eye donate
-
ఆ ఊళ్లు.. ‘రెండు కళ్లు’
‘మరణించిన వ్యక్తి నేత్రదానం చేయడం ద్వారా వారి కళ్లు జీవించే ఉంటాయి. మరణానంతరం కూడా మన కళ్లు మరో ప్రపంచాన్ని చూస్తాయి. మట్టిలో కలిసిపోయే ముందు మరొకరి జీవితంలో వెలుగు నింపితే.. వారి ఆనందాన్ని మన నయనాలు నింపుకుంటాయి’. అనే సిద్ధాంతంతో ఓ రిటైర్డ్ ఇంజనీరు మొదలెట్టిన ప్రయత్నం సక్సెస్ అయ్యింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం ముచ్చర్లలో మొదలైన నేత్రదాన ఉద్యమం.. పరకాల డివిజన్ సర్వాపూర్‌కు వ్యాప్తి చెందింది. సాక్షి ప్రతినిధి, వరంగల్: నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఈగా పనిచేసిన మండల రవీందర్ 12 ఏళ్ల క్రితం ముచ్చర్లలో నేత్రదాన ఉద్యమం మొదలెట్టారు. ‘అంధులకు కార్నియా ఆపరేషన్లు చేయడం ద్వారా కంటిచూపును ప్రసాదించవచ్చు’ అనే ఉద్దేశంతో చనిపోయిన వారి కళ్లతో సప్తవర్ణాలను చూపేందుకు ఆ రోజే బాటలు పడ్డాయి. ఒక్కరితో మొదలైన బృహత్కార్యంలో గ్రామస్తులు మనసారా భాగస్వాములయ్యారు. నేత్రదానం (Eye Donation) చేస్తామని ప్రతినబూని ముందుకు సాగుతున్నారు. మూడువేల పైచిలుకు జనాభా కలిగిన ముచ్చర్ల (వరంగల్ నగర పాలక సంస్థలో విలీనమైంది)లో ఇప్పటివరకు 46 మంది నేత్రదానం చేశారు. ముచ్చర్ల బాటలో సర్వాపూర్ హనుమకొండ జిల్లా కేంద్రానికి 23.2 కి.మీ. దూరంలో ఉన్న చిన్న గ్రామం సర్వాపూర్‌కు నేత్రదాన ఉద్యమం పాకింది. 630 మంది జనాభా ఉన్న ఆ గ్రామం పరకాల డివిజన్ నడికుడ మండలం కిందకు వస్తుంది. ముచ్చర్లకు చెందిన మండల రవీందర్‌కు బావ వరుసైన తాజా మాజీ వార్డు సభ్యుడు భోగి రాములు నేత్రదాన ఉద్యమానికి శ్రీకారం చుట్టగా.. సర్వాపూర్ గ్రామస్తులు సైతం సై అన్నారు. సర్వాపూర్‌లో రెండేళ్లలో 12 మంది నేత్రదానం చేయగా.. మరో 8 మంది హామీ పత్రాలు ఇచ్చినట్లు గ్రామస్తులు చెప్పారు. చదవండి: అపురూపాల మంత్రపురిలయన్స్ క్లబ్ హనుమకొండ, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ (వరంగల్)కు సమాచారం ఇస్తే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎల్వీ ప్రసాద్ నేత్ర సేకరణ నిపుణులు నేత్రాలను స్వీకరిస్తున్నారు. ముచ్చర్లను ఆదర్శంగా తీసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలూ అదేబాటను అనుసరించారు. మృతిచెందిన 15 మంది కళ్లను దానం చేసేందుకు ఆయా గ్రామాల్లో వారి కుటుంబసభ్యులు ముందుకొచ్చారు. పెంబర్తి, నాగారం, పలివేల్పుల, భీమారం, పెగడపల్లి, జమ్మికుంట, బావుపేటలో నేత్రదానంపై అవగాహన సదస్సులు ఉధృతంగా సాగుతున్నాయి.సామాజిక బాధ్యత కూడా.. మరణానంతరం నేత్రదానం చేస్తే ఇద్దరికి చూపు ఇచ్చిన వారమవుతామని అవగాహన కల్పిస్తూ నేత్రదాన ఉద్యమం చేస్తున్నాం. ఈ మహత్కార్యం సామాజిక బాధ్యత కూడా. మా తల్లిదండ్రుల నేత్రదానం ద్వారా మిగతా వాళ్లలో కూడా అవగాహన కల్పిస్తున్నాం. చాలా పల్లెలకు ఈ ఉద్యమం పాకడం సంతోషంగా ఉంది. – మండల రవీందర్, ఉపాధ్యక్షుడు, తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్ మా ఆయన కళ్లు దానం చేసినం.. మా ఆయన భోగి కొమురమల్లు (92) రెండేళ్ల కింద చనిపోయిండు. మా ఊళ్లోనే ఉండే భోగి రాములు, ఇంకొంత మంది కళ్ల దానం గురించి చెప్పిండ్రు. ఇంట్లోళ్లం మాట్లాడుకుని కళ్లు వట్టిగ మట్టిల పోవుడు ఎందుకని దానం చేసినం. మా ఊళ్లో ఎవరు చనిపోయినా కళ్లను దానం చేస్తమని ముందుకు వస్త్రను. – భోగి సమ్మమ్మ, సర్వాపూర్ -
నేత్రదానం మహాదానం
కొరుక్కుపేట: నేత్రదానం మహాదానమని ప్రముఖ సినీనటుడు సంతానం పేర్కొన్నారు. ఈ మేరకు కంటి వైద్య చికిత్సలో ఆధునిక టెక్నాలజీని జోడించి నేత్ర వైద్య సేవలను అందిస్తున్న డాక్టర్ అగర్వాల్ కంటి ఆస్పత్రి చెన్నై శివారు ప్రాంతం అంబత్తూర్లో డాక్టర్ అగర్వాల్ ఐ కేర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసింది. గురువారం జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నటుడు సంతానం పాల్గొని రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా డాక్టర్ అగర్వాల్స్ గ్రూప్ ఆఫ్ ఐ హాస్పటల్స్ సీఈఓ డాక్టర్ ఆదిల్ అగర్వాల్ మాట్లాడుతూ అంబత్తూర్లో తమ శాఖ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు . ప్రారంభోత్సవ సందర్భంగా అర్హులైన పేదలు 100మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు అందిస్తామని ప్రకటిస్తూ పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అంబత్తూర్ ప్రజలకు తమ సేవలను చేరువ చేయడం మరింత ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ అగర్వాల్ కంటి ఆస్పత్రి అంబూత్తూర్ క్లినికల్ సర్వీసెస్ హెడ్ డాక్టర్ కౌశిక్ పిబి మాట్లాడుతూ అన్ని రకాల ఆధునిక వైద్య పరికరాలతో ఐ కేర్ సేవలు అందులో కార్నియా , క్యాటరాక్ట్, గ్లకోమా, పెడియాట్రిక్ ఐ కేర్ ట్రీట్మెంట్లు ఇంకా న్యూరో ఆప్తమాలజీ, రెటినా, లో విజన్ రెహాబిలిటేషన్ సేవలను కల్పిస్తున్నట్టు తెలిపారు. అనంతరం నటుడు సంతానం మాట్లాడూతూ ప్రముఖ కంటి ఆస్పత్రిగా రాణిస్తున్న డాక్టర్ అగర్వాల్ ఆస్పత్రి సేవలు ప్రశంసనీయమన్నారు. అన్ని దానాల్లోకంటే నేత్రదానం మహాదానం అని పేర్కొన్నారు . నేత్రదానం చేసేందుకు యువత ముందకు రావాలని పిలుపునిచ్చారు. -
నేత్రదానంతో మరో ఇద్దరికి చూపు
ధర్మవరం టౌన్ : మరణానంతరం నేత్రదానం చేసి మరో ఇద్దరికి చూపును ప్రసాదించారు పట్టణానికి చెందిన నారాయణమూర్తి (50). స్థానిక శాంతినగర్‌కు చెందిన ఆయన ఎల్ఐసీ ఏజెంట్‌గా పని చేస్తున్నారు. మంగళవారం ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న యువర్స్ ఫౌండేషన్ సభ్యులు నేత్రదానం ఆవశ్యకతను అతడి కుటుంబసభ్యులకు వివరించారు. వారు అంగీకరించడంతో డాక్టర్ బీవీ సుబ్బారావు ఆధ్వర్యంలోని వైద్య బృందం శస్త్ర చికిత్స నిర్వహించి నేత్రాలను భద్రపరచి అనంతపురంలోని బాలాజీ ఐకేర్ ట్రస్ట్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ నేత్రదానం కోసం 99851 46362, 94406 83100 నంబర్లను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు వైకే శ్రీనివాసులు, సభ్యులు బీఆర్ రంగనాథ్, పోలా ప్రభాకర్, చాంద్‌బాషా తదితరులు పాల్గొన్నారు. -
ఆ గ్రామం అందరికీ ఆదర్శం
చేవెళ్ల(రంగారెడ్డి): ఓ గ్రామం సామాజికి సేవలో అందరికి ఆదర్శంగా నిలిచింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఇచ్చారెడ్డి గూడ గ్రామంలోని 80 కుటుంబాలు నేత్రదానం చేసేందుకు సమ్మతి తెలిపారు. ఇందుకు సంబంధించిన అంగీకార పత్రాలను హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి అందజేశారు. చేవెళ్ల ఆర్డీవో చంద్రమోహన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి ప్రతినిధులకు పత్రాలు అందజేశారు. -
నేత్రదానానికి ఆ గ్రామస్తులు అంగీకారం
చేవెళ్లరూరల్: చనిపోయిన తర్వాత కూడా మరొకరికి చూపును ప్రసాదించాలనే సదుద్దేశంతో ఆ గ్రామస్తులంతా ముందుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇక్కారెడ్డిగూడ గ్రామస్తుల ముందుచూపు ఇది. గ్రామంలో దాదాపు 80 కుటుంబాలు, 480 మంది జనాభా ఉంది. అంతా వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నెల రోజుల నుంచి గ్రామంలోని వివేకానంద యువజన సంఘం సభ్యులు నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం కల్పించారు. యువకుల మాటలకు గ్రామస్తులంతా సరేనన్నారు. దీంతో హైదరాబాద్‌లోని ఎల్వీప్రసాద్ కంటి ఆస్పత్రి వారితో మాట్లాడి ఆదివారం గ్రామంలోనే 480 మంది నేత్రాలను దానం చేస్తూ అంగీకారపత్రాలను అందజేసేందుకు సిద్ధమయ్యారు.