవుడ్‌ టాక్‌. ‘మౌనం పేసియదే’ (2002), ‘ఆయుద ఎళుత్తు’ (2004),  ‘ఆరు’ (2005) వంటి చిత్రాల్లో నటించారు సూర్య, త్రిష. తాజాగా నాలుగోసారి ఆర్‌జే బాలాజీ సినిమా కోసం వీరిద్దరూ తెరని పంచుకోనున్నారట. ఈ వార్త నిజం అయితే 19 సంవత్సరాల తర్వాత వీరి జోడీ రిపీట్‌ అవుతుంది.

టెస్ట్‌ మ్యాచ్‌కి సిద్ధం  
హీరోలు మాధవన్‌–సిద్ధార్థ్‌ క్రికెట్‌లో టెస్ట్‌ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ ఇద్దరూ  హీరోలుగా నటించిన తాజా చిత్రం ‘ది టెస్ట్‌’. నయనతార హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో మీరా జాస్మిన్‌ ఓ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాతో నిర్మాత శశికాంత్‌ దర్శకుడిగా పరిచయం కాగా, సింగర్‌ శక్తిశ్రీ గోపాలన్‌  మ్యూజిక్‌ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. ఇదిలా ఉంటే దాదాపు 20 ఏళ్ల తర్వాత మాధవన్‌–సిద్ధార్థ్‌ ఈ సినిమాలో కలిసి నటించారు. సూర్య, మాధవన్, సిద్ధార్థ్‌ హీరోలుగా మణిరత్నం దర్శకత్వం వహించిన చిత్రం ‘యువ’ (2004). ఆ సినిమా తర్వాత మాధవన్‌–సిద్ధార్థ్‌ కలిసి నటించిన చిత్రం ‘ది టెస్ట్‌’. క్రికెట్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఇప్పటికే పలుమార్లు విడుదల వాయిదా పడ్డ ఈ సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ని మేకర్స్‌ ప్రకటించలేదు. అయితే 2025 ఫిబ్రవరిలో విడుదల చేసే అవకాశాలుఉన్నాయని కోలీవుడ్‌ టాక్‌.
– డేరంగుల జగన్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement