
పినగాడిలో విద్యుదాఘాతంతో మరణించిన నాగమణి
పెందుర్తి: మరణంలోనూ ఆమె మరొకరికి వెలుగునిచ్చింది. పెందుర్తి మండలం పినగాడిలో మంగళవారం విద్యుదాఘాతంతో ఓ మహిళ మృత్యువాత పడింది. ఇంటిపై ఉతికిన దుస్తులు ఆరేస్తుండగా సమీపంలోని విద్యుత్ వైర్లు తగలడంతో దుర్ఘటన చోటు చేసుకుంది.
మృతురాలి కళ్ళను కటుంబసభ్యులు దానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. వివరాలివి.. పినగాడి బీసీ కాలనీలో వంటాకుల నాగమణి(48) కుమార్తెతో కలిసి నివాసం ఉంటుంది. మంగళవారం ఉదయం 8.40 సమయంలో ఉతికిన బట్టలు ఆరబెట్టేందుకు మేడ మీదకు వెళ్ళింది.
ఈ క్రమంలో సమీపంలోని విద్యుత్ తీగలకు ప్రమాదవశాత్తు నాగమణి చేయి తగలడంతో తీవ్ర విద్యుదాఘాతానికి గురై అక్కడిక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం తెలుసుకున్న పెందుర్తి సీఐ పి.సూర్యనారాయణ, ఎస్‌ఐ రామారావు ఘటనాస్థలికి వెళ్ళి వివరాలు సేకరించారు.
కేజీహెచ్ ఐబ్యాంక్ ప్రతినిధులు కుటుంబసభ్యులకు నేత్రదానం గురించి వివరించగా నాగమణి నేత్రాలను ఇచ్చేందుకు అంగీకరించారు. వైద్యులు ఆమె కళ్ళను సేకరించారు.