
మాధవి మృతదేహం
చిన్నశంకరంపేట(మెదక్) : సోదరి ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకలకు హాజరైన మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన సంఘటన చిన్నశంకరంపేట మండలం రుద్రారం గ్రామంలో విషాదం నింపింది. శనివారం జరిగిన ఈ సంఘటన వివరాలు గ్రామస్తుల కథనం మేరకు ఇలా ఉన్నాయి. దౌల్తాబాద్ మండల కేంద్రానికి చెందిన గొట్టం మాధవి(24) శనివారం ఉదయం ఇంటి ఇనుప మెట్లకు విద్యుత్ సరఫరా జరగడంతో విద్యుత్ షాక్‌కు గురై ప్రమాదవశాత్తు మృతి చెందింది.
తన సోదరి రుద్రారం గ్రామానికి చెందిన లావణ్య ఇంట్లో ఈ నెల 10న జరిగిన పెళ్లి వేడుకలకు హాజరైన మాధవి శనివారం ఉదయం స్లాబ్‌పైకి వేసిన ఇనుప మెట్లు ఎక్కుతూ విద్యుత్ షాక్ గురైంది. శుక్రవారం రాత్రి వీచిన గాలికి విద్యుత్ వైర్లు ఇంటి ఇనుప మెట్లకు తాకి విద్యుత్ సరఫరా అయిందని భావిస్తున్నారు.
మెట్లపైకి ఎక్కుతున్న మాధవి విద్యుత్ షాక్‌తో ఒక్కసారిగా పడిపోవడంతో వెంటనే నార్సింగి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. మాధవికి అఖిల్, అల్పేష్ అనే ఇద్దరు చిన్నారులు ఉన్నారు. భర్త నరేష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నశంకరంపేట ఎస్‌ఐ ప్రకాష్‌గౌడ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment