తెర్లాం : విద్యుదాఘాతంతో మహిళ మృతి చెందిన సంఘటన డి. గదబవలసలో జరిగింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని డి.గదబవలస గ్రామానికి చెందిన చెల్లూరి లక్ష్మి (38) గ్రామంలోని ఒకటో అంగన్‌వాడీ కేంద్రంలో హెల్పర్(ఆయా)గా పనిచేస్తోంది. ఈమె భర్త బలరాం గ్రామంలోనే చికెన్ సెంటర్ నడుపుతుంటాడు.
లక్ష్మి ఖాళీ సమయాల్లో భర్తకు తోడుగా చికెన్ సెంటర్‌లో పనిచేసేది. అప్పటిలాగే బుధవారం ఉదయం ఆరు గంటల సమయంలో కోళ్లను శుభ్రం చేసేందుకు (వెంట్రుకలు తీసేందుకు) గ్రైండర్‌లో కోళ్లు వేసి స్విచ్ ఆన్ చేయగా, షాక్ కొట్టడంతో లక్ష్మి స్పృహ కోల్పోయింది. వెంటనే లక్ష్మిని ఆమె భర్త బలరాం, కుటుంబ సభ్యులు రాజాంలోని ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.
మృతురాలు లక్ష్మికి భర్తతో పాటు ముగ్గురు ఆడపిల్లలున్నారు. అంతవరకు తమతో కలిసి ఉన్న తల్లి మృతి చెందడాన్ని పిల్లలు జీర్ణించుకోలేకపోతున్నారు. మృతదేహం వద్ద వారు విలపిస్తున్న తీరు పలువురిని కంట తడిపెట్టించింది. లక్ష్మి మృతి విషయాన్ని వీఆర్‌ఓ శ్రీనివాసరావు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో హెచ్‌సీ శ్రీనివాసరావు గ్రామానికి చేరుకుని పెద్దల సమక్షంలో శవపంచనామ నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బాడంగి సీహెచ్‌సీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.విద్యుదాఘాతంతో మహిళ మృతి
Comments
Please login to add a commentAdd a comment