టీడీపీ నాయకురాలికి 173 ఇళ్లు
విశాఖపట్నం: అధికారం చేతిలో ఉంది.. అంతా నా ఇష్టం అన్నట్టుగా సాగుతోంది జిల్లాలోని టీడీపీ ప్రజా ప్రతినిధుల తీరు. నిరుపేదల కోసం నిర్మించిన ఇళ్లను సైతం కబ్జా చేసేందుకు రంగం సిద్ధమైంది. జీవీఎంసీతోపాటు జిల్లా ఉన్నతాధికారులు సైతం వీరికి అండగా నిలవడం విమర్శలకు తావిస్తోంది. జేఎన్ఎన్యూఆర్ఎం హౌసింగ్‌లో భాగంగా కేంద్రం మంజూరు చేసిన నిధులతో అప్పటి విశాఖ నగరపాలక సంస్థకు 2006లో 15,320 ఇళ్లు కేటాయించారు.
వీటిలో 14,235 ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయగా.. దశల వారీగా 12,969 ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించారు. ఇంకా 1266 ఇళ్లు కేటాయించాల్సి ఉంది. వైఎస్సార్ హఠాన్మరణం తర్వాత మారిన రాజకీయ పరిణామాలతో గత ప్రభుత్వ హయాంలో మంత్రి గంటా శ్రీనివాసరావు తన అనుచరులకు వీటిని కట్టబెట్టాలని విఫలయత్నం చేశారు. నగరానికి చెందిన గంటా అనుచరురాలు కె.లక్ష్మి గత ఆరేళ్లుగా ఈ ఇళ్లపై కన్నేశారు. 173 మందితో జాబితాను సిద్ధం చేసి గంటా సిఫార్సులతో అప్పటి అధికారులకు సమర్పించారు.
కాని గతంలో ఇక్కడ కమిషనర్లుగా పనిచేసిన రామాంజనేయులు, సత్యనారాయణ ఈ సిఫార్సులను పక్కన పెట్టేశారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఈమె మళ్లీ తన ప్రయత్నాలను మొదలు పెట్టారు. చివరకు 173 ఇళ్ల జాబితాను సిద్ధం చేసి మంత్రి గంటా సిఫార్సులతో జీవీఎంసీ యూసీడీ విభాగం ద్వారా కలెక్టరేట్‌కు సమర్పించారు. అక్కడ ఫైల్ ఓకే అయి.. మంగళవారం జీవీఎంసీకి చేరింది.
ఈ వ్యవహారంలో అధికారులకు, ప్రజాప్రతినిధిగా బాగా ముట్టచెప్పినట్టు సమాచారం. ఈ జాబితాలో అత్యధికులకు తగిన అర్హత లేదని తెలిసింది. ఉక్కునగరం, భీమిలి, గాజువాక తదితర ప్రాంతాలకు చెందిన వారిని సైతం ఈ జాబితాలో చేర్చి సిఫార్సు చేసినట్టు సమాచారం. వెంటనే ఇళ్ల కేటాయింపు జరపకుండా సమగ్ర విచారణ జరిపిస్తే అసలు దోషులెవరో నిగ్గు తేలుతుంది. ఈ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు న్యాయం జరుగుతుంది.