
విలపిస్తున్న కూతుళ్లు, ఇన్‌సెట్‌లో నల్ల శ్రీమతి (ఫైల్)
వర్గల్(గజ్వేల్) : తాగుడుకు బానిసైన భర్త వేధింపులు భరించలేక ఓ మహిళ ఒంటికి నిప్పించుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వర్గల్ మండలం సింగాయపల్లిలో శనివారం జరిగింది. వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన నల్ల పాపయ్య, శ్రీమతి భార్యాభర్తలు. వారికి పదో తరగతి చదువుతున్న అంజలి , ఏడో తరగతి చదువుతున్న అక్షయ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పాపయ్య తాగుడుకు బానిసై భార్యపై లేనిపోని అనుమానాలు పెట్టుకుని శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. ఇద్దరు ఆడపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమీప పరిశ్రమలో దినసరి కూలీగా పనిచేస్తూ శ్రీమతి కాలం నెట్టుకొచ్చింది.
ఈ నెల 16న ఉదయం గొడవపడి భర్త కొట్టడంతో శ్రీమతి తీవ్ర మనో వేదనకు గురైంది. కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన ఇరుగు పొరుగువారు 108 అంబులెన్స్‌లో గజ్వేల్ ఆస్పత్రికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం శ్రీమతి మృతి చెందింది. ఆమె మరణ వాంగ్మూలం ఆధారంగా ఆత్మహత్యకు పురికొల్పి, ఆమె చావుకు కారణమైన భర్త పాపయ్యపై కేసు నమోదు చేశామని ఏఎస్‌ఐ దేవీదాస్ తెలిపారు.
కంటతడి పెట్టించిన కూతుళ్ల రోదనలు..
తండ్రి పెడుతున్న బాధలు భరించలేక తల్లి తనువు చాలించడంతో ఇరువురు కూతుళ్లు అంజలి, అక్షయ పెనువిషాదంలో కూరుకుపోయారు. ఇక మాకు దిక్కెవరు, మమ్మల్ని చూసుకునేదెవరంటూ వారు విలపిస్తున్న తీరు అక్కడ ఉన్న వారిని కంటతడి పెట్టించింది. తండ్రి కటకటాల పాలవడంతో వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. మృతురాలి భర్త పాపయ్య పోలీసులకు లొంగిపోగా, అతని తల్లి అండమ్మ కోడలి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది.
Comments
Please login to add a commentAdd a comment