మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడుతున్న లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మునిగిపోయిన నావ అయితే టీఆర్‌ఎస్ మునిగిపోతున్న పడవ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ వ్యాఖ్యా నించారు. తెలంగాణ జర్నలిస్టు యూనియన్ హైదరాబాద్‌లో మంగళవారం నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. రాష్ట్రంలో మూస విధానాలను సమూలంగా మార్చడానికి జన చైతన్య యాత్రను 14 రోజులపాటు 22 జిల్లాలు, 14 పార్లమెంట్ స్థానాలు, 48 అసెంబ్లీ స్థానాల్లో నిర్వహించామన్నారు. ఈ యాత్రలో ప్రజలు అనేక సమస్యలను పార్టీ దృష్టికి తెచ్చారని చెప్పారు.
ఈ విజ్ఞప్తులు, ప్రజా ఆలోచనల మేరకు మేనిఫెస్టో ఉంటుందన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందిన రాష్ట్ర ప్రభుత్వంపై చార్జిషీట్ తయారు చేయనున్నట్లుగా ప్రకటించారు. ప్రాజెక్టుల్లో కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే.. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్‌పై, టీఆర్‌ఎస్‌పై అన్ని వర్గాలకు విశ్వాసం పోయిందని లక్ష్మణ్ అన్నారు. రాష్ట్రం రాక ముందున్న బాధలు, సమస్యలన్నీ ఇప్పుడూ అలాగే ఉన్నాయన్నారు. చేపలు, బర్రెలు, గొర్రెల పంపిణీ అంతా దగా, మోస మని విమర్శించారు. ఈ యాత్రతో టీఆర్‌ఎస్ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని, రూ.2 లక్షల రుణమాఫీ, ఉచిత బోర్లు, రైతుల అప్పులపై వడ్డీ మాఫీ లాంటి హామీలను ఇచ్చామన్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో మార్పు జరిగే వరకు యాత్ర ఆగదన్నారు. వచ్చే ఎన్నికల్లో వ్యూహం, అభ్యర్థుల ఎంపిక కోసం ఈ యాత్ర ఉపయోగపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందన, వ్యవహార శైలి సరిగా లేకపోవడంతోనే విభజన హామీలు కొన్ని అమలు కాలేదన్నారు. ముందస్తు ఎన్నికలను తాము కోరుకోవడం లేదని, అయితే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తెలంగాణలో 60 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ‘మిషన్–60’పేరుతో పనిచేస్తామని వివరించారు.
కేసీఆర్‌వి పగటికలలు
ఫామ్‌హౌజ్‌లో, ప్రగతిభవన్‌లో కూర్చుని కేసీఆర్ పగటికలలు కంటున్నాడన్నారు. అయితే ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిన కేసీఆర్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు. రాజకీయ సన్యాసం తీసుకుంటానని అధికారపార్టీ ఎమ్మెల్యే స్వయంగా ప్రకటించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్ ముందస్తు అనడం కాదు, ముందుగా ఎన్నికలు వస్తే కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి ప్రజలే ఎదురు చూస్తున్నారని అన్నారు.
అన్ని మూస పార్టీల ప్రభుత్వాలను ఇప్పటిదాకా ప్రజలు చూశారని, మార్పు కోసం వచ్చే ఎన్నికల్లో బీజేపీని దీవించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై అన్నీ తప్పుడు లెక్కలు, అబద్ధాలు చెబుతోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను దారి మళ్లించి, తమ గొప్పగా టీఆర్‌ఎస్ పేర్కొంటోందని ఆరోపించారు. కేంద్ర నిధుల దుర్వినియోగంపై టీఆర్‌ఎస్ చర్చకు సిద్ధమా అని లక్ష్మణ్ సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment