చిత్ర పరిశ్రమలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడమే తెలివైన వారి లక్షణం.. నటి త్రిష కూడా తన కెరీర్‌లో ఇదే చేసింది. 2002లో సూర్యకు జంటగా మౌనం పేసియదే చిత్రంతో కథానాయకిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత విజయ్ సరసన నటించిన గిల్లీ, విక్రమ్ జంటగా చేసిన స్వామి వంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించడంతో త్రిష క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆపై తెలుగులో నటించిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా, వర్షం వంటి చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. దీంతో త్రిష బహుభాషా నటిగా మారిపోయారు.
ఆ తర్వాత హిందీ, కన్నడం, మలయాళం భాషల్లోనూ నటించి పాన్ ఇండియా కథానాయకిగా గుర్తింపు పొందారు. అలా ఇప్పుడు శతాధిక చిత్రాల కథానాయకిగా రాణిస్తున్న త్రిష అసలు వయసు 41 ఏళ్లు. కథానాయకి వయసు 22 ఏళ్లు. ఇప్పటికీ పలు భాషల్లో స్టార్ హీరోలతో జతకడుతూ ఆగ్ర కథానాయకిగా రాణించటం విశేషం. ప్రస్తుతం అజిత్ సరసన విడాముయర్చి, గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రాల్లో ఒకేసారి నటిస్తున్న నటి త్రిష, నటుడు కమలహాసన్ కథానాయకుడిగా మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న థగ్ లైఫ్ చిత్రంలోనూ, సూర్య సరసన ఓ చిత్రంలోనూ నటిస్తున్నారు.
అదేవిధంగా తెలుగులో చిరంజీవికి జంటగా విశ్వంభర చిత్రంతో పాటు మలయాళంలో మోహన్ లాల్ సరసన రామ్, టోవినో థామస్ కు జంటగా ఐడెంటిటీ చిత్రాల్లో నటిస్తున్నారు. ఇలా నాలుగు పదులు దాటినా అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్న త్రిష శుక్రవారంతో కథానాయకిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె తన ఎక్స్ మీడియాలో ‘‘నేను కథానాయకిగా పరిచయమై 22 ఏళ్లు పూర్తి అయ్యాయి. ప్రేక్షకులైన మీ వల్లే ఇదంతా జరిగింది. అందుకు చాలా ధన్యవాదాలు’’ అని పేర్కొన్నారు. ఈ ఇకపోతే ఈమె శుక్రవారం సూర్య సరసన నటిస్తున్న చిత్ర షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ చిత్ర యూనిట్ త్రిష కథానాయకిగా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment